న్యూఢిల్లీ: దేశ జీడీపీలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాటా మరింత పెరగాల్సి ఉందని, మార్కెటింగ్‌ను బలోపేతం చేయడం ద్వారా ఇది సాధ్యపడుతుందని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్‌షా అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో రైతులు, తయారీదారుల సంఘాలు (ఎఫ్‌పీవోలు) కీలకపాత్ర పోషించాల్సి ఉందన్నారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ఆధునిక టెక్నాలజీ, మార్కెటింగ్ విధానాలను అనుసరించడం మొదలు పెడితే వ్యవసాయం లాభదాయకంగా మారుతుందన్నారు.
ఈ దిశగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్), ఎఫ్‌పీవోలు సాయంగా నిలుస్తాయన్నారు. ఎఫ్‌పీవోలు, పీఏసీఎస్‌లు హైబ్రిడ్ నమూనాలో కలసి పనిచేయాలని సూచించారు. ఇందులో భాగంగా 11,770 ఎఫ్‌పీవోలు ఒప్పందం ద్వారా పీఏసీఎస్‌తో అనుసంధానం కావాలని కోరారు. దీనికింద పీఏసీఎస్‌లకు ఎఫ్‌పీవోలు సేవలు అందించాలని సూచించారు. ‘‘తయారీ ద్వారా జీడీపీ వృద్ధి చెందితే ఉపాధి కల్పన భారీగా ఉండదు.
అదే వ్యవసాయం, అనుబంధ రంగాలు వృద్ధి చెందిదే జీడీపీకే కాకుండా పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు అనుకూలిస్తుంది. వ్యవసాయం దాని అనుబంధ రంగాలు అత్యధికంగా జీడీపీకి 17.5–18 శాతం వాటా సమకూరుస్తున్నాయి. కానీ, ఇతర రంగాల్లోని వారితో పోలిస్తే రైతుల పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. ఇతర రంగాల్లో మాదిరే రైతుల పరిస్థితులు మెరుగు పడాలంటే అందుకు ఎఫ్‌పీవోలను ఆమోదించాలి’’ అని అమిత్‌షా పేర్కొన్నారు. ఎఫ్‌పీవోల్లో రైతులు, తయారీదారులు (ఉత్పత్తిదారులు) భాగంగా ఉంటారు. వీరు చిన్న, సన్నకార రైతులకు సాగు, ముడి సరుకులు, సాంకేతిక సేవలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ సహా అన్ని రకాల సేవలు అందిస్తుంటారు.
మరిన్ని ఎఫ్‌పీవోలు
ఇప్పటికే 11,770 ఎఫ్‌పీవోలు ఉండగా, 2027–28 నాటికి మరో 10,000 ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. దేశంలో 85 శాతం మంది చిన్న, సన్నకార రైతులే ఉన్నందున వ్యవసాయం లాభసాటిగా మారాల్సి ఉందని అమిత్‌షా పేర్కొన్నారు. ఇందుకోసం ఆధునిక టెక్నాలజీ, మార్కెటింగ్ విధానాలు అవసరమని సూచించారు. ‘‘ఎఫ్‌పీవోల వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. కానీ, సహకార రంగంలో ఎఫ్‌పీవోలు, వాటి వల్ల ప్రయోజనాలు పరిమిత స్థాయికే చేరుకున్నాయి. పీఏసీఎస్‌ల ద్వారా 1,100 ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలని ఇటీవలే నిర్ణయించాం’’అని అమిత్‌షా తెలిపారు.
వ్యవసాయ మౌలిక నిధికి మద్దతుగా నిలవాలి
బ్యాంక్‌లను కోరిన వ్యవసాయ శాఖ
వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన నిధి (రూ.లక్ష కోట్లు)కి ప్రోత్సాహంగా నిలవాలని కేంద్ర వ్యవసాయ శాఖ కోరింది. సాగు రంగంలో మౌలిక వసతులు కల్పించేందుకు ఇది తప్పనిసరి అవసరంగా పేర్కొంది. సాగు అనంతరం నిల్వ వసతుల నిర్వహణ, కమ్యూనిటీ సాగు తదితర చర్యల కోసం 2020 జూలై 8న కేంద్ర సర్కారు వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనా నిధి (ఏఐఎఫ్)ని ప్రారంభించింది.
ఈ పథకం కింద 2025–26 నాటికి రూ.లక్ష కోట్లను బ్యాంక్‌లు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఇది వడ్డీ రాయితీ, కేంద్ర ప్రభుత్వ హామీతో కూడిన పథకం. ఇందుకోసం కొత్త ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహుజా ప్రారంభించారు. ‘‘నెల రోజుల పాటు (ఆగస్ట్ 15 వరకు) ఇది కొనసాగుతుంది. ఈ కాలంలో రూ. 7,200 కోట్లను మంజూరు చేయాలి. ఈ వీడి యో కాన్ఫరెన్స్ సమావేశానికి ప్రభుత్వ, ప్రైవేటు, ప్రాంతీయ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కోపరేటివ్ బ్యాంక్‌ల ఎగ్జిక్యూటివ్‌లు హాజరయ్యారు’’అని అహుజా తెలిపారు. దేశంలో వ్యవసాయ మౌలిక ప్రాజెక్టులకు గణనీయమైన అవకాశాలున్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment