వాషింగ్టన్:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘనవిజయంలో బిలియనీర్, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రచారానికి ఆర్థికంగా అండదండలందించడమే కాకుండా ట్రంప్ తరపున మస్క్ నేరుగా ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ పాలనా వ్యవహారాల్లో మస్క్‌కు కీలక బాధ్యతలు దక్కే అవకాశాలున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని మరింత బలపర్చేలా తాజాగా మరో పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడుతుండగా వారిద్దరి సంభాషణలో మస్క్ కూడా చేరినట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో మస్క్ ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసంలోనే ఉన్నారు. ఈ ఫొటోలు వైరల్‌గా కూడా మారాయి. సరిగ్గా ఈ సమయంలోనే ట్రంప్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్ చేసి అభినందించారు. వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా మధ్యలో ట్రంప్ ఫోన్‌ను మస్క్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది.
జెలెన్‌స్కీతో మాట్లాడాల్సిందిగా మస్క్‌ను ట్రంప్ కోరినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడితో మస్క్ కొద్దిసేపు మాట్లాడారని కథనాలు తెలిపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ అధ్యక్ష పేషీలో మస్క్ కీలక పాత్ర పోషించనున్నట్లు ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: ట్రంప్‌నకు కేసుల నుంచి భారీ ఊరట.. అధ్యక్షుడిగా ఎన్నికైనందునే
Comments
Please login to add a commentAdd a comment