ఇన్‌చార్జిలతో కాలక్షేపం
సాక్షి, విశాఖపట్నం : మండల విద్యాశాఖాధికారుల (ఎంఈవోల) కొరత జిల్లాను పట్టి పీడిస్తోంది. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఈ పోస్టులు భర్తీ కావడం లేదు. దీంతో విద్యా వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. జిల్లాలో మండలానికొకరు చొప్పున 43 ఎంఈవోలుండాలి. ప్రస్తుతం రెగ్యులర్ ఎంఈవోలు కేవలం ఎనిమిది మందే ఉన్నారు. మిగతా మండలాల్లో ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. గతంలో స్కూల్ అసిస్టెంట్లకు ఎంఈవోలుగా పదోన్నతి కల్పించడంపై జిల్లా పరిషత్, ప్రభుత్వ హైస్కూల్ టీచర్ల మధ్య వివాదం తలెత్తింది. తొలుత ఎక్కువ మంది ఉన్న జెడ్పీ హైస్కూల్ వారికి కాకుండా అతి తక్కువ సంఖ్యలో ఉన్న ప్రభుత్వ హైస్కూల్ ఉపాధ్యాయులకే ఎంఈవోలు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ తదితర పోస్టుల్లో పదోన్నతులు దక్కేవి.
1995లో డీఎస్సీ (డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ) వచ్చాక జిల్లా పరిషత్, హైస్కూలు ఉపాధ్యాయులకు సమాన హోదా ఉందన్న వాదనతో ప్రభుత్వం సీనియారిటీకి ప్రాధాన్యమిచ్చింది. ఆ మేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల స్కూల్ అసిస్టెంట్లకు సీనియారిటీ ఆధారంగా ఎంఈవోలుగా నియమించింది. దీనిని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయులు 1998లో సుప్రీంకోర్టుకెళ్లారు. ఈ వివాదం ఇంకా కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన మండలాల్లో సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఉండే షరతుపై ప్రభుత్వం అడ్‌హాక్ విధానంలో సీనియర్లయిన జిల్లా పరిషత్ హైస్కూల్ హెడ్మాస్టర్లతో ఇన్‌చార్జి ఎంఈవోలుగా నియమిస్తోంది.
ఇలా విశాఖ జిల్లాలోని 43 మండలాల్లో కేవలం సబ్బవరం, పెందుర్తి, అనకాపల్లి, దేవరాపల్లి, యలమంచిలి, మాకవరపాలెం, చోడవరం, హుకుంపేటల్లో (ఎనిమిది మంది) మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలున్నారు. మిగిలిన 35 చోట్ల ఇన్‌చార్జిలే కొనసాగుతున్నారు. కేసు కోర్టులో ఉన్నందున ఎవరైనా పదవీ విరమణ చేస్తే అక్కడ ఇన్‌చార్జి తప్ప కొత్తగా ఫుల్‌టైమ్ ఎంఈవోని వేసే పరిస్థితి లేదు.
క్షీణిస్తున్న ప్రమాణాలు: ఒకటి నుంచి ఏడో తరగతి వరకు మండలంలోని పాఠశాలల్లో విద్యా ప్రగతిని ఎంఈవోలు పర్యవేక్షించాలి. ఇటు హైస్కూలుపైన, అటు మండలంపైన దృష్టి సారించడం వీరికి కష్టతరమవుతోంది. దీంతో విద్యా ప్రమాణాలు క్షీణిస్తున్నాయి. ఇన్‌చార్జి కావడం వల్ల సర్వశిక్ష అభియాన్ నిధులు సకాలంలో వినియోగం కావడం లేదు. ఉపాధ్యాయులకు శిక్షణ తదితర విషయాలపై సమగ్రంగా పర్యవేక్షించలేకపోతున్నారు. ఫలితంగా రెండు పడవలపై ప్రయాణం చేయలేక విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారయింది. కోర్టు అనుమతితో త్వరలో ఎంఈవో పోస్టుల భర్తీ చేపడతామని ఇటీవల జరిగిన ప్రాంతీయ విద్యా సదస్సులో విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఆ హామీ కార్యరూపం దాలిస్తేనే జిల్లాలో ఉన్న 35 ఖాళీలు రెగ్యులర్ ఎంఈవోలతో భర్తీ అవుతాయి.