సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నారాయణ విద్యా సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులు టీడీపీ ఎన్నికల ఉచ్చులో ఇరుక్కున్నారు. తమ విద్యాసంస్థల అధినేత, టీడీపీకి చెందిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ రాజకీయంలో సమిధలైపోతున్నారు. వారి చేత నారాయణ ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇలా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న నారాయణ సిబ్బంది, ఉపాధ్యాయులకు ప్రజలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగిస్తున్నారు.
మూడురోజుల క్రితమే నెల్లూరు నగరం మూలాపేట డివిజన్‌లో ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్న నారాయణ సంస్థ ఉద్యోగినికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తాజాగా మంగళవారం నగరంలోనే 42వ డివిజన్ మన్సూర్‌నగర్‌లో ఇదే తరహాలో నారాయణ విద్యా సంస్థల ఉపాధ్యాయుడు ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో వ్యక్తిగత సమాచారం సేకరిస్తుండగా స్థానికులు ఆగ్రహించి అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
ఎన్ టీంగా ఏర్పాటు
నారాయణ టీడీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ఆయన 2024 ఎన్నికల్లో నెల్లూరు నుంచి మరోసారి బరిలోకి దిగేందుకు సమాయత్తం అవుతున్నారు. నాలుగున్నరేళ్ల పాటు నెల్లూరుకు ముఖం చాటేసిన ఆయనపై టీడీపీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఆయన కోసం పనిచేయడానికి టీడీపీ నేతలెవరూ ముందుకు రావడంలేదు. దీంతో తన విద్యా సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులను రంగంలోకి దింపుతున్నారు.
దాదాపు 150 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులతో నారాయణ టీం (ఎన్ టీం)గా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆ బృందంలోని వారితో నెల్లూరు నగరంలో ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారం తీసుకుంటున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా సమాచారం, వారి మొబైల్‌కు వచ్చే ఓటీపీని కూడా అడుగుతుండడంతో స్థానికుల్లో ఆందోళన ఏర్పడింది. తమ ఓట్లు తొలగిస్తారని స్థానికులు వారిని అడ్డుకుంటున్నారు. నెల్లూరు నగరంలో మూడు రోజుల్లోనే ఇద్దరు ఉపాధ్యాయులు దేహశుద్ధి చేయించుకొన్నారు.
ఇదేం ఖర్మ నారాయణా.. అంటున్న ఉద్యోగులు
నారాయణ విద్యా సంస్థల్లో అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులుగా అనేక మంది పనిచేస్తున్నారు. 2014 ఎన్నికల వరకు నారాయణ టీడీపీకి ఆర్థికంగా తోడ్పాటు అందిçస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు బినామీగా వ్యవహరించేవారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో నారాయణను చంద్రబాబు ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి ఇచ్చారు.
2019 ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి నారాయణ సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులను రాజకీయ ఉచ్చులోకి దింపుతున్నారు. ఒకవేళ ఎవరైనా నిరాకరిస్తే ఏదో ఒక సాకుతో ఉద్యోగం నుంచి తొలగించడం.. లేదా దూర ప్రాంతాలకు బదిలీ చేయడం చేస్తున్నట్లు ఓ ఉద్యోగి వెల్లడించారు. ఇప్పుడు ఉద్యోగులు ప్రజల చేతిలో తన్నులు తింటున్నారు. మాకు ఇదేం ఖర్మ అంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment