Question papers leakage
-
Parliament Opposition leaders: బయట పేపర్.. లోపల వాటర్ లీకేజీ
న్యూఢిల్లీ: ఢిల్లీని ముంచెత్తిన వరుణుడు పార్లమెంట్ వేదికగా విపక్షాలకు కొత్త విమర్శనాస్త్రాన్ని అందించాడు. గత ఏడేళ్లలో 15 రాష్ట్రాల పరిధిలో ఏకంగా పలురకాలైన 70 పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీకవడంపై కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం విదితమే. గురువారం పడిన వర్షాలకు నూతన పార్లమెంట్ భవంతిలోని లాబీ పైకప్పు నుంచి వర్షపు నీరు ధారగా పడుతోంది. దీంతో పేపర్ లీకేజీలను వాటర్ లీకేజీతో ముడిపెడుతూ విపక్షాలు భవన నిర్మాణ పటిష్టతను ఎత్తిచూపాయి. ‘‘ పేపర్ లీకేజీ బయట. వాటర్ లీకేజీ లోపల. రాష్ట్రపతి విచ్చేసినపుడే వినియోగించే లాబీ పైకప్పు నుంచి ధారగా పడుతున్న వర్షపు నీరు.. భవంతి ఏ మేరకు పటిష్టంగా ఉందనే చేదు నిజాన్ని చాటుతోంది. ఈ విషయమై లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడతా’ అని కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు మాణిక్కం ఠాకూర్ ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. వర్షపు నీటి కోసం బకెట్ పట్టడం, అక్కడి వారంతా చూస్తూ వెళ్తున్న వీడియోను పోస్ట్‌చేశారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సైతం విమర్శించారు. ‘‘ ఈ భవంతి కంటే పాత భవనమే నయం. ఎంపీలంతా మాట్లాడుకోవడానికి వర్షపు నీరు పడని చోటు ఉండేది. వేల కోట్లతో మళ్లీ కొత్త భవంతి రిపేర్లు పూర్తయ్యేదాక ఎంపీలు పాత భవంతికి మారితే మంచిదనుకుంటా’ అని వ్యంగ్య పోస్ట్ చేశారు. గాజు డోమ్‌ల మధ్య ప్రాంతాలను అతికించే జిగురు జారిపోవడంతో అక్కడి నుంచి మాత్రమే నీరు లీక్ అయిందని, వెంటనే సమస్యను పరిష్కరించామని లోక్‌సభ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. -
కాళేశ్వరం, మిషన్ భగీరథపై న్యాయవిచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పులకుప్పలా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులను చేపట్టారని, అనవసరమైన ఖర్చులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఆగం చేశారన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో శనివారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని జీవన్‌రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక స్థితిని ప్రస్తావించారు. సాంకేతిక పరిజ్ఞానం అంతంతమాత్రంగా ఉన్న రోజుల్లో నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని, కానీ అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రస్తుత రోజుల్లో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు లోపభూయిష్టంగా మారడం విడ్డూరమే అని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడంతో పాటు అన్నారం బ్యారేజీలో సైతం లీకేజీలు ఏర్పడటం విచారకరమన్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణ పనులకు సంబంధించి ఎల్అండ్టీ తొలుత చేపడుతుందని చెప్పినప్పటికీ... ఇప్పుడు చేయనని అంటోందని చెప్పారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణంపై న్యాయ విచారణ చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్లు ఖర్చు చేసిందని, అప్పటికే చాలా గ్రామాల్లో మంచినీటి సరఫరా వ్యవస్థ ఉన్నప్పటికీ వృథా ఖర్చులతో మళ్లీ మిషన్ భగీరథ పనులు చేపట్టి ప్రజాధనాన్ని నీటిపాలు చేశారని విమర్శించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే నిరుద్యోగులు హర్షించేవారని, కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు మానసికంగా ఆందోళన చెందారన్నారు. జీవో 317 ద్వారా ఉద్యోగులు నష్టపోయారని, వారికి ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రంగా ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలను కలిసే సీఎం రేవంత్: నర్సిరెడ్డి పదేళ్ల కేసీఆర్ పాలనలో సామాన్యుడిని సీఎం కలిసే పరిస్థితే ఉండేది కాదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వ్యాఖ్యానించారు. మండలిలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆయన బలపర్చారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ తను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక దాదాపు 30 సార్లు కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయతి్నంచినా అవకాశం దక్కలేదని, ఒకసారి అవమానానికి సైతం గురయ్యానన్నారు. కానీ రేవంత్‌రెడ్డి సీఎం అయిన మరుసటిరోజే ప్రజాభవన్‌లో కలిశానని చెప్పారు. ప్రజలను కలిసి వారి సమస్యలు వినే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారని, ఈ ఐదేళ్ల కాలంలో ఇదే తరహాలో పాలన సాగాలని ఆయన ఆకాంక్షించారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి లెక్కల్లేవు: ఉత్తమ్ బీఆర్ఎస్ పాలనలో పౌరసరఫరాల విభాగాన్ని అల్లకల్లోలం చేశారని, ఆ శాఖ వద్ద 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి లెక్కల్లేవని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ ధాన్యం ఉందా? లేదా? ఉంటే ఎక్కడుంది? అనే అంశాలకు కాగితాల్లో ఎక్కడా వివరాలు లేకపోవడం గమనార్హమని, దీనిపై సమగ్ర పరిశీలన ప్రారంభించినట్లు మంత్రి వివరించారు. పదేళ్లలో ఈ శాఖ రూ.56 వేల కోట్ల నష్టాల్లో ఉందని చెప్పారు. రేషన్ బియ్యం చాలాచోట్ల లబ్ధిదారులకు చేరడం లేదని, దీనిపై మరింత లోతైన చర్యలు చేపడతామన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై బీఆర్ఎస్ సభ్యులు మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచి్చన ప్రతి హామీని నెరవేర్చాలని, మానవహక్కుల పరిరక్షణపై ప్రభుత్వం ప్రకటన హర్షనీయమని, భావప్రకటన స్వేచ్ఛపై సీఎం చేస్తున్న ప్రకటనలు అమలు జరిగేలా చూడాలని అన్నారు. -
పరీక్ష కేంద్రాల పరిసరాల టవర్లపై నిఘా
సాక్షి, హైదరాబాద్: ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజా పరిస్థితిపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి సమీక్షించారు. ఇప్పుడున్న భద్రతతోపాటు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. విద్య, రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో జిల్లా కలెక్టర్లకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇక నుంచి జరిగే పరీక్షల్లో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాస్థాయిలో చురుకైన, సమర్థులైన అధికారులనే ఈ కార్యక్రమానికి ఎంపిక చేయాలని విద్యాశాఖకు ప్రభుత్వం సూచించింది. దీంతో పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయం అన్ని జిల్లాల నుంచి కొంతమంది అధికారుల పేర్లు తెప్పించింది. పరీక్ష కేంద్రాల సమగ్ర సమాచారం తెప్పించుకుని పరిశీలించింది. ఎక్కడ ఎలాంటి చర్యలు చేపట్టాలనేదానిపై కసరత్తు చేసింది. ప్రత్యేక బృందాలతో రాష్ట్రస్థాయి నెట్వర్క్ ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రశ్నపత్రాల చేరవేత నుంచి జవాబుపత్రాలను మూల్యాంకన కేంద్రాలకు తరలించే వరకూ గట్టి నిఘా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు, పోలీసు అధికారులు సాంకేతిక కోణంలో నిఘాను పెంచుతున్నారు. అనుమానిత కేంద్రాల వద్ద సెల్‌ఫోన్ టవర్ల ద్వారా అవసరమైన సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. స్పెషల్ బ్రాంచ్‌కు అందే కీలకమైన సమాచారం విశ్లేషించి, పరీక్ష కేంద్రాల పరిసరాల్లో సెల్‌ఫోన్ టవర్స్‌పై నిఘా పెంచి కాల్స్‌ను గుర్తించాలని నిర్ణయించారు. లీకేజీ వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో పరీక్షలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సీఎస్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రతీ జిల్లాలో ప్రత్యేక బృందాలు ♦ టెన్త్ పరీక్షల కోసం ప్రతీ జిల్లాలో ప్రత్యేక అధికారుల బృందాన్ని గురువారం ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో రెవెన్యూ ఉన్నతాధికారి దీనికి నేతృత్వం వహిస్తారు. పరీక్ష కేంద్రాలు, అందులో పనిచేస్తున్న సిబ్బంది, ఫ్లయింగ్ స్వా్కడ్స్, ఇన్విజిలేటర్లపై వీరి ఆజమాయిషీ ఉంటుంది. జిల్లా పరిధిలో పరీక్షల కేంద్రాలకు వీరి ద్వారా అవసరమైన సమాచారం వెళ్తుంది. తనిఖీ బృందాలకు ఎప్పటికప్పుడు ఆదేశాలిచ్చే వ్యవస్థను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారుల ద్వారా తెప్పించుకునే ప్రత్యేక అధికారం వీరికి ఉంటుంది. ♦ తహసీల్దార్, ఎంపీడీఓలు ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తారు. జిల్లాల్లో వివిధ జోన్లుగా విభజించి వీరికి బాధ్యతలు అప్పగించారు. పరీక్ష కేంద్రం నుంచి సమాచారం తెలుసుకుని, అవసరమైన సంకేతాలివ్వడం, అనుమానం ఉంటే తక్షణమే పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం వీరి బాధ్యత. ♦ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సిట్టింగ్ స్వా్కడ్స్ ఉండగా లీకేజీల నేపథ్యంలో మరికొన్ని ప్రత్యేక స్వా్కడ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో విద్యాశాఖ జిల్లాస్థాయి అధికారులుంటారు. డివిజన్ల వారీగా వీరు విధులు నిర్వర్తిస్తారు. మరోవైపు పోలీసు శాఖ నుంచీ ప్రత్యేక ఫ్లయింగ్ స్వా్కడ్ ఏర్పాటు చేశారు. ఇవి జిల్లాస్థాయిలో బృందాలుగా వెళ్లి పనిచేస్తాయి. సమస్యాత్మక కేంద్రాల విశ్లేషణ రాష్ట్రంలోని 2,652 పరీక్ష కేంద్రాలను వివిధ కేటగిరీలుగా విభజించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక, సాధారణ కేంద్రాల జాబితాను తయారు చేశారు. రాజకీయంగా సమస్యలున్న ప్రాంతాల్లోని కేంద్రాల వివరాలను ప్రత్యేకంగా సేకరించారు. అక్కడ అనుమానాస్పద కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా? కొత్త వ్యక్తులు వస్తున్నారా? అనే వివరాలు సేకరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నిఘా ఏర్పాటు చేస్తున్నట్టు విద్యాశాఖ అదనపు డైరెక్టర్ లింగయ్య తెలిపారు. -
మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, అమరావతి: పదవ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో తనకు బెయిల్ మంజూరు చేస్తూ మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సెషన్స్ కోర్టులో పోలీసులు దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌కు ఎలాంటి విచారణార్హత లేదంటూ నారాయణ విద్యా సంస్థల అధినేత, టీడీపీకి చెందిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ చేసిన వాదనను హైకోర్టు తోసిపుచి్చంది. సెషన్స్ కోర్టు ముందు పోలీసులు రివిజన్ పిటిషన్ దాఖలు చేయడం సరైందేనని, ఆ పిటిషన్‌కు విచారణార్హత ఉందని హైకోర్టు స్పష్టంచేసింది. అయితే, నారాయణకు మేజి్రస్టేట్ ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దుచేసింది. సెషన్స్ కోర్టు కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండానే మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను రద్దుచేసిందని తెలిపిన హైకోర్టు, తిరిగి కేసు పూర్వాపరాలన్నింటినీ విచారించి వాటి ఆధారంగా నిర్ణయం వెలువరించాలని సెషన్స్ కోర్టును ఆదేశించింది. ఇందుకు నాలుగు వారాల గడువు విధించింది. ఈ రివిజన్ తేలేంత వరకు నారాయణపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులకు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు మంగళవారం తీర్పు వెలువరించారు. అసలు ఏం జరిగిందంటే.. పదవ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో నారాయణను అరెస్టుచేసిన పోలీసులు అతన్ని చిత్తూరు మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే, నారాయణ రిమాండ్‌ను మేజిస్ట్రేట్ తిరస్కరిస్తూ ఉత్తర్వులిచ్చారు. తద్వారా నారాయణ బెయిల్‌పై విడుదలయ్యారు. దీనిపై పోలీసులు సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సెషన్స్ కోర్టు.. నారాయణకు బెయిల్ ఉత్తర్వులను రద్దుచేసి ఆయన కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో చిత్తూరు సెషన్స్ కోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ నారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్‌రావు విచారణ జరిపారు. అవి బెయిల్ ఉత్తర్వులు కాదు: అదనపు ఏజీ నారాయణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ.. బెయిల్‌ను రద్దుచేయాలని కోరుతూ సెషన్స్ కోర్టులో పోలీసులు దాఖలుచేసిన రివిజన్ పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులు రిమాండ్‌ను తిరస్కరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులే తప్ప బెయిల్ మంజూరు చేసిన ఉత్తర్వులు కాదన్నారు. అలాగే, రిమాండ్‌ను తిరస్కరిస్తూ మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులు తాత్కాలిక ఉత్తర్వులు కాదని, అందువల్ల ఆ ఉత్తర్వులపై దాఖలు చేసే రివిజన్ పిటిషన్‌కు విచారణార్హత ఉందన్నారు. నారాయణపై నమోదు చేసిన ఐపీసీ సెక్షన్–409 చెల్లదంటూ రిమాండ్ సమయంలోనే మేజి్రస్టేట్ తేల్చేశారని, తద్వారా ఓ మినీ ట్రయల్ నిర్వహించారని అదనపు ఏజీ వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్‌రావు మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. అదనపు ఏజీ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి మేజిస్ట్రేట్ రిమాండ్‌ను తిరస్కరించినప్పుడు దానిపై సెషన్స్ కోర్టులో రివిజన్ దాఖలు చేయవచ్చునని, దానికి విచారణార్హత ఉందన్న అదనపు ఏజీ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. అయితే, పోలీసులకు తమ వాదన వినిపించే అవకాశం మేజిస్ట్రేట్ కోర్టు ఇవ్వలేదని, అందువల్ల నారాయణ రిమాండ్‌ను తిరస్కరిస్తూ మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులను రద్దుచేస్తున్నట్లు సెషన్స్ జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొనడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. కానీ, మేజిస్ట్రేట్ ముందు వాదనలు వినిపించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) నిరాకరించారని, దీంతో ప్రభుత్వం పీపీపై చర్యలకు ఉపక్రమించిందని న్యాయమూర్తి గుర్తుచేశారు. అంతేకాక.. మేజిస్ట్రేట్ తన ముందున్న ఆధారాలను బట్టే నారాయణ రిమాండ్‌ను తిరస్కరించారా? అన్న విషయాన్ని కూడా సెషన్స్ కోర్టు పరిశీలించలేదన్నారు. అందువల్ల నారాయణ రిమాండ్‌ను తిరస్కరిస్తూ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేస్తున్నట్లు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. మేజి్రస్టేట్ ఇచ్చిన ఉత్తర్వుల తప్పొప్పులపై ఇరుపక్షాలు వాదనలు వినిపించాయని, అయితే.. ఆ విషయాన్ని తేల్చాల్సింది సెషన్స్ కోర్టే తప్ప హైకోర్టు కాదన్నారు. అందువల్ల సెషన్స్ కోర్టు తిరిగి ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి మేజిస్ట్రేట్ ఉత్తర్వుల సంగతి తేల్చాలని స్పష్టంచేశారు. చదవండి: (దగుల్బాజీ రామోజీ తప్పు చేస్తే ప్రశ్నించకూడదా?: మంత్రి కాకాణి) -
నారాయణకు చుక్కెదురు
చిత్తూరు అర్బన్: టీడీపీ నేత, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణకు చిత్తూరు జిల్లా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల సమయంలో ప్రశ్నపత్రాల మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణకు మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసింది. ఈ మేరకు చిత్తూరులోని 9వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30లోపు నారాయణ కోర్టులో లొంగిపోవాలని న్యాయమూర్తి శ్రీనివాసులు ఆదేశాలిచ్చారు. నారాయణ కోర్టులో లొంగిపోయిన అనంతరం ఆయనను జుడీషియల్ రిమాండ్‌కు తరలించాలని తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో తెలుగు కాంపోజిట్ ప్రశ్నపత్రాన్ని తిరుపతి నారాయణ పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ఎన్.గిరిధర్‌రెడ్డి ‘చిత్తూరు టాకీస్’ అనే వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చిత్తూరు డీఈవో పురుషోత్తం ఇచ్చిన ఫిర్యాదుతో వన్‌టౌన్ సీఐ నరసింహరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏప్రిల్ 29న తిరుపతి జిల్లా చంద్రగిరిలోని శ్రీకృష్ణారెడ్డి చైతన్య ప్రిన్సిపాల్ పి.సురేష్, తిరుపతి ఎన్ఆర్ఐ అకాడమీ ఆంగ్ల ఉపాధ్యాయుడు కె.సుధాకర్, తిరుపతి చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ ఆరిఫ్, డీన్ కె.మోహన్, గిరిధర్‌రెడ్డిలతోపాటు గంగాధర నెల్లూరు మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పవన్‌కుమార్‌రెడ్డి, బి.సోమును అరెస్టు చేశారు. వీరిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు మినహా మిగిలినవాళ్లంతా గతంలో నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసినవాళ్లే కావడం గమనార్హం. గిరిధర్‌రెడ్డి, సుధాకర్, సురేష్, పవన్‌కుమార్‌రెడ్డిలను మే 9న కస్టడీకు తీసుకుని విచారించారు. టీడీపీ నేత నారాయణ ఆదేశాలతోనే తాము ఇదంతా చేసినట్లు నిందితులు అంగీకరించారు. నారాయణ ఆదేశాలతో ఆ సంస్థ సిబ్బంది మరికొందరు కార్పొరేట్ విద్యాసంస్థల ప్రతినిధులతో కలిసి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారని వెల్లడైంది. దీంతో నారాయణను మే 10న ఐపీసీ 5 రెడ్‌విత్ 8, 10 ఎగ్జామినేషన్ మాల్‌ప్రాక్టీస్ యాక్టు 408, 409, 201, 120 (బి) ఐపీసీ, 65 ఆఫ్ ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో చిత్తూరులోని నాలుగో అదనపు ఇన్చార్జ్ మేజిస్ట్రేట్ సులోచనరాణి.. నారాయణకు బెయిల్ మంజూరు చేశారు. దీనిపై పోలీసులు చిత్తూరు జిల్లా కోర్టులో సవాలు చేశారు. ఇదే కేసులో మిగిలిన నిందితులకు జుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించారని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తాజాగా తీర్పును వెలువరించింది. -
‘లీక్ చేసేది వీళ్లే.. గందరగోళం చేసేది వీళ్లే’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ ఉన్నాడని ప్రాథమిక ఆధారాలు ఉన్న తర్వాతే ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. నారాయణ అరెస్ట్‌పై టీడీపీ చేస్తున్న రాద్దాంతాన్ని అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు.. ఆధారాలతో సహా అరెస్ట్ చేస్తే దీనిపై టీడీపీ గందరగోళం ఏమిటో అర్థం కావడం లేదని మండిపడ్డారు. ‘లీక్ చేసేది వీళ్లే.. గందరగోళం చేసేది వీళ్లే. రాష్ట్రంలో జరిగే చాలా విషయాల్లో ఇలానే చేస్తున్నారు. వాళ్లేమో లీక్ చేయొచ్చు...యాక్షన్ మాత్రం తీసుకోవద్దా...?, నిర్వహణ లోపం ఏమిటి..? నారాయణ స్కూల్ కి పరీక్షా పత్రం ఇవ్వొద్దంటారా..?, మీకు నెంబర్ వన్ ఎలా వస్తుంది..? ఇలాంటి లీక్‌ల వల్ల నంబర్‌వన్ ర్యాంక్ వస్తుంది. విచారణ తర్వాతే నారాయణను అదుపులోకి తీసుకున్నారు. నారాయణ కాలేజీ ప్రిన్సిపల్ స్టేట్మెంట్ తర్వాతే విషయం బయటకొచ్చింది. పేపర్లు లీక్ చేసి డబ్బు సంపాదించుకుంటున్నారు.పేపర్ లీకేజీల వల్లే నారాయణ విద్యాసంస్థలకు నంబర్‌వన్ స్థానం. పేపర్ లీక్ వ్యవహారంలో నారాయణ ఉన్నారని ప్రాథమికంగా నిర్థారించారు. వాళ్లేమో లీక్ చేయొచ్చు.. యాక్షన్ మాత్రం తీసుకోవద్దా?, నారాయణను అరెస్ట్ చేయాలని మాకేంటి...?, ఈ స్కాంలో నారాయణ ఉన్నాడని ప్రాథమిక ఆధారాలతోనే అరెస్ట్ చేశారు. జనం మాత్రం జరుగుతున్న వాస్తవాలు చూస్తూనే ఉన్నారు. పేపర్ లీక్ చేసేది మీరు.. రాజీనామా చేయాల్సింది బొత్స సత్యనారాయణా..?’ అని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు. చదవండి👉ఏపీ సీఐడీ అదుపులో మాజీ మంత్రి నారాయణ -
ఏపీ సీఐడీ అదుపులో మాజీ మంత్రి నారాయణ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ అరెస్ట్ అయ్యారు. కొండాపూర్‌లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గత 4 రోజులుగా ఫోన్ స్విచ్ఛాప్ చేసి నారాయణ అజ్ఞాతంలో ఉన్నారు. ఇదిలా ఉంటే, చిత్తూరు జిల్లాలో నారాయణ స్కూల్ నుంచి టెన్త్ పేపర్లు లీకైన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఇప్పటికే వైస్ ప్రిన్సిపల్ గిరిధర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
లీకేజీ వెనుక ఒప్పందం?
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన పాలిటెక్నిక్ రెండు, మూడో ఏడాదికి సంబంధించిన మూడు, ఐదవ సెమిస్టర్ పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్ శివార్లలోని స్వాతి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి జరిగిన ఈ లీకేజీలో సిండికేట్ అయిన కాలేజీలు ఎన్ని? లీక్ అయిన ఎంతసేపటికి వాట్సాప్ ద్వారా పేపర్లు వెళ్లాయి? అనే సమాచారం సేకరిస్తున్నారు. దీనివెనుక సాంకేతిక విద్యామండలి సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. కాల్‌డేటాపై దృష్టి... పరీక్ష పేపర్ 8, 9 తేదీల్లో లీక్ అవగా 9వ తేదీన లీకేజీ వ్యవహారాన్ని ఓ ప్రభుత్వ కాలేజీ సిబ్బంది గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే 8వ తేదీనే లీకేజీని సిబ్బంది ఎందుకు గుర్తించలేకపోయారనే కోణంలో పోలీసులు పలువురు విద్యార్థుల వాట్సాప్ నంబర్లను సేకరించారు. సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఆ సెల్ నంబర్ల నుంచి రెండు రోజులపాటు వెళ్లిన కాల్స్‌ను పరిశీలిస్తున్నారు. మరోవైపు కాలేజీ యాజమాన్యం, సిబ్బంది సెల్ నంబర్లనూ పరిశీలించగా మొత్తం 10 కాలేజీలకు ఆ నంబర్ల నుంచి ఫోన్లు వెళ్లినట్లు తేలింది. వివిధ ప్రాంతాలకు చెందిన పాలిటెక్నిక్ కాలేజీల యాజమాన్యాలతో స్వాతి ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యానికి ఉన్న లింకేంటి? ముందే ఒప్పందం చేసుకొని పేపర్ లీక్ చేశారా? అనే కోణంలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు. పాస్వర్డ్ అధికారులు పంపినదేనా? స్వాతి ఇంజనీరింగ్ కాలేజీ గుర్తింపును గతంలోనే రద్దు చేశామని, పాలిటెక్నిక్ ఫస్టియర్ అడ్మిషన్లకు అనుమతి లేదని సాంకేతిక విద్య అధికారులు తెలిపారు. ఈ స్థాయిలో విశ్వసనీయత లేని కాలేజీకి ముందే పాస్వర్డ్ చేరడం, అధికారుల బాధ్యతారాహిత్యాన్ని స్పష్టం చేస్తోందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. అసలు పాస్వర్డ్ అధికారులు పంపిందేనా? మరో మార్గంలో పాస్వర్డ్ రాక ముందే హ్యాక్ చేశారా? ఇలా జరిగితే ఉన్నత విద్యామండలి అధికారుల పాత్ర ఉందా? అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. సంబంధిత అధికారులనూ విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారు. నేర స్వభావం, అధికారుల వివరణ పరస్పర విరుద్ధంగా ఉండటం ఈ కేసులో కొత్త అనుమానాలకు తావిస్తోంది. నిబంధనల ప్రకారం అరగంట ముందు పరీక్ష కేంద్రాలకు పాస్వర్డ్ పంపాలి. కాలేజీ నిర్వాహ కులు, బాధ్యతగల అధికారుల పర్యవేక్షణలో పేపర్‌ను డౌన్లోడ్ చేయాలి. కానీ స్వాతి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్ణీత గడువుకన్నా ముందే పాస్వర్డ్ చేరిందనే సందేహాలు బలపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పాస్వర్డ్ వెళ్లిన సమయానికి ముందే పాస్వర్డ్ ఇవ్వడం వెనుక ఉద్దేశమేంటనే దిశగానూ దర్యాప్తు జరుగుతోంది. కాగా, ఈ కేసులో ముగ్గురు కాలేజీ సిబ్బంది పాత్రను నిర్ధారిం చిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. మరోవైపు కాలేజీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశామని.. ఇంకా యాజమాన్యం బదులివ్వలేదని సాంకేతిక విద్య అధికారులు తెలిపారు. -
సెల్ఫోన్లు చూస్తూ పేపర్లు చింపుతున్నారు.. కారణం ఏంటంటే..
సాక్షి, శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీ డిగ్రీ 6వ సెమిస్టర్ భౌతిక శాస్త్రం క్వశ్చన్ పేపర్ కొందరు విద్యార్థుల సెల్‌ఫోన్‌కు రావడంతో బుక్‌లో అందులోని సమాధానాలు వెతుక్కుంటూ పరీక్షా కేంద్రం బాధ్యులకు పట్టుబడ్డారు. కళాశాల కేంద్రం వారు శాతవాహనకు సమాచారం అందించగా 9 మంది సెల్ఫోన్లు సీజ్ చేసి విచారణకు ఆదేశించారు. ప్రశ్నాపత్రం లీక్ చేసింది ఎవరనే విషయంపై లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. త్వరలోనే బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎస్‌యూ పరీక్షల విభాగం తెలిపింది. ఇలా జరిగింది...? డిగ్రీ 6,4వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 12 నుండి ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా 6వ సెమిస్టర్ పరీక్షలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, 4వ సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఎస్సారార్ కళాశాల కేంద్రం వద్ద ఉదయం 10 గంటలు దాటిన తర్వాత కూడా విద్యార్థులు పరీక్షా కేంద్రం బయటే ఉండడాన్ని పరిశీలించిన ఎస్సారార్ అధ్యాపకులు వారి వద్దకు వెళ్లి చూడగా సెల్ఫోన్లు చూస్తూ పేపర్లు చింపుతుండడం కనిపించింది. వెంటనే సెల్ఫోన్లు తీసుకొని చూడగా ప్రశ్నాపత్రం ప్రత్యక్షమైంది. దీంతో అవాక్కయిన ఎస్సారార్ అధ్యాపకులు శాతవాహన యూనివర్సిటీకి సమాచారమందించారు. శాతవాహన యూనివర్సిటీ పరీక్షల విభాగం నుండి సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని 9 సెల్ఫోన్లు సీజ్ చేసి యూనివర్సిటీకి తీసుకెళ్లి పరీక్షల విభాగం అధికారులకు అప్పగించారు. ప్రశ్నాపత్రం లీక్‌పై విచారణ కమిటీ.. ఈ విషయాన్ని ఎస్‌యూ పరీక్షల నియంత్రణాధికారి శ్రీరంగప్రసాద్ వీసీ ప్రొఫెసర్ ఎస్.మల్లేశ్ దృష్టికి తీసుకెళ్లగా నలుగురితో కూడిన ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. కమిటీ త్వరలోనే నిజానిజాలు తేల్చి సంఘటనకు బాధ్యులైన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. లీక్ చేసిందెవరు...? ప్రశ్నాపత్రం లీక్ చేసింది ఎవరనే సందేహాలు మొదలయ్యాయి. ప్రభుత్వ, కళాశాల, ప్రయివేట్ కళాశాలలకు సంబంధించిన ప్రిన్సిపాల్/బాధ్యులకు ఆన్లైన్లో ఏ రోజుకారోజు పరీక్షా సమయానికి అరగంట ముందు మాత్రమే యూనివర్సిటీ నుండి వస్తుంది. దానిని ప్రింట్ తీసి కేంద్రంలో ఉన్న విద్యార్థులకు అందిస్తారు. అరగంట ముందు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఎలా విద్యార్థుల సెల్ఫోన్లకు వెళ్లిందనే విషయాలు తెలియకుండా ఉన్నాయి. దీని వెనక యూనివర్సిటీ సిబ్బంది ఉన్నారా.. లేదా కళాశాలల వారు ఉన్నారా అనే విషయాలు విచారణ చేపడుతున్నారు. ప్రత్యేక కమిటీ వేశాం.. విద్యార్థుల సెల్‌ఫోన్‌కు ప్రశ్నాపత్రం వచ్చిన విషయాన్ని వీసీ దృష్టికి తీసుకెళ్లాం. ప్రత్యేక కమిటీ ద్వారా విచారణ జరుగుతుంది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత బా«ధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. – డాక్టర్ శ్రీరంగప్రసాద్, ఎస్‌యూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ -
‘లీకేజీ’ దోషులను తప్పిద్దాం!
-
‘లీకేజీ’ దోషులను తప్పిద్దాం!
- ప్రశ్నపత్రాల లీకేజీని పక్కదారి పట్టించేలా ప్రభుత్వ చర్యలు - ఉన్నతాధికారులతో గంటా భేటీ సాక్షి, అమరావతి/నెల్లూరు: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం నుంచి బయటపడేందుకు ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. నెల్లూరు జిల్లా విద్యాధికారి రామలింగంను కూడా పిలిపించారు. ఈ భేటీ వివరాలు బయటకు రాకుండా స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మంత్రులతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంపై నోరువిప్పేందుకు అధికారులు భయపడుతున్నారు. ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో నారాయణ స్కూల్‌ను తప్పించడమే లక్ష్యంగా పోలీసులు దర్యాప్తును పక్కదారిపట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నపత్రం లీకేజీ సమయంలో ఆ కేంద్రంలో ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులతోపాటు నారాయణ స్కూల్ సిబ్బంది, ప్రిన్సిపల్ ఉన్నట్లు ప్రచారం. అయితే, నారాయణ పాఠశాల యాజమాన్యాన్ని తప్పించేందుకు వాటర్‌బాయ్, ఇన్విజిలేటర్ మహేష్‌లను బాధ్యులుగా చేసి కేసును నీరుగార్చే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా లీకేజీపై పోలీసులు బుధవారం పలువురిని విచారించారు. వారంతా నగరంలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, పీఈటీలని తెలిసింది. వాటర్‌బాయ్ ఉపయోగించిన సెల్‌ఫోన్ వేరే వ్యక్తిదని పోలీసులు గుర్తించారు. సెల్‌ఫోన్ యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
ఇంటర్ ప్రశ్నపత్రాల లీకు!
-
ఇంటర్ ప్రశ్నపత్రాల లీకు!
* నారాయణ కళాశాలలో వారం రోజులుగా ఉన్న ప్రశ్నపత్రాల బాక్సులు * ఈనెల 22నే ప్రశ్నపత్రాల బాక్సులు తీసుకెళ్లిన ప్రిన్సిపాల్ * అదనపు ప్రశ్నపత్రాల కోసం బోర్డు అధికారి రావడంతో వెల్లడి * క్రమపద్ధతిలో ఉండాల్సిన తాళాలతో తెరుచుకోని బాక్సులు * ప్రశ్నపత్రాలు లీకై ఉంటాయని బలపడుతున్న అనుమానాలు సాక్షి, హైదరాబాద్/ గుడివాడ (కృష్ణ్లా): ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాలు లీక్ చేశారనే వార్త కృష్ణాజిల్లా గుడివాడలో సంచలనం సృష్టించింది. పోలీసుస్టేషన్లో ఉన్న ప్రశ్నపత్రాలను వారం ముందే గుడివాడలో ఉన్న నారాయణ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తీసుకువెళ్లటం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రశ్నపత్రాల కోసం మంగళవారం జిల్లా ఇంటర్ బోర్డు అధికారి రావటంతో ఈ వ్యవహారం బయటపడింది. ప్రముఖ కార్పొరేట్ కళాశాలకు ప్రమేయమున్న ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచాలని ప్రయత్నించినా.. మీడియాకు తెలియడం తో బట్టబయలైంది. ఈ ఏడాది మార్చిలో గుడివాడలో ఐదు సెంటర్లలో ఇంటర్ పరీక్షలు జరిగాయి. వీటిలో నారాయణ జూనియర్ కాలేజీ కూడా ఒక సెంటర్‌గా ఉంది. పోలీసు స్టేషన్లో ప్రశ్నపత్రాలను భద్రపరిచేందుకు పరీక్షలు నిర్వహించే కాలేజీల వారే ఇనుప ట్రంకు పెట్టెలు ఇవ్వాలి. ఇందులో భాగంగా 12ప్రశ్నపత్రాలు భద్రపరిచేందుకు నారాయణ జూనియర్ కళాశాల వారు 12 ట్రంకు పెట్టెలను ఇచ్చారు. ఒక్కో ట్రంకుపెట్టెలో మూడు సెట్ల ప్రశ్నపత్రాలను సీలువేసి భద్రపరుస్తారు. పరీక్ష సమయంలో ఇంటర్మీడియెట్ బోర్డువారు జంబ్లింగ్ పద్ధతిలో వాటిలో ఒక సెట్‌ను ఎంపిక చేస్తారు. మిగిలిన రెండుసెట్లును పెట్టెలోనే ఉంచి సీలువేసి పోలీసు స్టేషన్లోనే భద్రపరుస్తారు. సప్లిమెంటరీ పరీక్షలకు బాక్సుల్లో మిగిలిన రెండు సెట్లలో ఒకదాన్ని వాడతారు. ఈనెల 25నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఈ పరీక్షలకు గుడివాడ లో విద్యార్ధుల సంఖ్య తక్కువగా ఉండటంతో జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు వారు గుడివాడకు నాలుగు సెంటర్లు మాత్రమే ఇచ్చారు. దీంతో గుడివాడ నారాయణ జూనియర్ కాలేజీకి సెంటర్ లేకుండా పోయింది. దీంతో ఆ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యశాస్త్రి ఈనెల 22న స్థానిక టూటౌన్ పోలీసు స్టేషన్‌కు వచ్చి తమ కళాశాలకు పరీక్షా కేంద్రం లేదని తమ ట్రంకు పెట్టెలు ఇవ్వాలని లేఖరాసి తీసుకెళ్లారు. అయితే రెండేసి సెట్లు ప్రశ్నపత్రాలున్న ఆ 12 ట్రంకుపెట్టెలనూ ఖాళీ బాక్సులు పేరుతో కార్పొరేట్ కళాశాలవారు తీసుకెళ్లడం అనుమానాస్పదంగా మారింది. ఇలా బయటకు వచ్చింది: సప్లిమెంటరీ పరీక్షల్లో జిల్లాలోని ఒక కేంద్రంలో బోటనీ ప్రశ్నపత్రాలు తక్కువయ్యాయి. గుడివాడలోని నారాయణ కాలేజీ సెంటర్ లేకపోవటంతో దానికి సంబంధించిన ప్రశ్నపత్రాలు పెట్టెల్లోనే ఉంటాయి కాబట్టి తీసుకెళ్లేందుకు జిల్లా ఇంటర్ బోర్డు అధికారి వెంకట్రామారావు గుడివాడ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. అయితే ఆ పెట్టెలను నారాయణ కళాశాలవారు 22వ తేదీనే తీసుకెళ్లారని చెప్పటంతో ఆయన ఒక్కసారిగా అవాక్కయ్యారు. కాలేజీ ప్రిన్సిపాల్‌ను పిలిపించగా 27వతేదీ బాక్సులన్నీ తెచ్చి స్టేషన్లో పెట్టారు. ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా చూడాలని అధికారులు ప్రయత్నించినా మీడియాకు తెలియటంతో బట్టబయలైంది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రఘునందనరావు స్పందించి జిల్లా జేసీ మురళీని విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో పోలీసుల నిర్లక్ష్యం ఉందని తెలిసిన జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు కూడా గుడివాడకు చేరుకున్నారు. గుడివాడ ఆర్డీఓ ఎస్.వెంకటసుబ్బయ్య, తహశీల్దార్ పద్మావతిల సమక్షంలో పెట్టెలు తీసి పరిశీలించారు. తాళాలు తెరుచుకోలేదు: ప్రశ్నపత్రాలు భద్రపరిచే పెట్టెలు తాళాలు తీయటంలో ప్రత్యేక విధానాన్ని పాటిస్తారు. మొత్తం 12 ట్రంకుపెట్టెల్లో ఒకటో నెంబరు బాక్సు తాళం మాత్రమే బయట ఉంటుంది. ఒకటో నెంబరు బాక్సులో రెండో నెంబరు బాక్సు తాళం, రెండో నెంబరు బాక్సులో మూడో నంబర్ బాక్సు తాళం... ఇలా 12 పెట్టెల తాళాలను భద్రపరుస్తారు. అయితే ఆయా బాక్సుల్లో ఉన్న తాళాలతో తర్వాతి నంబరు బాక్సులు తెరుచుకోలేదు. దీంతో ఆర్ఐఓ వద్ద ఉన్న డూప్లికేట్ తాళంచెవులు ఉపయోగించి తాళాలు తెరవాల్సివచ్చింది. ట్రంకుపెట్టెలు వారం రోజులపాటు నారాయణ కళాశాలలో ఉండటం, బాక్సుల్లో ఉన్న తాళంచెవులతో తర్వాతి నంబరు బాక్సులు తెరుచుకోకపోవడంతో ప్రశ్నపత్రాలు లీకయ్యి ఉంటాయనే అనుమానాలు నెలకొన్నాయి. ట్రంకు పెట్టెల సీళ్లన్నీ బాగానే ఉన్నాయని, అయితే బాక్సులు నిబంధనలకు విరుద్ధంగా బయటకు వెళ్లటం నేరమని జేసీ మురళి, ఎస్పీ ప్రభాకర్ చెప్పారు. పూర్తిస్థాయి విచారణ జరిగాక కారకులపై చర్యలు ఉంటాయని వారు తెలిపారు. ప్రశ్నపత్రం బయటకు వెళ్లినట్లు రుజువైతే, ఆ పరీక్షను మళ్లీ నిర్వహించే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు చేపట్టనున్నామని వారు పేర్కొన్నారు.