ఎక్కడైనా మేలు జాతి ఆవు ధర ఎంత ఉంటుంది? మహా అయితే రూ. లక్షల్లో ఉంటుందంటారా.. అయితే మీరు తప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే బ్రెజిల్‌లో ఇటీవల జరిగిన వేలంలో నెల్లూరు జాతికి (ఏపీలోని నెల్లూరు జిల్లా నుంచి దశాబ్దాల కిందట కొన్ని ఆవులను బ్రెజిల్ తీసుకెళ్లి జన్యు లక్షణాలను మరింత అభివృద్ధి చేసుకున్న ఆవులు) చెందిన తెల్ల ఆవు కనీవినీ ఎరుగని అత్యధిక ధర పలికింది. తద్వారా ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఆవుగా నిలిచింది.
వియాటినా–19 ఎఫ్4 మారా ఇమ్‌విస్ అనే నాలుగున్నరేళ్ల ఆవు మూడో వంతు యాజమాన్య హక్కు ఏకంగా రూ. 11.82 కోట్లకు అమ్ముడుపోయింది!! గతేడాది ఈ ఆవు సగం యాజమాన్య హక్కు రూ. 6.5 కోట్లు పలకడం అప్పట్లోనే రికార్డు సృష్టించగా ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది.
మొత్తంమీద ఈ ఆవు విలువ రూ. 35.30 కోట్లు పలికింది. అత్యంత నాణ్యౖమెన జన్యులక్షణాలు గల బ్రెజిల్‌లోని నెల్లూరు జాతి ఆవును రికార్డు ధరకు సొంతం చేసుకొనేందుకు డెయిరీ వ్యాపారులు పోటీపడటం దీని అసలుసిసలు విలువను చాటిచెబుతోంది.
బ్రెజిల్‌లోని ముఖ్యమైన ఆవు జాతుల్లో నెల్లూరు జాతి ఆవులు కూడా ఒకటి. వీటిని ఎక్కువగా మాంసం కోసం పెంచుతారు. వీటి మాంసంలో కొవ్వు తక్కువగా ఉండటం వల్ల చాలా దేశాల్లో ఈ ఆవుల మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రస్తుతం బ్రెజిల్‌లో 16.70 కోట్ల నెల్లూరు జాతి ఆవులు ఉన్నాయి. బ్రెజిల్‌లో ఉన్న మొత్తం ఆవుల సంఖ్యలో ఇవి 80 శాతం కావడం విశేషం. ఈ జాతికి చెందిన శ్రేష్టమైన ఎద్దుల వీర్యం సైతం అర మిల్లీలీటర్‌కు రూ. 4 లక్షలు పలుకుతోంది.
నెల్లూరు జాతి ఆవుల ప్రత్యేకతలు ఇవీ...
♦ ఈ ఆవులు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొనేలా చిక్కటి తెలుపు రంగులో ఉంటాయి.
♦ దళసరి చర్మంతో ఉండటం వల్ల రక్తం పీల్చే కీటకాలు వాటిని దరిచేరవు.
♦ ఓక్లహామా స్టేట్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం వాటి స్వేద గ్రంథులు యూరోపియన్ జాతి ఆవులతో పోలిస్తే రెండు రెట్లు పెద్దగా ఉండటంతోపాటు గ్రంథుల సంఖ్య సైతం 30 శాతం ఎక్కువగా ఉంటుంది.
♦ రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటంతో ఇన్ఫెక్షన్లను సమర్థంగా తట్టుకోగలవు.
♦ సమర్థమైన జీవక్రియ కారణంగా నాసిరకం గడ్డి జాతుల రకాలను సైతం తిని అరిగించుకోగలవు.
♦ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఈనగలగడం, సరై న యాజమాన్య పద్ధతులు పాటించనప్పటికీ దూ డలు సులువుగా పెరగగలగడం మరో ప్రత్యేకత.
– సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment