వెరీ ‘గుడ్డు’
Published Sat, Nov 30 2013 4:38 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
తణుకు, న్యూస్‌లైన్ :కోడిగుడ్డు ధర పైపైకి ఎగబాకుతోంది. పౌల్ట్రీ చరిత్రలోనే కనివినీ ఎరుగని రికార్డులు నమోదు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా నెక్ (జాతీయ కోడిగుడ్ల సమన్వయ సంఘం) నిర్ణయ ధర రూ.3.91 పైసలకు చేరటంతో పౌల్ట్రీ రైతుల్లో హర్షాతి రేకాలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో కోడిగుడ్డు ధర పెరగటం సహజమే. అయినా.. ముందెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది పౌల్ట్రీ చరిత్రలోనే అత్యధిక ధరలను నమోదు చేస్తోంది. కూరగాయ ధరలు మండిపోతున్న నేపథ్యంలో కోడిగుడ్డు కూరతో నాలుగు మెతుకులు తినే సామాన్యులను మాత్రం ఈ పరిస్థితి ఇబ్బందికి గురి చేస్తోంది. ధర ఇదే స్థాయిలో మరో రెండు, మూడు నెలలు కొనసాగితే.. గతంలో మూటగట్టుకున్న నష్టాల నుంచి గట్టెక్కే అవకాశం కలుగుతుందని పౌల్ట్రీ రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వరుస తుపానుల దెబ్బకు ఆంధ్రా, ఒడిశా ప్రాంతాల్లో తోటలు దెబ్బతినడంతో.. కూరగాయ ధరలు ఆకాశాన్ని
అంటాయి. ఈ పరిస్థితుల్లో కోడిగుడ్డు వినియోగం పెరిగింది. ఇదే సందర్భంలో ఈశాన్య రాష్ట్రాల్లో చలి పెరగడం వల్ల గుడ్డుకు డిమాండ్ పెరిగింది. దీంతో అసోం, పశ్చిమబెంగాల్, బీహార్, మిజోరం, నాగాలాండ్ తదితర రాష్ట్రాలకు ఎగుమతులు ఊపందుకున్నాయి. ఫలితంగా గుడ్డు ధరకు రెక్కలొచ్చాయి. ఈ నెల 14 నాటికి కోడిగుడ్డు నెక్ నిర్ణయ ధర రూ.3.65కు చేరి, ఆల్‌టైమ్ ధరలను తిరగరాసింది. అక్కడితో ఆగకుండా 15 నాటికి రూ.3.74, 22 నాటికి 3.80, 25 నాటికి రూ.3.89కి పెరిగింది. 27 నాటికి రూ.3.91కి చేరి అదే ధర వద్ద కొనసాగుతోంది. 2011 నవంబర్‌లో రూ.3.10 పలకగా, 2012 నవంబర్‌లో రూ.2.90కి చేరింది. ప్రస్తుతం రూ.3.91కి పౌల్ట్రీ చరిత్రలోనే అత్యధిక ధరగా నమోదైంది.
ఉత్పత్తి తగ్గటమూ కారణమే
ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో గతంలో 3.75 కోట్ల కోళ్లను పెంచారు. వీటిద్వారా కనీసం రోజుకు 3 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. గడచిన వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల కోళ్లు తెగుళ్ల బారిన పడటంతో గుడ్లు పెట్టే కోళ్లను సైతం మాంసానికి అమ్మేసి పౌల్ట్రీలను ఖాళీ చేశారు. ప్రస్తుతం ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో సుమారు 3 కోట్ల కోళ్లను పెంచుతున్నారు. వీటిద్వారా రోజుకు 2 కోట్ల గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయని పౌల్ట్రీవర్గాలు చెబుతున్నాయి. గతంలో పౌల్ట్రీ షెడ్లలో ఖాళీ చేసిన కోళ్ల స్థానే అప్పటికే గుడ్లు పెట్టే దశలో ఉన్న కోళ్లను వేసేవారు. అయితే తరచూ తెగుళ్లు వ్యాప్తి చెందుతుండటంతో బయో సెక్యూరిటీ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానంలో గుడ్లు పెట్టే కోళ్లను పూర్తిగా ఖాళీ చేసిన అనంతరమే కొత్త బ్యాచ్‌లు వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ పెడరేషన్ పశ్చిమగోదావరి రీజియన్ చైర్మన్ ఎ.దొరయ్య ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో కోటి కోళ్లు ఉండగా, రోజుకు 70నుంచి 75 లక్షల మేర గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయని ఆయన చెప్పారు. మేత ధరలు, నిర్వహణ వ్యయం పెరగడంతో పౌల్ట్రీ రంగం భారంగా పరిణమించిందని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పెంపకందారులు వెనుకంజ వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ధర పౌల్ట్రీకి ఆశాజనకంగా ఉన్నా, గుడ్డుధర రూ.4.50 ఉంటే తప్ప పౌల్ట్రీ రంగం లాభదాయకం కాదని దొరయ్య అభిప్రాయపడ్డారు.
Advertisement