నారాయణకు చుక్కెదురు  | Chittoor District Court gives shock to TDP Leader Narayana | Sakshi
Sakshi News home page

నారాయణకు చుక్కెదురు 

Published Tue, Nov 1 2022 2:35 AM | Last Updated on Tue, Nov 1 2022 2:35 AM

Chittoor District Court gives shock to TDP Leader Narayana - Sakshi

చిత్తూరు అర్బన్‌: టీడీపీ నేత, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణకు చిత్తూరు జిల్లా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల సమయంలో ప్రశ్నపత్రాల మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణకు మేజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసింది. ఈ మేరకు చిత్తూరులోని 9వ అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నెల 30లోపు నారాయణ కోర్టులో లొంగిపోవాలని న్యాయమూర్తి శ్రీనివాసులు ఆదేశాలిచ్చారు. నారాయణ కోర్టులో లొంగిపోయిన అనంతరం ఆయనను జుడీషియల్‌ రిమాండ్‌కు తరలించాలని తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 27న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో తెలుగు కాంపోజిట్‌ ప్రశ్నపత్రాన్ని తిరుపతి నారాయణ పాఠశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎన్‌.గిరిధర్‌రెడ్డి ‘చిత్తూరు టాకీస్‌’ అనే వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చిత్తూరు డీఈవో పురుషోత్తం ఇచ్చిన ఫిర్యాదుతో వన్‌టౌన్‌ సీఐ నరసింహరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఏప్రిల్‌ 29న తిరుపతి జిల్లా చంద్రగిరిలోని శ్రీకృష్ణారెడ్డి చైతన్య ప్రిన్సిపాల్‌ పి.సురేష్, తిరుపతి ఎన్‌ఆర్‌ఐ అకాడమీ ఆంగ్ల ఉపాధ్యాయుడు కె.సుధాకర్, తిరుపతి చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్‌ ఆరిఫ్, డీన్‌ కె.మోహన్, గిరిధర్‌రెడ్డిలతోపాటు గంగాధర నెల్లూరు మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పవన్‌కుమార్‌రెడ్డి, బి.సోమును అరెస్టు చేశారు. వీరిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు మినహా మిగిలినవాళ్లంతా గతంలో నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసినవాళ్లే కావడం గమనార్హం. గిరిధర్‌రెడ్డి, సుధాకర్, సురేష్, పవన్‌కుమార్‌రెడ్డిలను మే 9న కస్టడీకు తీసుకుని విచారించారు.

టీడీపీ నేత నారాయణ ఆదేశాలతోనే తాము ఇదంతా చేసినట్లు నిందితులు అంగీకరించారు. నారాయణ ఆదేశాలతో ఆ సంస్థ సిబ్బంది మరికొందరు కార్పొరేట్‌ విద్యాసంస్థల ప్రతినిధులతో కలిసి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారని వెల్లడైంది. దీంతో నారాయణను మే 10న ఐపీసీ 5 రెడ్‌విత్‌ 8, 10 ఎగ్జామినేషన్‌ మాల్‌ప్రాక్టీస్‌ యాక్టు 408, 409, 201, 120 (బి) ఐపీసీ, 65 ఆఫ్‌ ఐటీ యాక్ట్‌ సెక్షన్ల కింద అరెస్టు చేశారు.

ఈ వ్యవహారంలో చిత్తూరులోని నాలుగో అదనపు ఇన్‌చార్జ్‌ మేజిస్ట్రేట్‌ సులోచనరాణి.. నారాయణకు బెయిల్‌ మంజూరు చేశారు. దీనిపై పోలీసులు చిత్తూరు జిల్లా కోర్టులో సవాలు చేశారు. ఇదే కేసులో మిగిలిన నిందితులకు జుడీషియల్‌ రిమాండ్‌కు ఆదేశించారని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తాజాగా తీర్పును వెలువరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement