చిత్తూరు(టౌన్): పాఠశాలల్లో టీచర్ల కొరతను తీర్చేందుకు రాజీవ్ విద్యామిషన్ చర్యలు చేపట్టింది. టీచర్లను తాత్కాలికంగా సర్దుబాటు (రేషనలైజేషన్) చేసేందుకు నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రాష్ట్ర ఆర్వీఎం అధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో దీని వివరాలను జిల్లా విద్యాశాఖ, ఆర్వీఎం అధికారులకు వివరించారు. జిల్లాను యూనిట్‌గా తీసుకొని సర్దుబాటు చేయాలని అధికారులు ఆదేశాల్లో పేర్కొన్నారు.
మారుమూల ప్రాంతాల్లో టీచర్లు సరిగ్గా లేనందున విద్యార్థులకు చదువు చెప్పలేకపోతున్నారు. మెగా డీఎస్సీ నిర్వహిస్తే గానీ జిల్లాలో ఉపాధ్యాయుల కొరత తీరదు. ప్రస్తుతం డీఎస్సీ నిర్వహించే పరిస్థితి లేనందున తాత్కాలిక సర్దుబాటు చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల్లోగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటుచేసి వివరాలను రాష్ట్ర కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది.
రెండు రోజులు సరిపోతుందా?
సర్దుబాటు పూర్తి చేయడానికి రెండు రోజులు సరిపోదని, వారం రోజులైనా గడువిస్తే పూర్తి చేయవచ్చని అధికారులు అంటున్నారు. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. ఎక్కువగా సబ్జెక్టు టీచర్లు ఉం డే పాఠశాల నుంచి వీరిని సర్దుబాటు ప్రాతిపదికన వేరే పాఠశాలకు పంపాల్సి ఉంటుంది. సెలవుల్లో అధికారులే సర్దుబాటు చేసేందుకు పూనుకొని వివరాలు తెప్పించేందుకు ప్రయత్నించారు. అయితే క్షేత్ర స్థాయి నుంచి దీనికి పెద్దగా స్పందన రాలేదు.
అధికారుల వద్ద జిల్లాలో ఎన్ని ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి? టీచర్లు లేని పాఠశాలలు ఎన్ని? ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఎంత ఉంది? అనే వివరాలు పూర్తి స్థాయిలో లేవు. పాఠశాలలు పునఃప్రారంభమైనందున పిల్లల ఎన్‌రోల్‌మెంట్‌పై దృష్టి పెట్టాలని అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎంఈవోల నుంచి వివరాలు తెప్పించుకొని సర్దుబాటు చేయడమనేది కత్తిమీద సామేనని చెప్పొచ్చు.
అధికారులకు తలనొప్పులు తప్పవా?
తాత్కాలిక సర్దుబాటు చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలు జిల్లా విద్యాశాఖ అధికారులకు తలనొప్పులు తీసుకొచ్చేలా ఉంది. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో కొంత మంది ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న చోటు నుంచి వేరే చోటుకు వెళ్లేందుకు జీవోలు తెచ్చుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.
ఈ నేపథ్యంలో తాత్కాలిక సర్దుబాటు కార్యక్రమం వీరికి వరంలా దొరికింది. కొత్తగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వీరిని పట్టుకొని తాము కోరుకున్న చోటుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒత్తిళ్లు ఎక్కువైతే నిబంధనలకు అధికారులు తిలోదకాలు ఇచ్చే పరిస్థితి ఉంది.
ఇటీవల నిర్వహించిన ఎంఈవోల సమావేశంలో తాత్కాలిక సర్దుబాబు చేయాలని డీఈవో ఆదేశాలు ఇవ్వడంతో చాలా మంది తాము కోరుకున్న చోటుకి వెళ్లేందుకు ఒత్తిళ్లు తెచ్చారు. ఇప్పుడు ఉన్నతాధికారులు అధికారికంగా అనుమతి ఇవ్వడంతో అధికార పార్టీ ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.
టీచర్ల తాత్కాలిక సర్దుబాటుకు గ్రీన్‌సిగ్నల్
Published Sat, Jun 14 2014 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM
Advertisement