అభయ్ భాక్రే
సాక్షి, అమరావతి : ఇంధన సామర్థ్యం, ఇంధన పొదుపును ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ చేస్తున్న కృషిని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే అభినందించారు. స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఏపీ రోల్ మోడల్‌గా మారిందని ప్రశంసించారు. యూకేలోని గ్లాస్గోలో జరుగుతున్న 26వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్) సదస్సు ముగింపులో భారతీయ ప్రతినిధిగా ఆయన పాల్గొన్నారు.
ఆ వివరాలను ఆదివారం ఏపీ ఇంధన పర్యవేక్షక మిషన్ సీఈవో చంద్రశేఖరరెడ్డి మీడియాకు చెప్పారు. ఏపీలో 65 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)ల్లో ఐఓటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్) పవర్ మానిటరింగ్ డివైజ్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు. ఏపీ చర్యలు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించేవిగా ఉన్నాయని అభయ్ భాక్రే కొనియాడారు.
కర్బన ఉద్గారాల తీవ్రత తగ్గితేనే సమగ్రాభివృద్ధి
దేశంలో కర్బన ఉద్గారాల తీవ్రతను తగ్గించడం ద్వారా సమగ్రాభివృద్ధి సాధ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థికాభివృద్ధి, పర్యావరణ సమతుల్యంపై దృష్టి సారించిందని, 2030 నాటికి 33–35 శాతం ఉద్గార తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని అభయ్ భాక్రే చెప్పారు. స్వచ్ఛమైన ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం చాలా అవసరమన్నారు. బీఈఈ చేస్తున్న ప్రయత్నాల వల్ల 2030 నాటికి.. 557 మిలియన్ టన్నుల కార్బన్‌డైయాక్సైడ్ తగ్గుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.
దేశంలో ఇంధన–పొదుపు పెట్టుబడి సామర్థ్యం దాదాపు రూ.10.02 లక్షల కోట్ల నుంచి రూ.13.20 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నామని, ఈ అవకాశాన్ని రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పారిశ్రామిక రంగంలో ప్రస్తుతం ఉన్న మొత్తం ఇంధన వినియోగం 347 మిలియన్ యూనిట్లు కాగా, 2031 నాటికి 443.4 మిలియన్ యూనిట్లకు చేరుతుందని తెలిపారు.
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ఇంధన సామర్థ్య ఏజెన్సీల స్థాపనను తప్పనిసరి చేస్తూ ఇంధన సంరక్షణ చట్టం–2001ని సవరించనుందని, దీనిని అన్ని రాష్ట్రాలూ పాటించాలని అభయ్ భాక్రే సూచించినట్టు చంద్రశేఖరరెడ్డి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment