రాజకీయాలకు వేదికగా నారాయణ విద్యా సంస్థలు
ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఎన్నికల పనులు
రోజూ ముగ్గురు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఎన్నికల ప్రచారం
చెప్పిన పని చేయని వారికి శిక్ష
తీవ్ర ఆవేదనలో నారాయణ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, ఉద్యోగులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: భారీగా ఫీజులు చెల్లించి తమ విద్యా సంస్థల్లో పిల్లలకు మంచి విద్యను అందించాల్సిన టీడీపీ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ తన స్కూళ్లు, కాలేజీలను రాజకీయాలకు వేదికగా మార్చేశారు. చంద్రబాబు బినామీగా, టీడీపీ నేతగా, మాజీ మంత్రిగా చిరపరిచితుడైన నారాయణ ఈసారి ఎన్నికల్లో టీడీపీ తరపున నెల్లూరు నగర అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో నారాయణ విద్యా సంస్థల్లోనే రాజకీయ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు.
సంస్థలో ఉద్యోగులు, ఉపాధ్యాయులతో ఎన్నికల పనులు చేయిస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకుని పిల్లలకు పాఠాలు చెప్పడానికి వచ్ఛిన ఉపాధ్యాయులను ఎన్నికల ప్రచారం కోసం విద్యార్థుల ఇళ్లకు పంపుతున్నారు. ఈ దఫా ఓటు టీడీపీకే వెయ్యాలని ప్రాథేయపడేలా చేస్తున్నారు.
బలవంతంగా ఎన్నికల ఉచ్చులోకి..
2019 ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఓడిపోయిన నారాయణ నాలుగున్నరేళ్లపాటు నెల్లూరుకు ముఖం చాటేశారు. ఆయనపై టీడీపీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి ఉంది. దీంతో ఈసారి టీడీపీకి ప్రచారం చేయడం కోసం తన విద్యాసంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులను బలవంతంగా ఎన్నికల ఉచ్చులోకి లాగారు. ఇప్పటికే కొందరు ఉపాధ్యాయులు, ఉద్యోగులను రోజువారీ విధుల నుంచి తప్పించి ఎన్నికల విధులు అప్పజెప్పినట్లు సమాచారం. దాదాపు 500 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులను కలిపి నారాయణ టీం (ఎన్ టీం)గా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఆ బృందంతో గతంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో ఓటర్ల వెరిఫికేషన్ చేయించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా సమాచారం, వారి మొబైల్‌కొచ్చే ఓటీపీ అడగడంతో ప్రజలు వారికి దేహశుద్ధి చేసిన ఘటనలు ఉన్నాయి. అయినా, నారాయణ ఇప్పుడు ఎన్నికల ప్రచారం కోసం వారిని ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గాల్లో ప్రచారం చేయిస్తున్నారు.
ప్రతి రోజూ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి..
ఎంపిక చేసిన ఉపాధ్యాయులు ఆ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థుల అడ్రెస్‌లు సేకరించి, ఒక్కొక్కరూ రోజుకు ముగ్గురు విద్యార్థుల ఇళ్లకు వెళుతున్నారు. తల్లిదండ్రులతో ఎన్నికలపై చర్చిస్తున్నారు. ఈ దఫా ఓట్లు టీడీపీకే వేయాలని వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే తమ యాజమాన్యం ఒత్తిడిపై వచ్చామని, ఏమీ అనుకోవద్దని ప్రాధేయపడుతున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లను సందర్శించినట్లు ఫొటోలు దిగి విద్యా సంస్థల వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తున్నారు.
మాట వినకపోతే డిస్మిస్ లేదా బదిలీ
ఉన్నత చదువులు చదివిన తమకు వేతనం తక్కువైనప్పటికీ గౌరవప్రదమైన ఉద్యోగం అని చెప్పుకునేందుకు ఎక్కువ మంది నారాయణ విద్యా సంస్థల్లో చేరుతున్నారు. ఏళ్ల తరబడి అదే సంస్థలో పని చేస్తున్నారు. నారాయణ ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్ఛిన 2019 నుంచి నారాయణ సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులను రాజకీయ పనులకు వాడుకుంటున్నారు.
ఉద్యోగులను భయపెట్టి మరీ ఎన్నికల పనులు చేయిస్తున్నారని విద్యాసంస్థ ఉద్యోగులు, ఉపా«ద్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు తిరస్కరించిన ఉద్యోగులను పలు సాకులతోఉద్యోగం నుంచి తొలగించడమో, సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడమో చేస్తున్నారని ఓ ఉద్యోగి వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment