కీలక డిమాండ్ల సాధనలో నిన్నటి వెనక్కి తగ్గని అన్నదాతలు.. ఇప్పుడు చల్లబడ్డారా? లేకుంటే.. తమ ఆందోళనలను తీవ్ర తరం చేయబోతున్నారా? అసలు ఢిల్లీ ఛలోకి విరామం ఎందుకు ప్రకటించారు?. అయితే తాజా పరిస్థితుల దృష్ట్యా.. ఫిబ్రవరి 29వ తేదీ వరకు ఢిల్లీ ఛలో మార్చ్‌ను నిలిపివేస్తున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. అప్పటిదాకా ఏం చేయబోతున్నారనేది కూడా చెప్పేశారు.
1. పంజాబ్-హర్యానా సరిహద్దుల్లోని శంభూ, ఖనౌరీల వద్ద భారీ సంఖ్యలో రైతులు మోహరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం సైతం భాష్పవాయువు ప్రయోగం.. లాఠీ ఛార్జీతో ఆ ప్రాంతాలు రణరంగాన్ని తలపించాయి. అయితే ఆ వెంటనే ఢిల్లీ ఛలోను వాయిదా వేస్తున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించాయి. తమ నిర్ణయం ఏంటన్నది ఆరోజునే(29న) ప్రకటిస్తామని చెప్పారు. తదుపరి కార్యాచరణ ప్రకటించేదాకా.. అక్కడే వివిధ రూపాల్లో నిరసనలను తెలపాలని రైతులకు.. రైతు సంఘాల నేతలు పిలుపు ఇచ్చారు. దీంతో ఉద్రిక్తతలు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి.
2. ఇవాళ క్యాండిల్ మార్చ్.. రేపు రైతుల సమస్యల మీద సెమినార్ల నిర్వహణతో పాటు ప్రపంచ వాణిజ్య సంస్థ-కేంద్రం దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలకు పిలుపు ఇచ్చారు. ఆపై రెండు రోజుల్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో వరుస సమావేశాలు జరుగుతాయన్నారు. రానున్న ఐదురోజుల్లో సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కిసాన్ మజ్దూర్ మోర్చా, మరికొన్ని సంఘాలు భేటీ అయ్యి సంయుక్తంగా తదుపరి కార్యాచరణను రూపొందిస్తాయని ఆ సంఘాల నేతలు మీడియాకు వెల్లడించారు.
3. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణమాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు.. తదితర డిమాండ్లతో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దేశ రాజధానివైపు వైపు రైతులు కదం తొక్కేందుకు యత్నిస్తుండగా.. గత 11 రోజులుగా భద్రతా బలగాలు వాళ్లను నిలువరిస్తూ వస్తున్నారు. ఇనుప కంచెలు, బారికేడ్లతో బలగాలు.. ట్రాక్టర్‌లు, వాటికి రక్షణ కవచాలతో రైతులు పోటాపోటీ ప్రదర్శనలతో యుద్ధవాతావరణాన్ని తలపించారు. ఈ క్రమంలోనే ముందుకొచ్చిన రైతులపై బలగాలు భాష్పవాయుగోళాలు ప్రయోగంతో పాటు లాఠీ ఛార్జీ చేయడం చేశాయి. అయినా రైతులు మాత్రం వెనక్కి తగ్గలేదు.
4. ఇదిలా ఉంటే.. బుధవారం జరిగిన ఘర్షణల్లో యువ రైతు శుభ్‌కరణ్ సింగ్ మృతి చెందిన తర్వాత ఆందోళనను రెండు రోజులు నిలిపివేసినట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. శుక్రవారం శుభ్‌కరణ్ మృతికి నిరసనగా బ్లాక్ డే నిర్వహించాయి. అయితే.. నిరసనలో పాల్గొంటున్న దర్శన్ సింగ్(62) అనే రైతు గుండెపోటుతో శుక్రవారం ప్రాణాలు విడిచినట్లు రైతు నాయకులు తెలిపారు. దీంతో రైతుల నిరసనలు మొదలయ్యాక ఇప్పటిదాకా ఐదుగురు చనిపోయారని రైతు సంఘాలు చెబుతున్నాయి.
5.ఒకవైపు చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కేంద్రం చెబుతుండగా.. మరోవైపు రైతు సంఘాలు మాత్రం నిర్ణీత కాల వ్యవధితో తమకు డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని.. లేకుంటే ఆందోళనలను కొనసాగిస్తామని అంటున్నాయి. ఇంకోవైపు రైతులకు మద్దతుగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న అన్నదాతల హక్కులను కేంద్రం, కొన్ని రాష్ట్రాలు ఉల్లంఘిస్తున్నాయని అందులో పిటిషనర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment