దసరా సరదాల పండుగ కడుపు నిండా పిండి వంటలు ఆరగించే పండుగ ఈ సంవత్సరం మాత్రం కరోనా కనికరించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ నైవేద్యాలు అర్పించే పండుగ జాగ్రత్తలు పాటిస్తూ అందరూ కలిసి దసరాను సరదాగా... దసరదాల పండుగగా జరుపుకుందాం.
► సాబుదాన (సగ్గుబియ్యం) వడలు
కావలసినవి: సాబుదానా (సగ్గుబియ్యం): ఒక కప్పు; బంగాళ దుంప – 1(ఉడికించి పొట్టు తీయాలి); పచ్చిమిర్చి – 8; ఉప్పు – తగినంత; నూనె – తగినంత.
తయారీ:
- ముందుగా సగ్గుబియ్యంలో నీళ్లు పోసి బాగా కగిగాక, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు మూడు గంటలు నాననివ్వాలి
- ఒక పాత్రలో... నానిన సగ్గుబియ్యం, ఉడికించిన బంగాళ దుంప, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి
- స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగనివ్వాలి
- సగ్గుబియ్యం మిశ్రమాన్ని చిన్న చిన్న వడలుగా చేతితో వత్తు కోవాలి
- సన్నని మంట మీద నూనెను ఉంచి, వీటిని అందులో వేసి, నెమ్మదిగా బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి
- ప్లేటులో పేపర్ నాప్‌కిన్ వేసి దానిపై వేయించిన వడలు వేసుకోవాలి (సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి)
► నేతి గారెలు
కావలసినవి: మినపపప్పు – 4 కప్పులు; పచ్చి మిర్చి – 10; పచ్చికొబ్బరి తురుము – ఒక టీ స్పూను; అల్లం ముద్ద – 5 టీ స్పూన్లు; నెయ్యి – తగినంత; దాల్చిన చెక్క – రెండు; లవంగాలు – 2; ఉప్పు – తగినంత; నల్ల మిరియాలు – ఒక టీ స్పూను; జీలకర్ర: ఒక టేబుల్ స్పూను.
తయారీ:
- ముందుగా మినప్పప్పును మూడు గంటల పాటు నీళ్ళలో నానపెట్టాక, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
- మిక్సీలో నూనె మినహా మిగతా పదార్థాలన్నీ జత చేసి మెత్తగా చేసి, రుబ్బుకున్న మినప్పిండిలో వేసి బాగా కలపాలి
- స్టౌ వెలిగించి పాన్ పెట్టి తగినంత నెయ్యి వేసి కాచాలి
- గారెలు వేసే ముందు ఉప్పు జత చేయాలి
- పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ, ప్లాస్టిక్ పేపర్‌పై గారెలుగా ఒత్తి, కాగిన నేతిలో వేసి బంగారు వర్ణం వచ్చేంత వరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. (అల్లం చట్నీతో తింటే రుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా మంచిది)
► పనీర్ పాయసం
కావలసినవి: తరిగిన పనీర్ – అర కప్పు; బెల్లం తరుగు – 2 కప్పులు; చిక్కటి పాలు – ముప్పావు కప్పు; పాలు – అర లీటరు; డ్రై ఫ్రూట్లు – అలంకరిచంటానికి తగినన్ని; ఏలకుల పొడి – ఒక టీ స్పూను.
తయారీ: ∙స్టౌ మీద మందపాటి బాణలి ఉంచి వేడయ్యాక, తరిగిన పనీర్, పాలను ఒకదాని తరవాత ఒకటి వెంటవెంటనే వేయాలి ∙సుమారు పది నిమిషాల వరకు ఉండలు కట్టకుండా కలుపుతుండాలి ∙చిక్కటి పాలను జత చేసి మరో నాలుగు నిమిషాల పాటు కలుపుతుండాలి ∙బెల్లం తరుగు, ఏలకుల పొడి జత చేసి, బెల్లం కరిగేవరకు బాగా కలియబెట్టాలి ∙డ్రై ఫ్రూట్లను జత చేసి, బాగా కలిపి, గిన్నెలోకి తీసుకోవాలి ∙తరిగిన బాదం, కిస్మిస్ లతో పైన అలంకరించి, బాగా చల్లారాక అందించాలి.
► కొబ్బరి పులిహోర
కావలసినవి: బియ్యం – 2 కప్పులు; ఎండు కొబ్బరి తురుము – ఒక కప్పు; చింత పండు – 50 గ్రా.; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మిన\ప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 6; పచ్చి మిర్చి – 4; కరివేపాకు – మూడు రెమ్మలు; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; ఇంగువ – పావు టీ స్పూను; నూనె – 2 టేబుల్ స్పూన్లు; వేయించిన పల్లీలు – ఒక టేబుల్ స్పూను; జీడి పప్పులు – 10.
తయారీ:
- బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి
- అన్నం వేడిగా ఉండగానే ఒక ప్లేటులోకి తీసుకుని, గరిటెతో పొడిపొడిలాడేలా కదపాలి
- స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు, ఇంగువ ఒకదాని తరవాత ఒకటి వేసి బాగా వేయించాలి
- చింతపండు పులుసు, ఉప్పు, పసుపు జత చేసి బాగా కలిపి, కొద్దిసేపు ఉడకనివ్వాలి
- దింపే ముందు ఎండు కొబ్బరి తురుము జత చేసి కలిపి దింపేసి, అన్నం మీద వేసి బాగా కలియబెట్టాలి పల్లీలు, జీడిపప్పులు జత చేసి మరోమారు కలిపి, గంట సేపటి తరవాత అందిస్తే రుచిగా ఉంటుంది. (ఇదే పద్ధతిలో పెసర పిండి పులిహోర, ఆవ పులిహోర, దానిమ్మ రసం పులిహోర, నువ్వుల పొడి పులిహోర కూడా తయారుచేసుకోవచ్చు)
► తారాట్టి పాల్
కావలసినవి: పాలు – అర లీటరు; బెల్లం తరుగు – ఒక కప్పు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; నెయ్యి – ఒక టీ స్పూను.
తయారీ:
- ముందుగా వెడల్పాటి గిన్నెను స్టౌ మీద ఉంచి, అందులో పాలు పోసి సన్నని మంట మీద బాగా మరగనివ్వాలి
- పాలు సగం అయ్యే వరకు వాటిని కలుపుతూ మరిగించాలి
- పాలు బాగా చిక్కగా అయిన తరవాత బెల్లం తరుగు వేసుకోవాలి
- నెయ్యి జత చేసి గిన్నె అంచులకు అంటుకోకుండా కలుపుతూ వుండాలి
- ఏలకుల పొడి కూడా వేసి, నెమ్మదిగా కలుపుకుంటూ సన్నని మంట మీద బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి
- నెయ్యి పాల నుండి బయటికి వస్తున్నప్పుడు మరో అయిదు నిమిషాలు ఉడికించి దింపేయాలి.
► రవ్వ బొబ్బట్లు
కావలసినవి: రవ్వ – ఒక కప్పు; మైదా – 2 కప్పులు; గోధుమ పిండి – అర కప్పు; పంచదార – 2 కప్పులు; వంట సోడా – చిటికెడు; నెయ్యి 2 టీ స్పూన్లు; నూనె అర కప్పు.
తయారీ:
- ఒక పాత్రలో మైదా పిండి, గోధుమపిండి వేసి బాగా కలపాలి ∙తగినన్ని నీళ్లు, వంట సోడా జత చేసి పూరీ పిండిలా కలిపి మూతపెట్టి ఉంచాలి
- స్టౌ మీద పాన్‌లో నెయ్యి వేసి కరిగాక, రవ్వ వేసి దోరగా వేయించి పక్కన ఉంచాలి
- అడుగు మందంగా ఉన్న గిన్నెలో మూడు కప్పుల నీళ్లు పోసి స్టౌ మీద పెట్టాలి
- నీళ్లు బాగా మరుగుతుండగా వేయించిన రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించాలి
- రవ్వ ఉడికిందనుకున్న తరవాత పంచదార, ఏలకులపొడి వేసి కలపాలి
- ఇది పూర్ణం చేయడానికి సరిపడా చిక్కబడిన తరువాత పక్కకు దింపుకొని నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకోవాలి
- ఇప్పుడు మైదా పిండిని చిన్న సైజు పూరీలా ఒత్తి మధ్యలో రవ్వ పూర్ణాన్ని పెట్టి చుట్టూరా పూరీతో మూసేసి మళ్లీ దాన్ని కర్రతో లేదా చేత్తో బొబ్బట్టులా ఒత్తి పెనం మీద నూనె లేదా నెయ్యి వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి.
► పెసర పప్పు పొంగలి
కావలసినవి: బియ్యం ఒక కప్పు; పెసరపప్పు – ఒక కప్పు; బెల్లం 2 కప్పులు; నీళ్ళు: నాలుగున్నర కప్పులు; జీడిపప్పులు – 10; కిస్‌మిస్ –10; ఎండుకొబ్బరి ముక్కలు: అర కప్పు; ఏలకుల పొడి: అర కప్పు; నెయ్యి అర కప్పు.
తయారీ:
- ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి దానిలో నెయ్యి వేసి కరిగాక, ఎండుకొబ్బరి ముక్కలు వేసి కొంచెం ఎర్రగా వేగి, సువాసన వచ్చే వరకు వేయించాక, జీడిపప్పు, కిస్‌మిస్ కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి
- అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని బియ్యం, పెసరపప్పు కలిపి కడిగి నాలుగున్నర కప్పుల నీరు పోసి స్టౌ మీద పెట్టుకోవాలి
- అన్నం వండినట్లుగానే ఉడికించుకుంటూ (అన్నం మొత్తం పలుకు లేకుండా ఉడకాలి.
- అన్నం మొత్తం ఉడికిన తరువాత ఎసరు లేకపోతే కొంచెం నీరు పోసుకోవచ్చు) కొంచెం నీరు ఉన్నప్పుడే దానిలో బెల్లం తురుము వేసి కరిగేదాకా మధ్యమధ్యలో కలుపుతూ అడుగు అంటకుండా చూసుకోవాలి
- బెల్లం మొత్తం కరిగిన తరువాత, ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్‌మిస్‌లతో పాటుగా నెయ్యి కూడా వేసి బాగా కలిపాలి
- అంతే.. ఎంతో రుచికరమైన తియ్యటి పెసర పప్పు పొంగలి సిద్ధమైనట్లే. నవరాత్రి సందర్భంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ఈ వంటకాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు.
► బాదం పాయసం
కావలసినవి: బాదం పప్పులు: ఒక కప్పు; పాలు – 6 కప్పులు; పంచదార – ఒక కప్పు; కుంకుమ పువ్వు – కొద్దిగా; నీళ్లు – ఒక గ్లాసుడు.
తయారీ:
- ముందుగా బాదం పప్పులను వేడి నీటిలో వేసి గంట సేపు నానిన తరవాత, నీళ్లు ఒంపేసి, బాదం పప్పులపై వుండే పొట్టును తీసేయాలి
- తరువాత నీటిని వంచి బాదం గింజలపై వుండే పొట్టును తీసేసి, బాదం పప్పులను మిక్సీలో వేసి, మెత్తటి పేస్టులాగా చేసుకోవాలి (అవసరం అయితే పాలు వేసుకోవాలి)
- బాదం పేస్టును పాన్‌లో వేసి 5– 10 నిమిషాలు వేడి చేయాలి
- చక్కెర జత చేసి మరి కాసేపు ఉంచి, బాగా చిక్కగా అయిన తరువాత పాలు మొత్తం పోసి ఉడికించాలి
- కుంకుమపువ్వుతో అలంకరించితే, రుచికరమైన బాదం పాయసం రెడీ.
► పూర్ణం బూరెలు
కావలసినవి: మినపప్పు – ఒక కప్పు; బియ్యం 2 కప్పులు; పచ్చి సెనగ పప్పు – 2 కప్పలు; బెల్లం తరుగు – 2 కప్పులు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నూనె – తగినంత; నెయ్యి – అర కప్పు.
తయారీ:
- ముందుగా మినపప్పు, బియ్యాన్ని కడిగి, సరిపడా నీళ్ళు పోసి సుమారు నాలుగైదు గంటల పాటు నానబెట్టాలి
- మెత్తగా రుబ్బి పక్కకు పెట్టుకోవాలి
- పచ్చి సెనగపప్పును కుకరలో వేసి తగినన్నినీళ్ళు జత చేసి ఉడికించి దింపేయాలి
- బాగా చల్లారాక బెల్లం తరుగు జత చేసి, తడి పోయేవరకు మరోమారు ఉడికించాలి (లేదంటే వేయించేటప్పుడు విడిపోయి నూనెలో కలిసిపోతుంది)
- చివరగా ఏలకుల పొడి, నెయ్యి జత చేసి మరోమారు కలిపి దింపేయాలి
- ఈ మిశ్రమం చల్లారిన తరువాత నిమ్మకాయ పరిమాణంలో ఉండలు చేసుకోవాలి
- స్టౌ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి, కాగిన తరవాత ఉండలను మినపప్పు–బియ్యం మిశ్రమంలో పూర్తిగా ముంచి నూనెలో వేయాలి
- బంగారు వర్ణం వచ్చేంతవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి
- పూర్ణం మధ్యలో రంధ్రం చేసి, కాగిన నెయ్యి వేసుకుని తింటే రుచిగా ఉంటాయి.
నిర్వహణ: వైజయంతి పురాణపండ
కర్టెసీ: శ్రీదేవి లేళ్లపల్లి, చెన్నై
Comments
Please login to add a commentAdd a comment