భువనేశ్వర్ కుమార్‌కు రూ. 10 కోట్ల 75 లక్షలు
దీపక్ చహర్‌కు రూ.9 కోట్ల 25 లక్షలు
ఆకాశ్‌దీప్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండేలకూ భారీ మొత్తం
ఐపీఎల్ బరిలో 13 ఏళ్ల వైభవ్ అమ్ముడుపోని డేవిడ్ వార్నర్, విలియమ్సన్, బెయిర్‌స్టో, శార్దుల్
ముగిసిన ఐపీఎల్ వేలం
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడు... అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానం... టైటిల్ సహా దశాబ్దకాలం పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించిన పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేలంలో ఫ్రాంచైజీలను ఆకర్షించడంలో సఫలమయ్యాడు. రెండో రోజు వేలంలో భువీ (రూ.10 కోట్ల 75 లక్షలు) అత్యధిక ధరతో అగ్ర స్థానంలో నిలిచాడు.
భువనేశ్వర్‌లాగే చెన్నై మూడు ట్రోఫీ విజయాల్లో కీలక బౌలర్‌గా నిలిచిన దీపక్ చహర్‌కు (రూ.9 కోట్ల 25 లక్షలు) భారీ మొత్తం దక్కింది. వీరిద్దరిని వరుసగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు దక్కించుకున్నాయి. ప్రతీ జట్టుకూ భారత పేసర్ల అవసరం ఉండటంతో సోమవారం వేలంలో ఆకాశ్‌దీప్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండేలకు మంచి విలువ లభించింది.
విదేశీ ఆటగాళ్లలో మార్కో జాన్సెన్, విల్ జాక్స్‌లను ఫ్రాంచైజీలు తగిన మొత్తానికి సొంతం చేసుకున్నాయి. ఆరంభంలో ఆసక్తి చూపించకపోయినా... అజింక్య రహానే, దేవదత్ పడిక్కల్, ఉమ్రాన్ మాలిక్‌వంటి ఆటగాళ్లను చివర్లో టీమ్‌లు ఎంచుకున్నాయి. రెండో రోజు కూడా ఆస్ట్రేలియా డాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు నిరాశ ఎదురవగా... కేన్ విలియమ్సన్, బెయిర్‌స్టో, మిచెల్, శార్దుల్ ఠాకూర్ తదితరులను ఫ్రాంచైజీలు దూరంగా ఉంచాయి.
జిద్దా (సౌదీ అరేబియా): ఐపీఎల్–2025 కోసం రెండు రోజుల పాటు సాగిన వేలం సోమవారం ముగిసింది. మొత్తం 577 మంది క్రికెటర్లు వేలంలోకి రాగా... గరిష్టంగా 204 మంది క్రికెటర్లను ఎంచుకునే అవకాశం ఉండగా... 10 ఫ్రాంచైజీలు కలిపి మొత్తం 182 మంది ఆటగాళ్లనే వేలంలో తీసుకున్నాయి. వీరిలో 62 మంది విదేశీయులు కాగా... అన్ని జట్లూ కలిపి వేలంలో రూ.639.15 కోట్లు వెచ్చించాయి.
ఐపీఎల్‌లో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా బిహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. వేలంలో రాజస్తాన్ రూ.1 కోటీ 10 లక్షలకు ఎంచుకునే సమయానికి వైభవ్ వయసు 13 ఏళ్ల 243 రోజులు మాత్రమే. వైభవ్ ఇప్పటి వరకు 5 రంజీ మ్యాచ్‌లు, ఒక టి20 మ్యాచ్ ఆడాడు. అయితే ఇటీవల భారత అండర్–19 జట్టు సభ్యుడిగా ఆ్రస్టేలియా అండర్ –19 జట్టుతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో అందరి దృష్టినీ ఆకర్షించాడు.
తొలి రోజు వేలం రికార్డులతో హోరెత్తించగా, రెండో రోజు కూడా పేరున్న ఆటగాళ్లకు మంచి మొత్తమే దక్కింది. సోమవారం జాబితాలో పెద్ద సంఖ్యలో యువ ఆటగాళ్లు బరిలో నిలవగా, కొందరిని అదృష్టం తలుపు తట్టింది. జాతీయ జట్టుకు ఆడని అన్‌క్యాప్డ్ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు చివర్లో కనీస విలువకే తీసుకొని జట్టులో మిగిలిన ఖాళీలను నింపాయి.
Comments
Please login to add a commentAdd a comment