Bureau of Energy Efficiency
-
ఇంజన్ల మోత ఉండదిక!
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా కర్బన ఉద్గారాలపై ఆందోళన ఎక్కువవుతోన్న నేపథ్యంలో విద్యుత్ వాహనాలు (ఈవీ)లకు ఆదరణ పెరుగుతోంది. ఏటా 10 లక్షలకు పైగా ఈవీలను వాహనదారులు కొనుగోలు చేస్తున్నారు. గతేడాది 10.4 లక్షల వాహన విక్రయాలు జరగ్గా..ఈ ఏడాది అది 13.8 లక్షలకు, 2030 నాటికి 30 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఈ ఏడాది అమ్ముడవుతోన్న మొత్తం ద్విచక్ర వాహనాల్లో 4.5% ఎలక్ట్రిక్ వాహనాలే ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో వాటికి అవసరమైన చార్జింగ్ స్టేషన్లూ భారీగా ఏర్పాటవుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి 6 వేల చార్జింగ్ స్టేషన్లు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్నాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) నివేదిక ప్రకారం.. దేశంలో 9,113 పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్లు 15,493 ఈవీ చార్జర్లలో పనిచేస్తున్నాయి. వాహనాలకనుగుణంగా ఈవీ చార్జర్ల విక్రయాలూ పెరుగుతున్నాయి. అది ఎంతగా అంటే 2030 నాటికి దేశంలో ఈవీ చార్జర్ల డిమాండ్ ప్రస్తుతం ఉన్నదానికంటే 65% పెరుగుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ లెక్కన ఏడేళ్లలో 30 లక్షల చార్జర్లు అవసరమని కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ (సీఈఎస్), ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్ఏ) సంయుక్త నివేదిక తెలిపింది. అప్పగించే పని మొదలైంది ఎలక్ట్రిక్ వాహనాల విప్లవాన్ని రాష్ట్రంలో తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాలను సాధించాలనే జాతీయ లక్ష్యానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. భవిష్యత్‌లో రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం, ఎన్ఆర్ఈడీసీఏపీ స్థలాలను గుర్తించాయి. నమోదు చేసుకున్న నిర్వాహకులకు చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు బాధ్యతలను అప్పగించే పని మొదలైంది. – ఎస్ రమణారెడ్డి, వీసీ, ఎండీ, ఎన్ఆర్ఈడీసీఏపీ ప్రత్యేక పాలసీ..స్థిరమైన లక్ష్యం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక పాలసీని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈఎంఐ (వాయిదా)ప్రాతిపదికన లక్ష ఎలక్ట్రిక్ వాహనాలను పంపిణీ చేస్తోంది. రోడ్డు పన్ను, రిజి్రస్టేషన్ ఫీజు మినహాయింపు వంటి ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఇంధన ఖర్చులు భారంగా మారిన నేటి కాలంలో దిగువ/మధ్య తరగతి ప్రజలకు సాయపడేలా సుస్థిర రవాణాను అభివృద్ధి చేయడానికి రాష్ట్రమంతటా చార్జింగ్ మౌలిక సదుపాయాలను న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) ఆధ్వర్యంలో 266 ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. మరో 115 స్టేషన్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. దీంతో రాష్ట్రంలో విద్యుత్ వాహనాల సంఖ్య 65,000 దాటింది. 2030 నాటికి పెట్రోల్ వాహనాలను దశల వారీగా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా జాతీయ రహదారుల వెంబడి 25 కి.మీ ఒకటి చొప్పున, నగర పరిధిలో ప్రతి 3 కీలోమీటర్ల గ్రిడ్ లోపల చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 4 వేల స్థలాలను గుర్తించింది. -
రిఫ్రిజిరేటర్ల కొనుగోలు దారులకు భారీ షాక్!
న్యూఢిల్లీ: రిఫ్రిజిరేటర్లు మరింత ప్రియం కానున్నాయి. ధరలు 5 శాతం వరకు అధికం అయ్యే అవకాశం ఉంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ (బీఈఈ) నూతన ప్రమాణాలు జనవరి 1 నుంచి అమలులోకి రావడమే ఇందుకు కారణం. కొత్త ప్రమాణాల కారణంగా మోడల్‌నుబట్టి 2–5 శాతం ధర పెరగవచ్చని గోద్రెజ్ అప్లయెన్సెస్, హాయర్, ప్యానాసోనిక్ వెల్లడించాయి. ఫ్రాస్ట్–ఫ్రీ మోడళ్లలో ఫ్రీజర్స్, రిఫ్రిజిరేటర్ ప్రొవిజనింగ్ యూనిట్ల (నిల్వ విభాగం) కోసం వేర్వేరుగా స్టార్ లేబులింగ్‌ను బీఈఈ తప్పనిసరి చేసింది. రిఫ్రిజిరేటర్ స్థూల సామర్థ్యానికి బదులు నికర సామర్థ్యం (వినియోగం అయ్యే స్థలం) ఆధారంగానే కంపెనీలు స్టార్ లేబులింగ్ చేయాల్సి ఉంటుంది. రీసెర్చ్ అండ్ మార్కెట్స్ నివేదిక ప్రకారం భారత్‌లో రిఫ్రిజిరేటర్ల విపణి 2022లో రూ.25,352 కోట్లు ఉంది. -
Bureau Of Energy Efficiency: ఇంధన సంరక్షణలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: ఇంధన సంరక్షణ కార్యక్రమాల అమలుకు ఏపీ చేస్తున్న కృషిని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే ప్రశంసించారు. అన్ని స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీలతో (ఎస్డీఏ) ఆదివారం జరిగిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఇంధన సంరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ఆధ్వర్యంలో డిసెంబర్ 14 నుంచి 20 వరకు జరిగిన జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇంధన శాఖను ఆయన అభినందించారు. చదవండి: సర్వతోముఖాభివృద్ధి దిశగా ఏపీ దేశంలో ఇంధన–పొదుపు పెట్టుబడి సామర్థ్యం 2031 నాటికి దాదాపు రూ. 10.02 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు భాక్రే తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ఇంధన రంగాన్ని బలోపేతం చేయడానికి, పర్యావరణాన్ని మెరుగుపరచడానికి, ఆర్థిక వ్యవస్థను పెంచడానికి ఇంధన సామర్థ్యం, దాని ప్రయోజనాలను గుర్తించాలని ఆయన సూచించారు. ఆ దిశగా పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఏపీలో రూ. 2,185 కోట్ల ఇంధన మిగులు పారిశ్రామిక రంగంలో ఇంధన పొదుపు సామర్థ్యం రూ. 5.15 లక్షల కోట్లుగా అంచనా వేయగా, రవాణా రంగంలో రూ. 2.26 లక్షల కోట్లు, గృహ రంగంలో రూ. 1.2 లక్షల కోట్లు ఉందని డీజీ వివరించారు. పెర్ఫార్మ్ అచీవ్ ట్రేడ్ పథకం (సైకిల్–1–2) అమలు చేయడం ద్వారా పారిశ్రామిక రంగం దాదాపు రూ. 40,945 కోట్ల విలువైన 21.95 మిలియన్ టన్నుల చమురును ఆదా చేసిందన్నారు. ఏపీలో 30 పరిశ్రమల్లో రూ. 2,185 కోట్ల విలువైన ఇంధనాన్ని మిగల్చడం శుభ పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా 2020–21 నుంచి 2024 –25 వరకు రూ. 4,200 కోట్ల అంచనా వ్యయంతో అన్ని రంగాల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు డీజీ వెల్లడించారు. దీనివల్ల 2030 నాటికి సంవత్సరానికి 557 మిలియన్ టన్నుల కార్బన్డయాక్సైడ్ తగ్గే అవకాశం కలుగుతుందన్నారు. ఈ సమావేశంలో బీఈఈ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్, డైరెక్టర్లు మిలింద్ డియోర్, సునీల్ ఖండరే, ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. -
ఇంధన సామర్థ్యం, పొదుపులో ఏపీ కృషి అభినందనీయం
సాక్షి, అమరావతి : ఇంధన సామర్థ్యం, ఇంధన పొదుపును ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ చేస్తున్న కృషిని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే అభినందించారు. స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఏపీ రోల్ మోడల్‌గా మారిందని ప్రశంసించారు. యూకేలోని గ్లాస్గోలో జరుగుతున్న 26వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్) సదస్సు ముగింపులో భారతీయ ప్రతినిధిగా ఆయన పాల్గొన్నారు. ఆ వివరాలను ఆదివారం ఏపీ ఇంధన పర్యవేక్షక మిషన్ సీఈవో చంద్రశేఖరరెడ్డి మీడియాకు చెప్పారు. ఏపీలో 65 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)ల్లో ఐఓటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్) పవర్ మానిటరింగ్ డివైజ్‌ను ఇన్స్టాల్ చేయడం ద్వారా ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు. ఏపీ చర్యలు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించేవిగా ఉన్నాయని అభయ్ భాక్రే కొనియాడారు. కర్బన ఉద్గారాల తీవ్రత తగ్గితేనే సమగ్రాభివృద్ధి దేశంలో కర్బన ఉద్గారాల తీవ్రతను తగ్గించడం ద్వారా సమగ్రాభివృద్ధి సాధ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థికాభివృద్ధి, పర్యావరణ సమతుల్యంపై దృష్టి సారించిందని, 2030 నాటికి 33–35 శాతం ఉద్గార తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని అభయ్ భాక్రే చెప్పారు. స్వచ్ఛమైన ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం చాలా అవసరమన్నారు. బీఈఈ చేస్తున్న ప్రయత్నాల వల్ల 2030 నాటికి.. 557 మిలియన్ టన్నుల కార్బన్‌డైయాక్సైడ్ తగ్గుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. దేశంలో ఇంధన–పొదుపు పెట్టుబడి సామర్థ్యం దాదాపు రూ.10.02 లక్షల కోట్ల నుంచి రూ.13.20 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నామని, ఈ అవకాశాన్ని రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పారిశ్రామిక రంగంలో ప్రస్తుతం ఉన్న మొత్తం ఇంధన వినియోగం 347 మిలియన్ యూనిట్లు కాగా, 2031 నాటికి 443.4 మిలియన్ యూనిట్లకు చేరుతుందని తెలిపారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ఇంధన సామర్థ్య ఏజెన్సీల స్థాపనను తప్పనిసరి చేస్తూ ఇంధన సంరక్షణ చట్టం–2001ని సవరించనుందని, దీనిని అన్ని రాష్ట్రాలూ పాటించాలని అభయ్ భాక్రే సూచించినట్టు చంద్రశేఖరరెడ్డి వివరించారు. -
భారీగా పెరగనున్న టీవీ, ఫ్రిజ్‌ల ధరలు!
టీవీ, వాషింగ్ మెషీన్, ఫ్రిజ్, ఏసీ, మైక్రోవేవ్ ఓవెన్ తదితర వైట్ గూడ్స్ ధరలు త్వరలోనే పెరగనున్నాయి. ఉత్పత్తి, రవాణా వ్యయాలు పెరుగుతుండటంతో ఈ వస్తువుల ధరలను కంపెనీలు పెంచక తప్పడం లేదు. ఎల్సీడీ/ఎల్ఈడీ ప్యానెళ్లపై 5 శాతం సుంకం విధించడం, భవిష్యత్తులో ఈ సుంకం మరింత పెరగనుండటంతో టీవీల ధరలు కొండెక్కనున్నాయి. వైట్ గూడ్స్ ధరల పెరుగుదలపై సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ... వైట్ గూడ్స్‌కు సంబంధించి ఉత్పత్తి వ్యయాలు 15–40 శాతం మేర పెరిగాయి. ఈ వస్తువుల తయారీలో ఉపయోగపడే రాగి, జింక్, అల్యూమినియమ్, ఉక్కు, ప్లాస్టిక్ తదితర వస్తువుల ధరలు బాగా పెరిగాయి. రాగి, జంక్, అల్యూమినియమ్ ధరలు గత ఐదు నెలల్లోనే 40–45 శాతం మేర ఎగిశాయి. ఫ్రిజ్‌లు, చెస్ట్ ఫ్రీజర్లలో ఉపయోగించే ఫోమ్స్ తయారీలో వాడే ఎమ్‌డీఐ కెమికల్ ధర 200 శాతం ఎగసింది. ఇక ప్లాస్టిక్ ధరలు 30–40 శాతం పెరిగాయి. మరోవైపు సముద్ర రవాణా 40–50 శాతం మేర ఎగసింది. భారీగా పెరుగుదల...! వైట్ గూడ్స్ ధరలు 20 శాతం మేర పెరగనున్నాయని, ఒకేసారి ఇంత భారీగా ధరలు పెరగడం గత కొన్నేళ్లలో ఇదే మొదటిసారని పరిశ్రమ వర్గాలంటున్నాయి. కరెన్సీ మారకం రేటు నిలకడగా ఉండటం ఒకింత మేలు చేసిందని, లేకుంటే ధరల మోత మరింత అధికంగా ఉండేదని నిపుణులంటున్నారు. మరోవైపు ఏసీ, ఫ్రిజ్‌లకు ఎనర్జీ లేబులింగ్ నిబంధనల అప్‌గ్రేడ్‌ను మరో రెండేళ్ల పాటు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) వాయిదా వేసింది. ఈ నిబంధనలను కఠినతరం చేస్తే ధరలు మరింతగా ఎగబాకేవి. ఈ నిబంధనలు రెండేళ్లు వాయిదా పడటం ఒకింత ఊరట నిచ్చే అంశం. పండుగల సీజన్లోనే పెంచాల్సింది..! అసలైతే సెప్టెంబర్ నుంచే ధరలు పెంచాల్సి ఉంది. కానీ పండుగ అమ్మకాలపై ప్రభావం ఉంటుందనే భయాలతో ధరల పెంపును కంపెనీలు వాయిదా వేశాయి. మొత్తం ఏడాది అమ్మకాల్లో మూడో వంతు ఈ పండగ సీజన్లో ఉండటంతో మార్జిన్లు తగ్గించుకుని, ధరలు పెంచకుండా కంపెనీలు మేనేజ్ చేశాయి. ఇక ఇప్పుడు పండుగల సీజన్ పూర్తి కావడంతో ధరలు పెంచక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని, ఈ నెల చివర్లో గానీ, వచ్చే నెల మొదట్లో గానీ ధరల పెంపుదల ఉండొచ్చని పరిశ్రమ వర్గాలంటున్నాయి. కాగా హెయిర్ ఇండియా కంపెనీ టీవీల ధరలను ఇప్పటికే 5–7 శాతం మేర పెంచింది. వచ్చే నెలలో మరింతగా పెంచే అవకాశాలున్నాయని సమాచారం. ప్యానాసానిక్ ఇండియా తన వస్తువుల ధరలను ఇప్పటికే 7 శాతం మేర పెంచింది. భయపడుతున్న కంపెనీలు... కరోనా కల్లోలం కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ వరకూ వైట్ గూడ్స్ అమ్మకాలు కుదేలయ్యాయి. పండుగల సీజన్ పుణ్యమాని ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటున్నాయి. అమ్మకాలు కూడా రికవరీ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ వైట్ గూడ్స్ ధరలను 20 శాతం మేర పెంచడం అమ్మకాల రికవరీపై తీవ్రంగానే ప్రభావం చూపుతుందని కంపెనీలు భయపడుతున్నాయి. అయితే పెరుగుతున్న ఉత్పత్తి, రవాణా వ్యయాలను భరించే స్థాయిలో కంపెనీలు లేవు. ధరలు పెంచక తప్పని పరిస్థితి. ఇక ఈ ధరల పెరుగుదల మార్చి క్వార్టర్లో అమ్మకాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావమే చూపించగలదని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. టీవీలకు సుంకాల దెబ్బ... ఎల్ఈడీ/ఎల్సీడీ స్క్రీన్ల తయారీలో ఉపయోగపడే ఓపెన్–సెల్ ప్యానెళ్లపై దిగుమతి సుంకాలను కేంద్రం పెంచనున్నది. వీటిని స్థానికంగా తయారు చేయడాన్ని ప్రోత్సహించే నిమిత్తం సుంకాలను మూడేళ్లలో 8–10 శాతానికి పెంచాలనేది కేంద్రం అభిమతం. ఈ ప్యానెళ్ల దిగుమతులపై సెప్టెంబర్ వరకూ ఎలాంటి సుంకాలు లేవు. అక్టోబర్‌లో ఈ సుంకాన్ని కేంద్రం 5 శాతంగా విధించింది. ఈ ప్యానెళ్లపై సుంకం పెంపుదల కారణంగా టీవీల ధరలు కూడా 5 శాతం మేర పెరుగుతాయి. మరోవైపు సెప్టెంబర్ నుంచే ప్యానెళ్ల తయారీ ధరలు ప్యానెళ్ల ధరలను 20–25 శాతం మేర పెంచారు. ప్యానెళ్ల ధరలు పెరగడం, సుంకాల పెంపు... వెరసి టీవీల ధరలు 20 శాతం మేర ఎగిసే అవకాశాలున్నాయి. -
సెల్‌ఫోన్ టవర్స్‌లో విద్యుత్ వాడితే భారీ ఆదా
- సీఐఐ ఎనర్జీ సమిట్ ప్రెసిడెంట్ నౌషద్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించడం ద్వారా కేవలం సెల్‌ఫోన్ టవర్స్‌లోనే ఏటా రూ. 10,000 కోట్లు ఆదా చేయొచ్చని బ్యూరో ఆఫ్ ఎనర్జీ అఫిషియెన్సీ అంచనా వేసింది. సెల్‌ఫోన్ టవర్స్ పరిశ్రమ ఇంధన అవసరాల కోసం ఏటా రూ.15,000 కోట్ల విలువైన డీజిల్‌ను వినియోగిస్తోందని, దీని స్థానంలో చౌక విద్యుత్‌ను వినియోగించడం ద్వారా వ్యయాలను భారీగా తగ్గించుకోవచ్చని చెపుతోంది. ‘‘డీజిల్ ద్వారా ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి రూ.15-18 వరకు ఖర్చవుతోంది. దీని బదులు టవర్స్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేస్తే యూనిట్ రూ.6-8కే పొందవచ్చు’’ అని సీఐఐ ఎనర్జీ ఎఫిషియెన్సీ సమిట్-2015 ప్రెసిడెంట్ నౌషద్ ఫోర్బ్స్ చెప్పారు. దేశంలో రైల్వేల తర్వాత అత్యధికంగా డీజిల్‌ను వినియోగిస్తున్నది సెల్ టవర్స్ పరిశ్రమేనని, ఇది ఇతర చౌక ప్రత్యామ్నాయ ఇంధన వనరులకేసి చూడాల్సి ఉందని చెప్పారాయన. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సీఐఐ ఎనర్జీ అఫిషియెన్సీ సమిట్ 2015లో ఆయన మాట్లాడారు. కాగా ప్రపంచ దేశాలతో పోలిస్తే స్టీల్, పేపర్ పరిశ్రమలో ఇంధన వినియోగం చాలా ఎక్కువగా ఉందని, దీన్ని బాగా తగ్గించాల్సిన అవసరం ఉందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ అఫిషియెన్సీ డెరైక్టర్ జనరల్ అజయ్ మాథుర్ తెలిపారు. -
ఏసీ అమ్మకాలు... కూల్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ కండీషనర్ల(ఏసీ) తయారీ కంపెనీలకు ఈ వేసవి కలిసిరానుంది. ఎండలు 20 రోజులు ఆలస్యంగా మొదలైనా అమ్మకాలు జోరందుకోవడంతో కంపెనీలు మార్కెట్లోకి సరఫరాలు పెంచుతున్నాయి. గతేడాది కంటే ఈ సీజన్లో 10 శాతం అధికంగా విక్రయాలు నమోదవుతాయన్న అంచనాలు మార్కెట్‌కు జోష్‌నిస్తోంది. అయితే కస్టమర్లకు ఊరటనిచ్చే అంశమేమంటే ఏసీల ధరలు ఈ వేసవిలో పెంచబోమని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. 2014 బెటర్.. దేశవ్యాప్తంగా 2012లో రూ.7,500 కోట్ల విలువైన 32 లక్షల ఏసీలు అమ్ముడయ్యాయి. ముడిసరుకులు ఖరీదవడం, డాలరు గణనీయంగా బలపడడం తదితర కారణాలతో ఏసీల ధరలు 10 శాతం దాకా పెరగడంతో 2013లో మార్కెట్ పరిమాణం 31 లక్షలకే పరిమితమైంది. ప్రస్తుత సీజన్లో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ముంబైతోపాటు పశ్చిమ ప్రాంతాల్లో మార్కెట్ గణనీయంగా పుంజుకుందని బ్లూస్టార్ రూమ్ ఏసీ విభాగం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సి.పి.ముకుందన్ మీనన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కోస్తాలో అమ్మకాలు జోరుగా ఉన్నాయని చెప్పారు. 2013తో పోలిస్తే ఏసీల ధరలు 10% వరకు పెరిగాయి. ప్రస్తుతానికి ధరలు ఇలాగే ఉంటాయని, మరింత పెరిగే అవకాశమే లేదన్నారు. 50 శాతం వాటా 3 స్టార్‌దే.. ఏసీల విపణిలో సగం వాటా 3 స్టార్ ఏసీలదే. 1-1.5 టన్నుల ఏసీలు రూ.20 వేల నుంచి లభిస్తున్నాయి. 5 స్టార్ ఏసీలు 15 శాతం మార్కెట్‌ను కైవసం చేసుకున్నాయి. వీటి ధరలు రూ.28 వేల నుంచి ప్రారంభం. ఈ ఏడాది మొత్తం మార్కెట్లో విండో ఏసీలు 7 లక్షల యూనిట్లు, స్ప్లిట్ ఏసీలు 27 లక్షల యూనిట్లకు చేరుకుంటుందని అంచనా. 5 స్టార్ ఏసీల కంటే తక్కువ విద్యుత్‌ను ఖర్చు చేసే ఇన్వర్టర్ ఏసీలు 3 శాతం మార్కెట్‌ను కైవసం చేసుకున్నాయి. 2015లో ఈ విభాగం రెండింతలవుతుందని బ్లూస్టార్ అంటోంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ(బీఈఈ) ప్రమాణాలకుతోడు సాంకేతికంగా ఇవి ఆధునికమైనవి. సాధారణంగానే వీటి ధరలు 5 స్టార్ కంటే 30% ఎక్కువ. కస్టమర్లకు ప్రభు త్వమే నేరుగా సబ్సిడీ ఇస్తే ఇన్వర్టర్ ఏసీల అమ్మకాలు మరింత పెరుగుతాయని ముకుందన్ అభిప్రాయపడ్డారు. ఉపకరణం వినియోగించే విద్యుత్ ఆధారంగా బీఈఈ స్టార్ రేటింగ్ ఇస్తోంది. 5 స్టార్ కంటే 3 స్టార్ ఏసీతో కరంటు బిల్లు ఎక్కువగా వస్తుంది. కాకపోతే ధర తక్కువగా వుండటం వల్ల 3 స్టార్ ఏసీలకు డిమాండ్ ఎక్కువ. రంగుల ఏసీలు కావాలి.. రంగు రంగుల ఏసీలను యువతరం కోరుకుంటోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఎరుపు, పసిడి, వెండి వర్ణం రంగులకు డిమాండ్ జోరుగా ఉంటోంది. మొత్తం అమ్మకాల్లో వీటి వాటా 25%. కంపెనీలు సైతం తమ ఉత్పాదనల్లో ఈ రంగులను తప్పనిసరిగా ప్రవేశపెడుతున్నాయి. తెలుపు రంగు ఏసీలు 75%గా ఉన్నాయి. మొత ్తంగా ఈ ఏడాది 34 లక్షల ఏసీలు అమ్ముడవుతాయని షార్ప్ ఇండియా మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ కిషాలయ్ రే వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో 2.7 లక్షల యూనిట్లు నమోదు కావొచ్చు. వారం రోజుల్లో 1,500 ఏసీలను విక్రయించామని, మార్కెట్ పుంజుకుంటుందని టీఎంసీ బేగంపేట షోరూం మేనేజర్ కె.శ్రీనివాస్ తెలిపారు. భారత ఏసీల రంగంలో వోల్టాస్, ఎల్జీ, ప్యానాసోనిక్లు తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. బ్లూస్టార్, హిటాచీ 4వ స్థానం, దైకిన్, శాంసంగ్ ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాయి. 20 ప్రముఖ బ్రాండ్ల వాటా 96%గా ఉంది. -
ఇక టీవీలూ, గీజర్లకూ రేటింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్ వాడకం ఆధారంగా ఇచ్చే స్టార్ రేటింగ్‌ను ఇక నుంచి టీవీలు, గీజర్లకు తప్పనిసరి చేయనున్నట్టు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ(బీఈఈ) తెలిపింది. విద్యుత్ వాడకాన్ని బట్టి వీటికి 1 నుంచి 5 వరకు బీఈఈ స్టార్ రేటింగ్ ఉంటుంది. ప్రస్తుతం స్వచ్ఛంద రేటింగ్ జాబితాలో ఉన్న టీవీలు, గీజర్లు 2014 జనవరి 1 నుంచి తప్పనిసరి రేటింగ్ జాబితా కిందకు వెళ్తాయి. తద్వారా ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ట్రాన్స్ఫార్మర్ల సరసన చేరతాయి. స్టార్ ఏసీ కనుమరుగు.. 2014 జనవరి 1 నుంచి స్టార్ రేటింగ్‌ను కఠినతరం చేయనున్నట్టు బీఈఈ డెరైక్టర్ జనరల్ అజయ్ మాథుర్ తెలిపారు. బుధవారమిక్కడ సీఐఐ 12వ ఎనర్జీ ఎఫీషియెన్సీ సమ్మిట్-2013లో పాల్గొన్న ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ‘ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ప్రస్తుత రేటింగ్‌ను మారుస్తాం. అంటే 5 స్టార్ 4 స్టార్ అవుతుంది. 4 స్టార్ 3 స్టార్ అవుతుంది. ఈ విధానంలో ప్రస్తుత 1 స్టార్ ఏసీలు కనుమరుగవుతాయి. అలాగే 5 స్టార్ ఉపకరణం మరింత సమర్థవంతంగా పనిచేసి అతి తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది’ అని తెలిపారు. అయితే ఉత్పత్తుల ధరలు పెరగడానికి రేటింగ్ ఒక్కటే కారణం కాదు. ముడిసరుకు ధర పెరగడం, రూపాయి పతనం కూడా కారణమని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్‌ను ఆదా చేసే పరిజ్ఞానం అభివృద్ధికి పరిశోధనా సంస్థలకు, కంపెనీలకు రుణ సహాయం చేసే అంశంపై కేంద్ర ఆర్థిక శాఖతో చర్చిస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన చెప్పారు.