highest price
-
వేలంలో కోట్ల రూపాయలు పలికిన టాప్ పెయింటింగ్స్
ఆర్ట్ ఒక జీవితావసరం. ఎవరికి?! అద్దం అవసరం ఎవరికైతే ఉంటుందో, వారందరికీ. జీవితానికి అద్దం పట్టే ఆర్ట్ జీవితంలానే ఉంటుంది తప్ప.. ప్రతిబింబంలానో, అనుసృజనలానో ఉండదు. నడిచిపోయిన కాలానికి నిలకడైన రూపం ఆర్ట్. అందుకే ఆర్టిస్టులకు అంత గౌరవం, ఆర్ట్ అంత అమూల్యం. ప్రపంచ ప్రసిద్ధ చెందిన ‘ఆక్షన్’ సంస్థలు ఏడాది పొడవునా ఈ చిత్ర పటాలను వేలానికి ఉంచుతూనే ఉంటారు. అలా ఇప్పటి వరకు అంతర్జాతీయ వేలం పాటల్లో అత్యధిక ధరను దక్కించుకున్న తొలి ఐదు భారతీయ తైలవర్ణ చిత్రాల విశేషాలు మీ కోసం.తయ్యబ్ మెహతా, ఎం.ఎఫ్. హుస్సేన్ ఇంచుమించుగా ఒక ఈడు వాళ్లు. హుస్సేన్ తర్వాత పదేళ్లకు జన్మించిన తయ్యబ్... హుస్సేన్ కన్నా రెండేళ్లు ముందుగా ‘సెలవు’ తీసుకున్నారు. కానీ, మానవాళికి తమ కుంచె వేళ్లకు ఆనవాళ్లుగా వాళ్లు వదిలివెళ్లిన తైలవర్ణ చిత్రాలు కాలాలకు అతీతమైనవి! తయ్యబ్ దాదాపు 70 ఏళ్ల క్రితం గీసిన ‘ట్రస్‌డ్ బుల్’ పెయింటింగ్ తాజా వేలంలో రూ.61.8 కోట్ల ధర పలికింది. ఏప్రిల్ మొదటి వారంలో ముంబైలోని ‘శాఫ్రాన్ఆర్ట్’ గ్లోబల్ సంస్థ తన 25వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆన్లైన్ వేలంలో ‘ట్రస్‌డ్ బుల్’ రెండవ అత్యంత ఖరీదైన భారతీయ పెయిటింగ్‌గా చరిత్రలో నిలిచింది. మొదటిది ఎం.ఎఫ్. హుస్సేన్ పెయింటింగ్ ‘గ్రామ్ యాత్ర’. న్యూయార్క్‌లో ఈ ఏడాది మార్చి మూడవ వారంలో జరిగిన ‘క్రిస్టీస్’ వేలంలో హుస్సేన్ ‘గ్రామ్ యాత్ర’ రూ.118 కోట్లు పలికింది. అమృతతో తయ్యబ్ సమస్థానంహుస్సేన్ ‘గ్రామ్ యాత్ర’ తర్వాత తయ్యబ్ ‘ట్రస్‌డ్ బుల్’ చిత్రం రెండో స్థానంలో ఉన్నప్పటికీ, ఏడాదిన్నర క్రితమే 2003 సెప్టెంబరులో అదే ‘శాఫ్రాన్ఆర్ట్’ సంస్థ నిర్వహించిన వేలంలో అదే మొత్తానికి (రు.61.8 కోట్లు) అమృతా శేర్ గిల్ పెయింటింగ్ ‘ది స్టోరీ టెల్లర్’ విక్రయం అయింది కనుక తయ్యబ్‌ది అమృతాతో సమస్థానం అని చెప్పటం కూడా గౌరవంగానే ఉంటుంది. అమృత ఎం.ఎఫ్. హుస్సేన్ కంటే కూడా వయసులో రెండేళ్లు, తయ్యబ్ కంటే పన్నెండేళ్లు పెద్దవారు. హుస్సేన్ 95 ఏళ్లు, తయ్యబ్ 83 ఏళ్లు జీవిస్తే, అమృతా 28 ఏళ్లకే కన్నుమూశారు!ఎందుకింత ‘అమూల్యం’?!పైకి వర్ణాలే. వెలుగు నీడలే. లోపల అవి ఉద్వేగాలు. లోలోతుల్లో హృదయ తరంగాలు. ఎం.ఎఫ్. హుస్సేన్ తన ‘గ్రామ్ యాత్ర’లో గ్రామీణ భారత వైవిధ్య చిత్రాలను లిఖించారు. అది లేఖనం కాదు. ఊపిరి పోయటమే! వంట చెయ్యటం, పిల్లల్ని చూసుకోవటం, గూడుబండిలో ప్రయాణం చెయ్యటం వంటి రోజువారీ గ్రామీణ దృశ్యాలో స్త్రీలను చిత్రించటానికి హుస్సేన్ శక్తిమంతమైన మట్టి రంగులను ఉపయోగించారు. తయ్యబ్ మెహ్తా ‘ట్రస్‌డ్ బుల్’ (కట్టిపడేసిన ఎద్దు) విభజనానంతర కాలంలో ప్రత్యక్షంగా ఆయన చూసిన ఒక భయానక సంఘటనకు ప్రతీకాత్మక చిత్రీకరణ. ‘‘ఆ సమయంలో నేను మొహమ్మద్ అలీ రోడ్డులో (బొంబాయి) నివసిస్తున్నాను. నిరుపేద ముస్లింలు ఉండే ప్రదేశం అది. నేనుండే పైగది కిటికీలోంచి వీధిలో ఒక యువకుడి వధించటం నేను కళ్లారా చూశాను. జన సమూహం అతడిని కొట్టి చంపింది. అతని తలను రాళ్లతో పగలగొట్టింది. బొంబాయిలోని ఒక వధ్యశాలకు ఎద్దులను తీసుకెళే దృశ్యం అప్పుడు నా మదిలో కదలాడింది. వాళ్లు ఆ జంతువును వధించే ముందు తాళ్లతో కాళ్లు కట్టేస్తారు. కొద్దిగానైనా కదలకుండా చేసేస్తారు. ఆ స్థితిలో ఉన్న ఎద్దును నేను ఆనాటి దేశకాల స్థితిని ప్రతిఫలించేలా ట్రస్‌డ్ బుల్గా చిత్రించాను..’’ అని ఆ తర్వాతి కాలంలో అనేక సందర్భాల్లో చెప్పారు తయ్యబ్ మెహ్తా. హుస్సేన్, అమృతా, తయ్యబ్‌ల చిత్రాల తర్వాత ఇప్పటి వరకు ప్రపంచ వేలంలో అత్యంత ఖరీదైన భారతీయ తైలవర్ణ చిత్రాలుగా నిలిచినవి ఎస్.హెచ్.రజా ‘జెస్టేషన్’, వి.ఎస్. గైతోండే ‘అన్టైటిల్డ్’. 2023 సెప్టెంబరులో ముంబైలోని పండోల్ సంస్థ వేలంలో రజా ‘జెస్టేషన్’ రూ.51.7 కోట్లకు, అదే ఏడాది ఏప్రిల్‌లో జరిగిన శాఫ్రాన్ఆర్ట్ వేలంలో గైతోండే ‘అన్టైటిల్డ్’ రూ. 47.5 కోట్లకు అమ్ముడయ్యాయి. రజా 94 ఏళ్ల వయసులో, గైతోండే 77 ఏళ్ల వయసులో తమ అమూల్యమైన చిత్రాలను మానవాళికి కానుకగా ఇచ్చి వెళ్లిపోయారు. అమృతా శేర్ గిల్ పెయింటింగ్ ‘ది స్టోరీ టెల్లర్’ థీమ్ కూడా హుస్సేన్ వేసిన ‘గ్రామ్ యాత్ర’ వంటిదే. అయితే ఆ చిత్రాన్ని ఆమె హుస్సేన్ కంటే ముందే వేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడేళ్లకు హుస్సేన్ ‘గ్రామ్ యాత్ర’ను గీస్తే, దేశానికి స్వాతంత్య్రం రావటానికి పదేళ్ల ముందే అమృతా ‘ది స్టోరీ టెల్లర్’ను గీశారు. రోజువారీ పనులలో నిమగ్నమై ఉన్న గ్రామీణ మహిళల సమూహాన్ని అందులో చిత్రీకరించారు అమృత. ఈస్ట్ అండ్ వెస్ట్ సంస్కృతుల కలయిక ఆమె రంగుల వాడుక. ఎస్.హెచ్. రజా ‘జెస్టేషన్’ వృత్తం కేంద్రబిందువుగా త్రిభుజాలు, చతురస్రాలు, వికర్ణ రేఖలతో కూడి ఉంటుంది. ఐదు దశాబ్దాలు ఫ్రాన్స్‌లో జీవించిన తర్వాత ఆయన తన మాతృభూమికి తిరిగి రావటాన్ని ఆ చిత్రం సూచిస్తుంది. సూక్ష్మార్థంలో – మనిషి తన చరమాంకంలో తిరిగి బిడ్డగా మారి తల్లి కడుపులోకి నిక్షిప్తం కావాలని కాంక్షించటం అందులో కనిపిస్తుంది. ఇక వి.ఎస్. గైతోండే తన ‘అన్టైటిల్డ్’ పెయింటింగ్‌తో కళాత్మక తాత్వికునిగా ప్రసిద్ధి చెందారు. ‘అన్టైటిల్డ్’ శూన్యానికి ఏకవర్ణ ఆకృతిని ఇవ్వటం అంటారు ఆర్ట్ గురించి తెలిసినవాళ్లు. వీక్షకులు ఈ చిత్రంలోని అదృశ్యాన్ని అనుభూతి చెందుతారని కూడా అంటారు. ఎందుకీ చిత్రాలు ఇంత అమూల్యమైనవి అనుకున్నాం కదా. అది చిత్రం విలువ మాత్రమే కాదు, అంతకుమించి, చిత్రానికి రసాస్వాదకులు ఇచ్చే మర్యాద కూడా! ఆ రెండూ కలసి చిత్రం ఖరీదును తరతరాలకూ పెంచుకుంటూ పోతూనే ఉంటాయి.∙సాక్షి, స్పెషల్ డెస్క్ -
IPL Auction 2025 : పేస్ బౌలర్లకు పట్టం
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడు... అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానం... టైటిల్ సహా దశాబ్దకాలం పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించిన పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేలంలో ఫ్రాంచైజీలను ఆకర్షించడంలో సఫలమయ్యాడు. రెండో రోజు వేలంలో భువీ (రూ.10 కోట్ల 75 లక్షలు) అత్యధిక ధరతో అగ్ర స్థానంలో నిలిచాడు. భువనేశ్వర్లాగే చెన్నై మూడు ట్రోఫీ విజయాల్లో కీలక బౌలర్‌గా నిలిచిన దీపక్ చహర్‌కు (రూ.9 కోట్ల 25 లక్షలు) భారీ మొత్తం దక్కింది. వీరిద్దరిని వరుసగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు దక్కించుకున్నాయి. ప్రతీ జట్టుకూ భారత పేసర్ల అవసరం ఉండటంతో సోమవారం వేలంలో ఆకాశ్‌దీప్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండేలకు మంచి విలువ లభించింది. విదేశీ ఆటగాళ్లలో మార్కో జాన్సెన్, విల్ జాక్స్‌లను ఫ్రాంచైజీలు తగిన మొత్తానికి సొంతం చేసుకున్నాయి. ఆరంభంలో ఆసక్తి చూపించకపోయినా... అజింక్య రహానే, దేవదత్ పడిక్కల్, ఉమ్రాన్ మాలిక్వంటి ఆటగాళ్లను చివర్లో టీమ్‌లు ఎంచుకున్నాయి. రెండో రోజు కూడా ఆస్ట్రేలియా డాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు నిరాశ ఎదురవగా... కేన్ విలియమ్సన్, బెయిర్‌స్టో, మిచెల్, శార్దుల్ ఠాకూర్ తదితరులను ఫ్రాంచైజీలు దూరంగా ఉంచాయి. జిద్దా (సౌదీ అరేబియా): ఐపీఎల్–2025 కోసం రెండు రోజుల పాటు సాగిన వేలం సోమవారం ముగిసింది. మొత్తం 577 మంది క్రికెటర్లు వేలంలోకి రాగా... గరిష్టంగా 204 మంది క్రికెటర్లను ఎంచుకునే అవకాశం ఉండగా... 10 ఫ్రాంచైజీలు కలిపి మొత్తం 182 మంది ఆటగాళ్లనే వేలంలో తీసుకున్నాయి. వీరిలో 62 మంది విదేశీయులు కాగా... అన్ని జట్లూ కలిపి వేలంలో రూ.639.15 కోట్లు వెచ్చించాయి. ఐపీఎల్లో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా బిహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. వేలంలో రాజస్తాన్ రూ.1 కోటీ 10 లక్షలకు ఎంచుకునే సమయానికి వైభవ్ వయసు 13 ఏళ్ల 243 రోజులు మాత్రమే. వైభవ్ ఇప్పటి వరకు 5 రంజీ మ్యాచ్‌లు, ఒక టి20 మ్యాచ్ ఆడాడు. అయితే ఇటీవల భారత అండర్–19 జట్టు సభ్యుడిగా ఆ్రస్టేలియా అండర్ –19 జట్టుతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. తొలి రోజు వేలం రికార్డులతో హోరెత్తించగా, రెండో రోజు కూడా పేరున్న ఆటగాళ్లకు మంచి మొత్తమే దక్కింది. సోమవారం జాబితాలో పెద్ద సంఖ్యలో యువ ఆటగాళ్లు బరిలో నిలవగా, కొందరిని అదృష్టం తలుపు తట్టింది. జాతీయ జట్టుకు ఆడని అన్క్యాప్డ్ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు చివర్లో కనీస విలువకే తీసుకొని జట్టులో మిగిలిన ఖాళీలను నింపాయి. -
మాంసాహారం తినే రాష్ట్రాల్లో మనమే టాప్ప్లేస్
సాక్షి, హైదరాబాద్: పెళ్లి.. పుట్టినరోజు ఇలా ఏ దావత్ చేసినా.. ముక్కలుండాలె... ముక్కలేయకపోతే బంధాలే ముక్కలైపోతాయని బంధు ‘బలగం’మస్తుగా ఉన్న ప్రతీ కుటుంబానికీ తెలుసు. మటన్ ఓ ట్రెడిషన్‌గా మారిపోయి దేశంలోనే మన రాష్ట్రాన్ని టాప్ప్లేస్కు తీసుకెళ్లింది. జాతీయసగటు కన్నా ఎక్కువగా మాంసాన్ని మనవారు లాగించేస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో 70 శాతానికిపైగా ప్రజలు మాంసాహారాన్ని ఇష్టపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. దేశంలో 16.6శాతం మంది పురుషులు 29.4 శాతం మంది మహిళలు తప్ప, మిగిలిన వారంతా నాన్ వెజ్ ప్రియులేనని, ప్రతీ ముగ్గురిలో ఇద్దరు మాంసం తినేవారేనని తేల్చింది. మనమే టాప్... దేశవ్యాప్తంగా మాంసాహారం తినే రాష్ట్రాల్లో 98.7 శాతంతో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా, పశ్చిమబెంగాల్ 98.55, ఏపీ 98.25 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒక కేజీ మాంసం ధర రూ.500 నుంచి రూ.600 మధ్య ఉండగా, మన దగ్గర రూ. 800 నుంచి రూ.1,000 వరకూ ఉంది. తెలంగాణవాసులు వారానికి కనీసం మూడుసార్లు మాంసాహారాన్ని తింటున్నారని ఓ సర్వే వెల్లడించింది. ప్రతీ వ్యక్తి సంవత్సరానికి సగటున రూ.58,000 మాంసం కోసం వెచి్చస్తున్నారని ఓ వెటర్నరీ అధికారి తెలిపారు. ⇒ రాష్ట్రంలో 2014–15లో సగటున ఒక్కో వ్యక్తి సంవత్సరానికి 12.95 కిలోలు తినగా, అది 2021–22 నాటికి 21.17 కిలోలకు పెరిగింది. ఇప్పుడు ఆ సగటు 28.5 కిలోలకు చేరింది. ఇదే సమయంలో జాతీయ సగటు మాంసం వినియోగం దాదాపుగా 7.1 కిలోలు పైచిలుకు మాత్రమే కావడం గమనార్హం. ⇒ మన దగ్గర వినియోగిస్తున్న 28 కిలోల్లో దాదాపు 8 కిలోలు గొర్రె/మేక మాంసం కాగా (జాతీయ సగటు 3.5 కిలోలు) కాగా, ఇందులో స్వల్పంగా బీఫ్, పంది మాంసం మిగిలినది చికెన్.⇒ జాతీయ పోషకాహార సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఏడాదికి ఒక మనిషి 11 కిలోలు వరకూ వినియోగించవచ్చు. గొర్రె/మేక మాంస వినియోగం ఎక్కువగా ఉన్న మన దగ్గర ఉత్పత్తి సరిపోక ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. బయట నుంచి వచ్చే మాంసం ఏదైనా కారణాల వల్ల ఆగిపోతే మాంసం కేవలం 10 రోజులు రాకపోయినా మాంసం ధర రూ.1000 పైబడుతుందని అంచనా. మటన్ క్యాపిటల్ హైదరాబాద్ రాష్ట్రంలో ఉత్పత్తి చేసి, దిగుమతి చేసుకునే మాంసంలో ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే వినియోగిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి సరఫరా అయ్యే మాంసాన్ని హైదరాబాద్‌లో నిల్వ చేసి తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా చేయడంతో హైదరాబాద్ మాంసం సరఫరాకు కేంద్రంగా మారింది. మరోవైపు హోటళ్లు, రెస్టారెంట్లు పెద్ద సంఖ్యలో ఉండడంతో పాటువ్యక్తిగత వినియోగం కోసం కూడా కలిపి హైదరాబాద్‌లో ప్రతిరోజూ సుమారు 18,000కు పైగా గొర్రెలను వధిస్తున్నట్టు అంచనా.రోజుకు 50వేల వరకూ జంతువధ... తెలంగాణలో చెంగిచెర్ల, జియాగూడ, బోయిగూడ, బహదూర్‌పురా, అంబర్పేట్ తదితర ప్రాంతాల్లో కబేళాలు ఉన్నాయి. స్థానిక వినియోగం, ఎగుమతుల కోసం వేర్వేరుగా వీటిని వినియోగిస్తున్నారు. వీటిలో అన్ని రకాల మాంసాలు కలిపి ఒక్కరోజులో 6 వేల నుంచి 7 వేల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 45వేల నుంచి 50వేల దాకా జంతువులను వధిస్తారు. ఇందులో సగంపైనే హైదరాబాద్ వినియోగానికే కేటాయిస్తున్నారు. స్వయం సమృద్ధి దిశగా... గొర్రెల ఉత్పత్తిలో మనం తొలిస్థానంలో, మాంసం ఉత్పత్తి, వినియోగం రెండింటిలో మనం ముందున్నాం. దేశంలో బీఫ్ ఎగుమతుల ద్వారా మనకు అత్యధిక ఆదాయం లభిస్తోంది. అదే సమయంలో గొర్రె/మేక మాంసం దిగుమతులు తగ్గించేందుకు, స్వయం సమృద్ధి సాధించే దిశగా పలు ప్రయత్నాలు ముమ్మరం చేశాం. –డా.బర్బుధ్ది, డైరెక్టర్, నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్‌ఎమ్‌ఆర్‌ఐ)ఉత్పాదకత పెంపుపై దృష్టి... రాష్ట్రంలో మాంస వినియోగం రానురానూ పెరుగుతోంది. డిమాండ్‌ను అందుకునే ప్రయత్నాల్లో భాగంగా ప్రస్తుతం ఒక గొర్రె/మేక ద్వారా వస్తున్న మాంసం పరిమాణాన్ని పెంచాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటికి సరైన ఆహారం అందించడం ద్వారా దిగుబడి రెట్టింపు చేసే దిశగా కృషి చేస్తున్నాం. –పి.బస్వారెడ్డి, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఎన్‌ఎమ్‌ఆర్‌ఐ -
నెల్లూరు జాతి ఆవు @ రూ. 35 కోట్లు!
ఎక్కడైనా మేలు జాతి ఆవు ధర ఎంత ఉంటుంది? మహా అయితే రూ. లక్షల్లో ఉంటుందంటారా.. అయితే మీరు తప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే బ్రెజిల్లో ఇటీవల జరిగిన వేలంలో నెల్లూరు జాతికి (ఏపీలోని నెల్లూరు జిల్లా నుంచి దశాబ్దాల కిందట కొన్ని ఆవులను బ్రెజిల్ తీసుకెళ్లి జన్యు లక్షణాలను మరింత అభివృద్ధి చేసుకున్న ఆవులు) చెందిన తెల్ల ఆవు కనీవినీ ఎరుగని అత్యధిక ధర పలికింది. తద్వారా ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఆవుగా నిలిచింది. వియాటినా–19 ఎఫ్4 మారా ఇమ్విస్ అనే నాలుగున్నరేళ్ల ఆవు మూడో వంతు యాజమాన్య హక్కు ఏకంగా రూ. 11.82 కోట్లకు అమ్ముడుపోయింది!! గతేడాది ఈ ఆవు సగం యాజమాన్య హక్కు రూ. 6.5 కోట్లు పలకడం అప్పట్లోనే రికార్డు సృష్టించగా ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది. మొత్తంమీద ఈ ఆవు విలువ రూ. 35.30 కోట్లు పలికింది. అత్యంత నాణ్యౖమెన జన్యులక్షణాలు గల బ్రెజిల్‌లోని నెల్లూరు జాతి ఆవును రికార్డు ధరకు సొంతం చేసుకొనేందుకు డెయిరీ వ్యాపారులు పోటీపడటం దీని అసలుసిసలు విలువను చాటిచెబుతోంది. బ్రెజిల్‌లోని ముఖ్యమైన ఆవు జాతుల్లో నెల్లూరు జాతి ఆవులు కూడా ఒకటి. వీటిని ఎక్కువగా మాంసం కోసం పెంచుతారు. వీటి మాంసంలో కొవ్వు తక్కువగా ఉండటం వల్ల చాలా దేశాల్లో ఈ ఆవుల మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రస్తుతం బ్రెజిల్లో 16.70 కోట్ల నెల్లూరు జాతి ఆవులు ఉన్నాయి. బ్రెజిల్లో ఉన్న మొత్తం ఆవుల సంఖ్యలో ఇవి 80 శాతం కావడం విశేషం. ఈ జాతికి చెందిన శ్రేష్టమైన ఎద్దుల వీర్యం సైతం అర మిల్లీలీటర్‌కు రూ. 4 లక్షలు పలుకుతోంది. నెల్లూరు జాతి ఆవుల ప్రత్యేకతలు ఇవీ... ♦ ఈ ఆవులు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొనేలా చిక్కటి తెలుపు రంగులో ఉంటాయి. ♦ దళసరి చర్మంతో ఉండటం వల్ల రక్తం పీల్చే కీటకాలు వాటిని దరిచేరవు. ♦ ఓక్లహామా స్టేట్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం వాటి స్వేద గ్రంథులు యూరోపియన్ జాతి ఆవులతో పోలిస్తే రెండు రెట్లు పెద్దగా ఉండటంతోపాటు గ్రంథుల సంఖ్య సైతం 30 శాతం ఎక్కువగా ఉంటుంది. ♦ రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటంతో ఇన్ఫెక్షన్లను సమర్థంగా తట్టుకోగలవు. ♦ సమర్థమైన జీవక్రియ కారణంగా నాసిరకం గడ్డి జాతుల రకాలను సైతం తిని అరిగించుకోగలవు. ♦ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఈనగలగడం, సరై న యాజమాన్య పద్ధతులు పాటించనప్పటికీ దూ డలు సులువుగా పెరగగలగడం మరో ప్రత్యేకత. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
కేఎల్ రాహుల్‌కు లక్నో ఫ్రాంచైజీ బంపరాఫర్!
ఐపీఎల్ మెగావేలానికి సమయం దగ్గరపడుతున్న కొద్ది ఏ ఆటగాడు ఎంత ధరకు అమ్ముడుపోతాడనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది లక్నో, అహ్మదాబాద్ పేరుతో కొత్త ఫ్రాంచైజీలు రావడంతో ఐపీఎల్ 2022 మరింత రంజుగా మారింది. ఇక ఇదే చివరి మెగావేలమని.. తర్వాత ఫ్రాంచైజీలు సొంత సంస్థను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక నవంబర్ 30వ తేదీన ఆయా ఫ్రాంచైజీలు తమ దగ్గరే అట్టిపెట్టుకోనున్న(రిటైన్) జాబితాను సమర్పించేందుకు సిద్ధమవుతున్నాయి. చదవండి: మరీ 16 కోట్లా.. పంజాబ్ కింగ్స్ సంచలన నిర్ణయం.. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ గురించి ఒక ఆసక్తికర సమాచారం అందింది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌కు కేఎల్ రాహుల్‌ను లక్నో ఫ్రాంచైజీ కెప్టెన్‌గా తీసుకోవాలని భావిస్తుంది. ఇందుకోసం రాహుల్‌కు రూ.20 కోట్ల పైనే మూటజెప్పనున్నట్లు సమాచారం. ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టుకు కెప్టెన్‌గా ఇంతవరకు ఏ ఆటగాడు ఇంతమొత్తం పొందలేదు. ఈ సమాచారం నిజమని తేలితే ఐపీఎల్ చరిత్రలో అధికమొత్తం దక్కించుకున్న తొలి ఆటగాడిగా.. కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోనున్నాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న కింగ్స్ పంజాబ్ అతన్ని వదులుకోవడానికి ఇష్టపడనప్పటికి.. రాహుల్ కొత్త జట్టులోకి వస్తే మాత్రం పెద్ద మొత్తం దక్కే అవకాశం ఉంది. ఒకవేళ రాహుల్‌ను పంజాబ్ రిటైన్ చేసుకున్నప్పటికీ బీసీసీఐ నిబంధనల కోసం మొదటి రిటెన్షన్ కోసం 16 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. దీంతో పంజాబ్‌కు రాహుల్‌ను రిటైన్ చేసుకునే అవకాశాలు దాదాపు లేనట్లే. ఇక రాహుల్ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే జనవరిలో జరగనున్న మెగావేలం వరకు ఆగాల్సిందే. చదవండి: IPL 2022 Mega Auction:‘బంపర్ అనౌన్స్మెంట్’.. ఇదే చివరి మెగా వేలం.. ఇక ముందు! ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న కోహ్లికి అనధికారిక లెక్కల ప్రకారం 2018-21 సీజన్‌కు గానూ రూ.17 కోట్లు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు చూసుకుంటే ఐపీఎల్లో కోహ్లికి అందిస్తున్న పారితోషికం అధిక మొత్తం కావడం విశేషం. ఇక ఐపీఎల్ 2021 సీజన్లో కెప్టెన్ కేఎల్ రాహుల్ 13 ఇన్నింగ్స్‌లో 626 పరుగులు సాధించి బ్యాటర్‌గా అద్భుతంగా రాణించినప్పటికీ.. జట్టును విజేతగా నిలపాలన్న అతడి కోరిక మాత్రం నెరవేరలేదు. -
రూ.640 కోట్లు: ‘ఊపిరి’లో పెయింటింగ్ సీన్ గుర్తుందా..
న్యూయార్క్: అక్కినేని నాగార్జున, కార్తీ నటించిన ‘ఊపిరి’ సినిమా గుర్తుందా. ఆ సినిమాలో నాగార్జున ఒక పెయింటింగ్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేస్తే నోరెళ్లబెట్టిన హీరో కార్తీ గుర్తున్నాడు కదా. ఇప్పుడు మీరు కూడా ఈ వార్త చదివితే అలాగే అవుతారు. ఇటీవల అమెరికాలోని న్యూయార్క్‌లో ఒక పాతకాలం నాటి పెయింటింగ్ వేలంలో పెడితే అత్యధిక రేటు పలికింది. ప్రపంచంలోనే అత్యధిక ధర పలికిన పెయింటింగ్‌గా నిలిచింది. వేలంలో ఆ పెయింటింగ్ అక్షరాల రూ.640 కోట్లు పలికింది. వందల ఏళ్ల నాటి ఇటలీకి చెందిన చిత్రకారుడు సాండ్రో బొటిసెల్లి ఓ పెయింటింగ్ వేశాడు. ఆ పెయింటింగ్‌ను ఇటీవల న్యూయార్క్‌లో వేలం వేశారు. ఆ పెయింటింగ్ ఏకంగా రూ.670 కోట్లకు (92.2 మిలియన్ డాలర్లు) అమ్ముడవడం విశేషం. ఇటలీకి చెందిన సాండ్రో క్రీ.శ.1440-1510 మధ్య జీవించాడు. ప్రఖ్యాత చిత్రకారుడిగా పేరుపొందాడు. ఆయన ఎన్నో రకాల పెయింటింగ్‌లు వేశారు. ఈ విషయాన్ని వేలం నిర్వాహకులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ వేలంలో సాండ్రో బొటిసెల్లి వేసిన ఎన్నో చిత్రాలు కూడా పెట్టగా.. అందులో ఈ పెయింటింగ్‌కే అత్యధిక ధర పలికిందని నిర్వాహకులు పేర్కొన్నారు. -
మనింట్లో కక్కినా బాగుండు అనిపిస్తుంది!
బ్యాంకాక్: ఇదేమిటి? బూజుపట్టిన చపాతీ పిండా లేక ఇంకేదైనా అని ఆలోచిస్తూ.. బుర్రకు శ్రమ పెట్టకండి.. ఇది వేల్ వాంతి.. అనగా.. తిమింగలం కక్కు.. చీయాక్ అని అనమాకండి.. విషయం మొత్తం విన్నాక.. అదేదో మనింట్లోనే కక్కినా బాగుండు అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే.. దీని ధర రూ.2.09 కోట్లు మాత్రమే!! ఈ మధ్యే థాయ్‌లాండ్‌లోని సమీలా బీచ్ వద్ద ఓ మత్స్యకారుడికి దొరికింది. ఇసుకలో తెల్లటి ముద్దలాగ కనిపిస్తే.. ఏదో రాయి అనుకున్నాడట. దగ్గరకు వెళ్లి చూస్తే.. ఇదేదో పనికొచ్చేదానిలాగ ఉంది అనుకుని.. ఇంటికి తీసుకెళ్లాడట. ఊర్లోని పెద్దోళ్లకు చూపిస్తే.. అసలు విషయం చెప్పారు. ఇది స్పెర్మ్ వేల్ వాంతి (అంబర్‌గ్రీస్).. సాధారణంగా నీళ్లపై తేలియాడుతూ కనిపిస్తాయి లేదా తీరానికి కొట్టుకొస్తాయి. ఫ్రెష్‌గా ఉన్నప్పుడు కంపు కొడుతుంది కానీ.. ఓసారి గట్టిపడ్డాక సువాసన వెదజల్లుతుంది. అందుకే దీనికి పెర్ఫ్యూమ్ ఇండస్ట్రీలో తెగ క్రేజ్. దానికి తగ్గట్టుగానే ధర కూడానూ. తిమింగలం జీర్ణ వ్యవస్థలోని పిత్తాశయం నుంచి వెలువడ్డ స్రావం నుంచి ఇది తయారవుతుందట. గతంలో ఇంతకన్నా పెద్దది రూ.22 కోట్లకు అమ్ముడుపోయిందట. -
యోగేశ్వర్‌కు రూ. 39.7 లక్షలు
సుశీల్‌కు రూ.38.2 లక్షలు హెర్‌హెల్‌కు అత్యధిక మొత్తం ప్రొ రెజ్లింగ్ లీగ్ వేలం న్యూఢిల్లీ: భారత్‌లో తొలిసారి జరగనున్న ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో భారత రెజ్లర్లలో యోగేశ్వర్ దత్‌కు అత్యధిక ధర పలికింది. మంగళవారం జరిగిన వేలంపాటలో హర్యానా ఫ్రాంచైజీ రూ. 39 లక్షల 70 వేలు వెచ్చించి యోగేశ్వర్ దత్ (65 కేజీలు)ను కొనుగోలు చేసింది. 33 ఏళ్ల యోగేశ్వర్ దత్ లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడంతోపాటు గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని గెలిచాడు. బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య, రజత పతకాలు సాధించిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ (74 కేజీలు)ను ఉత్తరప్రదేశ్ ఫ్రాంచైజీ రూ. 38 లక్షల 20 వేలకు సొంతం చేసుకుంది. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 74 కేజీల విభాగంలో కాంస్యం సాధించిన నర్సింగ్ యాదవ్‌ను బెంగళూరు ఫ్రాంచైజీ రూ. 34 లక్షల 50 వేలకు కొనుగోలు చేసింది. ఉక్రెయిన్‌కు చెందిన మహిళా రెజ్లర్ ఒక్సానా హెర్హెల్ (60 కేజీలు)కు అందరికంటే ఎక్కువ మొత్తం లభించింది. ఆమెను హర్యానా ఫ్రాంచైజీ రూ. 41 లక్షల 30 వేలకు కైవసం చేసుకుంది. బెలారస్‌కు చెందిన మరో మహిళా రెజ్లర్ వాసిలిసా (69 కేజీలు)ను పంజాబ్ ఫ్రాంచైజీ రూ. 40 లక్షల 20 వేలకు కొనుగోలు చేసింది. గీతా ఫోగట్‌ను ఢిల్లీ జట్టు రూ. 33 లక్షలకు ... బబితాను ఉత్తరప్రదేశ్ రూ. 34 లక్షల 10 వేలకు కొనుగోలు చేశాయి. మొత్తం ఆరు ఫ్రాంచైజీల (ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ముంబై, బెంగళూరు) మధ్య డిసెంబరు 10 నుంచి 27 వరకు ప్రొ రెజ్లింగ్ లీగ్ జరుగుతుంది. -
వెరీ ‘గుడ్డు’
తణుకు, న్యూస్‌లైన్ :కోడిగుడ్డు ధర పైపైకి ఎగబాకుతోంది. పౌల్ట్రీ చరిత్రలోనే కనివినీ ఎరుగని రికార్డులు నమోదు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా నెక్ (జాతీయ కోడిగుడ్ల సమన్వయ సంఘం) నిర్ణయ ధర రూ.3.91 పైసలకు చేరటంతో పౌల్ట్రీ రైతుల్లో హర్షాతి రేకాలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో కోడిగుడ్డు ధర పెరగటం సహజమే. అయినా.. ముందెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది పౌల్ట్రీ చరిత్రలోనే అత్యధిక ధరలను నమోదు చేస్తోంది. కూరగాయ ధరలు మండిపోతున్న నేపథ్యంలో కోడిగుడ్డు కూరతో నాలుగు మెతుకులు తినే సామాన్యులను మాత్రం ఈ పరిస్థితి ఇబ్బందికి గురి చేస్తోంది. ధర ఇదే స్థాయిలో మరో రెండు, మూడు నెలలు కొనసాగితే.. గతంలో మూటగట్టుకున్న నష్టాల నుంచి గట్టెక్కే అవకాశం కలుగుతుందని పౌల్ట్రీ రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వరుస తుపానుల దెబ్బకు ఆంధ్రా, ఒడిశా ప్రాంతాల్లో తోటలు దెబ్బతినడంతో.. కూరగాయ ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈ పరిస్థితుల్లో కోడిగుడ్డు వినియోగం పెరిగింది. ఇదే సందర్భంలో ఈశాన్య రాష్ట్రాల్లో చలి పెరగడం వల్ల గుడ్డుకు డిమాండ్ పెరిగింది. దీంతో అసోం, పశ్చిమబెంగాల్, బీహార్, మిజోరం, నాగాలాండ్ తదితర రాష్ట్రాలకు ఎగుమతులు ఊపందుకున్నాయి. ఫలితంగా గుడ్డు ధరకు రెక్కలొచ్చాయి. ఈ నెల 14 నాటికి కోడిగుడ్డు నెక్ నిర్ణయ ధర రూ.3.65కు చేరి, ఆల్‌టైమ్ ధరలను తిరగరాసింది. అక్కడితో ఆగకుండా 15 నాటికి రూ.3.74, 22 నాటికి 3.80, 25 నాటికి రూ.3.89కి పెరిగింది. 27 నాటికి రూ.3.91కి చేరి అదే ధర వద్ద కొనసాగుతోంది. 2011 నవంబర్‌లో రూ.3.10 పలకగా, 2012 నవంబర్‌లో రూ.2.90కి చేరింది. ప్రస్తుతం రూ.3.91కి పౌల్ట్రీ చరిత్రలోనే అత్యధిక ధరగా నమోదైంది. ఉత్పత్తి తగ్గటమూ కారణమే ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో గతంలో 3.75 కోట్ల కోళ్లను పెంచారు. వీటిద్వారా కనీసం రోజుకు 3 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. గడచిన వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల కోళ్లు తెగుళ్ల బారిన పడటంతో గుడ్లు పెట్టే కోళ్లను సైతం మాంసానికి అమ్మేసి పౌల్ట్రీలను ఖాళీ చేశారు. ప్రస్తుతం ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో సుమారు 3 కోట్ల కోళ్లను పెంచుతున్నారు. వీటిద్వారా రోజుకు 2 కోట్ల గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయని పౌల్ట్రీవర్గాలు చెబుతున్నాయి. గతంలో పౌల్ట్రీ షెడ్లలో ఖాళీ చేసిన కోళ్ల స్థానే అప్పటికే గుడ్లు పెట్టే దశలో ఉన్న కోళ్లను వేసేవారు. అయితే తరచూ తెగుళ్లు వ్యాప్తి చెందుతుండటంతో బయో సెక్యూరిటీ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానంలో గుడ్లు పెట్టే కోళ్లను పూర్తిగా ఖాళీ చేసిన అనంతరమే కొత్త బ్యాచ్‌లు వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ పెడరేషన్ పశ్చిమగోదావరి రీజియన్ చైర్మన్ ఎ.దొరయ్య ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో కోటి కోళ్లు ఉండగా, రోజుకు 70నుంచి 75 లక్షల మేర గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయని ఆయన చెప్పారు. మేత ధరలు, నిర్వహణ వ్యయం పెరగడంతో పౌల్ట్రీ రంగం భారంగా పరిణమించిందని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పెంపకందారులు వెనుకంజ వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ధర పౌల్ట్రీకి ఆశాజనకంగా ఉన్నా, గుడ్డుధర రూ.4.50 ఉంటే తప్ప పౌల్ట్రీ రంగం లాభదాయకం కాదని దొరయ్య అభిప్రాయపడ్డారు.