అద్దె బ్యాచ్‌ దిగింది ! | Yellow media is an attempt to convince locals by reading news in the newspapers | Sakshi
Sakshi News home page

అద్దె బ్యాచ్‌ దిగింది !

Published Sat, Jan 13 2024 5:08 AM | Last Updated on Sat, Jan 13 2024 9:01 AM

Yellow media is an attempt to convince locals by reading  news in the newspapers - Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు/తిరుపతి:  ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలకు తెరతీస్తోంది. ఎన్నడూ లేని విధంగా నలుగురైదుగురు ఉన్న చోటకెళ్లి టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతూ ఆ పార్టీ గెలుస్తోందని అసత్య ప్రచారాలు కల్పిస్తూ ‘చీప్‌ పాలిట్రిక్స్‌కు’ దిగజారిపోయింది. రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల్లో విజయం కోసం వ్యూహాలు రచించడం సహజం. ప్రజలకు చేసిన మంచి పనులను ఎన్నికల సమయంలో చెప్పుకోవడం, మరోసారి అధికారంలోకి వస్తే మరింత మంచి చేస్తామని ప్రకటించడం పరిపాటి.

అయితే ఇందుకు భిన్నంగా ప్రస్తుతం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఏవగింపుగా మారింది. ప్రజాభిమానం కోల్పోయి రోజురోజుకూ పాతాళంలోకి దిగజారిపోయిన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మౌత్‌ పబ్లిíసిటీ పేరుతో అడ్డదారులు తొక్కుతోంది. ప్రతి నియోజకవర్గంలో భారీ స్థాయిలో ఎల్లో కిరాయి మూకలను అద్దెకు ఏర్పాటు చేసుకుని టీ దుకాణాలు, సెలూన్‌ల వద్ద తిష్టవేసి అధికార పక్షంపై అసత్య ప్రచారం చేయించుకునే దుస్థితికి వచ్చింది.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీయే లక్ష్యంగా సీఎం జగన్‌ మోహన్‌రెడ్డిని దూషించడమే పనిగా పెట్టుకుని అద్దెబ్యాచ్‌ పట్టణాల్లో తిరుగుతోంది. టీడీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యం సహకారంతో విద్యార్థులను రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి కళాశాల నుంచి కొంత మంది విద్యార్థులను ఎంపిక చేసుకుని వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించినట్లు తెలిసింది.

అద్దె బ్యాచ్‌కు శిక్షణ ఇచ్చి..
క్షేత్రస్థాయిలోకి వెళ్లి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను టార్గెట్‌ చేయటంతో పాటు ముఖ్యంగా సీఎం వైఎస్‌ జగన్‌పై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయాలని ఆదేశాలిచ్చారు. శిక్షణా తరగతులను మొదటి, రెండు, మూడు బ్యాచ్‌లుగా విభజించి ఖమ్మం జిల్లాలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మొదటి విడతగా నియోజక వర్గానికి ఇద్దరు విద్యార్థుల చొప్పున రంగంలోకి దింపారు. వీరిపైన జిల్లాకు ఒక కో ఆర్డినేటర్‌ని నియమించారు. ఈ ఇద్దరు రోజూ ఎక్కడెక్కడ తిరిగారు, ఏం చేశారు? అక్కడ పరిస్థితులు ఏంటి అనేది జిల్లా కో ఆర్డినేటర్‌కి నివేదిక రూపంలో అందిస్తారు.

దానిని  అమరావతిలో ఉండే టీం లీడర్‌కి పంపుతారు. దాదాపు 5 వేల మందికి శిక్షణ ఇచ్చి నగర, పట్టణ ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. లోకల్‌గా కొంతమందిని రిక్రూట్‌ చేసుకుని వారితో సమన్వయం చేసుకుంటూ అద్దె బ్యా చ్‌ మౌత్‌ పబ్లిíసిటీ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల నెల్లూరు రూరల్‌ ప్రాంతంలో అద్దె బ్యాచ్‌ టీ దుకాణాల వద్ద చేస్తున్న అసత్య ప్రచారాన్ని కొందరు స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఆ బ్యాచ్‌ ఆ ప్రాంతాన్ని వదిలి పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది.

రెండు, మూడు విడతల్లో మండల, సచివాలయాలు..
మొదటి విడత కార్పొరేషన్లు, మున్సి­పాలిటీలు పూర్తయ్యాక మరొక బ్యాచ్‌ రంగంలోకి దిగుతుంది. సంక్రాంతి తరువాత మండల, సచివాలయ కేంద్రాలను ఎంపిక చేసు­కోనున్నట్లు తెలిసింది. పట్టణాలు, నగరాలు అయితే అద్దె బ్యాచ్‌ ఎవరనేది ఎవ్వరూ ప్రశ్నించరు. కాబట్టి వారికి ఆ బాధ లేదు. మండల, సచివాలయ కేంద్రాలకు వెళ్లే సమయంలో స్థానిక నాయకుల సహకారంతో రంగంలోకి దిగనున్నారు.

ఇప్పటికే స్థానిక నాయకులకు అధిష్టానం నుంచి ఆదేశాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. స్థానిక నాయకులతో కలిసి పర్యటిస్తారు. ఒక అద్దె వ్యక్తి స్థానికుడు ఒకరు ఉంటారు. అలా ఇద్దరికి ఇద్దరు పర్యటిస్తారు. టీ కొట్లు, చిన్న బంకుల వద్ద కూర్చొని అబద్దపు ప్రచారాలకు పదును పెడుతారు. స్థానిక టీడీపీ కార్యకర్త ప్రభుత్వం గురించో, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ గురించో ప్రస్తావన చేస్తారు. అద్దె వ్యక్తి ‘అవునంటన్నా. మా బంధువుకి అలా జరిగిందంట, వైఎస్సార్‌సీపీ వాళ్లు ఇలా చేశారంట’ అని శృతి కలుపుతాడు. నలుగురు కలిసి ఒక అబద్దాన్ని నిజం చేసేందుకు తీవ్రంగానే కృషి చేయటానికి పక్కా ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు సమాచారం.

మూడో బ్యాచ్‌లో బరి తెగింపుడే
ఇక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించాక మూడవ బ్యాచ్‌ రంగంలోకి దిగే పనిలో ఉంది. ఈ బ్యాచ్‌ అన్నింటికీ తెగించిన వారికి ప్రస్తుతం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. షెడ్యూల్‌ వచ్చాక అబద్దాలు ప్రచారం చేయటం కంటే.. స్థానికంగా గొడవలు సృష్టించేందుకే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. మద్యం దుకాణాల వద్ద, లేదా మద్యం సేవించే ప్రాంతాలను ఎంపిక చేసుకుని స్థానికుల మధ్య గొడవలు పెట్టటం లేదా వీరే స్థానికులను రెచ్చగొట్టి విధ్వంసాలకు లాగటమే వీరి స్కెచ్‌గా తెలుస్తోంది. మద్యంపై విషప్రచారం చేయటం, స్థానికులను కొట్టడం, లేదా వారి వద్ద వీరు దెబ్బలు తినటమే ప్రధాన లక్ష్యంగా రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.

ఘోర పరాభవాన్ని గుర్తెరిగే..
గత ఎన్నికల్లో మాదిరిగా ఘోర పరాభవాన్ని గుర్తెరిగే టీడీపీ ఇలాంటి నీతిమాలిన చర్యలకు పూనుకొంటోంది. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాభివృద్ధితో ఆ ప్రభుత్వానికి ప్రజల్లో పరపతి పెరిగింది. మరోసారి కూడా వైఎస్సార్‌సీపీ వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని ఒంటరిగా ఎదుర్కొనే సత్తా లేక అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఎన్నికల బరిలోకి దిగే ప్రయతాన్ని టీడీపీ చేస్తోంది.అయినా ప్రజల్లో టీడీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో మౌత్‌ పబ్లిíసిటీని నమ్ముకొని దానినే  కార్యరూపంలోకి తీసుకొచ్చారు.  

టీ స్టాళ్లు, సెలూన్లే వేదికలు
టీడీపీ కిరాయి మూకలు నగరాలు, పట్టణా ల్లోని టీ దుకాణాలు, సెలూన్లను వేదికగా చేసుకుంటున్నాయి. సాధారణ వ్యక్తుల్లా వెళ్లి అక్కడే తిష్ట వేస్తారు. వారి చేతిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉంటుంది. ఆ పత్రికలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వార్త లను చదువుతున్నట్లు నటిస్తారు. వార్త ల సారాంశంపై పక్కనున్న వారితో చర్చ పెడతారు. ఆపై ఇదేం ప్రభుత్వం, ఎక్కడ చూసినా ప్రజలు ఛీదరించుకుంటున్నారు. ఎక్కడా రోడ్లు వేయలేదు, అభివృద్ధి జరగలేదు, రాష్ట్రం అప్పులు చూస్తే కొండలా పెరిగిపోతున్నాయి, సంక్షేమం అంటూ బటన్లు నొక్కి తిరిగి ధరలు పెంచి మన నుంచి డబ్బులు లాగేసుకుంటున్నారంటూ పెదవి విరుస్తారు.

ఇలా  ఎల్లో కిరాయి మూ కలు తమ నటనను ప్రదర్శిస్తారు. అంతే కాకుండా లోకల్‌ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేకు టికెట్‌ రాదని, ఆయన అవినీతి చేశాడని.. టీడీపీలోకి వలసలు జోరుగా జరుగుతున్నా­యంటూ భజన ప్రారంభిస్తారు. టీడీపీ, జనసేన జోడీ బాగుంది.. ఉత్తరాంధ్రలో అంతా టీడీపీ, జనసేన కూటమికే ఎక్కువ సీట్లు వస్తాయని, ఈ దఫా ఈ కూటమికే అధికారం వస్తుందని పదేపదే చెబుతారు. ఆ షాపుల వద్ద జనం ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే అక్కడ తిష్ట వేసి ఇలా తమ నటనను ప్రదర్శిస్తారు. దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా నేర్పరితనంతో వ్యవహరిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement