సాక్షి ప్రతినిధి, తిరుపతి: శ్రీవెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (స్విమ్స్) నేతృత్వంలోని శ్రీపద్మావతి మహిళా వైద్యకళాశాల అడ్మిషన్లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా సీట్లను భర్తీ చేయడానికి మార్గదర్శకాలు (జీవో 120)ను శనివారం వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్వీ.సుబ్రమణ్యం జారీ చేశారు.
వివరాల్లోకి వెళితే.. స్విమ్స్ నేతృత్వంలో శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాలను రెండేళ్ల క్రితమే ప్రభుత్వం మంజూరు చేసింది. వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు.. బోధన సిబ్బందిని స్విమ్స్ యాజమాన్యం నియమించుకుంది.
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఏడాది క్రితం తనిఖీ చేసి వైద్య కళాశాలకు అనుమతి ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచి వైద్య కళాశాలను ప్రారంభించడానికి స్విమ్స్ డెరైక్టర్ డాక్టర్ బీ.వెంగమ్మ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈనెల 14న సీఎం చంద్రబాబు నేతృత్వంలో స్విమ్స్ పాలకమండలి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ సమావేశంలో మెరిట్ ఆధారంగా మన రాష్ట్ర విద్యార్థులకు 70 శాతం సీట్లు, 15 శాతం సీట్లను ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు, 15 శాతం సీట్లను ఎన్‌ఆర్‌ఐలతో భర్తీ చేయాలని నిర్ణయించారు. మన రాష్ట్ర, ఇతర రాష్ట్ర కోటాల్లో భర్తీ చేసే సీట్లకు రూ.60 వేల వంతున, ఎన్‌ఆర్‌ఐ సీట్లకు 20 వేల అమెరికన్ డాలర్ల వంతున ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించారు. తాజాగా ఇతర రాష్ట్రాలకు కేటాయించిన 15 శాతం సీట్లను కూడా మన రాష్ట్ర విద్యార్థులతోనే భర్తీ చేయాలని నిర్ణయించారు. తరగతులను ఈ ఏడాది నుంచే ప్రారంభించడానికి పాలకమండలి సమావేశంలో అనుమతి ఇచ్చారు.
ఈ మహిళా వైద్య కళాశాలలో 150 సీట్లను భర్తీ చేయనున్నారు. ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సెన్సైస్ నేతృత్వంలో నిర్వహించే ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా మెరిట్ ఆధారంగా 127 సీట్ల (85 శాతం)ను మన రాష్ట్ర విద్యార్థులతో భర్తీ చేయనున్నారు. ప్రసూతి ఆస్పత్రి భవనం విషయంలో జూనియర్ డాక్టర్లకు, సిమ్స్‌కు మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో మహిళా వైద్య కళాశాల తరగతుల ప్రారంభంపై నెలకొన్న సందిగ్ధతకు ప్రభుత్వం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలతో బ్రేక్ పడింది.
శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాల అడ్మిషన్లకు గ్రీన్‌సిగ్నల్
Published Sun, Aug 24 2014 3:51 AM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM
Advertisement
Advertisement