Question Paper Leakage: AP High Court Rejected Argument Of Narayana Counsel, Details Inside - Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో చుక్కెదురు

Published Tue, Dec 6 2022 3:33 PM | Last Updated on Wed, Dec 7 2022 5:44 PM

Question Paper leakage: AP High Court Rejected Argument of Narayana counsel - Sakshi

సాక్షి, అమరావతి: పదవ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో తనకు బెయిల్‌ మంజూరు చేస్తూ మేజిస్ట్రేట్‌ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సెషన్స్‌ కోర్టులో పోలీసులు దాఖలు చేసిన రివిజన్‌ పిటిషన్‌కు ఎలాంటి విచారణార్హత లేదంటూ నారాయణ విద్యా సంస్థల అధినేత, టీడీపీకి చెందిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ చేసిన వాదనను హైకోర్టు తోసిపుచి్చంది. సెషన్స్‌ కోర్టు ముందు పోలీసులు రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేయడం సరైందేనని, ఆ పిటిషన్‌కు విచారణార్హత ఉందని హైకోర్టు స్పష్టంచేసింది. అయితే, నారాయణకు మేజి­్రస్టేట్‌ ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేస్తూ సెషన్స్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దుచేసింది.

సెషన్స్‌ కోర్టు కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండానే మేజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన రిమాండ్‌ ఉత్తర్వులను రద్దుచేసిందని తెలిపిన హైకోర్టు, తిరిగి కేసు పూర్వాపరాలన్నింటినీ విచారించి వాటి ఆధారంగా నిర్ణయం వెలువరించాలని సెషన్స్‌ కోర్టును ఆదేశించింది. ఇందుకు నాలుగు వారాల గడువు విధించింది. ఈ రివిజన్‌ తేలేంత వరకు నారాయణపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులకు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు మంగళవారం తీర్పు వెలువరించారు. 

అసలు ఏం జరిగిందంటే.. 
పదవ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో నారాయణను అరెస్టుచేసిన పోలీసులు అతన్ని చిత్తూరు మేజిస్ట్రేట్‌ కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే, నారాయణ రిమాండ్‌ను మేజిస్ట్రేట్‌ తిరస్కరిస్తూ ఉత్తర్వులిచ్చారు. తద్వారా నారాయణ బెయిల్‌పై విడుదలయ్యారు. దీనిపై పోలీసులు సెషన్స్‌ కోర్టులో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీని­పై విచారణ జరిపిన సెషన్స్‌ కోర్టు.. నారాయణకు బెయిల్‌ ఉత్తర్వులను రద్దుచేసి ఆయన కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో చిత్తూరు సెషన్స్‌ కోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ నారాయణ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్‌ రఘునందన్‌రావు విచారణ జరిపారు.  

అవి బెయిల్‌ ఉత్తర్వులు కాదు: అదనపు ఏజీ 
నారాయణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయ­వాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ.. బెయిల్‌ను రద్దుచేయాలని కోరుతూ సెషన్స్‌ కోర్టులో పోలీసులు దాఖలుచేసిన రివిజన్‌ పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, మేజిస్ట్రేట్‌ ఇచ్చిన ఉత్త­ర్వులు రిమాండ్‌ను తిరస్కరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులే తప్ప బెయిల్‌ మంజూరు చేసిన ఉత్తర్వులు కాదన్నారు.

అలాగే, రిమాండ్‌ను తిరస్కరిస్తూ మేజిస్ట్రేట్‌ ఇచ్చిన ఉత్తర్వులు తాత్కాలిక ఉత్తర్వులు కాదని, అందువల్ల ఆ ఉత్తర్వులపై దాఖలు చేసే రివిజన్‌ పిటి­షన్‌కు విచారణార్హత ఉందన్నారు. నారాయణ­పై నమోదు చేసిన ఐపీసీ సెక్షన్‌–409 చెల్లదంటూ రిమాండ్‌ సమయంలోనే మేజి్రస్టేట్‌ తేల్చేశారని, తద్వారా ఓ మినీ ట్రయల్‌ నిర్వహించారని అదనపు ఏజీ వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ రఘునందన్‌రావు మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరించారు.

అదనపు ఏజీ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి
మేజిస్ట్రేట్‌ రిమాండ్‌ను తిరస్కరించినప్పుడు దానిపై సెషన్స్‌ కోర్టులో రివిజన్‌ దాఖలు చేయవచ్చునని, దానికి విచారణార్హత ఉందన్న అదనపు ఏజీ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. అయితే, పోలీసులకు తమ వాదన వినిపించే అవకాశం మేజిస్ట్రేట్‌ కోర్టు ఇవ్వలేదని, అందువల్ల నారాయణ రిమాండ్‌ను తిరస్కరిస్తూ మేజిస్ట్రేట్‌ కోర్టు ఉత్తర్వులను రద్దుచేస్తున్నట్లు సెషన్స్‌ జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొనడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. కానీ, మేజిస్ట్రేట్‌ ముందు వాదనలు వినిపించేందుకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) నిరాకరించారని, దీంతో ప్రభుత్వం పీపీపై చర్యలకు ఉపక్రమించిందని న్యాయమూర్తి గుర్తుచేశారు.

అంతేకాక.. మేజిస్ట్రేట్‌ తన ముందున్న ఆధారాలను బట్టే నారాయణ రిమాండ్‌ను తిరస్కరించారా? అన్న విషయాన్ని కూడా సెషన్స్‌ కోర్టు పరిశీలించలేదన్నారు. అందువల్ల నారాయణ రిమాండ్‌ను తిరస్కరిస్తూ మేజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేస్తూ సెషన్స్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేస్తున్నట్లు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. మేజి్రస్టేట్‌ ఇచ్చిన ఉత్తర్వుల తప్పొప్పులపై ఇరుపక్షాలు వాదనలు వినిపించాయని, అయితే.. ఆ విషయాన్ని తేల్చాల్సింది సెషన్స్‌ కోర్టే తప్ప హైకోర్టు కాదన్నారు. అందువల్ల సెషన్స్‌ కోర్టు తిరిగి ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి మేజిస్ట్రేట్‌ ఉత్తర్వుల సంగతి తేల్చాలని స్పష్టంచేశారు. 

చదవండి: (దగుల్బాజీ రామోజీ తప్పు చేస్తే ప్రశ్నించకూడదా?: మంత్రి కాకాణి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement