మాస్టారూ.. ఎవరీమె? | YSRCP candidates objections on Narayana affidavit | Sakshi
Sakshi News home page

మాస్టారూ.. ఎవరీమె?

Published Sat, Apr 27 2024 8:14 AM | Last Updated on Sat, Apr 27 2024 8:50 AM

YSRCP candidates objections on Narayana affidavit

ఎన్నికల కోసం కట్టుకున్న భార్యను కాదనుకున్నావా నారాయణా?

ఆస్తుల్లో భార్యకు వాటాలిచ్చావు.. బిడ్డను కన్నావు.. ఇప్పుడు కాదంటావా?

ఎన్నికల అఫిడవిట్‌లో ఇద్దరు భార్యలున్నట్లు చూపని మాజీ మంత్రి 

రెండో భార్య కుమార్తెను ‘గంటా’ కుమారుడితో వివాహం జరిపించలేదా? 

నీ ఎడ్యుకేషనల్‌ సొసైటీలో రెండో భార్య ఇందిర డైరెక్టర్‌గా ఎలా ఉంది? 

గత అఫిడవిట్, ప్రస్తుత అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చిన ‘పొంగూరు’ 

మొన్న మరదలిని వంచించావు..ఇప్పుడు కట్టుకున్న భార్యనే కాదనుకుంటావా? 

మహిళలను మోసం చేసే నీవు సింహపురి మహిళలకు ఏం చెబుతావు?

నారాయణ అఫిడవిట్‌పై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అభ్యంతరాలు  

సాక్షి  ప్రతినిధి, నెల్లూరు: నారాయణ విద్యాసంస్థల అధినేతగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఎన్నికల వేళ సత్యాన్ని సమాధిచేసి తన రాజకీయ పదవి కోసం తాళి కట్టిన భార్యనే కాదనుకున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నారాయణతో మూడు దశాబ్దాల పాటు అన్యోన్య దాంపత్య జీవితం పంచుకున్న ఆమె ప్రస్తుతం ఎవరు? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఎన్నికల అఫిడవిట్‌లో తనకు ఒక భార్య, కుమార్తెను మాత్రమే చూపారు. రెండో భార్య ఆమె కుమార్తెను చూపించకపోవడంతో గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నారాయణ మహిళలను వంచించిన విషయంలో సింహపురి మహిళలకు ఏమని సమాధానం చెబుతారు.

తప్పుల కుప్ప.. ఆ ‘అఫిడవిట్‌’  
టీడీపీ నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ చిక్కుల్లో పడ్డాడు. భారత ఎన్నికల సంఘం నిబంధనలను సవాల్‌ చేస్తూ తన నామినేషన్‌ పత్రంతో సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం పొందుపరిచారు. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ఒక భార్య ఉన్న వారే రాజ్యాంగబద్ధ పదవులకు అర్హులు. ఇంకో భార్య ఉన్నప్పటికీ విడాకులు అయినా ఇచ్చి ఉండాలి.  అయితే నారాయణ విద్యా సంస్థల అధినేతగా నారాయణ వ్యక్తిగత జీవితం ‘తెరిచిన పుస్తకం’. నారాయణకు ఇద్దరు భార్యలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే.  

2014లో ఇలా.. 
2014లో ఎమ్మెల్సీ నామినేషన్‌ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో తన భార్య పి. రమాదేవిగా, శారిణి (రెండో భార్య ఇందిర కుమార్తె), కుమారుడు నిషింత్‌ను డిపెండెంట్‌లుగా చూపించారు. వీరు కొడుకు, కూతురు అయినప్పటికి మిగతా ఐఐఐలోవారు తన సంతానంగా సృష్టంగా పేర్కొనకపోవడం విశేషం.  

2019 ఎన్నికల్లో ఇలా.. 
2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడివిట్‌లో కేవలం తన భార్య రమాదేవిని మాత్రమే చూపించారు. అయితే అంతకు ముందే కుమారుడు నిషాంత్‌ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కుమార్తె శారిణిని అఫిడవిట్‌లో సంతానంగా, డిపెండెంట్‌లుగా పేర్కొనకపోవడం గమనార్హం.  

2024లో (ప్రస్తుతం)ఇలా.. 
2024 సార్వత్రిక ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్‌లో తన భార్య రమాదేవిని మాత్రమే చూపించారు. కానీ ఎక్కడా కుమార్తెలు ఉన్నట్లుగా చూపించకపోగా, శారిణి, సింధూర వద్ద అప్పులు తీసుకున్నట్లు అఫిడవిట్‌లో చూపించడం గమనార్హం. 
 
ఇందిర నారాయణ రెండో భార్యే? 
పొంగూరు ఇందిర రెండో భార్యే అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. 1996లో ఏర్పాటు చేసిన నారాయణ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ సంస్థలో ఇందిర భర్త పొంగూరు నారాయణగా ఆమె చైర్మన్‌ హోదాతో ఉన్నట్లు ట్రస్ట్‌ బోర్డులో రిజి్రస్టేషన్‌ డాక్యుమెంట్లు నిర్థారణ చేస్తున్నాయి. ఇందిర నిర్వహణ కమిటీలో కూడా కోశాధికారిగా ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో మాత్రం ఎన్నికల కోసం ఆమెతో రాజీనామా చేయించారు.

2011 నుంచి  2020 వరకు నారాయణ ఎడ్యుకేషన్‌ సోసైటికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్‌ అకౌంట్‌లో లావాదేవీల విషయంలో కూడా ఇందిర సంతకం ఉంది. అయితే ఆమెతో కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నట్లు ఎప్పుడు, ఎలా, ఎక్కడ అనే ఆధారాల్లేవు. ఆమె పాస్‌పోర్టు పరిశీలించినా నారాయణ భార్యగా తేటతెల్లం అవుతుంది. ఆమె పేరుతో ఉన్న ఆస్తుల రిజిస్టర్‌ డాక్యుమెంట్లను పరిశీలించినా ఇదే విషయం ప్రస్ఫుటం అవుతుంది.

ఇందిర కుమార్తె శారిణి పాస్‌పోర్ట్‌లో తన తండ్రి నారాయణగా ఉన్నట్లు సమాచారం. అయితే నారాయణ మంత్రి అయ్యాక వీకీపీడియాలో మాత్రం భార్య రమాదేవి, కుమార్తెలు సింధూర, శారిణి, కుమారుడు నిషాంత్‌ (లేట్‌) అనే విషయాలు నమోదు చేసి ఉండడం విశేషం. 
 
కన్యాదానం చేసి.. తర్వాత మసి పూసి 
నారాయణ గతంలో మంత్రి పదవి చేపట్టిన తర్వాత కొంత కాలానికి కుమారుడు హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు  ప్రమాదంలో దుర్మరణం చెందారు. తర్వాత కొన్నాళ్లకు తన కుమార్తె శారిణి (రెండో భార్య కుమార్తె)కి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజతో వివాహం జరిగింది.

ఆ వివాహ సందర్భంలో నారాయణ, ఇందిర దంపతులుగా వ్యవహరించి కన్యాదానం చేశారు. అలాగే  నారాయణ ఎడ్యుకేషనల్‌ సోసైటీ మేనేజ్‌మెంట్‌ కమిటీ మెంబర్‌గా శారిణి, రవితేజగా వ్యవహరిస్తున్నారు. అన్ని సందర్భాల్లో ఇందిరను భార్యగా చూపిస్తున్న నారాయణ ఎన్నికల అఫిడవిట్‌లో మాత్రం చూపించకపోవడం విశేషం.  
 
టీడీపీకి ఆర్థిక దన్ను 
టీడీపీకి నారాయణ ఆర్థిక వెన్నుదన్నుగా నిలుస్తూ చంద్రబాబు అండతో రాజధాని ప్రాంతంలో వేలాది ఎకరాల భూ కుంభకోణానికి పాల్పడ్డారు. అనేక అవినీతి బాగోతాల్లో నారాయణ పాత్రధారుడుగా ఉన్నారు. ఇక విద్యా సంస్థల్లో అయితే పేపర్ల లీకేజీల నుంచి అనేక అడ్డదారులు తొక్కారు. వీటి నుంచి బయటపడాలని 2019లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారాయణ అవినీతి బాగోతాలన్నీ బయటపడ్డాయి. ఈ కేసులన్నీ మెడకు చుట్టుకోవడంతో కేసుల నుంచి బయటపడేందుకు ఈ ఎన్నికల్లో గెలవాలని రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి సైతం దాదాపు రూ.900 కోట్ల ఎన్నికల ఫండ్‌ను అందజేసినట్లు ప్రచారం జరుగుతోంది.

నెల్లూరు సిటీలో కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నిలబెట్టిన ఒక సామాన్యుడిపై ఓడిపోతాననే భయంతో రూ.100 కోట్లు వరకు ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడడం లేదని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. 
 
అక్రమాలపై ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌సీపీ   
నారాయణ ఎన్నికల అక్రమాలపై ఇప్పుడు వైఎస్సార్‌సీపీ దృష్టి సారించింది. 2014లో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఆయన ఎన్నికల  కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌పై అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఉండడంతో వైఎస్సార్‌సీపీ నేతలు దృష్టి సారించలేదు. 2019 ఎన్నికలప్పుడు కూడా ఆయన వ్యక్తిగత అఫిడవిట్‌పై దృష్టి కేంద్రీకరించలేదు.

తాజాగా జరుగుతున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్సార్‌సీపీ గతంలో, ఇప్పుడు సమర్పించిన అఫిడవిట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. తన అఫిడవిట్లలో తనకు ఇద్దరు  భార్యలు, ముగ్గురు సంతానం ఉన్నట్లు  ఎక్కడా చూపించకపోవడంపై నిశితంగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. ప్రధానంగా నారాయణ భార్యగా రికార్డుల్లో ఉన్న ఇందిరతో విడాకులు తీసుకున్నట్లు ఎక్కడా ఆధారాలు లేవు.

ఆయనకు ముగ్గురు సంతానం అనేదానికి సైతం ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం కుమారుడు చనిపోయినప్పటికీ ముగ్గురు సంతానం అనే నిబంధన నారాయణకు వర్తిస్తుందని ఎన్నికల కమిషన్‌ నియమావళి చెబుతోంది. వీటిపై దృష్టిసారించిన వైఎస్సార్‌సీపీ నారాయణ అఫిడవిట్‌పై పోరాటం చేయడానికి సిద్ధమైంది. 
 
ఆస్తుల్లోనూ తప్పుడు సమాచారమే? 
దేశ వ్యాప్తంగా నారాయణ విద్యాసంçస్థలను నెలకొల్పి వేలకోట్ల ఆస్తులను సొంతం చేసుకున్న నారాయణ ఎన్నికల ఆఫిడవిట్‌లో ఆస్తులపై తప్పుడు సమాచారం ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఆయన కుటుంబ ఆస్తులు విలువ రూ.824.05 కోట్లుగా చూపారు. ఆయన తోపాటు మొదటి భార్య రమాదేవి పేరిట ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. వారిద్దరి పేర్లతో అప్పులు కూడా రూ.189.59 కోట్లుగా చూపారు. కానీ దేశ వ్యాప్తంగా వేల కోట్ల ఆస్తులు పోగేసుకున్న నారాయణ అఫిడవిట్‌లో కొన్నింటినే చూపారని చెప్పుకోవాలి.  
 
కేసుల్లో దిట్ట 
నారాయణపై అఫిడవిట్‌లో చూపిన ప్రకారం ఎనిమిది కేసులు నమోదయిన్నాయి. నారాయణ తమ్ముడు భార్య నెల్లూరు నగరంలోని బాలాజీనగర్‌ స్టేషన్‌లో వరకట్నం, వేధింపుల కేసు నమోదు చేయించింది. అలాగే చిత్తూరులో ప్రశ్నాపత్రాల లీక్‌ చేసిన అభియోగంతో కేసు నమోదయింది.

అలాగే నారాయణ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న కేసులో కడప జిల్లా బి కోడూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.. మిగిలిన ఐదు కేసులు అమరావతితో భూముల విషయంలో సీఐడీ కేసులు నమోదు చేసింది..  అమరావతి భూముల మాస్టర్‌ డిజైనింగ్‌ అక్రమాలు, దళితుల భూములు కొనుగోలు, మంత్రిగా తన విధులను దుర్వినియోగం చేశారన్న అభియోగాలపై సీఐడీ కేసులు నమోదు చేసినట్లు చూపారు. 
 
నామినేషన్‌ స్క్రూట్నిలో అభ్యంతరాలు  
నెల్లూరులోని శుక్రవారం జరిగిన నామినేషన్ల స్క్రూట్ని సమయంలో నెల్లూరు నగర టీడీపీ అభ్యర్థి నారాయణ నామినేషన్‌ సందర్భంగా పొందుపరిచిన అఫిడవిట్‌పై స్థానిక వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఖలీల్‌ అహ్మద్‌ పలు అభ్యంతరాలను తెలిపారు. నారాయణకు రెండు పెళ్లిళ్లు అధికారికంగా అయినట్లు పలు ఆధారాలతో సహ రిటర్నింగ్‌ అధికారికి చూపించారు. అఫిడవిట్‌లో రెండో భార్యను ఎక్కడ చూపించలేదని. రెండో భార్య కుమార్తె శారిణి ఉన్నట్లు చూపించారు.

నారాయణ ఎడ్యుకేషన్‌ సోసైటీ ఏర్పాటు నుంచి ఆయన భార్యగా ఇందిరను చూపించారని, కుమార్తె శారిణి కూడా సోసైటి మేనేజ్‌మెంట్‌ మెంబర్‌గా ఉందని, వారి పాస్‌పోర్ట్‌లు పరిశీలించినా వాస్తవాలు తెలుస్తాయయని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆయా అభ్యంతరాల ఆధారంగా నారాయణ నామినేషన్‌ను  తిరస్కరించాలని ఫిర్యాదు చేసినా రిటర్నింగ్‌ అధికారి ఆ అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement