సాక్షి, అమరావతి: ఆక్వాజోన్ పరిధిలో పదెకరాల్లోపు ఆక్వా సాగుచేసే రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ వర్తింపజేస్తున్న ప్రభుత్వం మరింతమందికి లబ్దిచేకూర్చాలని సంకల్పించింది. జోన్ పరిధిలో అసైన్డ్ భూములతో సహా వివిధరకాల ప్రభుత్వ భూముల్లో సాగుచేస్తున్న వారితోపాటు దేవదాయ భూములను లీజుకు తీసుకుని సాగుచేస్తున్న పదెకరాల్లోపు వారికి విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. వెబ్‌ల్యాండ్‌లో ఈ భూముల హక్కులు ప్రభుత్వ, ఆయా దేవస్థానాల పేరిట నమోదై ఉండడంతో ఆక్వా సబ్సిడీ వర్తింపునకు సాంకేతికంగా ఇబ్బంది నెలకొంది.
ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం అయా భూముల్లో పదెకరాల్లోపు సాగుచేస్తున్న రైతులందరికి సబ్సిడీ వర్తించేలా వెసులుబాటు కల్పించింది. ఈ ఫిష్ సర్వే ప్రకారం 1,72,514 మంది పదెకరాల్లోపు విస్తీర్ణంలో.. మొత్తం 3,14,313 ఎకరాల్లోను, 4,691 మంది పదెకరాలకు పైగా విస్తీర్ణంలో.. మొత్తం 1,17,780 ఎకరాల్లోను ఆక్వా సాగుచేస్తున్నారు. నోటిఫైడ్ ఆక్వాజోన్ పరిధిలో 2,49,348 ఎకరాల్లో 1,00,792 మంది సాగుచేస్తున్నారు.
వీరిలో 98,095 మంది పదెకరాల్లోపు విస్తీర్ణంలో.. మొత్తం 1,86,218 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. నాన్ ఆక్వాజోన్ పరిధిలో 74,419 మంది 1,28,095 ఎకరాల్లో సాగుచేస్తుండగా, 76,413 మంది పదెకరాల్లోపు విస్తీర్ణంలో.. మొత్తం 1,82,744 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. జోన్ పరిధిలో పదెకరాల్లోపు సాగుదారులందరికీ ఈ నెల 1వ తేదీ నుంచి విద్యుత్ సబ్సిడీ వర్తింపజేస్తున్నారు.
సీఎం ఆదేశాల మేరకు..
జోన్ పరిధిలో పదెకరాల్లోపు అసైన్డ్‌తో సహా వివిధరకాల ప్రభుత్వ, దేవదాయ భూముల్లో సాగుచేస్తున్న వారికి విద్యుత్ సబ్సిడీ వర్తింపజేయడంలో నెలకొన్న సాంకేతిక సమస్యలను ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తీసుకెళ్లారు.
సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధిచేకూర్చేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబును ఆదేశించారు. దీంతో మత్స్యశాఖాధికారులు జోన్ పరిధిలో అసైన్డ్ ల్యాండ్స్, వివిధరకాల ప్రభుత్వ, దేవదాయ భూముల్లో పదెకరాల్లోపు సాగుచేస్తున్నవారిని గుర్తించి వారికి విద్యుత్ సబ్సిడీ వర్తించేలా చర్యలు చేపట్టారు.
ఈ జాబితాలను తయారుచేసి ఆయా డిస్కమ్‌లకు పంపించేందుకు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు నాన్ ఆక్వాజోన్ ప్రాంతాల్లో అర్హతగల ఆక్వాజోన్ ప్రాంతాల గుర్తింపునకు చేపట్టిన సర్వే పూర్తికాగా, వాటికి గ్రామసభతోపాటు జిల్లాస్థాయి కమిటీలు ఆమోదముద్ర వేశాయి. రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదం పొందగానే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
డిస్కమ్‌లకు జాబితాలు
ఆక్వాజోన్‌లో పదెకరాల్లోపు అర్హత కలిగిన విద్యుత్ కనెక్షన్ల వివరాలను డిస్కమ్‌లకు పంపించాం. వాటికి యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా చేస్తున్నాం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల జోన్ పరిధిలో ఉన్న అసైన్డ్, ఇతర ప్రభుత్వ, దేవదాయ భూముల్లో సాగుచేసే పదెకరాల్లోపు రైతులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు విద్యుత్ సబ్సిడీ వర్తింపజేసేలా చర్యలు చేపట్టాం.
ఈ జాబితాలను డిస్కమ్‌లకు పంపిస్తున్నాం. నాన్ ఆక్వాజోన్ ప్రాంతాల్లో అర్హమైన ప్రాంతాలను గుర్తించి జోన్ పరిధిలోకి బదలాయించేందుకు చర్యలు చేపట్టాం.
– కూనపురెడ్డి కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ
మరింత మందికి ఆక్వా విద్యుత్ సబ్సిడీ
Published Sat, Feb 18 2023 4:14 AM | Last Updated on Sat, Feb 18 2023 4:14 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment