ప్రపంచ పర్యావరణాన్ని కోలుకోలేనంతగా ధ్వంసం చేసిన ప్రస్తుత ఆర్థిక విధానాల స్థానంలో వ్యవసాయరంగమే ఆర్థిక వృద్ధికి నిజమైన సంరక్షకదారు అనే భావన ప్రాచుర్యం పొందుతోంది. వ్యవసాయం పట్ల మన ఆలోచనలనే మౌలికంగా మార్చేయాల్సిన విప్లవం ఇప్పుడు ప్రపంచానికి అవసరం. స్థూలదేశీయోత్పత్తి అత్యున్నత స్థాయికి చేరినప్పుడు కూడా ఉపాధి కల్పన సాధ్యం కానప్పుడు మరింత దూకుడుగా ఆర్థిక సంస్కరణలు ప్రారంభించాలంటున్న ఆలోచనలు ఇంకా ప్రమాదకరం. ఇప్పుడు కావలసింది కోట్లమందికి దేశీయంగా ఉపాధి కల్పించగలిగిన వ్యవసాయ రంగంలో నిజమైన సంస్కరణలే. ప్రతి రైతు కుటుంబం కూడా ఆర్థిక పుష్టి సాధించినప్పుడు గ్రామాలనుంచి పట్టణాలకు వలసపోవడానికి బదులుగా గ్రామాలే ఉపాధి కేంద్రాలుగా తయారవుతాయి.
నయా ఉదారవాదం చేవచచ్చిపోయి చరిత్రలో కలిసిపోయిందనీ, దాని ఫలితంగా ప్రపంచంలో నిరుద్యోగం, అసమానతలు పరాకాష్టకు చేరిపోయి, వాతావరణ మార్పు దాని చరమ దశకు చేరుకుందనీ.. నోబెల్ అవార్డు గ్రహీత జోసెఫ్ స్టిగ్లిట్జ్ వ్యాఖ్యానించినప్పుడు, కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి ఉద్దీపింపజేయగల శక్తి వ్యవసాయానికి మాత్రమే ఉందని స్పష్టమైంది. పాశ్చాత్య దేశాల్లో సంపద సంచయనం అనేది తప్పనిసరిగా గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలపై ఆధారపడి నిర్మితమైందని ప్రముఖ రచయిత అమితాబ్ ఘోష్ చెప్పినప్పుడు, ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్ ఆ అభిప్రాయాన్ని ఖండించే సాహసం చేశారు ‘ప్రపంచం కొనసాగిస్తున్న ప్రస్తుత ఆర్థిక నమూనా.. పర్యావరణానికి ఆత్మహత్యా సదృశం లాంటిది. వాతావరణంలో మార్పు ఎంత తీవ్రంగా ఉందంటే ఆర్థిక వృద్ధికి సంబంధించిన పాత నమూనా ఇప్పుడు ఒక అడ్డంకిగా మాత్రమే లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్వావలంబన వైపు ఉత్తమంగా నడిపేందుకు మనం ఇప్పుడు ఏకంగా విప్లవాన్నే సాగించాల్సి ఉంది.’’ కానీ, 2011 ప్రపంచ ఆర్థిక వేదికను ఉద్దేశించి ఆయన ఇచ్చిన పై పిలుపును ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
ప్రస్తుత ఆర్థిక నమూనా ఉపయోగం నిరర్థకంగా తేలిపోయిన ఈ తరుణంలో సహజ వనరుల విధ్వంసం కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. ఇది కనీవినీ ఎరుగని సామాజిక, ఆర్థిక విచ్ఛిన్నతల వైపునకు దారి తీస్తోంది. ఆర్థిక వృద్ధికి సంబంధించి పర్యావరణ దుష్ఫలితాలు విధ్వంసకరంగా మారుతున్నాయి. వ్యవసాయం విస్తృతంగా సాగుతున్న ప్రాంతాల్లో కూడా నేల సారం జీరో స్థాయికి పడిపోయింది. భూగర్భ జలాలను మితిమీరి తోడేయడం ఫలితంగా జలాశయాలు ఎండిపోతున్నాయి. పైగా పురుగుమందులతో సహా వ్యవసాయంలో రసాయనాల వాడకం పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నందున ప్రపంచ వ్యాప్తంగా ఆహార రంగం పూర్తిగా కలుషితమైపోయింది.
నేల సారం రానురానూ చిక్కి శల్యమవుతున్నందున, పారిశ్రామిక వ్యవసాయ విస్తరణ వెనుకంజ వేసింది. నేల కోత, నీటి క్షీణత కారణంగా అడవులు ఖాళీ అవుతున్నాయి. ఈ అన్ని దుష్పరిణామాల నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోవడానికి ఇష్టపడని బ్రెజిల్ నూతన అధ్యక్షుడు జైర్ బొల్సోనరో ఏకంగా అమెజాన్ వర్షాటవులపైనే దాడిని ప్రారంభించాడు. అధికారాన్ని స్వీకరించి కొద్ది గంటలు కూడా కాకముందే ప్రపంచ శ్వాసగా గుర్తింపుపొందిన జీవారణ్యాలను చావుదెబ్బతీస్తూ ఆదేశాలు జారీ చేశాడు. భారత్‌లో పంజాబ్ ముఖ్యమంత్రి కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతూ భూగర్భజలాలను ప్రస్తుత స్థాయిలో తోడేస్తున్న ప్రక్రియలను ఇకనైనా నిరోధించకపోతే భూమి ఎడారిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పంజాబ్, హర్యానాల్లో భూగర్భజలాలను ప్రస్తుత స్థాయిలో తోడేయడం ఆపకపోతే మరో 35 సంవత్సరాల్లోనే ఈ రెండు రాష్ట్రాలు కచ్చితంగా ఎడారిగా మారిపోక తప్పదని కేంద్ర భూగర్భ జల మండలి తాజా నివేదిక స్పష్టం చేసింది.
పర్యావరణ ఉత్పాతం ఇంత స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనబడుతున్నప్పటికీ, ఆర్థిక సంస్కరణలు మరింత స్థాయిలో పెరుగుతున్న సూచనలే కనబడుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లు మద్దతు పలుకుతున్న చింతనా పరులు, క్రెడింట్ రేటింగ్ సంస్థలు, ఆర్థశాస్త్ర రచయితలు మరో మాటకు తావీయకుండా మరిన్ని ఆర్థిక సంస్కరణలు మొదలెట్టాల్సిందేనని పిలుపునిచ్చారు. ఆర్థిక సంస్కరణల భావజాలం ప్రాతిపదికన పాలసీలకు ప్రాధాన్యం ఇవ్వాలనే లక్ష్యంతో ఏర్పడిన యూపీఏ–1, యూపీఏ–2 ప్రభుత్వాలు పదేళ్లపాటు సాగించిన అత్యున్నత జీడీపీ రేటు కూడా ఉద్యోగాలను తగినంతగా కల్పించకపోయినప్పుడు, మరింత దూకుడుగా ఆర్థిక సంస్కరణలను అమలు చేయాలనే ప్రతిపాదనలు మరిన్ని ఉద్యోగాలను ఎలా సృష్టించగలవనేది పెద్ద ప్రశ్న. ఉద్యోగాలు లేని దశనుంచి ఉద్యోగాలు కోల్పోతున్న దశకు ప్రపంచ ఆర్థిక గమనం వేగంగా పయనిస్తున్నప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం లభించడం చాలా కష్టం. పట్టణ కేంద్రాలలోనే కాకుండా గ్రామీణ వ్యవసాయం, వ్యవసాయేతర రంగాల్లోనూ శ్రామికులు భారీస్థాయిలో ఉద్యోగాలు కోల్పోతున్నారని ఇటీవలి అధ్యయనాలు సూచిస్తున్నాయి.
అదేవిధంగా, పెట్టుబడులను ఆకర్షించడానికి మరిన్ని ఉద్యోగాలు కల్పించడానికి కార్పొరేట్ పన్నును తగ్గించాలనే డిమాండ్ పెరుగుతోంది. కానీ వాస్తవానికి ఇది సమర్థనీయమని చెప్పడానికి ఎలాంటి ప్రత్యక్ష ఆధారం కూడా లేదు. తమపై అధికపన్నును తగ్గించాలని కార్పొరేట్ రంగం కోరుకుంటోంది కాబట్టి వారి ఆకాంక్షలకు అనుగుణంగా క్రెడిట్ రేటింగ్ సంస్థలు, ఆర్థిక చింతనాపరులు ఈ వాదనను మితిమీరి సమర్థిస్తున్నారు. కార్పొరేట్ పన్నును భారీగా తగ్గిస్తే అది బారీ పెట్టుబడులను ఆకర్షిస్తుందనే ప్రచారం ఎంత తప్పు భావనో పేర్కొంటూ నోబెల్ అవార్డు గ్రహీత పాల్ క్రూగ్‌మన్ ఈ తప్పుడు ఆలోచన మూలాన్నే ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. కార్పొరేట్ పన్నులకు, పెట్టుబడుల పెరుగుదలకు మధ్య ఎలాంటి సంబంధం లేదని యుఎస్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్ అనాలసిస్ ఆధారంగా పాల్ పట్టిక సహితంగా సూచిస్తూ సవాలు చేశారు. పైగా, కార్పొరేట్ పన్నుల తగ్గింపు మరిన్ని ఉద్యోగాల కల్పనకు ఏవిధంగానూ దారి తీయడం లేదు. నిజానికి కార్పొరేట్లపై పన్నులు తగ్గించిన ప్రతిసారి సంపన్నులు స్టాక్ మార్కెట్లలో మరింత అధికంగా మదుపు చేయడానికే ప్రాధాన్యమిచ్చారని పాల్ పేర్కొన్నారు.
పారిశ్రామిక సంస్థలు పదే పదే కోరుతున్న మరొక సాహసోపేత సంస్కరణ ఏదంటే, లేబర్ మార్కెట్లను సంస్కరించడమే. దీని అర్థం ఏమిటంటే, కార్మికులను తమ ఇష్టమొచ్చినట్లుగా నియమించుకోవడం, వారిపై ఓటువేయడం తమకు హక్కుగా కల్పించాలని కార్పొరేట్ సంస్థల డిమాండ్. అయితే లేబర్ మార్కెట్లపై పాశవితను ప్రదర్శించడం ద్వారా సంపన్నులు పొందగలిగేది ఏమీ ఉండబోదని పాల్ మరొక ట్వీట్‌లో తేల్చి చెప్పారు. సులభంగా చెప్పాలంటే, అమెరికాలో అనుసరించిన పాశవికమైన కార్మికరంగ సంస్కరణలు ఏ దశలోనూ పనిచేయలేదు. ఇలాంటి ఆలోచనా విధానం మారాలి. మన వ్యవసాయరంగంలో వ్యవస్థాగతమైన సంస్కరణల అవసరం ఉందని గుర్తిస్తున్న తరుణంలో పాత ఆలోచనల్లో మార్పు రావడం సులభం కాదు. కాని మార్పువస్తుందని నేను నమ్ముతున్నాను.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో వ్యవసాయం మాత్రమే ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవితం చేయగలదు. వ్యవసాయం మాత్రమే కోట్లాదిమందికి జీవనం కలిపించగలదు, అదేసమయంలో భూతాపాన్ని గణనీయంగా తగ్గించగలదు కూడా. అయితే దీన్ని సాధించాలంటే మొట్టమొదటగా గుర్తించవలసిందీ, ఆమోదించవలసిందీ ఏమిటంటే రాబోయే సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థకు తిరిగి ప్రాణం పోయడంలో వ్యవసాయం నిర్వహించే పాత్రను అందరూ అర్థం చేసుకోవాలి. నగరాలకు అవసరమైన చౌక శ్రమను పూరించడానికి వ్యవసాయం నుండి పెద్ద ఎత్తున రైతులను నగరాలకు తరలించాల్సి ఉందన్న ఆలోచననే మొదటగా మార్చుకోవలసి ఉంది. వ్యవసాయాన్ని ఆర్థికంగా చెల్లుబాటయ్యేలా చేయాలంటే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా పరివర్తింప జేస్తూ, నగరాలకు వలసలను గణనీయంగా అరికట్టాల్సి ఉంటుంది. వ్యవసాయం లాభదాయకంగా మారినప్పడు నగరాల్లో ఉద్యోగాల కల్పన చేయవలసిన అవసరం దానికదేగా తగ్గుతుంది. అందుకే వ్యవసాయమే ఆర్థిక వ్యవస్థ సంరక్షక పాత్రను పోషిస్తుంది.
న్యూఢిల్లీలో ఇటీవల నీతి అయోగ్ పాలనామండలి అయిదో సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తూ, వ్యవసాయంలో సంస్థాగత సంస్కరణలనూ సూచిస్తూ ఒక అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ని ఏర్పరుస్తున్నట్లు ప్రకటించారు. ఇది నిజంగానే సానుకూల పరిణామం. 2014 నాటికి వ్యవసాయరంగ పరివర్తనకు అవసరమైన పునాదికి ఇది వీలుకల్పిస్తుంది. పర్యావరణ రంగ స్వావలంబన, దేశ ప్రాదేశిక అవసరాలను గుర్తించడం దీని లక్ష్యం. ప్రధాని ఈ అంశాన్నే నొక్కి చెబుతూ సాంప్రదాయిక జల వనరుల పరిరక్షణ సాంకేతికతలను పెంపొందించాలని, వ్యవసాయ రంగ వ్యూహంలో నీటి పరిరక్షణను అతి ముఖ్యమైన అంశంగా మార్చాలని ప్రతిపాదించారు. దశాబ్దాల పర్యంతం ఆకలి, పోషకాహార లోపానికి దారితీసిన గత ఆహార విధానాలను తోసిపుచ్చుతూ వ్యవసాయంలో దేశీ సంస్కరణను విస్తృంతంగా అమలుచేయడమే ఇప్పుడు భారత్ ప్రధాన అవసరమని స్పష్టం చేశారు.
ఇప్పటికే విఫలమైన వ్యవసాయ విధానాలను మళ్లీ అరువు తెచ్చుకోవడానికి బదులుగా భారత్ ఇప్పుడు వ్యవసాయ ఆర్థికవ్యవస్థను స్వావలంబన వైపు మళ్లించే తరహా సాగు విప్లవాన్ని సాధించాల్సిన అవసరముంది. ప్రతి వ్యవసాయదారుడికి రూ. 6,000ల నగదు మద్దతును అందించడం ద్వారా మోద్లీ మన ఆలోచనల్లోనే పెద్ద మార్పును తీసుకొచ్చారు. ఈ పథకం ఇప్పుడు దేశంలోని ప్రతి రైతుకూ నెలకు రూ.500లు అందిస్తోంది. భవిష్యత్తులో ప్రతిరైతూ నెలకు రూ. 5,000లు లబ్ధి పొందేలా మన వ్యవసాయ విధానాలు మెరుగుపడేరోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. ప్రభుత్వ ఖజానాకు వ్యవసాయం శిరోభారం అనే ఆలోచనాతీరునే మన పాలసీ నిర్ణేతలు మార్చుకోవాలి. భవిష్యత్తులో ఆర్థిక వృద్ధి వ్యవసాయం ద్వారానే సాధ్యమవుతుందని విశ్వసించడం మాత్రమే వ్యవసాయరంగలో నిజమైన మార్పులకు వీలు కల్పిస్తుంది.
దేవీందర్ శర్మ
వ్యాసకర్త ప్రముఖ వ్యవసాయ రంగ నిపుణులు
ఇమెయిల్ :hunger55@gmail.com
Comments
Please login to add a commentAdd a comment