సెల్‌ఫోన్ టవర్స్‌లో విద్యుత్ వాడితే భారీ ఆదా
- సీఐఐ ఎనర్జీ సమిట్ ప్రెసిడెంట్ నౌషద్ వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించడం ద్వారా కేవలం సెల్‌ఫోన్ టవర్స్‌లోనే ఏటా రూ. 10,000 కోట్లు ఆదా చేయొచ్చని బ్యూరో ఆఫ్ ఎనర్జీ అఫిషియెన్సీ అంచనా వేసింది. సెల్‌ఫోన్ టవర్స్ పరిశ్రమ ఇంధన అవసరాల కోసం ఏటా రూ.15,000 కోట్ల విలువైన డీజిల్‌ను వినియోగిస్తోందని, దీని స్థానంలో చౌక విద్యుత్‌ను వినియోగించడం ద్వారా వ్యయాలను భారీగా తగ్గించుకోవచ్చని చెపుతోంది. ‘‘డీజిల్ ద్వారా ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి రూ.15-18 వరకు ఖర్చవుతోంది.
దీని బదులు టవర్స్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేస్తే యూనిట్ రూ.6-8కే పొందవచ్చు’’ అని సీఐఐ ఎనర్జీ ఎఫిషియెన్సీ సమిట్-2015 ప్రెసిడెంట్ నౌషద్ ఫోర్బ్స్ చెప్పారు. దేశంలో రైల్వేల తర్వాత అత్యధికంగా డీజిల్‌ను వినియోగిస్తున్నది సెల్ టవర్స్ పరిశ్రమేనని, ఇది ఇతర చౌక ప్రత్యామ్నాయ ఇంధన వనరులకేసి చూడాల్సి ఉందని చెప్పారాయన. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సీఐఐ ఎనర్జీ అఫిషియెన్సీ సమిట్ 2015లో ఆయన మాట్లాడారు. కాగా ప్రపంచ దేశాలతో పోలిస్తే స్టీల్, పేపర్ పరిశ్రమలో ఇంధన వినియోగం చాలా ఎక్కువగా ఉందని, దీన్ని బాగా తగ్గించాల్సిన అవసరం ఉందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ అఫిషియెన్సీ డెరైక్టర్ జనరల్ అజయ్ మాథుర్ తెలిపారు.