సాక్షి, హైదరాబాద్: ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజా పరిస్థితిపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి సమీక్షించారు. ఇప్పుడున్న భద్రతతోపాటు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. విద్య, రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో జిల్లా కలెక్టర్లకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇక నుంచి జరిగే పరీక్షల్లో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.
జిల్లాస్థాయిలో చురుకైన, సమర్థులైన అధికారులనే ఈ కార్యక్రమానికి ఎంపిక చేయాలని విద్యాశాఖకు ప్రభుత్వం సూచించింది. దీంతో పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయం అన్ని జిల్లాల నుంచి కొంతమంది అధికారుల పేర్లు తెప్పించింది. పరీక్ష కేంద్రాల సమగ్ర సమాచారం తెప్పించుకుని పరిశీలించింది. ఎక్కడ ఎలాంటి చర్యలు చేపట్టాలనేదానిపై కసరత్తు చేసింది. ప్రత్యేక బృందాలతో రాష్ట్రస్థాయి నెట్‌వర్క్ ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రశ్నపత్రాల చేరవేత నుంచి జవాబుపత్రాలను మూల్యాంకన కేంద్రాలకు తరలించే వరకూ గట్టి నిఘా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.
మరోవైపు, పోలీసు అధికారులు సాంకేతిక కోణంలో నిఘాను పెంచుతున్నారు. అనుమానిత కేంద్రాల వద్ద సెల్‌ఫోన్ టవర్ల ద్వారా అవసరమైన సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. స్పెషల్ బ్రాంచ్‌కు అందే కీలకమైన సమాచారం విశ్లేషించి, పరీక్ష కేంద్రాల పరిసరాల్లో సెల్‌ఫోన్ టవర్స్‌పై నిఘా పెంచి కాల్స్‌ను గుర్తించాలని నిర్ణయించారు. లీకేజీ వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో పరీక్షలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సీఎస్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ప్రతీ జిల్లాలో ప్రత్యేక బృందాలు
♦ టెన్త్ పరీక్షల కోసం ప్రతీ జిల్లాలో ప్రత్యేక అధికారుల బృందాన్ని గురువారం ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో రెవెన్యూ ఉన్నతాధికారి దీనికి నేతృత్వం వహిస్తారు. పరీక్ష కేంద్రాలు, అందులో పనిచేస్తున్న సిబ్బంది, ఫ్లయింగ్ స్వా్కడ్స్, ఇన్విజిలేటర్లపై వీరి ఆజమాయిషీ ఉంటుంది. జిల్లా పరిధిలో పరీక్షల కేంద్రాలకు వీరి ద్వారా అవసరమైన సమాచారం వెళ్తుంది. తనిఖీ బృందాలకు ఎప్పటికప్పుడు ఆదేశాలిచ్చే వ్యవస్థను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారుల ద్వారా తెప్పించుకునే ప్రత్యేక అధికారం వీరికి ఉంటుంది.
♦ తహసీల్దార్, ఎంపీడీఓలు ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తారు. జిల్లాల్లో వివిధ జోన్లుగా విభజించి వీరికి బాధ్యతలు అప్పగించారు. పరీక్ష కేంద్రం నుంచి సమాచారం తెలుసుకుని, అవసరమైన సంకేతాలివ్వడం, అనుమానం ఉంటే తక్షణమే పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం వీరి బాధ్యత.
♦ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సిట్టింగ్ స్వా్కడ్స్ ఉండగా లీకేజీల నేపథ్యంలో మరికొన్ని ప్రత్యేక స్వా్కడ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో విద్యాశాఖ జిల్లాస్థాయి అధికారులుంటారు. డివిజన్ల వారీగా వీరు విధులు నిర్వర్తిస్తారు. మరోవైపు పోలీసు శాఖ నుంచీ ప్రత్యేక ఫ్లయింగ్ స్వా్కడ్ ఏర్పాటు చేశారు. ఇవి జిల్లాస్థాయిలో బృందాలుగా వెళ్లి పనిచేస్తాయి.
సమస్యాత్మక కేంద్రాల విశ్లేషణ
రాష్ట్రంలోని 2,652 పరీక్ష కేంద్రాలను వివిధ కేటగిరీలుగా విభజించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక, సాధారణ కేంద్రాల జాబితాను తయారు చేశారు. రాజకీయంగా సమస్యలున్న ప్రాంతాల్లోని కేంద్రాల వివరాలను ప్రత్యేకంగా సేకరించారు. అక్కడ అనుమానాస్పద కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా? కొత్త వ్యక్తులు వస్తున్నారా? అనే వివరాలు సేకరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నిఘా ఏర్పాటు చేస్తున్నట్టు విద్యాశాఖ అదనపు డైరెక్టర్ లింగయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment