Dussehra 2023: విజయ దశమి విశిష్టత ఏంటంటే.?  | Dussehra 2023:: Know about Vijayadashami Festival | Sakshi
Sakshi News home page

Dussehra 2023: విజయ దశమి విశిష్టత ఏంటంటే.? 

Published Sun, Oct 22 2023 6:28 PM | Last Updated on Mon, Oct 23 2023 9:13 AM

Dussehra 2023:: Know about Vijayadashami Festival - Sakshi

ముక్తి కోసం సాధన చేసేందుకు ఉపకరించే దక్షిణాయనంలో వచ్చే పండుగలలో దసరా ఒకటి. ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింపచేసే సాధనతో, దైవ ఉపాసనతో కూడిన పండుగ దసరా. ఆసేతు హిమాచలం అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగలలో ఒకటైన ఈ దసరా గురించి... 

దసరా అంటే పది జన్మల పాపాలను, పది రకాలైన పాపాలను పోగొట్టేది అనే అర్థం కూడా వ్యాప్తిలో ఉంది. ఈ పది రోజుల పండుగని ‘నవరాత్ర వ్రతం‘ అనీ, ‘దేవీ నవరాత్రులు‘, ‘శరన్నవరాత్రులు‘ అని వ్యవహరిస్తాం. తొమ్మిది రోజులు నియమ నిష్ఠలతో జగన్మాతను పూజించే వ్రతం ఈ శరత్కాలంలో చేసే శరన్నవరాత్ర వ్రతం.

తొమ్మిది సంఖ్య పూర్ణత్వానికి సంకేతం. నవరాత్రులు ఆరాధించటమంటే పరమాత్మను పరిపూర్ణంగా ఆరాధించటం. నవరాత్రి అంటే నూతనమైన రాత్రి లేదా కొత్త రాత్రి అని అర్థం. తొమ్మిది రోజుల దీక్ష వలన పదవరోజు విజయం లభిస్తుంది. అంటే తొమ్మిది రోజుల దీక్షకు ఫలం లభిస్తుంది. కనుక పదవ రోజును ‘విజయదశమి‘ పేరిట పండుగ జరుపుకుంటాము.

జగన్మాత ఆదిపరాశక్తి గొప్పదనాన్ని, మహిమను గురించి, దేవీ భాగవతం, మార్కండేయ పురాణం మొదలైన అనేక పురాణాలు, ఉపనిషత్తులు వివరిస్తాయి, త్రిపురా రహస్యంలో విపులమైన వివరణ కనిపిస్తుంది. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మగా కొలవబడుతున్న జగన్మాత దుర్గమ్మ అనంతమైన నామాలతో పూజలందుకుంటోంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గ, పార్వతి, హైమవతి, అపరాజిత, భవాని, లలిత, జయంతి, మంగళ, భద్రకాళి, కాపాలిని, క్షమా, శివదూతి, స్వాహా, స్వధా, చాముండి, విష్ణుపత్ని, ఈశ్వరి ఇటువంటి అనేకమైన నామాలతో ఆరాధనలందుకుంటోంది.

మనలోని శక్తిని, శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన శక్తిని జాగృత పరిచే, దైవ అనుగ్రహంతో, మంత్ర శక్తితో, నియమబద్ధమైన జీవితంతో జాగృత పరిచే ఒక వ్రతం ఈ నవరాత్ర వ్రతం. అందుకే దసరా నవరాత్రులలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు పది రోజులు ఈ జగన్మాతను బాలా త్రిపురసుందరిగా, గాయత్రీ మాతగా, అన్నపూర్ణాదేవిగా, శ్రీ మహాలక్ష్మి దేవిగా, శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా, సప్తమి రోజున శ్రీ మహా సరస్వతీ దేవిగా, అష్టమి నాడు దుర్గామాతగా, నవమి నాడు మహిషాసుర మర్దినిగా, దశమినాడు జయా విజయా సహిత అపరాజితా దేవిగా –  రాజరాజేశ్వరీ దేవిగా ఆరాధిస్తాం. తొమ్మిది రోజులు కఠినమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైన నియమాలను పాటిస్తూ, నామ మంత్ర జపం, నామ పారాయణ చేస్తూ, కీర్తనలతో, భజనలతో కొలుస్తూ, ఉపవాస నియమాలను, నక్త వ్రతముల వంటి వాటిని పాటిస్తూ దశమినాడు చక్కగా జగన్మాతను షోడశోపచారాలతో పూజించి, అనేక విధాలైన పిండివంటలు తయారు చేసి, నైవేద్యం పెట్టి అమ్మను ఆరాధిస్తాం. ఆ పిండి వంటలను ప్రసాదంగా బంధుమిత్రులందరికీ పెట్టి, ఆరగిస్తాం.
ఆదిపరాశక్తిని లక్ష్మీ, గాయత్రీ, సరస్వతీ, రాధ, దుర్గా అనే ఐదు పరిపూర్ణ మూర్తులుగా ఆరాధిస్తారు.

యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా !
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః!!

పరమేశ్వరుని సంకల్ప శక్తి జగన్మాత. ఆ సంకల్పం వల్లే సృష్టి స్థితి లయలన్నీ జరుగుతున్నాయి. ఆదిపరాశక్తి ప్రకృతి అయితే, పరమాత్మ పురుషుడు. ప్రకృతి పురుషుల కలయిక వల్లే సృష్టి యేర్పడుతుంది. అంటే శివపార్వతుల చిద్విలాసం యావద్విశ్వం. ఈశ్వరుడని కొలిచినా, విష్ణువు అని కొలిచినా, జగన్మాత అంబిక అని కొలిచినా ఉన్న శక్తి ఒక్కటే అని మనకి ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. ఒక్కటిగా ఉన్న ఆ శక్తిని, చిచ్ఛక్తినే మనం అమ్మవారిగా, జగన్మాతగా ఆరాధిస్తున్నాము. చండీ సప్తశతిలో జగన్మాత మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహా సరస్వతిగా దుష్ట రాక్షసులను దునుమాడిన వైనాన్ని కీర్తించారు.

అమ్మవారు దేవతలకు – ఎప్పుడు దుష్ట రాక్షసుల నుంచి బాధలు కలిగినా, తాను అవతరించి, దుష్ట శిక్షణ చేస్తానని అభయమిచ్చారు. జగన్మాత, యోగ నిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువును జాగృత పరిచి, మధు కైటభులనే రాక్షసులను సంహరింపజేసింది. మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను జయించి స్వర్గాన్ని ఆక్రమించగా, దేవతలు బ్రహ్మదేవునితో కలిసి శ్రీ మహావిష్ణువు, రుద్రుల దగ్గరికి వెళ్ళి మహిషాసురుని ఆగడాలను గురించి చెప్పారు. ఆ మాటలు వినగానే శివకేశవులకు ధర్మాగ్రహం కలిగింది. ఆ క్రోధం ఒక ఆకృతి దాల్చి, వెలుగు రూపంలో బయటకొచ్చింది. దేవతలందరి ముఖాల నుంచి తేజస్సు బయటికి వచ్చి, ఆ సమష్టి తేజస్సు ఒక మహాద్భుత రూపం దాల్చి, అష్టభుజాలతో మహాలక్ష్మీదేవిగా, ఆదిపరాశక్తి ్తగా భాసించింది. ఈ తల్లిని దేవతలు ‘అమ్మా! నీవే సర్వకారణభూతురాలివి, కార్య కారణ రూపిణివి, క్రియా రూపిణివి, నీవు లేనిదే ఏదీ లేదు, అంతా నీలోనే ఉంది తల్లి అంటూ కీర్తించారు. శక్తి లేకపోతే శివుడు కూడా ఏమీ చేయలేడు. కనీసం స్పందించను కూడా లేడట. శక్తి లేకపోతే, చలనం, స్పందన ఉండదు అని జగద్గురువు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అమ్మవారి గురించి ప్రస్తుతించారు. ఆమె మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించి మహిషాసురమర్దినిగా కీర్తించబడింది.

జగన్మాతే ధూమ్రాక్షుడిని, రక్తబీజుడిని, చండ, ముండులను, శుంభ, నిశుంభులనే రాక్షసులను సంహరించింది. ఈ రాక్షసులందరూ బ్రహ్మదేవుని గురించి, పరమేశ్వరుని గురించి తపస్సులు చేసి వరాలు పొందినటువంటి వారు. దేవతల నుంచి ఎటువంటి భయాలు లేకుండా వరాలు పొందారు. కానీ స్త్రీ అంటే చులకన. ఆడవారు మననేం చేస్తారులే! అనే చులకన భావన స్త్రీల మీద! కనుకనే అమ్మవారు ఈ రాక్షసులందరినీ తనలో నుంచి బ్రాహ్మీ , వైష్ణవి, మహేశ్వరి, కౌమారి, ఐంద్రీ, వారాహి, నారసింహీ, చాముండా, శ్యామలా, కాళీ మొదలైన దేవతాగణాలను ఉద్భవింపజేసి, వారితో కలిసి రాక్షసులతో యుద్ధం చేసి, దానవులందరినీ సంహరించింది. ఈ దుష్ట రాక్షసులందరినీ జగన్మాత ఈ నవరాత్రులలో సంహరించినందున నవరాత్రులలో జగన్మాత వివిధ రూపాలను, అవతారాలను మనం కీర్తిస్తాం, ఆరాధిస్తాం. విజయదశమి నాడు, జగన్మాత దుష్ట రాక్షసులను సంహరించి విజయం సాధించిన రోజు కాబట్టి మనమంతా విజయదశమి పండుగను వేడుకగా జరుపుకుంటాం.

విజయదశమి జరుపుకోవటంలో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి భేదం ఉండవచ్చు కానీ హైందవులందరూ ఈ పండుగ జరుపుకుంటారు. విజయదశమి పండుగ దుష్టత్వం పైన దైవత్వం పొందిన విజయంగా జరుపబడుతున్నది. మానవులలోనే దైవీ గుణాలుంటాయి, ఆసురీ గుణాలు ఉంటాయి. మనలోని ఆసురీ గుణాలను పోగొట్టుకుని, దైవీ గుణాలను వృద్ధి పరచుకోవాలి.ఈ విజయదశమి పండుగ జరుపుకోవడానికి మనకు అనేక కారణాలు కనిపిస్తాయి. కాలంలో వచ్చే మార్పులను బట్టి దైవ శక్తిని ఆరాధించటం ఒక భావన అయితే, మనలోని దైవ శక్తిని వృద్ధిపరచుకోవటం, సమాజం లో అందరితో అన్యోన్యంగా సహకరిస్తూ ఉండటం అన్నది మరొక అంశం.

ఈ విజయదశమినాడే అర్జునుడు ఉత్తర గోగ్రహణంలో కౌరవుల మీద విజయం సాధించి విజయుడు అయ్యాడు. శమీ వృక్షం మీద పెట్టిన తమ ఆయుధాలలో నుంచి తన గాండీవాన్ని తీసుకుని యుద్ధం చేసి విజయం సాధించాడు కనుక మనం ఈనాడు విజయదశమి పండుగ జరుపుకుంటున్నాం. ఈనాడు శమీవృక్షాన్ని పూజిస్తాం.

‘శమీ శమయతే పాపం
శమీ శత్రు వినాశినీ!
అర్జునస్య ధనుర్ధారీ
రామస్య ప్రియ దర్శిని’

అని చెప్తూ శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తాం. ఈ విజయదశమి పండగనాడు అందరూ కూడా ఈ శమీ పత్రాలను – శమీ వృక్షపు ఆకులను పెద్దలకు ఇచ్చి నమస్కరిస్తారు. పెద్దలు వాటిని తీసుకుని పిల్లలను ఆశీర్వదిస్తారు.

ఈ విజయదశమి రోజునే శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించినందున, విజయదశమి రోజున ‘రామలీల‘ను ప్రదర్శిస్తారు. రావణ దహనం చేస్తారు. జగన్మాత ఆరాధన వలన, దుర్జనుల వలన సంఘానికి చేటు కలగకుండా, అధివ్యాధుల సమస్యలు లేకుండా దేశానికి భద్రత కలుగుతుంది.
అందుకే సాక్షాత్తూ ఆ జగజ్జనని మనని పాలిస్తూ ఉన్నట్లుగా.. ఆమె పాలనలో మనందరం క్షేమంగా.. సుఖంగా ఉన్నట్లు భావించుకుందాం. పూజించుకుందాం.
‘‘అఖిలాండేశ్వరీ... చాముండేశ్వరీ.. పాలయమాం గౌరీ... పరిపాలయమాం గౌరీ...’’ అని ప్రార్థిస్తూ... మనల్ని పాలించమని అమ్మను వేడుకుందాం.

మహిషం అంటే దున్నపోతు, జంతువు. మహిషాసురుడు అంటే జంతు తత్వం కలిగినటువంటి వాడు. రాజస తామస గుణాలకు ప్రతీకలు రాక్షసులు. మహిషాసురుడిని, చండ ముండులను, శుంభ, నిశుంభులను జగన్మాతసంహరించింది అంటే, మనలోనే ఉన్న కామ క్రోధాది అరిషడ్వర్గాలను, లోభ మోహాలను, అహంకారాన్ని నశింప చేసుకోవాలి అని గ్రహించాలి. చండ ముండాది రాక్షసులు దుర్మార్గమైన, ధర్మ విరుద్ధమైన బలదర్పాలకు ప్రతీకలు. కనుక అటువంటి బలహీనతలను జయించాలి. మనలోని రజోగుణాలను, తమో గుణాలను అరికట్టి, సత్వగుణాన్ని వృద్ధి పరచుకుని, శుద్ధ సత్వ గుణాన్ని పొందడానికి సాధన చేయాలి. అది ఈ జగన్మాతను నవరాత్రులలో ఆరాధించడం వలన సాధ్యపడుతుంది. శుద్ధ సత్వ గుణాన్ని వృద్ధి చేసుకుంటే దైవత్వాన్ని దర్శించగలుగుతాము, పొందగలుగుతాము.

మథు, కైటభులు అనే రాక్షసులు అహంకార మమకారాలకు ప్రతీకలు. నేను, నాది అనే భావాలకు ప్రతీకలు. మధువు అంటే తేనె. అన్నింటి కంటే మనకు ఇష్టమైనది, తీయనైనది ఎవరికి వారే! ఒక్క నేను అనేది ఉంటే, అనేకమైన నావి, నా వారు, నా బంధువులు, నా అధికారం, నా పదవులు వంటి అనేకమైనవి బయలుదేరతాయి. ఒక్క తేనె చుక్క ఉంటే, అనేకమైన కీటకాలు చుట్టూ చేరినట్లుగా, ఒక్క నేనుకి, అనేకమైన – నావి అనేవి బయలుదేరతాయి. ఈ నేను, నాది అనే అహంకార, మమకార భావాలను సంహరించటమే మధుకైటభములను సంహరించటం. ధూమ్రాక్షుడు లేక ధూమ్రలోచనుడు అంటే పొగ బారిన, మసకబారిన కన్నులు కలవాడు, అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు అని అర్థం. కళ్ళు మసకబారినప్పుడు యదార్థం కనిపించదు. అలాగే అజ్ఞానం వలన జ్ఞానం బహిర్గతం కాదు. వివేక జ్ఞానం ఉదయించదు. కనుక మనలోని ఆ అజ్ఞానాన్ని సంహరించాలి. రక్తం అంటే రాగం, మోహం. రక్తబీజుడు అంటే ఎంత వద్దనుకున్నా మోహం ఆనే బీజం మొలకెత్తుతూనే ఉంటుంది. అందుకే కాళికాదేవి తన పెద్ద నాలుకను చాపి, ఆ రక్తబీజుని శరీరం నుంచి కారే రక్తబిందువులను మింగేసి, ఇంక మళ్ళీ రక్తబీజులు పుట్టే అవకాశం లేకుండా చేసింది. అప్పుడు జగన్మాత వాడిని సంహరించింది. అలాగే మనలోని రాగద్వేషాలను పూర్తిగా ఎప్పుడైతే మనం జయిస్తామో, అప్పుడు జగన్మాత దర్శనం మనకు ప్రాప్తిస్తుంది.

విజయదశమి దుష్టత్వం పైన దైవత్వం పొందిన విజయంగా జరుపుకుంటున్న పండగ. ఇప్పుడు రాక్షసులు లేకపోవచ్చు కానీ, మానవులలోనే దైవీ గుణాలుంటాయి, ఆసురీ గుణాలు ఉంటాయి. మనలోని ఆసురీ గుణాలను పోగొట్టుకుని, దైవీ గుణాలను వృద్ధి పరచుకోవాలి.
– డా. తంగిరాల విశాలాక్షి, విశ్రాంత ఆచార్యులు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement