Energy Savings
-
ఇంధన పొదుపు దిశగా టీటీడీ అడుగులు
సాక్షి, అమరావతి: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇంధన సామర్థ్య చర్యల్లో భాగంగా పాత నీటి మోటార్ల స్థానంలో స్టార్ రేటెడ్ మోటార్లను అమర్చేందుకు యోచిస్తోంది. తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం, విద్యుత్ ఆదాతో పాటు బిల్లులను తగ్గించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. విద్యుత్ కోసం టీటీడీ ఏటా రూ.40 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడం ద్వారా ఈ బిల్లులను ఏడాదికి రూ.5 కోట్ల వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా సంప్రదాయ హై కెపాసిటీ మోటార్ల స్థానంలో ఫైవ్ స్టార్ రేటెడ్ పంపు సెట్లను అమర్చనుంది. నీటి పంపింగ్ స్టేషన్లలో ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్‌పై ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం), ఎనర్జీ డిపార్ట్మెంట్, ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ సీఇడీసీఓ), టీటీడీ అధికారులు ఆదివారం వర్చువల్‌గా చర్చించారు. టీటీడీలో ప్రస్తుతం ఉన్న 118 పంపుసెట్ల స్థానంలో ఇంధన సామర్థ్య పంపుసెట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. 4.50 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా టీటీడీలో ఉన్న పంపింగ్ స్టేషన్లలో ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్ (ఐజీఈఏ) నిర్వహించినట్టు ఏపీ సీడ్కో, ఏపీ ఎస్ఈసీఎం సీనియర్ అధికారులు వెల్లడించారు. 118 పంపు సెట్లను ఇంధన సామర్థ్య పంపుసెట్లతో భర్తీ చేయడానికి సుమారు రూ.3.18 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్టు తెలిపారు. వీటివల్ల ఏటా రూ.3.17 కోట్ల విలువైన 4.50 మిలియన్ యూనిట్ల ఇంధనాన్ని ఆదా చేసే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సహకారంతో ఎల్ఈడీ లైటింగ్ ఉపకరణాలు, బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్ (బీఎల్డీసీ) ఫ్యాన్ల విభాగాల్లో టీటీడీలో ఎనర్జీ ఎఫిషియెన్సీ డెమోన్స్ట్రేషన్ ప్రాజెక్టులు అమలు చేశారు. మొదటి దశలో శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో 1000 ట్యూబ్ లైట్ల స్థానంలో ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు, 400 ఫ్యాన్లను బీఎల్డీసీ ఫ్యాన్లతో భర్తీ చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల ఏడాదికి 1.64 లక్షల యూనిట్ల ఇంధనం ఆదా అవుతుందని అంచనా వేసినట్టు అధికారులు పేర్కొన్నారు. రెండో దశలో టీటీడీ భవనాలలో ప్రస్తుతం ఉన్న 5 వేల సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో బీఎల్డీసీ ఫ్యాన్లతో భర్తీ చేయడానికి ఏపీ సీడ్‌కోతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇవి ఏటా రూ.62 లక్షల ఆదాతో దాదాపు 0.88 మిలియన్ యూనిట్లను ఆదా చేయగలవని భావిస్తున్నారు. సమావేశంలో టీటీడీ చీఫ్ ఇంజనీర్ డి.నాగేశ్వరరావు, ఏపీఎస్ఈసీఎం సీఈఓ ఎ.చంద్రశేఖరరెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ జగదేశ్వరరెడ్డి, ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈసీ సెల్ రవిశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ పరిశ్రమల్లో జపాన్ సాంకేతికత
సాక్షి, అమరావతి: ఇంధన పొదుపులో ఏపీ పరిశ్రమలకి సాంకేతికతను అందించేందుకు తాము ఆసక్తిగా ఉన్నట్లు జపాన్‌కు చెందిన ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (టీఈఆర్ఐ – టెరి) డైరెక్టర్ గిరీశ్ సేథి చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా–జపాన్ ఎన్విరాన్మెంట్ వీక్’ సదస్సులో భాగంగా దేశంలో పర్యావరణ మౌలిక సదుపాయాలు, సాంకేతికతల ద్వారా రెసిలెంట్ డీ కార్బనైజ్డ్ సొసైటీ నిర్మాణం అనే అంశంపై టీఈఆర్ఐ ఈ నెల 12, 13 తేదీల్లో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా గిరీశ్ సేథి మాట్లాడుతూ జపాన్–ఇండియా టెక్నాలజీ మ్యాచ్ మేకింగ్ (జేఐటీఎం)లో భాగంగా ఇంధన సామర్థ్య సాంకేతికతల్లోను ఏపీని దేశానికే రోల్‌మోడల్‌గా నిలుపుతామని హామీ ఇచ్చారు. ఇందుకోసం కేంద్ర విద్యుత్‌శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ), ఇతర శాఖలతో సంప్రదింపులు జరిపి అవసరమైన అనుమతులు తీసుకున్న అనంతరం, జపాన్ ప్రభుత్వ సహకారంతో ఏపీలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలకు) లో–కార్బన్ సాంకేతికతలను పరిచయం చేస్తామని చెప్పారు. ఏపీ పరిశ్రమల విభాగంలో ఇంధన వినియోగం దాదాపు 18,844 మిలియన్ యూనిట్లు (ఏపీఈఆర్సీ టారిఫ్ ఆర్డర్ 2022–23 ప్రకారం) ఉండగా, ఇందులో డిస్కంల డేటా ప్రకారం ఎంఎస్ఎంఈలు ఏటా 5 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నాయని తెలిపారు. దీన్లో 10 శాతం విద్యుత్తును ఆదాచేసినా, ఏడాదికి రూ.300 కోట్ల విలువైన 500 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని చెప్పారు. ఏపీలోని ఫిషరీస్, రిఫ్రాక్టరీ, ఫౌండ్రీ, స్పిన్నింగ్, దాల్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజీ వంటి ఆరు ఎంఎస్ఎంఈ క్లస్టర్లలో తమ సంస్థ ఇంధన సామర్థ్య అధ్యయనం చేసిందని తెలిపారు. భీమవరంలోని సీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో సుమారు 65 మిలియన్ యూనిట్లు, ఫౌండ్రీ క్లస్టర్లో 12 మిలియన్ యూనిట్లు, తూర్పుగోదావరిలోని రిఫ్రాక్టరీ క్లస్టర్లో 2,400 మెట్రిక్ టన్నుల బొగ్గుకు సమానమైన థర్మల్ ఇంధనాన్ని ఆదాచేయవచ్చని అంచనా వేశామని వివరించారు. ఈ మూడు క్లస్టర్లలోనే ఏటా 65 వేల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 30 స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీలు (ఎస్డీఏలు) పాల్గొన్న ఈ సదస్సులో మన రాష్ట్రం నుంచి పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం)కు మాత్రమే ప్రసంగించే అవకాశం లభించింది. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలకు ఎనర్జీ ఎఫిషియెన్సీ ద్వారా చేకూరే ప్రయోజనాలపై టెరి తయారుచేసిన నివేదికను జపాన్‌కు చెందిన అంతర్జాతీయ పర్యావరణ వ్యూహాలసంస్థ (ఐజీఈఎస్) డైరెక్టర్ సతోషి కోజిమా, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణమార్పుశాఖ మాజీ ప్రత్యేక కార్యదర్శి రజనీరంజన్ రష్మీ ఆవిష్కరించి ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డికి అందజేశారు. -
Bureau Of Energy Efficiency: ఇంధన సంరక్షణలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: ఇంధన సంరక్షణ కార్యక్రమాల అమలుకు ఏపీ చేస్తున్న కృషిని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే ప్రశంసించారు. అన్ని స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీలతో (ఎస్డీఏ) ఆదివారం జరిగిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఇంధన సంరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ఆధ్వర్యంలో డిసెంబర్ 14 నుంచి 20 వరకు జరిగిన జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇంధన శాఖను ఆయన అభినందించారు. చదవండి: సర్వతోముఖాభివృద్ధి దిశగా ఏపీ దేశంలో ఇంధన–పొదుపు పెట్టుబడి సామర్థ్యం 2031 నాటికి దాదాపు రూ. 10.02 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు భాక్రే తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ఇంధన రంగాన్ని బలోపేతం చేయడానికి, పర్యావరణాన్ని మెరుగుపరచడానికి, ఆర్థిక వ్యవస్థను పెంచడానికి ఇంధన సామర్థ్యం, దాని ప్రయోజనాలను గుర్తించాలని ఆయన సూచించారు. ఆ దిశగా పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఏపీలో రూ. 2,185 కోట్ల ఇంధన మిగులు పారిశ్రామిక రంగంలో ఇంధన పొదుపు సామర్థ్యం రూ. 5.15 లక్షల కోట్లుగా అంచనా వేయగా, రవాణా రంగంలో రూ. 2.26 లక్షల కోట్లు, గృహ రంగంలో రూ. 1.2 లక్షల కోట్లు ఉందని డీజీ వివరించారు. పెర్ఫార్మ్ అచీవ్ ట్రేడ్ పథకం (సైకిల్–1–2) అమలు చేయడం ద్వారా పారిశ్రామిక రంగం దాదాపు రూ. 40,945 కోట్ల విలువైన 21.95 మిలియన్ టన్నుల చమురును ఆదా చేసిందన్నారు. ఏపీలో 30 పరిశ్రమల్లో రూ. 2,185 కోట్ల విలువైన ఇంధనాన్ని మిగల్చడం శుభ పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా 2020–21 నుంచి 2024 –25 వరకు రూ. 4,200 కోట్ల అంచనా వ్యయంతో అన్ని రంగాల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు డీజీ వెల్లడించారు. దీనివల్ల 2030 నాటికి సంవత్సరానికి 557 మిలియన్ టన్నుల కార్బన్డయాక్సైడ్ తగ్గే అవకాశం కలుగుతుందన్నారు. ఈ సమావేశంలో బీఈఈ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్, డైరెక్టర్లు మిలింద్ డియోర్, సునీల్ ఖండరే, ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. -
Power Saving Tips: ఈ టిప్స్ పాటిస్తే కరెంట్ బిల్లులు తక్కువ రావడం ఖాయం!
Power Saving Tips For House: ఎండా కాలం, చలి కాలం, వానా కాలం.. ఇలా సీజన్లతో సంబంధం లేకుండా కరెంట్ బిల్లులు సామాన్యుడికి గుబులు పుట్టిస్తున్నాయి. ఈమధ్య కాలంలో బిల్లులు ఎక్కువగా వస్తున్నాయంటూ చాలామంది గగ్గోలు పెడుతూ.. కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతుండడం చూస్తున్నాం. మరి కరెంట్ వినియోగం కూడా అదే స్థాయిలో ఉంటోంది కదా!. అందుకే ఆదా చేసే మార్గాలు ఉన్నప్పుడు.. కరెంట్ బిల్లులను తగ్గించుకోవడం మన చేతల్లోనే ఉంటుందని గుర్తు చేస్తున్నారు నిపుణులు. పైగా అవి సింపుల్ చిట్కాలే!. వ్యాంపైర్ అప్లియెన్సెస్.. కరెంట్‌ను జలగల్లా పీల్చేస్తాయి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్. కాబట్టే వీటికి వ్యాంపైర్ అని పేరు పెట్టారు. విశేషం ఏంటంటే.. ఆఫ్‌లో ఉన్నా కూడా ఇవి ఎంతో కొంత కరెంట్‌ను లాగేస్తుంటాయి కూడా. సెల్‌ఫోన్ ఛార్జర్ల మొదలు.. వైఫై రూటర్లు, టీవీలు, కంప్యూటర్లు, ఐరన్బాక్స్లు, వాషింగ్‌మెషీన్, ల్యాప్‌ట్యాప్‌లు.. ఇలా ఫ్లగ్గులో ఉండి కూడా ఆఫ్‌లో ఉన్నప్పుడు కరెంట్‌ను తీసుకుంటాయి. అందుకే వినియోగించనప్పుడు వాటిని ఫ్లగ్‌ల నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఈరోజుల్లో స్టాండ్‌బై మోడ్ ఆప్షన్‌తో వస్తున్నా.. అవి ఎంతో కొంత వాట్లలో పవర్‌ను లాగేస్తున్నాయి. కాబట్టి, వీటి విషయంలో ఈ చిన్న సలహా పాటిస్తే బెటర్. సంబంధిత కథనం: ఆఫ్ చేసినా ఇవి కరెంట్ లాగేస్తాయని తెలుసా? కెపాసిటీకి తగ్గట్లు.. వాషింగ్ మెషిన్, గ్రీజర్-వాటర్ హీటర్, ఏసీలు.. ఇలా హెవీ అప్లయెన్సెస్ ఏవి వాడినా కరెంట్ బిల్లు ఎక్కువగానే వస్తుంటుంది. కానీ, వాటిని వాడే విధానంలో తేడాల వల్లే బిల్లులు అంతలా వస్తుంటాయని తెలుసా?. కాబట్టి, ఒక పద్దతిలోనే వాటిని వాడాల్సి ఉంటుంది. ఉదాహరణకు వాషింగ్ మెషిన్‌ను ఫుల్ కెపాసిటీతో కాకుండా తక్కువ కెపాసిటీతో ఉపయోగించడం. అంటే తక్కువ బట్టలు వేసి.. రెగ్యులర్‌గా ఉతకడం. దీనివల్ల ఫుల్ కెపాసిటీ టైంలో పడే లోడ్ పడి కరెంట్ ఎక్కువ ఖర్చు అవుతుంది. వాషింగ్ మెషిన్లు మాత్రమే కాదు.. ఏసీలు, హీటర్లు, గ్రీజర్లు.. ఇలా ఏవైనా సరే వాటి లెవల్‌కు తగ్గట్లుగా స్మార్ట్‌గా ఉపయోగించడం వల్ల కరెంట్ బిల్లులను తగ్గించుకున్న వాళ్లు అవుతాం. ఇక కొత్తగా అప్లియెన్సెస్ కొనాలనుకుంటే.. వాటి రేటింగ్‌ను పరిగణనలోకి తీసుకోవడం అస్సలు మరవద్దు. తద్వారా కరెంట్ కన్జంప్షన్ తగ్గుతుంది. కరెంట్ సేవింగ్‌లో ఇదే ముఖ్యం బల్బులు, సీలింగ్ ఫ్యాన్లు ఇంటి ప్రాథమిక అవసరాలు. అలాగే కరెంట్ బిల్లుల విషయంలో వీటి భాగస్వామ్యం కూడా ఎక్కువే!. చివరికి కరెంట్ తక్కువ లాగుతాయనుకునే.. సీఎల్ఎఫ్, ఎల్ఈడీ బల్బులు సైతం ఆఫ్ కరెంట్‌ను ఎక్కువే తీసుకుంటాయి. కాబట్టి, అవసరం లేనప్పుడు వాటిని ఆఫ్ చేయడం, తక్కువ స్పేస్‌లో పని చేస్తున్నప్పుడు ఫోర్టబుల్ ల్యాంపులు, స్టడీ ల్యాంపులు ఉపయోగించడం బెటర్. పాతవి ఎక్కువే.. పాత అప్లియెన్సెస్.. కొత్తగా వస్తున్నవాటికన్నా ఎక్కువ ఎనర్జీని లాగేస్తాయి. అందుకు కారణం.. ఆప్టియం ఏజ్. అంటే కాలం చెల్లడంలాంటిదన్నమాట. అందుకే పాత అప్లియెన్సెస్‌ను మార్చేసి.. మంచి రేటింగ్ ఉన్న అప్లియెన్సెస్‌ను ఉపయోగించాలి. మాటిమాటికీ అక్కర్లేదు.. మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, దోమల బ్యాట్లు, ఛార్జింగ్ లైట్లు.. అవసరం లేకున్నా ఛార్జింగ్ పెట్టడం కొందరికి ఉండే అలవాటు. ముఖ్యంగా సెల్‌ఫోన్ ఛార్జింగ్‌ల విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ, దీనివల్ల కరెంట్ అడ్డగోలుగా కాలుతుంది. అందుకే అత్యవసం అయితేనే ఛార్జింగ్ పెట్టాలి. అవసరం లేనప్పుడు ఫ్లగ్‌ల నుంచి ఛార్జర్లను తొలగించాలి మరిచిపోవద్దు. కరెంట్ బిల్లులు మోగిపోవడానికి, మీటర్ గిర్రున తిరగడం ఒక్కటే కారణం కాదు. ఎంత ఉపయోగిస్తున్నామనేది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ, చిన్న చిన్న జాగ్రత్తలు, టిప్స్ పాటిస్తూ కరెంట్‌ను ఆదా చేయడంతో పాటు జేబుకు చిల్లుపడకుండా చూసుకోవచ్చు. -
ఇంధన సామర్థ్యం, పొదుపులో ఏపీ కృషి అభినందనీయం
సాక్షి, అమరావతి : ఇంధన సామర్థ్యం, ఇంధన పొదుపును ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ చేస్తున్న కృషిని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే అభినందించారు. స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఏపీ రోల్ మోడల్‌గా మారిందని ప్రశంసించారు. యూకేలోని గ్లాస్గోలో జరుగుతున్న 26వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్) సదస్సు ముగింపులో భారతీయ ప్రతినిధిగా ఆయన పాల్గొన్నారు. ఆ వివరాలను ఆదివారం ఏపీ ఇంధన పర్యవేక్షక మిషన్ సీఈవో చంద్రశేఖరరెడ్డి మీడియాకు చెప్పారు. ఏపీలో 65 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)ల్లో ఐఓటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్) పవర్ మానిటరింగ్ డివైజ్‌ను ఇన్స్టాల్ చేయడం ద్వారా ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు. ఏపీ చర్యలు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించేవిగా ఉన్నాయని అభయ్ భాక్రే కొనియాడారు. కర్బన ఉద్గారాల తీవ్రత తగ్గితేనే సమగ్రాభివృద్ధి దేశంలో కర్బన ఉద్గారాల తీవ్రతను తగ్గించడం ద్వారా సమగ్రాభివృద్ధి సాధ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థికాభివృద్ధి, పర్యావరణ సమతుల్యంపై దృష్టి సారించిందని, 2030 నాటికి 33–35 శాతం ఉద్గార తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని అభయ్ భాక్రే చెప్పారు. స్వచ్ఛమైన ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం చాలా అవసరమన్నారు. బీఈఈ చేస్తున్న ప్రయత్నాల వల్ల 2030 నాటికి.. 557 మిలియన్ టన్నుల కార్బన్‌డైయాక్సైడ్ తగ్గుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. దేశంలో ఇంధన–పొదుపు పెట్టుబడి సామర్థ్యం దాదాపు రూ.10.02 లక్షల కోట్ల నుంచి రూ.13.20 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నామని, ఈ అవకాశాన్ని రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పారిశ్రామిక రంగంలో ప్రస్తుతం ఉన్న మొత్తం ఇంధన వినియోగం 347 మిలియన్ యూనిట్లు కాగా, 2031 నాటికి 443.4 మిలియన్ యూనిట్లకు చేరుతుందని తెలిపారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ఇంధన సామర్థ్య ఏజెన్సీల స్థాపనను తప్పనిసరి చేస్తూ ఇంధన సంరక్షణ చట్టం–2001ని సవరించనుందని, దీనిని అన్ని రాష్ట్రాలూ పాటించాలని అభయ్ భాక్రే సూచించినట్టు చంద్రశేఖరరెడ్డి వివరించారు. -
ఇంధన ఆదా బిల్డింగ్‌లకు ‘నీర్మాణ్’ అవార్డులు
సాక్షి, అమరావతి: ఇంధన పొదుపు నిబంధనలను పాటిస్తూ నిర్మించిన కట్టడాలకు కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ రోడ్ మ్యాప్ ఫర్ మూమెంట్ టువర్డ్స్ అఫర్డబుల్ అండ్ నేచురల్ హేబిటేట్ (ఎన్‌ఈఈఆర్‌ఎంఏఎన్–నీర్మాణ్)’ పేరిట అవార్డులతో ప్రోత్సహించనుంది. మొత్తం ఎనిమిది విభాగాల్లో అందిస్తున్న అవార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 31 చివరి తేదీ అని ఇంధన శాఖ ఆదివారం ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రం నుంచి అత్యధిక మంది అవార్డులకు దరఖాస్తు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మికి ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి లేఖ రాశారు. రాష్ట్రంలో వాణిజ్య భవనాల్లో 5,130 మిలియన్ యూనిట్లకు డిమాండ్ ఉండగా ఈసీబీసీ–2017 నిబంధనలను అమలు చేయడం ద్వారా 1,542 యూనిట్ల విద్యుత్ అంటే 25 శాతం పొదుపు చేయవచ్చని అంచనా వేశారు. దీనివల్ల రూ.881 కోట్ల విలువైన విద్యుత్‌ను ఆదా చేయగలుగుతారు. గృహ వినియోగంలో ఈ నిబంధనలు పాటించడం ద్వారా 3,410 మిలియన్ యూనిట్ల వరకు ఆదా చేయవచ్చని ఇంధన శాఖ అధికారులు అంచనా వేశారు. -
ఆఫ్ చేసినా ఇవి కరెంట్ లాగేస్తాయని తెలుసుకోండి
టెక్ ఏజ్‌లో సాంకేతికతకు పవర్ తోడైతేనే రోజువారీ పనులు జరిగేది. విచ్చల విడిగా వాడేస్తూ.. నెల తిరిగే సరికి కరెంట్ బిల్లును చూసి కళ్లు పెద్దవి చేసేవాళ్లు మనలో బోలెడంత మంది. అయితే మనకు తెలియకుండానే కరెంట్‌ను అదనంగా ఖర్చు చేస్తున్నామని తెలుసా?.. అదీ ఆఫ్ చేసినప్పటికీ!. యస్.. మొత్తం పవర్ బిల్లులలో మినిమమ్ 1 శాతం.. పవర్ ఆఫ్ చేసిన ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ వల్ల వస్తుందని ఇండియన్షెల్ఫ్ ఓ కథనం ప్రచురించింది. టెలివిజన్ సెట్స్.. చాలామంది టీవీలు చూస్తూ రిమోట్ ఆఫ్ చేసి వేరే పనుల్లో మునిగిపోతారు. లేదంటే రాత్రిళ్లు పడుకునేప్పుడు టీవీలను స్విచ్ఛాఫ్ చేయకుండా వదిలేస్తారు. ఇలా చేయడం స్టాండ్‌బై మోడ్‌లోకి వెళ్లే టీవీ.. రోజుకి 24 వాట్ల పవర్‌ను తీసుకుంటుంది. ఇది తక్కువే అనిపించినా.. రోజుల తరబడి లెక్క ఎక్కువేగా అయ్యేది!. సెల్‌ఫోన్ ఛార్జర్.. చాలామంది నిర్లక్క్ష్యం వహించేది దీని విషయంలోనే. ఫోన్ ఛార్జింగ్ అయ్యాకో, మధ్యలో ఫోన్ కాల్ వస్తేనో స్విచ్ఛాఫ్ చేయకుండా ఫోన్ నుంచి పిన్ తీసేస్తుంటారు. కానీ, పవర్ బటన్‌ను ఆఫ్ చేయడమో, సాకెట్ నుంచి ఛార్జర్‌ను తీసేయడమో చేయరు. ఛార్జర్ సగటున రోజుకి 1.3 వాట్ల పవర్‌ను లాగేసుకుంటుంది. అంతేకాదు ఛార్జర్ పాడైపోయే అవకాశం.. ఒక్కోసారి పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. వైఫై మోడెమ్.. స్విచ్ఛాఫ్ చేయకుండా ఉంచే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండేది ఇదే. ఇంటర్నెట్ను ఉపయోగించినా లేకున్నా, వైఫై పరిధి నుంచి మొబైల్స్, తదితర డివైజ్‌లు దూరంగా వెళ్లినా సరే.. 24/7 వైఫైలు ఆన్‌లోనే ఉంటాయి. ప్రత్యేకంగా ఇది ఎంత కరెంట్ కాలుస్తుందనేది ప్రత్యేకంగా చెప్పలేకపోయినా.. ఉపయోగించనప్పుడు, బయటికి వెళ్లినప్పుడు ముఖ్యంగా రాత్రిళ్లు పడుకునేప్పుడు ఆఫ్ చేసి ఫ్లగులు తీసేయడం బెటర్. మైక్రో ఓవెన్స్.. ఇది తక్కువ మంది ఇళ్లలో ఉండొచ్చు. కానీ, చాలామంది వీటిని పూర్తిగా ఆఫ్ చేయకుండా వదిలేస్తుంటారు. కానీ, మైక్రో ఓవెన్స్, ఓవెన్స్‌లు ఒకరోజులో 108 వాట్ల పవర్‌ను లాగేస్తాయి. సో.. వాడనప్పుడు వాటిని అన్‌ఫ్లగ్ చేయడం ఉత్తమం. మరికొన్ని.. పెద్దసైజులో ఉండే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్లు వాషింగ్ మెషిన్స్, ఫ్రిడ్జ్(పెద్దగా పాడయ్యే సామాన్లు లేనప్పుడు)లతో పాటు డ్రైయర్స్, మిక్సర్లు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, టేబుల్ ఫ్యాన్లు, బ్లూటూత్ స్పీకర్లు ఆఫ్ చేయడం ముఖ్యంగా అన్‌ఫ్లగ్ చేయడం మంచిది. వర్క్ ఫ్రమ్ హోంలో చాలామంది ల్యాప్‌టాప్‌లను సిచ్ఛాఫ్ చేసినా అన్‌ఫ్లగ్ చేయరు. అడిగితే చాలామంది టైం ఉండదంటూ సాకులు చెప్తుంటారు. లేదంటే పరధ్యానంలో మరిచిపోతుంటారు. ఇంకొందరు ఓస్ అంతే కదా అని బద్ధకిస్తుంటారు. కానీ, పవర్సేవింగ్ను ఒక బాధ్యతగా గుర్తిస్తే.. కరెంట్‌ను ఆదా చేయడం, అప్లయన్సెస్‌ను పాడవకుండా కాపాడుకోవడంతో పాటు ఖర్చుల్ని తగ్గించుకున్నవాళ్లు అవుతారు. -సాక్షి, వెబ్‌డెస్క్ -
ఇంధన పొదుపుపై దృష్టి పెట్టండి
సాక్షి, అమరావతి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం ద్వారా ఇంధన పొదుపుతో పాటు పర్యావరణానికి మేలు జరిగే చర్యలు తీసుకోవాలని ఇంధన శాఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీఈఈ అంచనా ప్రకారం రాష్ట్రంలో 67,500 మిలియన్ యూనిట్ల విద్యుత్‌కు డిమాండ్ ఉండగా.. అందులో 16,875 మిలియన్ యూనిట్ల వరకు ఆదా చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ డీఎస్ఎం, గ్రామ పంచాయతీల్లోని వీధి లైట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలు పీఏటీ, ఉజాలా తదితరాల ద్వారా 2,932 మిలియన్ యూనిట్లను ఆదా చేయగలిగామని పేర్కొన్నారు. దీని వల్ల రూ.2,014 కోట్ల ఆర్థిక భారం తగ్గిందని చెప్పారు. మరో 14,000 మిలియన్ యూనిట్లు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. దీనికి తగినట్లుగా ఇంధన శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. అందరికీ అందుబాటు ధరల్లో విద్యుత్‌ను అందించాలనేది సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని చెప్పారు. 2031 నాటికి దేశ ఇంధన రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చే అవకాశముందని, ఇందులో అత్యధిక భాగం ఏపీకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
శ్రీవారి సన్నిధిలో భారీగా ఇంధన పొదుపు
సాక్షి, అమరావతి: టీటీడీలోని విద్యుత్ సరఫరాలో విప్లవాత్మక మార్పులు తేబోతున్నారు. సమర్థమైన విద్యుత్ పరికరాలతో ఇంధన పొదుపు చేపట్టబోతున్నారు. టీటీడీ, అనుబంధ ఆలయాలు, ధర్మసత్రాల్లో సమగ్ర ఇంధన ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి కేంద్ర సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సాంకేతిక, ఆర్థిక తోడ్పాటు అందిస్తుందని రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం చెప్పారు. బీఈఈ నేతృత్వంలో సోమవారం నుంచి టీటీడీలో నీటి పంపుల పనితీరుపై ఆడిట్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉపకరణాలన్నీ మారతాయి టీటీడీ పరిధిలో 399 పంపుసెట్లున్నాయి. వీటి సామర్థ్యం 3,500 హెచ్‌పీ. వీటి స్థానంలో ఇంధన సామర్థ్యం గల పంపుసెట్లు అమరిస్తే ఏటా దాదాపు 1.14 మిలియన్ యూనిట్లు (20 శాతం) ఆదా చేయవచ్చని ప్రాథమిక పరిశీలనలో వెల్లడైందని రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ తెలిపింది. ఇప్పుడున్న 38,000 ఫ్యాన్ల స్థానంలో రూ.9.5 కోట్ల పెట్టుబడితో సూపర్ ఎఫిషియంట్ ఫ్యాన్లను అమర్చబోతున్నారు. దీనివల్ల ఏటా 5.02 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని అంచనా వేశారు. ఇలా చేస్తే రూ.4.5 కోట్లు పొదుపు చేయవచ్చని గుర్తించారు. దేవస్థానం పరిధిలో 1,608 ఏసీలనూ మారుస్తున్నారు. రూ.8.4 కోట్ల ఖర్చుతో 5 స్టార్ ఏసీలను అమర్చబోతున్నారు. దీంతో ఏటా రూ.1.85 కోట్ల విలువైన 3.09 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని భావిస్తున్నారు. 30 శాతం పవన, సౌర విద్యుత్ టీటీడీ ఏటా 68 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగిస్తోంది. ఇందులో 30 శాతం సౌర, పవన విద్యుత్ ఉంటోంది. మిగతా 70 శాతం (435 లక్షల యూనిట్లు) దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి తీసుకుంటోంది. టీటీడీకి 7.5 మెగావాట్ల సామర్థ్యం గల పవన విద్యుత్ కేంద్రం, 10 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం ఉన్నాయి. ఏటా రూ.కోట్ల విలువైన కోటి యూనిట్ల పవన విద్యుత్, రూ.3 కోట్ల విలువైన 1.45 కోట్ల యూనిట్ల సౌర విద్యుత్‌ను టీటీడీ ఉత్పత్తి చేసుకుని వాడుకుంటోంది. దేవస్థానం పరిధిలోని కళాశాలల భవనాలపై రూప్‌టాప్ ద్వారా సౌర విద్యుత్ అందుతోంది. -
ఇంధన పొదుపులో ఏపీ ప్రతిభ, కేంద్రం ప్రశంస
సాక్షి, అమరావతి: ఇంధన పొదుపు కోసం చేపట్టిన ‘పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్(పీఏటీ)’ పథకం అమలులో ఏపీ ప్రభుత్వం ఉత్తమ ప్రతిభ కనబరుస్తోందని కేంద్రం అభినందించింది. దేశవ్యాప్తంగా పీఏటీ రెండో దశకు సంబంధించి వివిధ పరిశ్రమలు సాధించిన పురోగతిపై సోమవారం ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ అధ్యక్షతన వెబినార్ నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) డీజీ అభయ్ భాక్రే పలు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇంధన పొదుపులో ఏపీ సాధించిన పురోగతిని ఆయన వెల్లడించినట్టు రాష్ట్ర ఇంధన శాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. పీఏటీ రెండో దశలో ఏపీ 0.25 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ సాధించిందని.. పరిశ్రమల్లో ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకు బలమైన మార్గదర్శకాలను రూపొందించిన అతికొద్ది రాష్ట్రాల్లో ఏపీ ఒకటని ఆయన పేర్కొన్నట్లు తెలిపింది. అలాగే సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల్లో ఐవోటీ ఆధారిత ఇంధన సామర్థ్య టెక్నాలజీని వినియోగించడాన్ని కేంద్రం ప్రశంసించింది. -
ఇంధన పొదుపులో మహిళలు
సాక్షి, అమరావతి: ఇంధన పొదుపులో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్వయం సహాయక సంఘాలకు చెందిన కోటి మంది మహిళలు ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం గ్రామీణ పేదరిక నిర్ములనా సంస్థ (సెర్ప్) తో కలసి రాష్ట్ర ఇంధన శాఖ ఈనెల 16న విజయవాడలో రాష్ట్రస్థాయి మహిళా సదస్సు నిర్వహించనుంది. క్షేత్రస్థాయి నుంచి ఇంధన భద్రతను పటిష్టం చేయడం దీని ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర ఇంధన పొదుపు విభాగం అధికారి చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా విద్యుత్ పొదుపు–మహిళల పాత్రకు సంబంధించి రాష్ట్రస్థాయి మహిళా సదస్సు పోస్టర్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంధన సామర్థ్య రంగంలో మహిళల భాగస్వామ్యం దేశానికే ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుందని మంత్రి అన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుకు సాంకేతిక, ఆర్థిక సహాయం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషిఎన్సీ సంస్థను కొనియాడారు. ఏపీ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం), రాష్ట్ర ఇంధన శాఖ త్వరలో సెర్ప్ సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఇంధన సామర్థ్య కార్యకలాపాలలో స్వయం సహాయక సంఘాలు భాగస్వాములయ్యేలా ఒక దీర్ఘకాలిక అమలు ప్రణాళిక రూపొందించాల్సిందిగా పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలక్రిష్ణ ద్వివేదిని, సెర్ప్ సీఈవో పి.రాజబాబును మంత్రి ఆదేశించారు. -
నిరసనల నేపథ్యంలో పలు రైళ్ల రద్దు
సాక్షి, హైదరాబాద్: ఖరగ్‌పూర్ డివిజన్లో నిరసనల నేపథ్యంలో రైల్వే శాఖ పలురైళ్లను రద్దు చేసింది. హౌరా–సికింద్రాబాద్, హౌరా–కన్యాకుమారి, సంత్రాగచ్చి–పాండిచ్చేరి, అగర్తల–బెంగళూరు, గువాహటి–బెంగళూరు, గువాహటి–సికింద్రాబాద్, యశ్వంత్‌పూర్–హౌరా, మైసూరు–హౌరా, పూరి–చెన్నై రైళ్లను రద్దు చేసింది. దక్షిణ మధ్యరైల్వేకు జాతీయ ఇంధన పొదుపు అవార్డులు ఇంధన పొదుపు విషయంలో దక్షిణ మధ్య రైల్వేకు నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి. సౌర విద్యుత్ వినియోగం, ఆక్యుపెన్సీ, సెన్సార్ల వినియోగం, ఎల్ఈడీ బల్బుల వినియోగం, ఇంధన సామర్థ్యాన్ని పెంచే పంపుల వినియోగం వంటి అంశాల్లో చేపట్టిన చర్యలకు గాను ఈ అవార్డులు లభించాయి. ఈ నెల 14న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ నుంచి దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎ.ఎ.ఫడ్కే, హైదరాబాద్ డివిజన్ ఇంజనీర్ డీఆర్ఎం ఎస్ఎస్ఆర్ ప్రసాద్‌లు అందుకున్నారు. -
ఇక కరెంటుకూ బ్యాంకులు
* సౌర విద్యుత్ వినియోగదారులకు ఎనర్జీ బ్యాంకింగ్ సౌకర్యం * విద్యుత్‌ను ‘డిస్కం’లకు ఇచ్చి అవసరమైనప్పుడు తిరిగి పొందవచ్చు * సౌర విద్యుత్ ఉత్పాదనను ప్రోత్సహించేందుకు వినూత్న ప్రయత్నం సాక్షి, హైదరాబాద్: రాము తన రూఫ్‌టాప్ సోలార్ సిస్టం ద్వారా 500 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాడు. సొంత వినియోగం పోగా 100 యూనిట్లను ‘ఎనర్జీ బ్యాంకు’లో జమ చేశాడు. మరుసటి నెలలో అవసరాలు పెరగడంతో ఎనర్జీ సేవింగ్స్ నుంచి 50 యూనిట్లను డ్రా చేసి వాడుకున్నాడు. సమీప భవిష్యత్తులో మనం ఇలాంటి ఘటనలను చూడబోతున్నాం. సంపాదనలో మిగులు డబ్బును బ్యాంకులో జమ చేసి అవసరమైనప్పుడు వినియోగించుకుంటున్నట్లే విద్యుత్‌ను సైతం దాచిపెట్టి అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. రాష్ట్రంలో సౌరవిద్యుత్ ఉత్పాదకతను పెంపొందించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఈ వినూత్న సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు సరళీకృత విధానాలు, భారీ రాయితీలు, ప్రోత్సాహకాలతో డిస్కంలు ‘తెలంగాణ సౌర విద్యుత్ విధానం’ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సౌర విద్యుత్ వినియోగదారుల కోసం ప్రవేశపెట్టిన ‘విద్యుచ్ఛక్తి బ్యాంకింగ్’ సదుపాయం అందరినీ ఆకర్షిస్తోంది. సొంత వినియోగం(కాప్టివ్), ఓపెన్ యాక్సెస్ (బహిరంగ విక్రయం), షెడ్యూల్డ్ కేటగిరీల వినియోగదారులకు ఏడాదిలో 12 నెలల పాటు ఈ సౌలభ్యం అందుబాటులో ఉండనుంది. స్వీయ వినియోగం/ప్రైవేటు సంస్థలకు విక్రయ డిమాండు తగ్గిపోయినా సౌర విద్యుత్ ప్రాజెక్టులు నిరాటంకంగా ఉత్పత్తిని కొనసాగించవచ్చు. ఉత్పాదనలో 100 శాతం విద్యుత్‌ను ఎనర్జీ బ్యాంక్‌లో దాచుకోవచ్చు. సౌర విద్యుత్ ప్రాజెక్టులపై భారీగా పెట్టుబడి పెట్టిన వినియోగదారులు నష్టపోకుండా డిస్కంలు ఈ వినూత్న సదుపాయాన్ని కల్పించాయి. దీనికి ప్రతిఫలంగా కేవలం 2 శాతం బ్యాంకింగ్ చార్జీలను వసూలు చేస్తాయి. ఏప్రిల్ నుంచి మార్చివరకు బ్యాంకింగ్ సంవత్సరంగా పరిగణిస్తారు. వినియోగదారులు ‘ఎనర్జీ బ్యాంకు’ నుంచి విద్యుత్‌ను తిరిగి పొందని పక్షంలో డిస్కంలు ఆ విద్యుత్‌ను తామే కొనుగోలు చేసినట్లు పరిగణిస్తాయి. విద్యుత్ నియంత్రణ సంస్థ నిర్ణయించిన సగటు విద్యుత్ కొనుగోలు ధర ప్రకారం వినియోగదారులకు డబ్బులు చెల్లిస్తాయి. సౌర విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి థర్డ్ పార్టీ కొనుగోలుదారుడు లభించే వరకు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను సైతం ఎనర్జీ బ్యాంకులో నిల్వ చేసుకోవచ్చు. ఎనర్జీ బ్యాంక్ అంటే స్వభావరీత్యా విద్యుత్ నిల్వ ఉండదు. ఉత్పత్తి చేసిన వెంటనే వినియోగించుకోవాల్సిందే. అప్పటికప్పుడు వినియోగించునే అవకాశం లేనప్పుడు (డిస్కంలకు) ఎనర్జీ బ్యాంకుకు ఇవ్వవచ్చు. ఆ విద్యుత్‌ను డిస్కంలు తమ వినియోగదారులకు సరఫరా చేస్తాయి. దీనికి బదులుగా అవసరమైనప్పుడు డిస్కంలు సౌర వినియోగదారులకు విద్యుత్‌ను ఇస్తాయి.