
‘స్వదేశీ’ అని సగర్వంగా చెప్పుకోండి
ప్రతిభావంతుల కోసం ‘ప్రతిభా సేతు’
125వ మన్ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: రాబోయేది పండుగల కాలమని, ఈ సీజన్‌లో ప్రజలందరూ స్వదేశీ వస్తువులనే ఉపయోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బహుమతులు, దుస్తులు, అలంకరణలు జీవితంలో ప్రతీది మనదేశంలో తయారైందే ఉపయోగించాలని, ఇది స్వదేశీ అని సగర్వంగా చెప్పుకోవాలని సూచించారు. అదే ఆత్మనిర్భర్ భారత్‌కు దారి తీస్తుందని ఉద్ఘాటించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై 50 శాతం సుంకం విధించడంతో అమెరికాతో సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో దేశం స్వావలంబన చెందాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి 125వ ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ మాట్లాడారు. వివిధ ప్రాంతాలు గణేష్ చతుర్థి, ఆ తరువాత దుర్గా నవరాత్రులు, దీపావళి పండుగలు వరుసగా వస్తున్నందున పండుగల సమయంలో ప్రజలు స్వదేశీ ఉత్పత్తుల గురించి ఎప్పటికీ మరచిపోకూడదన్నారు. రామాయణం, భారతీయ సంస్కృతి పట్ల ప్రేమ ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి మూలకు చేరుకోవడం చూస్తుంటే గర్వంగా ఉందన్నారు.
ప్రకృతి వైపరీత్యాల విధ్వంసంపై విచారం..
ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు చేపట్టిన భద్రతా దళాలు, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, స్థానికులు చూపిన ధైర్యాన్ని అభినందించారు. ‘వంతెనలు కూలినా, కొండచరియలు విరిగిపడినా, మనుషుల ప్రాణాలను రక్షించేందుకు ప్రతి ఒక్కరూ చేసిన కృషి దేశానికి గర్వకారణం’అని కొనియాడారు. ప్రకృతి వైపరీత్యాలు సృష్టించిన విధ్వంసంపై ప్రధాని విచారం వ్యక్తం చేశారు.
పటేల్ వల్లే హైదరాబాద్ విమోచన..
‘భారత సమగ్రతను కాపాడటంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ పాత్ర చిరస్మరణీయం. 1948లో ఆయనే చూపిన దూరదృష్టి, ధైర్యసాహసాల వలననే హైదరాబాద్ విమోచన సాధ్యమైంది. సెపె్టంబర్ 17వ తేదీ హైదరాబాద్ విమోచన దినోత్సవం మనకు చరిత్రలోని ఒక మహత్తర గాథను గుర్తు చేస్తుంది. అది కేవలం ఒక ప్రాంత విమోచన కాదు, దేశ సమగ్రతకు బలమైన పునాది.
ప్రతిభా సేతుతో వందలాది మందికి ఉపాధి
యూపీఎస్సీలో ఎంపిక కాని ప్రతిభావంతుల కోసం రూపొందించిన ‘ప్రతిభా సేతు పోర్టల్’గురించి ప్రధాని ప్రస్తావించారు. ఈ పోర్టల్ ద్వారా ఇప్పటికే వందలాది మంది ఉపాధి పొందారన్నారు. మధ్యప్రదేశ్ యువకులు ఫుట్‌బాల్ ఆడుతున్న దృశ్యం జర్మన్ కోచ్ దృష్టిని ఆకర్షించడం, వారికి జర్మనీలో శిక్షణ కల్పించడానికి ముందుకు రావడాన్ని ప్రధాని ఉదహరించారు. కొంతమంది ఆటగాళ్లు త్వరలో శిక్షణ కోసం జర్మనీకి వెళతారని ప్రధాని తెలిపారు. సైనికుల గాథలను సేకరించి, అమరవీరుల కుటుంబాలతో సంబంధాలు కొనసాగిస్తున్న సమాజసేవకుడు జితేంద్ర సింగ్ రాథోడ్ సేవలను ప్రధాని ప్రశంసించారు. బీహార్‌కు చెందిన ‘సోలార్ దీదీ’ దేవకి సోలార్ పంపుల ద్వారా గ్రామానికి నీరు అందజేసి రైతుల ఆదాయాన్ని పెంచిన కృషిని గుర్తుచేశారు.
విశ్వకర్మ సోదరులకూ వందనం
‘సెపె్టంబర్ 17న విశ్వకర్మ జయంతి. ఆ రోజును మన విశ్వకర్మ సోదరులకు అంకితం చేశాం. వడ్రంగులు, కమ్మరి, స్వర్ణకారులు, కుమ్మరులు, శిల్పులు – ఈ సంప్రదాయ వృత్తులు భారతీయ నాగరికతకు, సాంస్కృతిక వారసత్వానికి పునాదులు. ఒక తరం నుండి మరొక తరానికి నైపుణ్యాన్ని అందిస్తూ, జ్ఞానాన్ని కాపాడుతూ వస్తున్నారు. వీరిని ఆదుకోవడానికి ప్రభుత్వం ‘విశ్వకర్మ యోజన’ను ప్రారంభించింది’అని మోదీ తెలిపారు.
PM Narendra Modi (@narendramodi), during the 125th episode of ‘Mann Ki Baat’, says, "Pratibha Setu Portal is a beacon of hope for those UPSC aspirants who narrowly miss selection, opening doors to fresh opportunities and dignity for talented individuals."
(Source: Third Party) pic.twitter.com/ODyOTmT87n— Press Trust of India (@PTI_News) August 31, 2025