దసరా పండగ.. ఒకప్పుడు అలా చేసుకునేవారు, కాలం మారిందిగా | Dussehra Significance And Celebration From Then To Now | Sakshi
Sakshi News home page

Dussehra celebrations: దసరా పండగ.. ఒకప్పుడు అలా చేసుకునేవారు, కాలం మారిందిగా

Published Thu, Oct 19 2023 10:07 AM | Last Updated on Thu, Oct 19 2023 12:17 PM

Dussehra Significance And Celebration From Then To Now - Sakshi

దసరా అంటే సెలవులు. దసరా అంటే అయ్యవార్లతో పిల్లలు కలిసి వెళ్లి పాడే పాటలు. దసరా అంటే పగటి వేషాలు. దసరా అంటే బతుకమ్మలు.దసరా అంటే బొమ్మల కొలువులు. దసరా అంటే ఊళ్ల నుంచి విచ్చేసే బంధువులు.జేబు నుంచి తీసి ఇవ్వాల్సిన ఆత్మీయ మామూళ్లు. దసరా అంటే స్త్రీ, పురుషులకు ఉల్లాసం.పిల్లలకు ఆటవిడుపు.

కాలం చాలా మారింది. నాటి దసరా ఎలా ఉంటుందో నేటి తరాలకు పదే పదే చెప్పాల్సిన అవసరం ఏర్పడింది.పెద్దలకు గుర్తు చేయాల్సిన బాధ్యత కూడా. ‘ఏ దయా మీ దయా మా మీద లేదు  ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు పావలా అర్ధయితే పట్టేది లేదు ముప్పావులా అయితే ముట్టేది లేదు హెచ్చు రూపాయయితే పుచ్చుకుంటాము అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు’...

ఒకప్పుడు దసరా వస్తే పిల్ల దండును వెంట బెట్టుకుని అయ్యవార్లు బయలుదేరేవారు. ఇంటింటికి తిరిగేవారు. మామూళ్లు స్వీకరించేవారు. ఆ రోజుల్లో ఊళ్లలో బడి కొత్త. చదువు కొత్త. అయ్యవార్లకు జీతాలు అంతంత మాత్రం. సంవత్సరంలో నేర్పిన విద్య దసరా సెలవుల్లో పెద్దల ముందు అయ్యవార్లు పిల్లల చేత ప్రదర్శింపచేసేవారు. పిల్లల తెలివితేటలు చూసి పెద్దలు ముచ్చట పడేవారు.

బడికి చందాలు, అయ్యవార్లకు మామూళ్లు ఇచ్చేవారు. ఆ సమయంలో ఇలా పైన రాసిన పాట పాడేవారు. ఇంతకీ వరహా అంటే మూడున్నర రూపాయి. దసరా కోసం పిల్లలు ఎదురు చూసేవారు. ఆ సమయంలో పిల్లల్ని బంధువుల వద్దకు పంపుతామనే హామీ ఉండేది. అవ్వా, తాతల దగ్గరికో, బాబాయి దగ్గరికో, మేనత్త ఊరికో నాలుగు జతలు పెట్టుకుని పిల్లలు ఉత్సాహంగా వెళ్లేవారు. దసరా సెలవులు హాయిగా గడిపేవారు.

 

దసరా వేషాలు
దసరాలో పిల్లలకు, పెద్దలకు ఆసక్తి దసరా వేషాలు. చాలామంది కళాకారులు పురాణ వేషాలు కట్టి ఇళ్ల ముందుకు వచ్చి కానుకలు స్వీకరించేవారు. పిల్లలకు ఈ వేషాలు చూడటం మహా సరదా. సీతారాములు, హనుమంతుడు, నారదుడు, శివుడు, అర్ధ నారీశ్వరుడు... ఇక పులి వేషాలు తప్పనిసరి. ఆ రోజుల్లో పులిని చూడటం అరుదు కాబట్టి (సినిమాల్లో తప్ప) మనిషే పులి రూపు కట్టి ఎదురు పడితే అబ్బురపడేవారు.

తప్పెట్ల మోతకు వేషగాళ్లు లయబద్ధంగా ఆడుతుంటే నోరు తెరిచి చూసేవారు. నేలన పడేసిన రూపాయి కాసునో నిమ్మకాయనో పులి వేషగాడు నోట కరవడం ఒక ఘట్టం. దసరా నవరాత్రులు వైభవంగా జరుగుతాయి కదా. అలా ఎవరైనా ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటే ‘దసరా బుల్లోడు’ అనడం ఆనవాయితీ.

బొమ్మల కొలువులు
ఇక బొమ్మల కొలువు పెట్టి ఆనందించడం ఆడపిల్లల వంతు. బొమ్మల కొలువును ఎప్పుడూ బేసి సంఖ్య మెట్ల మీద ఏర్పాటు చేస్తారు. ఇంటి ఆచారాన్ని బట్టి ఇంటి ఆడపిల్ల చేత పార్వతీ పరమేశ్వరులను గాని, సీతారాములను గాని, రాధాకృష్ణులను గాని, లక్ష్మీ సరస్వతులను గాని పెట్టిస్తారు, అమ్మాయి మొదటి దేవతామూర్తిని పెట్టాక, ఆ యేడు కొన్న కొత్త బొమ్మను తల్లి కూడా పట్టుకుని పెట్టిస్తుంది.

ప్రతి ఏడు ఒక కొత్త బొమ్మ తప్పనిసరిగా కొనడం ఆచారం. ఈ క్రమంలోనే, కొండపల్లి బొమ్మలు, నక్కపల్లి బొమ్మలతో పాటు దేశదేశాల బొమ్మలు సేకరించి బొమ్మల కొలువులో పెట్టడం వ్యాప్తి లోకి వచ్చింది. అందంగా, కళాత్మకంగా అమర్చిన బొమ్మల కొలువు పేరంటానికి బంధు మిత్రులను పిలిచి తొమ్మిది రోజులూ పేరంటం చేస్తారు. పేరంటానికి పిల్లలూ పెద్దలూ కూడా వస్తారు. బొమ్మలకు హారతి ఇచ్చి ప్రసాదం పంచిపెడతారు. 

బతుకమ్మ
తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండగ బతుకమ్మ. బతుకమ్మ పండగ వస్తుందంటే తెలంగాణ పల్లెల్లో నూతన ఉత్సాహం వెల్లి విరుస్తుంది. అది ఒక పెద్ద సంబరంగా భావిస్తారు. ఇళ్ళు శుభ్రపరుస్తారు. చక్కగా అలంకరించు కుంటారు. ఆడపిల్లల్ని పుట్టింటికి తీసుకు వస్తారు. అత్తగారింట్లో వుండే ప్రతి ఆడపిల్లా పుట్టింటికి వెళ్లడం కోసం ఎదురు చూస్తుంటుంది. రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు.

బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ బతుకమ్మలను నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.  బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement