cellphone towers
-
పరీక్ష కేంద్రాల పరిసరాల టవర్లపై నిఘా
సాక్షి, హైదరాబాద్: ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజా పరిస్థితిపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి సమీక్షించారు. ఇప్పుడున్న భద్రతతోపాటు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. విద్య, రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో జిల్లా కలెక్టర్లకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇక నుంచి జరిగే పరీక్షల్లో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాస్థాయిలో చురుకైన, సమర్థులైన అధికారులనే ఈ కార్యక్రమానికి ఎంపిక చేయాలని విద్యాశాఖకు ప్రభుత్వం సూచించింది. దీంతో పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయం అన్ని జిల్లాల నుంచి కొంతమంది అధికారుల పేర్లు తెప్పించింది. పరీక్ష కేంద్రాల సమగ్ర సమాచారం తెప్పించుకుని పరిశీలించింది. ఎక్కడ ఎలాంటి చర్యలు చేపట్టాలనేదానిపై కసరత్తు చేసింది. ప్రత్యేక బృందాలతో రాష్ట్రస్థాయి నెట్వర్క్ ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రశ్నపత్రాల చేరవేత నుంచి జవాబుపత్రాలను మూల్యాంకన కేంద్రాలకు తరలించే వరకూ గట్టి నిఘా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు, పోలీసు అధికారులు సాంకేతిక కోణంలో నిఘాను పెంచుతున్నారు. అనుమానిత కేంద్రాల వద్ద సెల్‌ఫోన్ టవర్ల ద్వారా అవసరమైన సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. స్పెషల్ బ్రాంచ్‌కు అందే కీలకమైన సమాచారం విశ్లేషించి, పరీక్ష కేంద్రాల పరిసరాల్లో సెల్‌ఫోన్ టవర్స్‌పై నిఘా పెంచి కాల్స్‌ను గుర్తించాలని నిర్ణయించారు. లీకేజీ వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో పరీక్షలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సీఎస్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రతీ జిల్లాలో ప్రత్యేక బృందాలు ♦ టెన్త్ పరీక్షల కోసం ప్రతీ జిల్లాలో ప్రత్యేక అధికారుల బృందాన్ని గురువారం ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో రెవెన్యూ ఉన్నతాధికారి దీనికి నేతృత్వం వహిస్తారు. పరీక్ష కేంద్రాలు, అందులో పనిచేస్తున్న సిబ్బంది, ఫ్లయింగ్ స్వా్కడ్స్, ఇన్విజిలేటర్లపై వీరి ఆజమాయిషీ ఉంటుంది. జిల్లా పరిధిలో పరీక్షల కేంద్రాలకు వీరి ద్వారా అవసరమైన సమాచారం వెళ్తుంది. తనిఖీ బృందాలకు ఎప్పటికప్పుడు ఆదేశాలిచ్చే వ్యవస్థను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారుల ద్వారా తెప్పించుకునే ప్రత్యేక అధికారం వీరికి ఉంటుంది. ♦ తహసీల్దార్, ఎంపీడీఓలు ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తారు. జిల్లాల్లో వివిధ జోన్లుగా విభజించి వీరికి బాధ్యతలు అప్పగించారు. పరీక్ష కేంద్రం నుంచి సమాచారం తెలుసుకుని, అవసరమైన సంకేతాలివ్వడం, అనుమానం ఉంటే తక్షణమే పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం వీరి బాధ్యత. ♦ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సిట్టింగ్ స్వా్కడ్స్ ఉండగా లీకేజీల నేపథ్యంలో మరికొన్ని ప్రత్యేక స్వా్కడ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో విద్యాశాఖ జిల్లాస్థాయి అధికారులుంటారు. డివిజన్ల వారీగా వీరు విధులు నిర్వర్తిస్తారు. మరోవైపు పోలీసు శాఖ నుంచీ ప్రత్యేక ఫ్లయింగ్ స్వా్కడ్ ఏర్పాటు చేశారు. ఇవి జిల్లాస్థాయిలో బృందాలుగా వెళ్లి పనిచేస్తాయి. సమస్యాత్మక కేంద్రాల విశ్లేషణ రాష్ట్రంలోని 2,652 పరీక్ష కేంద్రాలను వివిధ కేటగిరీలుగా విభజించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక, సాధారణ కేంద్రాల జాబితాను తయారు చేశారు. రాజకీయంగా సమస్యలున్న ప్రాంతాల్లోని కేంద్రాల వివరాలను ప్రత్యేకంగా సేకరించారు. అక్కడ అనుమానాస్పద కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా? కొత్త వ్యక్తులు వస్తున్నారా? అనే వివరాలు సేకరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నిఘా ఏర్పాటు చేస్తున్నట్టు విద్యాశాఖ అదనపు డైరెక్టర్ లింగయ్య తెలిపారు. -
స్ట్రీట్ లైన్ల నుంచే సెల్ సిగ్నల్స్!
లాస్ఏంజెలెస్: సెల్‌ఫోన్ టవర్లపై ‘ఇంటర్నెట్’ భారం పెరుగుతోంది. 2జీ, 3జీలు దాటిపోయి.. ప్రపంచం ఫోర్ జీ వైపు అడుగులేస్తోంది. 2020 కల్లా ప్రపంచంలో సెల్యులర్ డాటా ట్రాఫిక్ ఏకంగా 900 శాతం పెరుగుతుందని అంచనా. దీంతో సెల్ టవర్ల నిర్వహణ ఆపరేటర్లకు సవాలుగా మారుతోంది. ఇలాంటి నేపథ్యంలో అధునాతన ఆవిష్కరణలు ఈ విషయంలో కొత్త పరిష్కారాలుగా మారుతున్నాయి. లాస్ఏంజెలెస్లో స్ట్రీట్లైట్ల కోసం ఏర్పాటు చేసే పోల్స్‌కే సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను ఇచ్చే ఆంటెన్నాలను అమర్చే కార్యక్రమం మొదలైంది. మరీ పెద్దపెద్ద సెల్‌ఫోన్ టవర్స్ స్థాయిలో కాకపోయినా, సమీపదూరాలకు పుష్కలంగా సిగ్నల్స్‌ను అందించగలవు ఈ ఆంటెన్నాలు. దీంతో భారీ ఎత్తున సెల్‌ఫోన్ టవర్లను నిర్మించాల్సిన అవసరం తగ్గడంతో పాటు, సిగ్నల్స్ విషయంలో కూడా సమస్య లేకుండా పోతుంది. ప్రస్తుతానికి ఆ నగరంలో వీటి ఏర్పాటు జరుగుతోంది. మిగతా ప్రపంచమంతా దీన్ని అందిపుచ్చుకోవడానికి అవసరంతో కూడిన ఆసక్తితో ఎదురుచూస్తోంది! -
సెల్‌ఫోన్ టవర్స్‌లో విద్యుత్ వాడితే భారీ ఆదా
- సీఐఐ ఎనర్జీ సమిట్ ప్రెసిడెంట్ నౌషద్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించడం ద్వారా కేవలం సెల్‌ఫోన్ టవర్స్‌లోనే ఏటా రూ. 10,000 కోట్లు ఆదా చేయొచ్చని బ్యూరో ఆఫ్ ఎనర్జీ అఫిషియెన్సీ అంచనా వేసింది. సెల్‌ఫోన్ టవర్స్ పరిశ్రమ ఇంధన అవసరాల కోసం ఏటా రూ.15,000 కోట్ల విలువైన డీజిల్‌ను వినియోగిస్తోందని, దీని స్థానంలో చౌక విద్యుత్‌ను వినియోగించడం ద్వారా వ్యయాలను భారీగా తగ్గించుకోవచ్చని చెపుతోంది. ‘‘డీజిల్ ద్వారా ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి రూ.15-18 వరకు ఖర్చవుతోంది. దీని బదులు టవర్స్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేస్తే యూనిట్ రూ.6-8కే పొందవచ్చు’’ అని సీఐఐ ఎనర్జీ ఎఫిషియెన్సీ సమిట్-2015 ప్రెసిడెంట్ నౌషద్ ఫోర్బ్స్ చెప్పారు. దేశంలో రైల్వేల తర్వాత అత్యధికంగా డీజిల్‌ను వినియోగిస్తున్నది సెల్ టవర్స్ పరిశ్రమేనని, ఇది ఇతర చౌక ప్రత్యామ్నాయ ఇంధన వనరులకేసి చూడాల్సి ఉందని చెప్పారాయన. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సీఐఐ ఎనర్జీ అఫిషియెన్సీ సమిట్ 2015లో ఆయన మాట్లాడారు. కాగా ప్రపంచ దేశాలతో పోలిస్తే స్టీల్, పేపర్ పరిశ్రమలో ఇంధన వినియోగం చాలా ఎక్కువగా ఉందని, దీన్ని బాగా తగ్గించాల్సిన అవసరం ఉందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ అఫిషియెన్సీ డెరైక్టర్ జనరల్ అజయ్ మాథుర్ తెలిపారు. -
అక్రమ సెల్‌ఫోన్ టవర్లపై చర్యలేవీ?
సాక్షి, ముంబై: నగరంలో అక్రమంగా ఏర్పాటుచేసిన సెల్‌ఫోన్ టవర్లను తొలగించేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిపాలన విభాగానికి ముహూర్తం దొరకడం లేదు. నియమాలను తుంగలో తొక్కి ఏర్పాటు చేసుకున్న వివిధ కంపెనీలకు చెందిన వేలాది సెల్‌ఫోన్ టవర్లను తొలగించేందుకు నిర్ణయించిన బీఎంసీ ఆ మేరకు కొత్త నియమావళిని రూపొందించడంలో సాగదీత ధోరణిని అవలంభిస్తోంది. దీన్ని రూపొందించేందుకు ఇప్పటివరకు బీఎంసీకి సమయం దొరకకపోవడం వారికి పనిమీద ఉన్న శ్రద్ధను తెలియజేస్తోంది. నగరంలో వివిధ సంస్థలకు చెందిన 4,776 సెల్‌ఫోన్ టవర్లు ఉన్నాయి. ఇందులో ఏకంగా 75 శాతం టవర్లు అక్రమంగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. కేవలం 1,145 టవర్లు మాత్రమే అవసరమైన అనుమతులు తీసుకున్న నిర్వాహకులు నియమాలకు కట్టుబడి వాటిని ఏర్పాటు చేశారు. మిగతా టవర్లు అక్రమంగా ఏర్పాటు చేసినట్లు బీఎంసీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో వెల్లడైంది. అయినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ టవర్ల నుంచి వెలువడుతున్న రేడియేషన్ వల్ల చుట్టుపక్కల ప్రజలు పడుతున్న ఇబ్బందులను విన్నవించేందుకు హిందీ సినీ నటి జూహి చావ్లా ఇటీవల బీఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ సీతారాం కుంటేతో భేటీ అయ్యారు. దీంతో నగరంలోని సెల్ టవర్లపై జూన్ ఒకటో తేదీ వరకు వివరాలు అందజేసి, జూలై 15 వరకు కొత్త నియమావళి ప్రకటిస్తామని చావ్లాకు కుంటే హామీ ఇచ్చారు. కానీ ఆయన స్పందించకపోవడంతో బీజేపీ కార్పొరేటర్ వినోద్ శేలార్ సీతారాం కుంటేతో భేటీ అయి ఆగస్టు ఒకటో తేదీ వరకు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కానీ ఆగస్టు రెండో వారం ముగుస్తున్నా ఇంతవరకు ఎలాంటి నియమావళి అమలు చేయలేదు. అయితే అనేక సెల్ టవర్లకు బెస్ట్ సంస్థ, రిలయన్స్ ఎనర్జీ విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. ఇందులో అత్యధిక శాతం టవర్లు అక్రమంగా ఏర్పాటుచేసినవే ఉన్నాయి. ఇలాంటి టవర్లపై దర్యాప్తు చేయడంతో పాటు వీటికి విద్యుత్ సరఫరా చేసేందుకు అనుమతినిచ్చిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని శేలార్ డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రజల సమస్యలు వినేందుకు సెల్ టవర్ల కంపెనీల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సమాజ సేవా సంస్థల పదాధికారులతో కూడిన ఒక కమిటీని స్థాపించాలని కోరుతూ ఆయన కేంద్ర మంత్రి మిలింద్ దేవరాకు ఒక లేఖ పంపించారు.