![RTI plays a vital role in strengthening democracy - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/10/Abdul%20Nazeer%2C111.jpg.webp?itok=JXFQtp0H)
సమావేశంలో ప్రసంగిస్తున్న గవర్నర్ అబ్దుల్ నజీర్
సాక్షి, విశాఖపట్నం: ప్రజాస్వామ్యం బలోపేతం కావడంలో సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కీలకపాత్ర పోషిస్తోందని ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో శనివారం నిర్వహించిన 28 బోర్డు ఆఫ్ గవర్నర్లు, సమాచార కమిషన్ల నేషనల్ ఫెడరేషన్ 12వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో 2005లో అమలులోకి వచ్చిన సమాచార హక్కు చట్టం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు.
దేశ ప్రజల ప్రయోజనానికి, ప్రభుత్వ పాలనలో పారదర్శకత పెంపునకు, గోప్యత మినహాయింపునకు దోహదపడుతోందని చెప్పారు. ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లోని అధికారుల వద్ద ఉన్న సమాచారాన్ని తెలుసుకునే శక్తివంతమైన సాధనం ఆర్టీఐ అని పేర్కొన్నారు.ప్రజలు ప్రభుత్వ అధికారులను జవాబుదారీగా చేస్తూ అవసరమైన సమాచారాన్ని తెలుసుకునే హక్కును సులభంగా వినియోగించుకునేలా చేస్తోందన్నారు. ఆర్టీఐ పౌరుల ప్రాథమిక హక్కును గుర్తించడంతో పాటు ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా చేసిందని వివరించారు.
అవినీతిని అరికట్టడంలోను, సుపరిపాలన అందించడానికి, అవినీతి, అధికార దుర్వినియోగాలను బహిర్గతం చేయడానికి ఇది సహకరిస్తోందన్నారు. ఏదైనా తప్పు చేస్తే పరిహారం పొందే అధికారం ఇచ్చిందన్నారు. అలాగే బ్యూరోక్రాట్ల జాప్యాన్ని తగ్గించడం, సత్వర సేవలను మెరుగు పరచడం, ప్రభుత్వ అధికారులు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం, అట్టడుగు వర్గాలపై ప్రత్యేక సాధికారత వంటి అంశాల్లో సానుకూల ప్రభావం చూపడానికి ఈ చట్టం దోహదం చేస్తోందన్నారు.
ఇంకా వివక్ష, నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి ఒక యంత్రాంగాన్ని అందించిందని, ఇది సమాచార అంతరాన్ని తగ్గించడంలో సహాయ పడుతోందని తెలిపారు. కేంద్ర, రాష్ట్రాల కమిషన్లు ఒకే విధమైన అధికారాలు, బాధ్యతలను, ఒకదానితో ఒకటి స్వతంత్రతను కలిగి ఉంటాయన్నారు. ఈ ఫెడరేషన్ కమిషన్లు, రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల కమిషన్లను సభ్యులుగా చేర్చుకున్నందున కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్ల మధ్య పరస్పర సంప్రదింపులు సులభతరం అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.
సందేశం పంపించిన సీఎం జగన్
విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమాచార కమిషన్‌ల వార్షిక సమావేశానికి తన సందేశాన్ని పంపించారు. ‘ప్రభుత్వం తరఫున మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను. దేశం నలుమూలల నుంచీ మీరు విశాఖకు రావడం సంతోషానిస్తోంది. రెండు దశాబ్దాలుగా సమాచార హక్కు చట్టం ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. అనేక మందికి ప్రయోజనం చేకూరుస్తోంది. ప్రజాస్వామ్యంలో చట్టం పాత్ర, పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం, జవాబుదారీతనాన్ని పెంచుతోంది’ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సందేశాన్ని రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్. మహబూబ్ బాషా చదివి వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment