
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ముగిసిన సంగతి తెలిసిందే. ఆదివారం(మార్చి 9) దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 12 ఏళ్ల తర్వాత తిరిగి భారత్ సొంతమైంది.
ఈ క్రమంలో టోర్నీలో ఉత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో కూడిన జట్టును భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రకటించాడు. ఈ పదకొండు మంది సభ్యుల జట్టులో నలుగురు భారత ప్లేయర్లకు చోటు దక్కింది. కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం అశ్విన్ తన ఎంచుకున్న టీమ్‌లో చోటు ఇవ్వలేదు.
రోహిత్ శర్మ ఫైనల్లో 74 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అంతేకాకుండా కెప్టెన్సీ పరంగా రోహిత్ అదరగొట్టాడు. టోర్నీలో భారత్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజేతగా నిలిపాడు. ఐసీసీ ప్రకటించిన ఉత్తమ టీమ్‌లో కూడా రోహిత్‌కు చోటు దక్కలేదు.
కాగా అశ్విన్ తన ఎంపిక చేసిన జట్టులో న్యూజిలాండ్‌కు చెందిన రచిన్ రవీంద్ర, ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్‌లకు ఓపెనర్లగా అవకాశమిచ్చాడు. అదేవిధంగా ఫస్ట్ డౌన్‌లో భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి, సెకెండ్ డౌన్‌లో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కింది. వికెట్ కీపర్‌గా ఆస్ట్రేలియాకు చెందిన జోష్ ఇంగ్లిష్‌ను అశూ ఎంచుకున్నాడు.
ఫినిషర్‌గా డేవిడ్ మిల్లర్‌కు ఛాన్స్ లభించింది. ఆల్‌రౌండర్ల కోటాలో అజ్మతుల్లా ఓమర్జాయ్, మైఖల్ బ్రేస్‌వెల్.. స్పెషలిస్ట్ స్పిన్నర్లగా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌లకు చోటు దక్కింది. ఏకైక ఫాస్ట్ బౌలర్‌గా కివీస్ స్పీడ్ స్టార్ మాట్ హెన్రీని అశ్విన్ ఎంపిక చేశాడు. అశ్విన్ తన జట్టులో 12వ ప్లేయర్‌గా న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్‌ను ఎంచుకున్నాడు. అయితే ఐసీసీ మాత్రం తన ప్రకటించిన టీమ్‌కు శాంట్నర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం గమనార్హం.
ఆర్ అశ్విన్ ఎంపిక చేసిన బెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు: రచిన్ రవీంద్ర, బెన్ డకెట్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, జోష్ ఇంగ్లిస్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మైఖేల్ బ్రేస్‌వెల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మాట్ హెన్రీ. 12వ ఆటగాడు: మిచెల్ సాంట్నర్
చదవండి: రిషబ్ పంత్ ఇంట్లో పెళ్లి భజాలు.. సందడి చేయనున్న భారత క్రికెటర్లు
Comments
Please login to add a commentAdd a comment