న్యూఢిల్లీ: రైతులకు కనీసమద్దతు ధర కల్పించే విషయంలో సంబంధిత భాగస్వాములతో చర్చించడానికి సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని(జేపీసీ)ని ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ‍్యసభలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మూడు సాగుచట్టాలను రద్దుచేయాడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం దేశంలో.. రైతు ప్రయోజనాల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయన్నారు.
కనీస మద్దతు ధర కల్పించాలనే అంశం మరోసారి చర్చకు వచ్చిందన్నారు. కాగా, తమ ప్రభుత్వం ఏపీ రైతులకు కనీస మద్దతుధర ఆచరించి చూపిందని తెలిపారు. కేంద్రం 23 వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పిస్తే.. తమ ప్రభుత్వం మరో 24 వ్యవసాయ ఉత్పాదనలకు ఎంఎస్‌పీ ఇస్తుందన్నారు. ప్రస్తుతం ఏపీలో 47 పంటలు కనీస మద్దతుధర పరిధిలోకి వచ్చాయని పేర్కొన్నారు.
దేశంలోని అన్నిరాష్ట్రాల కంటే అత్యధిక పంటలకు ఎంఎస్‌పీ ప్రకటించిన రాష్ట్రం ఏపీ అని విజయసాయిరెడ్డి తెలిపారు. జాతీయస్థాయిలో కూడా అత్యధిక పంటలకు ఎంఎస్‌పీ ఉండేలా చట్టబద్ధమైన హామీ కల్పించాల్సిన అవసరముందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పించే విషయంలో ఆటంకంగా ఉన్న అన్ని అంశాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు.
రైతుల అవసరాలకు అనుగుణంగా పార్లమెంట్‌లో చట్టం చేయడానికి ఈ సంప్రదింపులు ఎంతగానే ఉపయోగపడతాయని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అందుకే సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ)ని ఏర్పాటుచేసి, కనీస మద్దతు ధరపై ముడిపడిన వివిధ సమస్యలపై సంబంధిత భాగస్వామ‍్య పార్టీలతో సంప్రదింపులు చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment