ప్రధానమంత్రి కృషి సించాయి యోజన(పీఎంకేఎస్‌వై) రాష్ట్రం నుంచి ఎంపికయిన ప్రాజెక్టులకు కేంద్రం రూ.9వేల కోట్ల మేర సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా గుర్తించిన 99 సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి, నాబార్డ్‌కి మధ్య ఈ నెల 7న ఢిల్లీలో కుదిరిన ఒప్పందం మేరకు రాష్ట్రంలోని 11 ప్రాజెక్టులకు సాయం అందించనుంది. ఇందులో కేంద్రం గ్రాంటు కింద రూ.1108కోట్లు, నాబార్డ్ రూ.7,955కోట్లు రుణంగా ఇవ్వనుంది.
ఈ మేరకు గురువారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేంద్రం నుంచి సానుకూలత వచ్చినట్లు నీటి పారుదల శాఖ వర్గాల ద్వారా తెలిసింది. కొమురంభీం, గొల్లవాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు,పాలెంవాగు, ఎస్సారెస్పీ-2, దేవాదుల, జగన్నాధ్‌పూర్ , భీమా, వరద కాల్వ ముఖ్యంగా దేవాదుల ప్రాజెక్టు కోసం మొత్తంగా 14,965 హెక్టార్ల భూమి అవసరం ఉండగా, ఇంతవర కు 10,428 హెక్టార్లు సేకరించారని, మిగతా 4,267 హెక్టార్లను త్వరితగతిన సేకరించాలని సూచించారు. దీంతో పాటే ఇందిరమ్మ వరద కాల్వ పనులకు అడ్డంకిగా మారిన జాతీయ రహదారి క్రాసింగ్ పనులను, భీమా, కొమురంభీం ప్రాజెక్టులకు మిగిలిపోయిన భూ సేకరణను వేగిరం చేసి పనులు సత్వరం పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించింది.