యోగేశ్వర్‌కు రూ. 39.7 లక్షలు
సుశీల్‌కు రూ.38.2 లక్షలు
హెర్‌హెల్‌కు అత్యధిక మొత్తం
ప్రొ రెజ్లింగ్ లీగ్ వేలం
న్యూఢిల్లీ: భారత్‌లో తొలిసారి జరగనున్న ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో భారత రెజ్లర్లలో యోగేశ్వర్ దత్‌కు అత్యధిక ధర పలికింది. మంగళవారం జరిగిన వేలంపాటలో హర్యానా ఫ్రాంచైజీ రూ. 39 లక్షల 70 వేలు వెచ్చించి యోగేశ్వర్ దత్ (65 కేజీలు)ను కొనుగోలు చేసింది. 33 ఏళ్ల యోగేశ్వర్ దత్ లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడంతోపాటు గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని గెలిచాడు. బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య, రజత పతకాలు సాధించిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ (74 కేజీలు)ను ఉత్తరప్రదేశ్ ఫ్రాంచైజీ రూ. 38 లక్షల 20 వేలకు సొంతం చేసుకుంది. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 74 కేజీల విభాగంలో కాంస్యం సాధించిన నర్సింగ్ యాదవ్‌ను బెంగళూరు ఫ్రాంచైజీ రూ. 34 లక్షల 50 వేలకు కొనుగోలు చేసింది.
ఉక్రెయిన్‌కు చెందిన మహిళా రెజ్లర్ ఒక్సానా హెర్‌హెల్ (60 కేజీలు)కు అందరికంటే ఎక్కువ మొత్తం లభించింది. ఆమెను హర్యానా ఫ్రాంచైజీ రూ. 41 లక్షల 30 వేలకు కైవసం చేసుకుంది. బెలారస్‌కు చెందిన మరో మహిళా రెజ్లర్ వాసిలిసా (69 కేజీలు)ను పంజాబ్ ఫ్రాంచైజీ రూ. 40 లక్షల 20 వేలకు కొనుగోలు చేసింది. గీతా ఫోగట్‌ను ఢిల్లీ జట్టు రూ. 33 లక్షలకు ... బబితాను ఉత్తరప్రదేశ్ రూ. 34 లక్షల 10 వేలకు కొనుగోలు చేశాయి. మొత్తం ఆరు ఫ్రాంచైజీల (ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ముంబై, బెంగళూరు) మధ్య డిసెంబరు 10 నుంచి 27 వరకు ప్రొ రెజ్లింగ్ లీగ్ జరుగుతుంది.