టీ–20 అండర్–19 మహిళల ప్రపంచ కప్ విజేత భారత్
గెలుపులో పేస్ బౌలర్‌గా సత్తా చాటిన విశాఖ అమ్మాయి
భారత యువ క్రికెట్ జట్టు టీ–20 అండర్– 19 మహిళల ప్రపంచకప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఈ విజయంలో విశాఖకు చెందిన పేస్ బౌలర్ షబ్నమ్ కీలక పాత్ర పోషించింది. షబ్నమ్ తన అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టడి చేసింది. కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో ఆమె కచ్చితమైన లైన్, లెంగ్త్ బంతులు విసిరి బ్యాటర్లను ఇబ్బంది పెట్టింది.
ఎనిమిదేళ్ల ప్రాయంలో సరదాగా తండ్రితో రన్నింగ్ చేయడానికి వెళ్తూ అక్కడ క్రికెట్ ఆడుతున్న అమ్మాయిల్ని చూసింది షబ్నమ్. అలా క్రికెట్‌పై మక్కువ పెంచుకుంది. ఆమె తండ్రి షకీల్ క్రికెట్ ఆటగాడు కావడంతో.. షబ్నమ్ ఆసక్తిని గమనించి ఆటలో ప్రాథమిక మెళకువలు నేర్పించారు. అనంతరం జాతీయ క్రికెట్ అకాడమీలో మెళకువలు తోడవడంతో అంతర్జాతీయ స్థాయిలో చెలరేగే బంతులేసే స్థాయికి ఎదిగింది. కెరీర్ ప్రారంభించి పదేళ్లలోనే జాతీయ అండర్–19 జట్టులో స్థానం సంపాదించిన షబ్నమ్.. భారత్ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ మహిళా అండర్–19 జట్టు సిరీస్‌లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. నేడు మహిళల టీ–20 అండర్ 19 వరల్డ్‌కప్‌ను రెండోసారి భారత్ జట్టు అందుకోగా.. రెండుసార్లు విశాఖకు చెందిన షబ్నమ్ పేస్‌తో బెంబేలెత్తించిన పాత్ర గర్వించదగ్గది.
క్వాడ్రేంగులర్ సిరీస్‌లో భాగంగా శ్రీలంక, వెస్టిండీస్‌తో తలపడిన భారత్ బి జట్టు తరఫున రెండు మ్యాచ్‌లు ఆడింది. అనంతరం టీ–20 భారత్ మహిళా అండర్–19 జట్టు తరఫున ఆడే అవకాశం దక్కింది. 2023 అండర్ 19 మహిళల టీ–20 వరల్డ్‌కప్‌లో మూడు మ్యాచ్‌లకే పరిమితమైనా.. అప్పుడు లభించిన అనుభవాన్ని తాజా వరల్డ్‌కప్‌లో చూపించింది. కోలాలంపూర్‌లో జరిగిన వరల్డ్‌కప్‌లో అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆడి నాలుగు కీలక వికెట్లు తీసింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్‌ను నిలదొక్కుకోనివ్వకుండా పెవిలియన్‌కు పంపడంతో పాటు జట్టును తక్కువ స్కోర్‌కే పరిమితం చేయడంలో కీలకపాత్ర పోషించింది. ‘అండర్–19 మహిళా జట్టుకు ఎంపిక కాగానే నేషనల్ క్రికెట్ అకాడమీలో పేస్‌కు మరింత వేగం పెంచుకునే విధంగా శిక్షణ పొందాను. ఐసీసీ ట్రోఫీని జట్టు అందుకోవడంలో తోటి క్రీడాకారిణుల సహకారంతో నా వంతు పాత్ర పోషించాను.’అని షబ్నమ్ తెలిపింది.
2019లో జిల్లాకు ప్రాతినిధ్యం
శిక్షణ శిబిరంలో నేర్చుకున్న ఆటతో 2019లో అండర్–16లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి షబ్నమ్ చేరుకుంది. వేసవి శిబిరాల్లో జట్టుగా ఆడేటప్పుడే పేస్ బౌలింగ్ వైపు ఆసక్తి పెరిగి పేస్‌లో వేరియేషన్స్‌తో జట్టుకు కీలకంగా మారింది. కరోనాతో శిక్షణ, పోటీలకు బ్రేక్ వచ్చింది. తిరిగి 2022లో పోటీలు ప్రారంభం కావడంతో దేశవాళీ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో ఆడింది. చాలెంజర్ ట్రోఫీతో పాటు స్కూల్ గేమ్స్ నేషనల్స్ అండర్–17 జట్టుకు ఆడింది.
Comments
Please login to add a commentAdd a comment