జిల్లాల విభజన వేగవంతం!
Published Wed, Aug 10 2016 11:29 PM | Last Updated on Sat, Sep 29 2018 5:52 PM
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రెండు రోజులుగా జిల్లాల పునర్విభజన ప్రక్రియ వేగం పెరిగింది. బుధవారం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సహా ఐదుగురు మంత్రులతో ప్రభుత్వం ఉపసంఘం వేసింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం జిల్లాలో పునర్విభజనపై వేగం పెంచింది. అందరూ కొత్త మండలాల ఏర్పాటుకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లేనని భావించారు. అయితే సీఎం కేసీఆర్ మంగళవారం చేసిన ప్రకటనతో మళ్లీ కొత్త మండలాలతో జిల్లాల పునర్విభజన వైపు అధికార యంత్రాంగం ముందుకు సాగుతోంది. కొత్త జిల్లాల చేర్పులు, మార్పులకు ఎంత శ్రమ పడాల్సి వస్తుందో.. మండలాలకు అంతకంటే ఎక్కువే కసరత్తు చేయాల్సి వస్తున్నప్పటికీ, జిల్లాలతోనే చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. రాష్ట్రంలో కొత్తగా 14 జిల్లాలు ఏర్పడితే.. మండలాల ప్రతిపాదన 74గా ఉంది. జిల్లాలో ఏర్పాటుతోపాటు కొత్త జిల్లాల్లో 74 మండలాల్లో కార్యాలయాలు, అధికారులు యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని కూడ ఆదేశించారు. ఈ నేపథ్యంలో కొత్త మండలాల ఏర్పాటు కోసం జిల్లా నుంచి ఇదివరకు పంపిన ప్రతిపాదనల ప్రకారమే 10 మండలాలు ఏర్పడితే.. రెండు జిల్లాల్లో మండలాల సంఖ్య 46కు చేరనుంది. నాగిరెడ్డిపేట మండలంలో ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి మరో మండలం కూడా ఏర్పడే అవకాశం ఉంది.
కామారెడ్డిలో 21.. నిజామాబాద్ 25 మండలాలు..
సీఎం కేసీఆర్ వేర్వేరుగా నిర్వహించిన కలెక్టర్లు, టీఆర్‌ఎస్‌ఎల్‌పీ సమావేశాల్లో అధికార పార్టీ నేతలు, అధికారులు సూచించిన మేరకు జిల్లాలో కొత్తగా 10 మండలాలు పెరగనున్నాయి. కొత్త మండలాల ఏర్పాటు, కొత్త జిల్లాల్లో మండలాల విలీనంపై స్పష్టత వచ్చిన మీదటే ఇచ్చిన నివేదికలకు తుదిరూపు వచ్చింది. 25 మండలాలతో నిజామాబాద్, 21 మండలాలలో కామారెడ్డి జిల్లా ఏర్పాటు కానుండగా.. నిజామాబాద్‌లో ఎనిమిది, కామారెడ్డి రెండు మండలాలు కొత్తగా చేరనున్నాయి. ఇదే సమయమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలం మెదక్ జిల్లాలో కలుపుతున్నారన్న ప్రచారం జరుగుతున్నా.. కొత్తగా మరో మండలం కామారెడ్డిలో చేరనుంది. అదే విధంగా బాన్సువాడకు చెందిన కోటగిరి, వర్ని మండలాలు అక్కడి ప్రజల కోరిక మేరకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆ రెండు మండలాలను నిజామాబాద్ జిల్లాలోనే కొనసాగిస్తామన్న హామీ కూడా ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా బాన్సువాడ రెవెన్యూ డివిజన్ ఏర్పడినా.. ఆ రెండు మండలాలు నిజామాబాద్ జిల్లాలోనే కొనసాగించే అవకాశం ఉంది. కేబినేట్ సబ్ కమిటీ నిర్ణయాల మేరకు రెండు జిల్లాల్లో ఏవైనా చేర్పులు, మార్పులు జరిగితే కొత్త మండలాల సంఖ్య ఒకటి, రెండు పెరిగే ఆవకాశం ఉండవచ్చని తెలుస్తుంది.
ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయ సేకరణ
జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఇదివరకు రెండు జిల్లాల్లో కొనసాగే అధికారులు, ఉద్యోగుల విభజన జరిగింది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం మంత్రవర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. జిల్లాల సంఖ్య, కొత్త జిల్లాల నుంచి కార్యకలాపాలు, తాత్కాలిక ఏర్పాట్లు, వసతి, మౌలిక సదుపాయాలు, ఉద్యోగుల కేటాయింపు, జోనల్, శాఖల పునర్‌వ్యవస్థీకరణ తదితర అంశాలపై ఈ కమిటీ మరోమారు అధ్యయనం చేయనుంది. ముసాయిదాకు ముందే వారంలోగా అధ్యయనానికి సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి సమర్పించనుంది. దీంతో జిల్లాలో పునర్విభజన ప్రక్రియ వేగం పెరిగింది. ఇదిలా వుండగా అధికారులు కొత్తగా ఇప్పుడున్న మండలాలకు తోడు 10 మండలాలకు సబ్‌కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. వాటిలో నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్ అర్బన్, రూరల్‌లో రుద్రూరు, కామారెడ్డి అర్బన్‌తో దేవునిపల్లి, సదాశివనగర్ మండలం రామారెడ్డి, ఆర్మూరు అర్బన్‌కు తోడు ఆలూరు, భిక్కనూర్ మండలం రాజంపేట, దోమకొండ మండలం బీబీపేటలు మండలాలుగా ఏర్పడే అవకాశం ఉందన్నారు. అలాగే వీటికి తోడు డిచ్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లోని కొన్ని గ్రామాలు కలిపి మరో మండలం ఏర్పడనుంది. మండలాలకు తోడు నిజామాబాద్ జిల్లాలో ఒక కార్పోరేషన్, రెండు మున్సిపాలిటీలు, కామారెడ్డి జిల్లాలో ఒక మున్సిపాలిటీ ఉంటుంది. జనాభా విభజనపైన కూడ ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. వీటన్నింటిపై ఈ నెల 22న ముసాయిదాలో వివరంగా ప్రకటించనుండగా.. దసరా నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన కొనసాగనుంది.
Advertisement