
సాక్షి, అమరావతి: ఇంధన పొదుపు కోసం చేపట్టిన ‘పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్(పీఏటీ)’ పథకం అమలులో ఏపీ ప్రభుత్వం ఉత్తమ ప్రతిభ కనబరుస్తోందని కేంద్రం అభినందించింది. దేశవ్యాప్తంగా పీఏటీ రెండో దశకు సంబంధించి వివిధ పరిశ్రమలు సాధించిన పురోగతిపై సోమవారం ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ అధ్యక్షతన వెబినార్ నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) డీజీ అభయ్ భాక్రే పలు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఇంధన పొదుపులో ఏపీ సాధించిన పురోగతిని ఆయన వెల్లడించినట్టు రాష్ట్ర ఇంధన శాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.
పీఏటీ రెండో దశలో ఏపీ 0.25 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ సాధించిందని.. పరిశ్రమల్లో ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకు బలమైన మార్గదర్శకాలను రూపొందించిన అతికొద్ది రాష్ట్రాల్లో ఏపీ ఒకటని ఆయన పేర్కొన్నట్లు తెలిపింది. అలాగే సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల్లో ఐవోటీ ఆధారిత ఇంధన సామర్థ్య టెక్నాలజీని వినియోగించడాన్ని కేంద్రం ప్రశంసించింది.