AP SSC Paper Leak: Former TDP Minister Narayana History in Telugu - Sakshi
Sakshi News home page

Narayana: కార్పొరేట్‌ విద్యా మాఫియా అధిపతి నారాయణ చరిత్ర ఇదే..

Published Wed, May 11 2022 12:15 PM | Last Updated on Wed, May 11 2022 1:14 PM

Former TDP minister Narayana History Paper Leak PSR Nellore  - Sakshi

పొంగూరు నారాయణ.. జిల్లాకు చెందిన ఈయన విద్యాసంస్థల్లో జరుగుతున్న అక్రమాలకు అంతేలేదు. పేపర్‌ లీకేజీలు చేయించి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారు. ఒత్తిడి తట్టుకోలేక ఆ కాలేజీల్లో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నారాయణ ప్రస్తుతం టెన్త్‌ పేపర్‌ లీకేజీ, అమరావతి ల్యాండ్‌ పూలింగ్‌లో అవినీతి కేసులో కీలక నిందితుడిగా పోలీస్‌ రికార్డుల్లోకెక్కారు. దీంతో ఈ మాజీ మంత్రి అవినీతి, అక్రమాల చరిత్ర చర్చనీయాంశంగా మారింది. 

సాక్షి, నెల్లూరు: పొంగూరు నారాయణకు ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేకున్నా చంద్రబాబు 2014 సంవత్సరంలో ఏకంగా రాష్ట్ర మంత్రి పదవిని కట్టబెట్టారు. అంతేకాకుండా టీడీపీ అమరావతి రాజధాని భూములు వ్యవహారాన్ని అప్పగించారు. రాజధాని ఏర్పాటు ముసుగులో ల్యాండ్‌ పూలింగ్‌లో అక్రమాలు అలాగే ఇన్నర్‌ రింగ్‌రోడ్‌లో అవకతవకలు చేసినట్లు గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. అందులో ఏ2 నిందితుడిగా నారాయణ ఉన్నారు. టెన్త్‌ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఆయన్ను పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. 

ఆది నుంచి వివాదాలే.. 
నారాయణ ఆయన విద్యా సంస్థలపై మొదటి నుంచి వివాదాలున్నాయి. విద్యార్థులపై అధిక ఒత్తిడి తెస్తారనే ఆరోపణలున్నాయి. తమ విద్యాసంస్థల్లో లక్షల మందిని జాయిన్‌ చేసుకుంటారు. కొంచెం బాగా చదివే వారిని ఎంచుకుంటారు. వారి కోసం పరీక్షల సమయంలో పేపర్‌ లీకేజీ చేయించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు తెప్పించి పబ్లిసిటీ చేయించుకోవడం పరిపాటిగా మారిందని అనేకమంది చెబుతున్న మాట. ఆ విద్యాసంస్థల్లో నిర్భంద విద్యతో మానసిక ఒత్తిడికి లోనైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలున్నాయి. గత టీడీపీ హయాంలోనే పదుల సంఖ్యలో విద్యార్థులు బలవన్మరాణానికి పాల్పడ్డారు. మంత్రిగా ఉన్న నారాయణపై ఎలాంటి కేసుల్లేకుండా చేసుకోవడంపై అప్ప›ట్లో ప్రభుత్వంపై ఆరోపణలొచ్చాయి. 

చదవండి: (ఏపీ సీఐడీ అదుపులో మాజీ మంత్రి నారాయణ)

ప్రలోభాలకు గురిచేసి.. 
జిల్లాలో ఉన్న అన్ని విద్యాసంస్థల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు, అలాగే ఎంపిక విద్యార్థులు టాపర్లుగా రాణించేందుకు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. పలు సెంటర్లో ఇన్విజిలేటర్లను ప్రలోభాలకు గురిచేశారని ప్రచారం ఉంది. ఇందుకు గానూ పలువురు విద్యార్థుల నుంచి రూ.5 వేలు చొప్పున వసూలు చేశారని చెబుతున్నారు.  

గుర్తింపు రద్దు చేయాలి 
నెల్లూరు(టౌన్‌): పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బాధ్యులుగా తేలిన నారాయణ విద్యాసంస్థల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు యశ్వంత్‌సింగ్‌ డిమాండ్‌ చేశారు. ఆ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం  జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లీకేజీకి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ధర్నా నిర్వహించిన యశ్వంత్‌సింగ్‌ తదితరులను అరెస్ట్‌ చేసి దర్గామిట్ట పోలీసుస్టేషనుకు తరలించారు.  

చదవండి: (అప్రూవర్‌గా మారిన వైస్‌ ప్రిన్సిపల్‌ గిరిధర్‌.. నారాయణ ప్రోద్బలంతోనే..)

నారాయణ చరిత్ర ఇది.. 
► 1979లో సాధారణ కోచింగ్‌ సెంటర్‌ ప్రారంభం. 
► మూడేళ్లపాటు ట్యూషన్‌ చెప్పుకుంటూ 1983లో నారాయణ స్కూల్, కాలేజీలకు అనుమతులు తెచ్చుకున్నారు. 
► నెల్లూరులోనే స్కూల్, కాలేజీలను నిర్వహించుకుంటూ అనంతరం దేశస్థాయిలోనే 970 బ్రాంచ్‌ల ఏర్పాటు. 
► ఎనిమిది ప్రొఫెషనల్‌ కాలేజీలు, ఒక మెడికల్‌ కాలేజీ, రెండు ఇంజినీరింగ్‌ కాలేజీలు, ఒక డెంటల్‌ కాలేజీ, ఒక నర్సింగ్‌ కాలేజీ, ఒక ఫార్మసీ కాలేజీ ఏర్పాటు చేసుకుని విద్యారంగాన్ని శాసించే స్థాయికి ఎదిగారు.  
► ఇద్దరి భార్యలు, ఇద్దరి కుమార్తెలతో ట్రస్టు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి విద్యను వ్యాపారంగా మార్చుకుని రూ.వేల కోట్లకు అధిపతిగా మారారు. 
► టీడీపీ అధినేత చంద్రబాబుకు బినామీగా ఉంటూ 2014 ఎన్నికల్లో రూ.వందల కోట్లను పార్టీకి ఫండ్‌గా ఇచ్చి మూడు జిల్లాల పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సహకారం అందించారు. 
► 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు తన బినామీ నారాయణకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా అవకాశం కల్పించారు.  

టీడీపీ నేతల డ్రామా 
విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుకున్న  మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌పై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తుంటే టీడీపీ నేతలు మాత్రం అక్రమ అరెస్ట్‌ చేశారంటూ డ్రామా చేశారు. దీంతో జిల్లా వాసులు వారి తీరును అసహ్యించుకుంటున్నారు. జిల్లాలో కార్పొరేట్‌ విద్య పేరుతో మాఫియాగా ఏర్పడి తల్లిదండ్రుల నుంచి అడ్డగోలు దోపిడీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా టెక్నో, ఈ–టెక్నో, ఒలింపియాడ్‌ అంటూ ప్రత్యేక కోర్సులు, ఐఐటీలో ర్యాంకులు అంటూ ప్రతి విద్యార్థి వద్ద రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. పుస్తకాలు, యూనిఫాం పేరుతో ఇంకా వసూలు చేస్తుంటారు. నారాయణ అరెస్ట్‌ను తమ రాజకీయ స్వార్థం కోసం టీడీపీ వాడుకోవడంపై జిల్లావాసులు మండిపడుతున్నారు.   

చంద్రబాబుకు సన్నిహితుడు 
టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న నారాయణ గతంలో ఆ పార్టీ ఆర్థిక వ్యవహారాలు చక్కబెడుతుంటారు. అలాగే విద్యాసంస్థల ఉద్యోగులచే సర్వేలు చేయించి చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడిగా మారాడు. దీంతో  2014లో టీడీపీ అధికారంలోకి రాగానే తనకు బినామీగా ఉన్న నారాయణకు మంత్రి పదవి కట్టబెట్టి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. జిల్లాలో ఎందరో సీనియర్‌ నేతలు ఉన్నా వారిని కాదని నారాయణకు పదవి ఇచ్చారు. 

ఫలితాలను హైజాక్‌ చేస్తున్నారు 
కార్పొరేట్‌ పాఠశాలలు అవ కాశమున్న చోట్ల పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్‌ చేయిస్తూ తమ స్కూళ్ల విద్యార్థులచే అన్ని జవాబులు రాయించి తెలి వైన విద్యార్థులున్న ప్రభుత్వ పాఠశాలల ఫలితాలను హైజాక్‌ చేస్తున్నారు. వారి వ్యాపారం పెంచుకునేందుకు దారుణమైన పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఇటీవల పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాలు లీక్‌ కావడం అందులో భాగమే. ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించాల్సిందే.     
– ఎం.రవిబాబు, టీచర్, యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి, చేజర్ల 

కార్పొరేట్ల వల్ల విద్యావ్యవస్థ నాశనం 
కార్పొరేట్‌ విద్యాసంస్థలు వ్యాపార కోణంలో ఉంటూ విద్యావ్యవస్థను దెబ్బతిసేలా పబ్లిక్‌ పరీక్షలను సైతం తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. రాజకీయ పలుకుబడితో ఎన్నో అరాచకాలు చేసిన కార్పొరేట్‌ విద్యాసంస్థలను ప్రభుత్వం కట్టడి చేయాల్సి ఉంది. ఈ సంస్థల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లోని తెలివైన విద్యార్థులు మానసికక్షోభకు గురవుతున్నారు. దీనికి పుల్‌స్టాఫ్‌ పెట్టాలి. 
– తోపుగుంట మోహన్, హెచ్‌ఎం, చేజర్ల మెయిన్‌ పాఠశాల  

దోషులపై చర్యలు తీసుకోవాలి 
ప్రశ్నపత్రం లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పూర్తిస్థాయిలో విచారణ జరిపి దీనివెనుక ఉన్న దోషులపై కేసులు నమోదు చేయాలి. ఉపాధ్యాయులు తప్పు చేశారంటే నమ్మలేకున్నాం. వారిపై చర్యలు ఉపసంహరించుకోవాలి. భవిష్యత్‌లో ఈ రీతిలో జరగకుండా విద్య, పరీక్ష ప్రణాళికలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. 
– అల్లంపాటి సురేంద్రరెడ్డి, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఏపీటీఎఫ్‌ 

లీకేజీకి పాల్పడడం తప్పే.. 
పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడడం పెద్ద తప్పు. ఈ లీకేజీ వెనుక ఎంతటివారున్నా విచారించి వారిని కఠినంగా శిక్షించాలి. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలి. 
– నాటకం తిరుమలయ్య, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ 

ప్రభుత్వ చర్యలు అభినందనీయం 
పరీక్షల్లో ఎప్పటినుంచో జరుగుతున్న లీకేజీ బాగోతాన్ని ఇప్పటి ప్రభుత్వం బయటపెట్టింది. గతంలో జరిగినా అప్పటి ప్రభుత్వాలు మిన్నకున్నాయి. ఇప్పటి ప్రభుత్వం నిష్పక్షపాతంగా శిక్షించే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటుమాడుతున్న ప్రయివేట్‌ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలి. 
 – కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ శాఖ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement