వచ్చే నెలలో మరోసారి టెట్‌! | TET again in the next month! | Sakshi
Sakshi News home page

వచ్చే నెలలో మరోసారి టెట్‌!

Published Thu, Apr 5 2018 3:10 AM | Last Updated on Fri, May 25 2018 5:44 PM

TET again in the next month! - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను మరోసారి నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను మేలో జారీ చేసి జూన్‌లో ఆన్‌లైన్లో పరీక్షలు చేపట్టనున్నారు. టెట్‌ పూర్తయ్యాక ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)ని నిర్వహించే అవకాశం ఉంది. మంగళవారం మంత్రి గంటా శ్రీనివాసరావు టెట్, డీఎస్సీలపై అధికారులతో సమావేశమయ్యారు. ఇటీవల నిర్వహించిన టెట్‌ లోపాలతో తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. పైగా ఈ టెట్‌లో అనేకమందికి అర్హత మార్కులు రాలేదు. దీంతో వారంతా మరోసారి టెట్‌ నిర్వహించాలని కోరుతున్నారు. దీనిపై సమావేశంలో చర్చ జరిగింది. ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహించేందుకు అవకాశమున్నందున మరోసారి నిర్వహణకు నిర్ణయించారు. 

అభ్యంతరాలకు అవకాశమేది?
ఇటీవల నిర్వహించిన టెట్‌ను 4,14,120 మంది రాయగా 1,94,093 మంది అర్హత సాధించారు. ఈ పరీక్షను ఆన్‌లైన్లో నిర్వహించడంతో ప్రశ్నలు, సమాధానాల జంబ్లింగ్, ఇతర కారణాలతో తమకు ఫైనల్‌ ‘కీ’ ప్రకారం వచ్చిన మార్కులకు, తుది ఫలితాల్లోని మార్కులకు చాలా వ్యత్యాసం ఉందని, 20 నుంచి 30 వరకు మార్కులు తగ్గిపోయాయని అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు అందాయి. తమ సమాధాన పత్రాలు ఇవ్వాలనే డిమాండ్‌ రావడంతో రూ.200 ఫీజుతో వాటిని అందించారు. 30,591 మంది వీటిని తీసుకున్నారు. అయితే వీటిని పరిశీలించుకొని అభ్యంతరాలు తెలియచేసేందుకు విద్యాశాఖ అభ్యర్థులకు అవకాశం ఇవ్వలేదు. మరోవైపు కొన్ని పరీక్ష కేంద్రాల్లో సాంకేతిక కారణాలతో టెట్‌ పరీక్ష పత్రంలోని ఐదు ప్రశ్నలు కంప్యూటర్లలో కనిపించలేదు. ఈ కారణంగా తాము నష్టపోతున్నామని 1356 మంది ఫిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించేందుకు ఒక కమిటీని విద్యాశాఖ నియమించింది. వీరికి ఆ ప్రశ్నలకు సంబంధించిన మార్కులు ఎలా కలపాలనే దానిపై తర్జనభర్జన పడుతోంది. ఇలా కలపడం వల్ల మిగిలిన అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు, న్యాయపరమైన సమస్యలు వస్తాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని, ఆ తర్వాత తదుపరి టెట్‌కు ప్రభుత్వానికి లేఖ రాస్తామని అధికారులు వివరించారు. 

ప్రొఫెసర్‌ పోస్టుల కంటే టీచర్‌ పోస్టులకు ఎక్కువ అర్హత మార్కులు
యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల కంటే టెట్‌లో అర్హత మార్కులు అధికంగా పెట్టడంపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెసర్‌ పోస్టులకు 40 శాతం మాత్రమే అర్హత మార్కులు ఉన్నాయని, తమకు 60 శాతం మార్కులు రావాలనే నిబంధన పెట్టడం అన్యాయమని వాపోతున్నారు. కాగా.. డీఎస్సీ పోస్టులపై ప్రభుత్వానికి నివేదిక పంపినా ఇప్పటివరకు స్పష్టత రాలేదు. 14,494 ఖాళీ పోస్టులున్నా అన్నిటినీ ఒకేసారి కాకుండా రెండు విడతలుగా భర్తీ చేయాలనుకుంటున్నారు. రెండో టెట్‌ నిర్వహణలోపు ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయడానికి వీలుంటుందని, లేదంటే టెట్‌ ముగిశాక సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశముంటుందని అధికార వర్గాలు వివరించాయి.

– పోస్టుల భర్తీని వాయిదా వేసేందుకేనా!
ఇలా ఉండగా టెట్‌లో గందరగోళం రేకెత్తేలా చేయడం, మళ్లీ దాన్ని నిర్వహించాలని నిర్ణయించడాన్ని పరిశీలిస్తే టీచర్‌ పోస్టుల భర్తీని సాధ్యమైనంత జాప్యం చేసేందుకే అనే అభిప్రాయాలు నిరుద్యోగుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఏటా డీఎస్సీ ప్రకటిస్తామని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. నాలుగేళ్లలో ఇప్పటివరకు డీఎస్సీ నిర్వహించింది కేవలం ఒకేఒక సారే. రెండేళ్లుగా మంత్రి శ్రీనివాసరావు డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఇదిగో విడుదల చేస్తున్నాం, అదిగో నోటిఫికేషన్‌ జారీ అవుతోందంటూనే ఇప్పటికీ కాలం గడుపుతూనే వస్తున్నారు. 2017లో మూడు పర్యాయాలు డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తున్నట్లు వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రకటనలిచ్చారు.

గతేడాది డిసెంబర్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఉపాధ్యాయ నియామక పరీక్షల నోటిఫికేషన్‌ తేదీలను కూడా విడుదల చేశారు. 2017 డిసెంబర్‌ 14న టెట్, ఆ మర్నాడు డీఎస్సీ నోటిఫికేషన్‌.. అన్నారు. కానీ టెట్‌ నోటిఫికేషన్‌ వెలువడటం, పరీక్షలు నిర్వహించడం, ఫలితాలు విడుదల చేయడం అన్నీ అయిపోయాయి. టెట్‌ నిర్వహణలో గందరగోళం నెలకొంది. ఇప్పుడు తాజాగా మరోసారి టెట్‌ నిర్వహించనున్నామని, అభ్యర్థుల నుంచి డిమాండ్‌ వస్తోందని సర్కారు చెబుతోంది. వీటన్నింటినీ బట్టి చూస్తే.. డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలలో సాధ్యమైనంత జాప్యం చేయడానికే సర్కారు కుయుక్తులు పన్నుతోందని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement