అంతరిక్షంపై చిన్నారుల్లో అమితాసక్తి  | PM Modi Mann Ki Baat 124th Episode Highlights | Sakshi
Sakshi News home page

అంతరిక్షంపై చిన్నారుల్లో అమితాసక్తి 

Jul 27 2025 12:25 PM | Updated on Jul 28 2025 12:39 AM

PM Modi Mann Ki Baat 124th Episode Highlights

శుభాంశు అంతరిక్ష యాత్ర విజయవంతం కావడం హర్షణీయం  

స్పేస్‌ సెక్టార్‌లో 200కుపైగా స్టార్టప్‌ కంపెనీలొచ్చాయి 

దేశ అభివృద్ధి కోసం స్వదేశీ ఉత్పత్తులే ఉపయోగిద్దాం  

‘మన్‌ కీ బాత్‌’లో మోదీ పిలుపు  

సాక్షి, న్యూఢిల్లీ:  భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. అంతరిక్షంపై చిన్నారుల్లో ఆసక్తి నానాటికీ పెరుగుతోందని చెప్పారు. అంతరిక్ష రంగంలో 200కుపైగా స్టార్టప్‌ కంపెనీలు ఏర్పాటయ్యాయని తెలిపారు. ఆయన ఆదివారం 124వ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

 ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’కు అతిపెద్ద ఆధారం ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ అని పునరుద్ఘాటించారు. ‘2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌’ అనే లక్ష్య సాధన కోసం కృషి చేస్తున్నామని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. గత కొన్ని వారాల్లో క్రీడలు, సైన్స్, సాంస్కృతికం తదితర రంగాల్లో ఎన్నో ఘనతలు నమోదయ్యాయని, అవి ప్రతి భారతీయుడికీ గర్వకారణమని చెప్పారు.

శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్రతో దేశమంతా పులకించిపోయిందని, ఆయన క్షేమంగా తిరిగి వచ్చాక గర్వంతో ఉప్పొంగిపోయిందని, ప్రతి హృదయం సంతోషంతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు. 

2023 ఆగస్టులో చంద్రయాన్‌–3 ప్రయోగం విజయవంతమైనప్పుడు భారతీయులు ఎంతగానో గర్వించారని గుర్తుచేశారు. చిన్నారుల్లో సైన్స్, అంతరిక్షం పట్ల ఆసక్తి పెరిగిందని, చంద్రుడిపైకి చేరుకుంటామని చెబుతున్నారని వెల్లడించారు. స్పేస్‌ సైంటిస్ట్‌ కావాలన్న ఆలోచన వారిలో నాటు కుందని, ఇదొక శుభ పరిణామమని ఉద్ఘాటించారు. ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే...  

ఒలింపియాడ్‌లో మన విద్యార్థుల ఘనత  
‘‘చిన్నారుల్లో నూతన ఆవిష్కరణ పట్ల ఉత్సాహం పెంచడానికి ఇన్‌సై్పర్‌–మానక్‌ అభియాన్‌ ప్రారంభించాం. ఒక్కో పాఠశాల నుంచి ఐదుగురిని ఎంపిక చేశాం. లక్షలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో చేరారు. చంద్రయాన్‌–3 తర్వాత వారి సంఖ్య రెట్టింపయ్యింది. స్పేస్‌ స్టార్టప్‌లు ఐదేళ్ల క్రితం కేవలం 50 ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 200 దాటేసింది. 

21వ శతాబ్దంలో నూతన శక్తితో సైన్స్‌ పురోగమిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఇంటర్నేషనల్‌ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో మన విద్యార్థులు దేవేశ్‌ పంకజ్, సందీప్‌ కుచీ, దేవదత్‌ ప్రియదర్శి, ఉజ్వల్‌ కేసరి పతకాలు గెలుచుకున్నారు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్‌ మ్యాథమెటికల్‌ ఒలింపియాడ్‌ లో మన విద్యార్థులు ఆరు పతకాలు సాధించారు. 

విప్లవాల మాసం ఆగస్టు   
ఆగస్టు రాబోతోంది. ఆగస్టు అంటే విప్లవాల మాసం. 18 ఏళ్ల స్వాతంత్య్ర సమర యోధుడు ఖుదిరాం బోస్‌ను ఆగస్టులోనే బ్రిటిష్‌ పాలకులు ఉరి తీశారు. లోకమాన్య బాల గంగాధర్‌ తిలక్‌ ఆగస్టు 1న మరణించారు. ఆగస్టు 8న గాంధీ నాయకత్వంలో క్విట్‌ఇండియా ఉద్యమం మొదలైంది. ఆగస్టు 15న మనకు స్వాతంత్య్రం వచ్చింది. దేశ విభజన కూడా ఇదే నెలలో జరిగింది. ప్రతిఏటా ఆగస్టు 14వ తేదీని ‘విభజన అకృత్యాల సంస్మరణ దినం’గా నిర్వహించుకుంటున్నాం. 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం ఆరంభమైంది. స్వదేశీ ఉత్పత్తులు వాడాలన్న పిలుపునకు అప్పటి ప్రజలు స్పందించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం నిర్వహిస్తున్నాం. 

అదే మనందరి సంకల్పం  
మన దేశం మరింత అభివృద్ధి చెందాలంటే స్థానిక ఉత్పత్తులు విరివిగా ఉపయోగించాలి. మన దేశంలో తయారైన వస్తువులే విక్రయించాలి. అవే కొనుక్కోవాలి. అదే మనందరి సంకల్పం కావాలి. ఎందుకంటే వాటి తయారీ కోసం మనం స్వేదం చిందించాం. కొన్నిసార్లు కొన్ని విషయాలు కొందరికి అసాధ్యంగా కనిపిస్తాయి. కానీ, మనమంతా ఒక్కటై పని చేస్తే అసాధ్యాలే సుసాధ్యాలవుతాయి. అందుకు తగిన ఉదాహరణ స్వచ్ఛ భారత్‌ మిషన్‌. ఈ కార్యక్రమానికి 11 ఏళ్లు పూర్తి కాబోతున్నాయి. ఇదొక ప్రజా ఉద్యమంగా మారింది. స్వచ్ఛతను ప్రజలు తమ బాధ్యతగా భావిస్తున్నారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ అవసరం ఇప్పటికీ ఉంది. 4,500 పట్టణాలు, నగరాలు ఇందులో భాగమయ్యాయి. 15 కోట్ల మందికిపైగా జనం పాలుపంచుకున్నారు. ఇది సాధారణ     విషయం కాదు.  

ఒడిశాలో మాజీ నక్సలైట్ల విజయాలు స్ఫూర్తిదాయకం  
జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో మాజీ నక్సలైట్లు చేపల పెంపకంలో అద్భుత విజయాలు సాధిస్తున్నారు. హింసను వీడి మత్స్య రంగంలో ప్రవేశించారు. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ అభివృద్ధి దీపం వెలిగించవచ్చని నిరూపించారు. కొన్నిసార్లు దట్టమైన చీకటి నుంచే ప్రకాశవంతమైన వెలుగు ఉద్భవిస్తుంది. గతంలో తుపాకులు పట్టుకొన్న నక్సలైట్లు ఇప్పుడు వలలు చేతబూని చేపల వేట సాగిస్తున్నారు. చక్కటి ఆదాయం పొందుతూ బతుకులు మార్చుకుంటున్నారు. ఈ విజయ గాథలు అందరికీ స్ఫూర్తిదాయకం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement