Strengthening
-
ప్రజాస్వామ్యం బలోపేతంలో ఆర్టీఐది కీలక పాత్ర
సాక్షి, విశాఖపట్నం: ప్రజాస్వామ్యం బలోపేతం కావడంలో సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కీలకపాత్ర పోషిస్తోందని ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. విశాఖపట్నంలోని ఓ హోటల్లో శనివారం నిర్వహించిన 28 బోర్డు ఆఫ్ గవర్నర్లు, సమాచార కమిషన్ల నేషనల్ ఫెడరేషన్ 12వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో 2005లో అమలులోకి వచ్చిన సమాచార హక్కు చట్టం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. దేశ ప్రజల ప్రయోజనానికి, ప్రభుత్వ పాలనలో పారదర్శకత పెంపునకు, గోప్యత మినహాయింపునకు దోహదపడుతోందని చెప్పారు. ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లోని అధికారుల వద్ద ఉన్న సమాచారాన్ని తెలుసుకునే శక్తివంతమైన సాధనం ఆర్టీఐ అని పేర్కొన్నారు.ప్రజలు ప్రభుత్వ అధికారులను జవాబుదారీగా చేస్తూ అవసరమైన సమాచారాన్ని తెలుసుకునే హక్కును సులభంగా వినియోగించుకునేలా చేస్తోందన్నారు. ఆర్టీఐ పౌరుల ప్రాథమిక హక్కును గుర్తించడంతో పాటు ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా చేసిందని వివరించారు. అవినీతిని అరికట్టడంలోను, సుపరిపాలన అందించడానికి, అవినీతి, అధికార దుర్వినియోగాలను బహిర్గతం చేయడానికి ఇది సహకరిస్తోందన్నారు. ఏదైనా తప్పు చేస్తే పరిహారం పొందే అధికారం ఇచ్చిందన్నారు. అలాగే బ్యూరోక్రాట్ల జాప్యాన్ని తగ్గించడం, సత్వర సేవలను మెరుగు పరచడం, ప్రభుత్వ అధికారులు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం, అట్టడుగు వర్గాలపై ప్రత్యేక సాధికారత వంటి అంశాల్లో సానుకూల ప్రభావం చూపడానికి ఈ చట్టం దోహదం చేస్తోందన్నారు. ఇంకా వివక్ష, నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి ఒక యంత్రాంగాన్ని అందించిందని, ఇది సమాచార అంతరాన్ని తగ్గించడంలో సహాయ పడుతోందని తెలిపారు. కేంద్ర, రాష్ట్రాల కమిషన్లు ఒకే విధమైన అధికారాలు, బాధ్యతలను, ఒకదానితో ఒకటి స్వతంత్రతను కలిగి ఉంటాయన్నారు. ఈ ఫెడరేషన్ కమిషన్లు, రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల కమిషన్లను సభ్యులుగా చేర్చుకున్నందున కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్ల మధ్య పరస్పర సంప్రదింపులు సులభతరం అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. సందేశం పంపించిన సీఎం జగన్ విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమాచార కమిషన్ల వార్షిక సమావేశానికి తన సందేశాన్ని పంపించారు. ‘ప్రభుత్వం తరఫున మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను. దేశం నలుమూలల నుంచీ మీరు విశాఖకు రావడం సంతోషానిస్తోంది. రెండు దశాబ్దాలుగా సమాచార హక్కు చట్టం ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. అనేక మందికి ప్రయోజనం చేకూరుస్తోంది. ప్రజాస్వామ్యంలో చట్టం పాత్ర, పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం, జవాబుదారీతనాన్ని పెంచుతోంది’ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సందేశాన్ని రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్. మహబూబ్ బాషా చదివి వినిపించారు. -
ఎన్బీఎఫ్సీల్లో పరిపాలన మరింత బలపడాలి
ముంబై: పరిపాలనా ప్రమాణాలను బలోపేతం చేసుకోవాలని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), హౌసింగ్ ఫైనాన్సింగ్ కంపెనీలను (హెచ్ఎఫ్సీలు) ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కోరారు. ఎంపిక చేసిన పెద్ద ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీల ఎండీలు, సీఈవోలతో గవర్నర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వరంగంలోని ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీల చీఫ్‌లు కూడా ఇందులో పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న సంస్థలు ఈ రంగంలోని మొత్తం ఆస్తుల్లో సగం నిర్వహిస్తుండడం గమనార్హం. బ్యాంకింగ్ సేవలు చేరువ కాని లేదా అందుబాటులో లేని వర్గాలకు రుణాలను అందిస్తూ ఈ సంస్థలు పోషిస్తున్న కీలక పాత్రను ఆర్బీఐ గవర్నర్ గుర్తిస్తూ.. అనుకూల సమయాల్లో అలసత్వానికి చోటు ఇవ్వొద్దని అప్రమత్తం చేశారు. పరిపాలనా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ.. నిబంధనల అమలు, రిస్క్ నిర్వహణ, అంతర్గత ఆడిట్ల యంత్రాంగం విషయమై భరోసా అవసరమన్నారు. ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు తమ నిధుల కోసం ఎక్కువగా బ్యాంకులపై ఆధారపడకుండా, ప్రత్యామ్నాయ మార్గాలపైనా ఈ సమావేశంలో చర్చించారు. అలాగే అన్సెక్యూర్డ్ రిటైల్ రుణాల్లో ఉండే రిస్క్, ఐటీ వ్యవస్థలు, సైబర్ భద్రత మెరుగుపరుచుకోవడంపైనా దృష్టి సారించారు. ఎన్పీఏలకు మరిన్ని కేటాయింపులు చేయడం ద్వారా బ్యాలన్స్ షీట్ల బలోపేతం, ఒత్తిడిలోని రుణ ఆస్తులను పర్యవేక్షించడం, బలమైన లిక్విడిటీ, అస్సెట్ లయబిలిటీ మధ్య సమతుల్యం, రుణాలకు సంబంధించి పారదర్శకమైన రేట్లు, మెరుగైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగంపైనా ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలోఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు ఎం రాజేశ్వర్ రావు, స్వామినాథన్, ఎన్‌హెచ్‌బీ ఎండీ ఎస్కే హోతా కూడా పాల్గొన్నారు. -
జీడీపీలో వ్యవసాయం వాటా మరింత పెరగాలి
న్యూఢిల్లీ: దేశ జీడీపీలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాటా మరింత పెరగాల్సి ఉందని, మార్కెటింగ్‌ను బలోపేతం చేయడం ద్వారా ఇది సాధ్యపడుతుందని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్‌షా అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో రైతులు, తయారీదారుల సంఘాలు (ఎఫ్‌పీవోలు) కీలకపాత్ర పోషించాల్సి ఉందన్నారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ఆధునిక టెక్నాలజీ, మార్కెటింగ్ విధానాలను అనుసరించడం మొదలు పెడితే వ్యవసాయం లాభదాయకంగా మారుతుందన్నారు. ఈ దిశగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్), ఎఫ్‌పీవోలు సాయంగా నిలుస్తాయన్నారు. ఎఫ్‌పీవోలు, పీఏసీఎస్‌లు హైబ్రిడ్ నమూనాలో కలసి పనిచేయాలని సూచించారు. ఇందులో భాగంగా 11,770 ఎఫ్‌పీవోలు ఒప్పందం ద్వారా పీఏసీఎస్‌తో అనుసంధానం కావాలని కోరారు. దీనికింద పీఏసీఎస్‌లకు ఎఫ్‌పీవోలు సేవలు అందించాలని సూచించారు. ‘‘తయారీ ద్వారా జీడీపీ వృద్ధి చెందితే ఉపాధి కల్పన భారీగా ఉండదు. అదే వ్యవసాయం, అనుబంధ రంగాలు వృద్ధి చెందిదే జీడీపీకే కాకుండా పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు అనుకూలిస్తుంది. వ్యవసాయం దాని అనుబంధ రంగాలు అత్యధికంగా జీడీపీకి 17.5–18 శాతం వాటా సమకూరుస్తున్నాయి. కానీ, ఇతర రంగాల్లోని వారితో పోలిస్తే రైతుల పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. ఇతర రంగాల్లో మాదిరే రైతుల పరిస్థితులు మెరుగు పడాలంటే అందుకు ఎఫ్‌పీవోలను ఆమోదించాలి’’ అని అమిత్‌షా పేర్కొన్నారు. ఎఫ్‌పీవోల్లో రైతులు, తయారీదారులు (ఉత్పత్తిదారులు) భాగంగా ఉంటారు. వీరు చిన్న, సన్నకార రైతులకు సాగు, ముడి సరుకులు, సాంకేతిక సేవలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ సహా అన్ని రకాల సేవలు అందిస్తుంటారు. మరిన్ని ఎఫ్‌పీవోలు ఇప్పటికే 11,770 ఎఫ్‌పీవోలు ఉండగా, 2027–28 నాటికి మరో 10,000 ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. దేశంలో 85 శాతం మంది చిన్న, సన్నకార రైతులే ఉన్నందున వ్యవసాయం లాభసాటిగా మారాల్సి ఉందని అమిత్‌షా పేర్కొన్నారు. ఇందుకోసం ఆధునిక టెక్నాలజీ, మార్కెటింగ్ విధానాలు అవసరమని సూచించారు. ‘‘ఎఫ్‌పీవోల వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. కానీ, సహకార రంగంలో ఎఫ్‌పీవోలు, వాటి వల్ల ప్రయోజనాలు పరిమిత స్థాయికే చేరుకున్నాయి. పీఏసీఎస్‌ల ద్వారా 1,100 ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలని ఇటీవలే నిర్ణయించాం’’అని అమిత్‌షా తెలిపారు. వ్యవసాయ మౌలిక నిధికి మద్దతుగా నిలవాలి బ్యాంక్‌లను కోరిన వ్యవసాయ శాఖ వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన నిధి (రూ.లక్ష కోట్లు)కి ప్రోత్సాహంగా నిలవాలని కేంద్ర వ్యవసాయ శాఖ కోరింది. సాగు రంగంలో మౌలిక వసతులు కల్పించేందుకు ఇది తప్పనిసరి అవసరంగా పేర్కొంది. సాగు అనంతరం నిల్వ వసతుల నిర్వహణ, కమ్యూనిటీ సాగు తదితర చర్యల కోసం 2020 జూలై 8న కేంద్ర సర్కారు వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనా నిధి (ఏఐఎఫ్)ని ప్రారంభించింది. ఈ పథకం కింద 2025–26 నాటికి రూ.లక్ష కోట్లను బ్యాంక్‌లు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఇది వడ్డీ రాయితీ, కేంద్ర ప్రభుత్వ హామీతో కూడిన పథకం. ఇందుకోసం కొత్త ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహుజా ప్రారంభించారు. ‘‘నెల రోజుల పాటు (ఆగస్ట్ 15 వరకు) ఇది కొనసాగుతుంది. ఈ కాలంలో రూ. 7,200 కోట్లను మంజూరు చేయాలి. ఈ వీడి యో కాన్ఫరెన్స్ సమావేశానికి ప్రభుత్వ, ప్రైవేటు, ప్రాంతీయ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కోపరేటివ్ బ్యాంక్‌ల ఎగ్జిక్యూటివ్‌లు హాజరయ్యారు’’అని అహుజా తెలిపారు. దేశంలో వ్యవసాయ మౌలిక ప్రాజెక్టులకు గణనీయమైన అవకాశాలున్నాయని చెప్పారు. -
మెకానిక్‌లు సాధికారత సాధించాలి
న్యూఢిల్లీ: మన దేశ అటోమొబైల్ రంగాన్ని బలోపేతం చేయడానికి మెకానిక్‌లు మరింత కృషి చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. పరిశ్రమ అభివృద్ధి కోసం వారు సాధికారత సాధించాలని సూచించారు. ఆయన ఇటీవల ఢిల్లీ కరోల్ బాగ్‌లోని బైకర్స్ మార్కెట్లో మోటార్‌సైకిల్ మెకానిక్‌లతో సమావేశమై, వారి సమస్యలను అడిగి తెలుసుకున్న విషయం విదితమే. మెకానిక్‌లతో కలిసి ఓ బైక్‌ను ఆయన సరీ్వసు కూడా చేశారు. సంబంధిత వీడియోను రాహుల్ ఆదివారం ట్విట్టర్లో షేర్ చేశారు. తనకు కేటీఎం 390 మోటార్ సైకిల్ ఉందని, దాన్ని ఉపయోగించడం లేదని, ఇంట్లోనే పార్క్ చేసి ఉంచానని ఈ వీడియోలో రాహుల్ చెప్పారు. మోటార్‌సైకిల్‌పై బయటకు వెళ్లేందుకు తన భద్రతా సిబ్బంది అనుమతించడం లేదని, అందుకే కేటీఎం 390ని ఇంటికే పరిమితం చేశానని వివరించారు. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని ఓ మెకానిక్ ప్రశ్నించగా.. చూద్దాం అంటూ రాహుల్ బదులిచ్చారు. అటోమొబైల్ పురోగతి కోసం మెకానిక్‌లు వారి ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా కష్టపడుతున్నారని, మెరుగైన వసతులు, ఉత్తమ అవకాశాలు పొందడానికి వారు అన్నివిధాలా అర్హులని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. భారతదేశ అసలైన అభివృద్ధి కారి్మకుల అభివృద్ధిపై ఆధారపడి ఉందని తెలిపారు. -
మరింత శక్తివంతంగా చైనా సైన్యం
బీజింగ్: భారత్, తైవాన్లతో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా తన సైనిక శక్తిని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకుంది. అందులోభాగంగా రక్షణ బడ్జెట్‌ను వరసగా ఎనిమిదోసారి పెంచింది. దీంతో చైనా రక్షణ బడ్జెట్ గత ఏడాదితో పోలిస్తే 7.2 శాతం ఎగసి 1.55 ట్రిలియన్ యువాన్లకు చేరుకుంది. గత ఏడాది 1.45 ట్రిలియన్ యువాన్లు కేటాయించింది. డాలర్లలో చూస్తే గత కేటాయింపులు 230 బిలియన్ డాలర్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈసారి డాలర్‌తో యువాన్ మారకం విలువ తగ్గడంతో కేటాయింపులు గతంతో పోలిస్తే కాస్త తక్కువగా 225 బిలియన్ డాలర్లుగా నమోదవడం గమనార్హం. బడ్జెట్ వివరాలను ఆదివారం దేశ పార్లమెంట్(నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్–ఎన్సీపీ)లో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆ దేశ ప్రధాని లీ కెక్వియాంగ్ సరిహద్దులో సైన్యం విజయాలను గుర్తుచేశారు. ‘ సరిహద్దుల్లో ఆపరేషన్లు విజయవంతమయ్యాయి. సరిహద్దు రక్షణ, ప్రాదేశిక సముద్రజలాలపై హక్కుల పరిరక్షణ, కోవిడ్ సంక్షోభం వంటి వాటిని విజయవంతంగా ఎదుర్కొన్నాం’ అంటూ పరోక్షంగా తూర్పు లద్దాఖ్‌ను ప్రస్తావించారు. ‘ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ శతాబ్ది ఉత్సవాల నాటికి పెట్టుకున్న లక్ష్యాలను పూర్తిచేసేలా సైనిక చర్యలను చేపట్టాలి’ అని ఆర్మీనుద్దేశించి అన్నారు. దక్షిణ, తూర్పు సముద్ర జల్లాలపై పూర్తి హక్కులు తమకే దక్కుతాయని వాదిస్తూ పొరుగు దేశాలతో చైనా ఘర్షణలకు దిగడం తెల్సిందే. వియత్నాం, మలేసియా, ఫిలిప్పీన్స్, తైవాన్, జపాన్‌లతో చైనా తగవులకు దిగుతోంది. ఈ ఆర్థికసంవత్సరంలో భారత రక్షణ బడ్జెట్ కేటాయింపులు 72 బిలియన్ డాలర్లుకావడం గమనార్హం. -
AP: రూ.100 కోట్లతో ల్యాబ్‌లు బలోపేతం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో రోగ నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబొరేటరీ వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. ఇందుకోసం రూ.100 కోట్లు వెచ్చిస్తోంది. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో వైద్య, ఆరోగ్య శాఖలో సంస్కరణలు చేపట్టడానికి ఐఏఎస్ మాజీ అధికారి సుజాతారావు అధ్యక్షతన కమిటీ ఏర్పాటుచేసింది. ప్రభుత్వ రంగంలో వైద్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ఐదేళ్లలో రూ.10వేల కోట్ల మేర ఖర్చుచేయాలని అప్పట్లో కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. చదవండి: బాబు.. ఏబీ.. ఓ పెగసస్ ఇప్పుడేమంటారు..? కానీ, ఈ కమిటీ సూచించిన దానికన్నా అదనంగా సర్కారు నాడు–నేడు కార్యక్రమం ద్వారా రూ.వేల కోట్ల ఖర్చుచేస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లోనే నిర్ధారణ పరీక్షలు (ఇన్‌హౌస్ ల్యాబొరేటరీ) ఏర్పాటుచేయాలని సుజాతారావు కమిటీ సిఫార్సు చేసింది. దీంతో ల్యాబొరేటరీలు ఏ విధంగా బలోపేతం చేయాలన్న దానిపై వైద్యశాఖ ఓ కమిటీ వేసి, దాని సిఫార్సుల మేరకు చర్యలు తీసుకుంటోంది. విలేజ్ క్లినిక్ నుంచి జిల్లా ఆసుపత్రి వరకూ.. వైఎస్సార్ విలేజ్ క్లినిక్ నుంచి జిల్లా ఆసుపత్రి వరకూ అన్ని ఆసుపత్రుల్లో ల్యాబ్‌లకు ఉపకరణాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేపడుతున్నారు. అయితే, మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తగ్గట్టుగా వనరులు అందుబాటులోకి తెస్తున్నారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో 14, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 35, సీహెచ్‌సీలో 78, ఏరియా ఆస్పత్రుల్లో 80, జిల్లా ఆస్పత్రుల్లో 136 రకాల వైద్య పరీక్షలు చేయడానికి వీలుగా అవసరమైన ఉపకరణాలను ఏపీఎంఎస్ఐడీసీ సమకూరుస్తోంది. రసాయనాలు (రీఏజెంట్స్), డిస్టిలరీ వాటర్‌తో సహా అన్నింటినీ సరఫరా చేస్తున్నారు. నెలాఖరు నుంచి అందుబాటులోకి సేవలు సొంతంగా ల్యాబొరేటరీల నిర్వహణవల్ల వ్యయం తగ్గడంతో పాటు రోగులకు సేవలు మెరుగుపడతాయి. ఈ నెలాఖరుకు అన్ని ఆసుపత్రుల్లో సేవలు ప్రారంభించాలని చెప్పాం. గతంలో రీఏజెంట్స్ స్థానికంగా కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం వాటిని కూడా సరఫరా చేస్తున్నాం. దీంతో అవి లేవు, ఇవి లేవు అని పరీక్షలకు బయటకు రిఫర్ చేయడానికి వీలుండదు. ప్రతి ఆసుపత్రిలో బోర్డు పెడతాం. ఫిర్యాదులు చేయడానికి వీలుగా ఫోన్ నెంబర్‌నూ ప్రదర్శిస్తాం. – కాటమనేని భాస్కర్, వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ -
వ్యయాల పెంపుతో డిమాండ్‌కు పునరుత్తేజం
న్యూఢిల్లీ: కేంద్ర వ్యయాల పెంపు వ్యవస్థలో డిమాండ్ పునరుత్తేజం, పటిష్టతకు అలాగే ఉపాధి కల్పనకు దోహదపడుతుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ పేర్కొన్నారు. సిమెంట్, స్టీల్, క్యాపిటల్ గూడ్స్ విభాగాలకు ఈ నిర్ణయం మంచి ప్రయోజనాలను అందిస్తుందని అన్నారు. ప్రత్యక్ష మద్దతు చర్యలు పరిమిత స్థాయిలోనే సానుకూల ప్రభావం చూపిస్తాయని పేర్కొన్న ఆయన, ఆర్థిక వ్యవస్థను స్థిరమైన పద్ధతిలో మెరుగుపరచడానికి దీర్ఘకాలం నుండి మధ్యకాలిక ప్రభావాన్ని కలిగి ఉండే చర్యలు అవసరమని చెప్పారు. ‘‘ఆర్థికాభివృద్ధి, నిర్వహణ వంటి అంశాలు ఏదో ఒక ఏడాదికి సంబంధించి అంశం కాదు. ఇవి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక అంశాలతో ఇమిడి ఉంటాయి. ప్రత్యక్ష ఆదాయ మద్దతు స్వల్పకాలిక ప్రయోజనాలకు తగిన విధంగా ఉపయోగపడుతుందనికానీ, మధ్యకాలి, దీర్ఘకాలిక ప్రయోజనాలు పరిమితంగానే ఉంటాయి. ఇక్కడ మూలధన వ్యయాల కీలకమైనవి. దీర్ఘకాలంలో బహుళ ప్రయోజనాలు సమకూర్చుతాయి. ఈ చర్యల వల్ల ముడి పదార్థాలకు డిమాండ్ పెరుగుతుంది. పెట్టుబడుల ప్రక్రియ పురోగమిస్తుంది’’ అని ఆయన అన్నారు. వినియోగ ధోరణి పట్ల దీర్ఘకాలిక రీతిన ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడం ప్రధానమని ఆయన అన్నారు. పెట్టుబడులకు సంబంధించి మూలధన వ్యయాలు (క్యాపిటల్ అకౌంట్‌కు సంబంధించి) భారీగా 35.4% పెంచుతూ 2022–23 బడ్జెట్ ప్రతిపాదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఇందుకు సంబంధించి కేటాయింపులు రూ.5.54 లక్షల కోట్లయితే, 2022–23లో రూ.7.50 లక్షల కోట్లకు (జీడీపీలో 2.9 శాతం) పెంచుతున్నట్లు బడ్జెట్ పేర్కొంది. -
నేపాల్ అభివృద్ధే మా ధ్యేయం
ఖాట్మండు: ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు నేపాల్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఖాట్మండు చేరుకున్న సుష్మా శుక్రవారం నేపాల్ అధ్యక్షురాలు బిద్యాదేవీ భండారీ, ప్రధాన మంత్రి షేర్ బహదూర్ ద్యూబ, సీపీఎన్ మావోయిస్టు సెంటర్ చైర్మన్ ప్రచండతో సమావేశమయ్యారు. నేపాల్‌లో రాజకీయ స్థిరత్వం సాధించేందుకు, ఆ దేశ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని ప్రచండతో సమావేశం సందర్భంగా ఆమె ప్రకటించారు. నేపాల్‌లో రాజకీయ స్థిరత్వం.. అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని సుష్మా హామీ ఇచ్చారని ప్రచండ ఈ సందర్భంగా చెప్పారు. తమ చర్చలు సానుకూల పంథాలో సాగినట్టు చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం సుష్మా స్వరాజ్ నేపాల్ పర్యటన ముగించుకుని స్వదేశం చేరుకున్నారు. -
కేవైసీ వ్యవస్థ మరింత పటిష్టం కావాలి...
సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఖాతాదారుల వివరాల వెల్లడికి సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న కేవైసీ నిబంధనల్లోని లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి అభిప్రాయపడ్డారు. కేవైసీ ఫారంల రూపంలో వచ్చే ఖాతాదారుల వివరాల వాస్తవికతను ధృవీకరించుకునేలా తగు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని బ్యాంకులకు సూచించారు. ఖాతాదారులు ఇచ్చిన డాక్యుమెంట్లను బ్యాంకులు ప్రస్తుతం ఆన్లైన్ మాధ్యమంలో ధృవీకరించుకునే వెసులుబాటు లేనందున పాన్ కార్డులు.. డ్రైవింగ్ లెసైన్సులు వంటి పత్రాల మార్ఫింగ్ తదితర మోసాలకు అవకాశాలు ఉన్నాయని చౌదరి చెప్పారు. ఈ నేపథ్యంలో వివిధ డేటాబేస్లను అనుసంధానం చేయడం ద్వారా ఇలాంటి మోసాలను అరికట్టడం సాధ్యపడుతుందని శుక్రవారం ఇక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. -
కాంగ్రెస్ బలోపేతానికి కృషి: డీఎస్
-
పండుగలకు పటిష్ట బందోబస్తు
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్: శరవన్నరాత్రులు, బక్రీద్ పర్వదినం సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీ య సంఘటనలు జరగకుండా పటి ష్ట బందోబస్తు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ రవీందర్ తెలిపారు. పోలీస్ హెడ్కార్వర్టర్స్లో బుధవారం జిల్లా నేర సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ గోవధలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గొలుసు దొంగతనాలు, దోపిడీల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశామని, పాత నేరస్థుల పై నిఘా పెంచామని చెప్పారు. అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉం డాలని, పోలీసులకు సమాచారం ఇ వ్వాలని కోరారు. బాణాసంచా దుకాణాలను నిర్దేశించిన ప్రాంతాల్లోనే వి క్రయించాలని సూచించారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ నిరోధానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే ప్రతీ ఫి ర్యాదుకు రశీదు ఇవ్వాలని, జాప్యమై తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శివారు దాబాల్లో మద్యం విక్రయాలు, అశ్లీల కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే దాడులు నిర్వహించి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం గడిచిన నెలలో సమర్ధవంతమైన సేవలందించిన పలువురికి రివార్డులు, జ్ఞాపికలు అందజేశారు.