‘లీకేజీ’ దోషులను తప్పిద్దాం!
- ప్రశ్నపత్రాల లీకేజీని పక్కదారి పట్టించేలా ప్రభుత్వ చర్యలు
- ఉన్నతాధికారులతో గంటా భేటీ
సాక్షి, అమరావతి/నెల్లూరు: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం నుంచి బయటపడేందుకు ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. నెల్లూరు జిల్లా విద్యాధికారి రామలింగంను కూడా పిలిపించారు. ఈ భేటీ వివరాలు బయటకు రాకుండా స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మంత్రులతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంపై నోరువిప్పేందుకు అధికారులు భయపడుతున్నారు. ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో నారాయణ స్కూల్‌ను తప్పించడమే లక్ష్యంగా పోలీసులు దర్యాప్తును పక్కదారిపట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ప్రశ్నపత్రం లీకేజీ సమయంలో ఆ కేంద్రంలో ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారులతోపాటు నారాయణ స్కూల్ సిబ్బంది, ప్రిన్సిపల్ ఉన్నట్లు ప్రచారం. అయితే, నారాయణ పాఠశాల యాజమాన్యాన్ని తప్పించేందుకు వాటర్‌బాయ్, ఇన్విజిలేటర్ మహేష్‌లను బాధ్యులుగా చేసి కేసును నీరుగార్చే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా లీకేజీపై పోలీసులు బుధవారం పలువురిని విచారించారు. వారంతా నగరంలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, పీఈటీలని తెలిసింది. వాటర్‌బాయ్ ఉపయోగించిన సెల్‌ఫోన్ వేరే వ్యక్తిదని పోలీసులు గుర్తించారు. సెల్‌ఫోన్ యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.