కాళేశ్వరం, మిషన్‌ భగీరథపై న్యాయవిచారణ జరిపించాలి | Congress leader Jeevan Reddy Sensational Comments on Kcr | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం, మిషన్‌ భగీరథపై న్యాయవిచారణ జరిపించాలి

Published Sun, Dec 17 2023 4:17 AM | Last Updated on Sun, Dec 17 2023 4:17 AM

Congress leader Jeevan Reddy Sensational Comments on Kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ అప్పులకుప్పలా మారిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం, మిషన్‌ భగీరథ ప్రాజెక్టులను చేపట్టారని, అనవసరమైన ఖర్చులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఆగం చేశారన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో శనివారం గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని జీవన్‌రెడ్డి ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ ప్రసంగాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక స్థితిని ప్రస్తావించారు. సాంకేతిక పరిజ్ఞానం అంతంతమాత్రంగా ఉన్న రోజుల్లో నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని, కానీ అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రస్తుత రోజుల్లో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు లోపభూయిష్టంగా మారడం విడ్డూరమే అని అన్నారు.

మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడంతో పాటు అన్నారం బ్యారేజీలో సైతం లీకేజీలు ఏర్పడటం విచారకరమన్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణ పనులకు సంబంధించి ఎల్‌అండ్‌టీ తొలుత చేపడుతుందని చెప్పినప్పటికీ... ఇప్పుడు చేయనని అంటోందని చెప్పారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణంపై న్యాయ విచారణ చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

మిషన్‌ భగీరథ ప్రాజెక్టు కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్లు ఖర్చు చేసిందని, అప్పటికే చాలా గ్రామాల్లో మంచినీటి సరఫరా వ్యవస్థ ఉన్నప్పటికీ వృథా ఖర్చులతో మళ్లీ మిషన్‌ భగీరథ పనులు చేపట్టి ప్రజాధనాన్ని నీటిపాలు చేశారని విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే నిరుద్యోగులు హర్షించేవారని, కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు మానసికంగా ఆందోళన చెందారన్నారు. జీవో 317 ద్వారా ఉద్యోగులు నష్టపోయారని, వారికి ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రంగా ప్రత్యేక జోన్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

ప్రజలను కలిసే సీఎం రేవంత్‌: నర్సిరెడ్డి 
పదేళ్ల కేసీఆర్‌ పాలనలో సామాన్యుడిని సీఎం కలిసే పరిస్థితే ఉండేది కాదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వ్యాఖ్యానించారు. మండలిలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆయన బలపర్చారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ తను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక దాదాపు 30 సార్లు కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయతి్నంచినా అవకాశం దక్కలేదని, ఒకసారి అవమానానికి సైతం గురయ్యానన్నారు. కానీ రేవంత్‌రెడ్డి సీఎం అయిన మరుసటిరోజే ప్రజాభవన్‌లో కలిశానని చెప్పారు. ప్రజలను కలిసి వారి సమస్యలు వినే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారని, ఈ ఐదేళ్ల కాలంలో ఇదే తరహాలో పాలన సాగాలని ఆయన ఆకాంక్షించారు.

90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి లెక్కల్లేవు: ఉత్తమ్‌ 
బీఆర్‌ఎస్‌ పాలనలో పౌరసరఫరాల విభాగాన్ని అల్లకల్లోలం చేశారని, ఆ శాఖ వద్ద 90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి లెక్కల్లేవని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ ధాన్యం ఉందా? లేదా? ఉంటే ఎక్కడుంది? అనే అంశాలకు కాగితాల్లో ఎక్కడా వివరాలు లేకపోవడం గమనార్హమని, దీనిపై సమగ్ర పరిశీలన ప్రారంభించినట్లు మంత్రి వివరించారు.

పదేళ్లలో ఈ శాఖ రూ.56 వేల కోట్ల నష్టాల్లో ఉందని చెప్పారు. రేషన్‌ బియ్యం చాలాచోట్ల లబ్ధిదారులకు చేరడం లేదని, దీనిపై మరింత లోతైన చర్యలు చేపడతామన్నారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై బీఆర్‌ఎస్‌ సభ్యులు మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో ఇచి్చన ప్రతి హామీని నెరవేర్చాలని, మానవహక్కుల పరిరక్షణపై ప్రభుత్వం ప్రకటన హర్షనీయమని, భావప్రకటన స్వేచ్ఛపై సీఎం చేస్తున్న ప్రకటనలు అమలు జరిగేలా చూడాలని అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement