Andhra Pradesh: Yellow Media Secret Agenda over False Allegations On AP, Full Details Inside - Sakshi
Sakshi News home page

ఏది నిజం?: విద్యుత్‌ వెలుగులపై చీకటి రాతలు

Published Sat, Apr 23 2022 7:31 AM | Last Updated on Sat, Apr 23 2022 2:39 PM

Yellow Media Secret Agenda over False Allegations Andra Pradesh - Sakshi

రాజకీయమైనా... పాత్రికేయమైనా రాష్ట్రం బాగును కోరుకోవాలి. దౌర్భాగ్యవశాత్తూ ఆంధప్రదేశ్‌కు అదే లేదు. అటు ప్రతిపక్షం... దానికి కొమ్ముకాసే పాత్రికేయ పక్షం... రెండిటిదీ ఒకే అజెండా!!. రాష్ట్రాదాయం పెరగకూడదు. అప్పులు తేకూడదు. పరిశ్రమలు రాకూడదు. సంక్షేమ పథకాలు నిలిచిపోవాలి. విద్యుత్‌ కోతలు పెరగాలి. మొత్తంగా... రాష్ట్రం నాశనమైపోవాలి. అందుకోసం అవసరమైతే... డ్రగ్స్‌ ముద్ర వేస్తారు. శ్రీలంకలా దివాలా తీస్తుందని ప్రచారం చేస్తారు. ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికీ వెనకాడరు. అందులో భాగమే... కొద్దిరోజులుగా విపరీతమైన విషప్రచారం చేస్తూ... బుధవారం నాడు ‘ఆ విద్యుత్‌ అదానీదే’ అంటూ ‘ఈనాడు’ రాసిన కథనం. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు వచ్చే 30ఏళ్లలో భారీగా గండి పడనున్నదంటూ రామోజీరావు వండిన వంటకంలో నిజానిజాలేంటి? ఏది నిజం? ఇదిగో చూద్దాం...

లక్ష దీపాల మధ్య నిలబడ్డా... కళ్లు మూసుకుంటే చీకటే. ‘ఈనాడు’దీ అదే పరిస్థితి. ఒప్పందాలు... రికార్డుల సాక్షిగా నిజాలు నర్తిస్తున్నా దానికి కనిపించవు. రైతుల  కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం ఏం చేసినా... దాన్ని వ్యతిరేకించాల్సిందేనన్నది రామోజీ సిద్ధాంతం. ఎందుకంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికున్న జనాదరణను తగ్గించకపోతే తన చంద్రబాబు వానప్రస్థం శాశ్వతమవుతుందన్నది ఆయన భయం. రాత్రనక, పగలనక రైతులు పొలాల్లో విద్యుత్‌ కోసం పడిగాపులు కాస్తూ, ప్రాణాలు పోగొట్టుకున్న చీకటి రోజుల నుంచి విముక్తి కలిగిస్తూ పగటిపూట 9 గంటల విద్యుత్‌ అందిస్తోంది ప్రభుత్వం. వ్యవసాయ విద్యుత్‌ను రైతులు తమ హక్కుగా భావించేలా చర్యలు చేపడుతూ, వచ్చే 30 ఏళ్ల పాటు వారికి విద్యుత్‌ కష్టాలు లేకుండా సౌర విద్యుత్‌ను సమకూర్చే ప్రయత్నాల్లో ఉంది.


చంద్రబాబు హయాంలో ఆరోహి సోలార్‌ ప్రైవేటు లిమిటెడ్‌తో యూనిట్‌కు రూ.5.63 చొప్పున కుదుర్చుకున్న సోలార్‌ పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌

ఇందులో భాగంగా...  ప్రైవేటు నుంచి కాకుండా,‘ట్రిపుల్‌ ఏ’ రేటింగున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)’ నుంచి నేరుగా 7వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ తీసుకునే ఒప్పందం చేసుకుంది. నిజానికిదే ఒప్పందం చంద్రబాబులా ఏ ప్రైవేటు కంపెనీలతోనో చేసుకుంటే ‘ఈనాడు’ దాని బృంద మీడియా శివాలెత్తేసేవి. కానీ నేరుగా సెకీతో కావటంతో బురద జల్లడానికి రంధ్రాన్వేషణ మొదలెట్టి.. చివరకు ఆ సెకీ అదానీ, తదితరుల నుంచి కొని రాష్ట్రానికి అందిస్తుందంటూ... అదానీ కోసమే ఈ ఒప్పందం చేసుకున్నారంటూ కొత్త రాగం మొదలెట్టాయి. దీనికన్నా దివాలాకోరుతనం ఇంకేమైనా ఉంటుందా రామోజీ? 2024 నుంచి 18 లక్షల మందికి పగటిపూట 9 గంటల పాటు ప్రత్యేక డిస్కమ్‌ ద్వారా ఉచిత విద్యుత్‌ అందటమే మహాపరాధంగా పరిగణిçస్తూ రాస్తున్న మీ కథనాలను ఏమనుకోవాలి? ఇదెక్కడి దివాలాకోరుతనం?

‘టాటా’ సంస్థ ఏమన్నది రామోజీ?
నిజమే! వ్యవసాయ విద్యుత్‌ కోసం 6,400 మెగావాట్ల పవర్‌ ప్రాజెక్ట్‌ అభివృద్ధి చేయాలంటూ రాష్ట్ర గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఏపీజీఈసీఎల్‌) 2020లో టెండర్లు పిలవటం నిజం. దాన్నెవ్వరూ కాదనరు. యూనిట్‌ రూ.2.49, రూ.2.56 చొప్పున ఇస్తామని  బిడ్లు దాఖలు కావటమూ నిజమే. మరి ఈ బిడ్లలో నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్టీపీసీ) కూడా ఉందిగా!. ఆ విషయమెందుకు ప్రస్తావించరు రామోజీ? ఈ  టెండర్లు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లేవని టాటా సంస్థ కోర్టుకెళ్లింది. మీరు మాత్రం ఇలా కాకుండా... టెండరు నిబంధనలు కొన్ని సంస్థలకు అనుకూలంగా ఉన్నాయంటూ టాటా సంస్థ కోర్టుకెక్కినట్లు రాసిపారేశారు. ఇదెక్కడి పాత్రికేయం? ఆ సంస్థ కోర్టులో కాకుండా మీతో మాత్రమే ఈ విషయం చెప్పిందా? మరీ ఇంత తప్పుడు రాతలేల?

చంద్రబాబు హయాంలో దయానిధి సోలార్‌ పవర్‌ ప్రైవేటు లిమిటెడ్‌తో యూనిట్‌కు రూ.5.97 చొప్పున కుదుర్చుకున్న సోలార్‌ పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌

రాజస్థాన్‌లో ఉర్జా వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ ద్వారా ఇస్తున్న విద్యుత్‌ యూనిట్‌ రూ.2.01. నిజమే! కానీ రాజస్థాన్‌లో ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌(పీఎల్‌ఎఫ్‌) 23.5 శాతం. కానీ ఏపీలో ఇది 17.5 శాతమే. మరి ధరలో మార్పులుండవా? 

గ్రిడ్‌ చార్జీలు మినహాయించారు గనకే...
సెకీ నుంచి విద్యుత్‌ తీసుకోవడం వల్ల పాతికేళ్ల పాటు అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్‌ చార్జీల నుంచి కేంద్రం మినహాయింపు వస్తోంది. అదే రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే పాతికేళ్లు సెంట్రల్‌ గ్రిడ్‌ చార్జీలు చెల్లించాలి. రాష్ట్రంలో అంతర్గతంగా సౌర ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే వాటికి కావాల్సిన విద్యుత్‌ లైన్లు, అంతర్గతంగా విద్యుత్‌ ప్రసార వ్యవస్థ బలోపేతం చేయటం తప్పనిసరి. రాష్ట్రంలో ఇçప్పుడున్న విద్యుత్‌ ప్రసార వ్యవస్థలపై దీనికోసం పెట్టాల్సిన ఖర్చును బేరీజు వేసుకుంటే బయటి రాష్ట్రాల నుంచి సౌర విద్యుత్‌ తీసుకున్నప్పుడే తక్కువవుతోంది.  అందుకే తొలత రాష్ట్రంలోనే సౌర విద్యుత్‌ ప్రాజెక్టు పెట్టాలనుకున్నప్పటికీ... తరువాత సెకీ ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వీటిలో కొన్ని అంశాలనే ప్రస్తావించటం ద్వారా ‘ఈనాడు’ తప్పుడు సమాచారానికే ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పకనే చెబుతోంది.

అందుకే... కేంద్రం ఆమోదం
2003 విద్యుత్‌ చట్టం ప్రకారం సెకీ ఒప్పందాలకు ఏపీఈఆర్‌సీ అనుమతినిచ్చింది. దీంతో సెకీ నుంచి 2024 సెప్టెంబర్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలు మొదలవుతుంది. తొలి ఏడాది 3 వేల మెగావాట్లు, 2025లో మరో 3వేల మెగావాట్లు, 2026లో 1000 మెగావాట్లు చొప్పున 7 వేల మెగావాట్లను రాష్ట్రం తీసుకుంటుంది. డిస్కమ్‌తో పాటు ప్రభుత్వమూ ఒప్పందంలో భాగస్వామి కావటంతో చెల్లింపులకు ఇబ్బంది ఉండదు. అందుకే కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి కూడా దీన్ని ఆమోదించింది.

చంద్రబాబు హయాంలో నిరంజన సోలార్‌ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్‌తో యూనిట్‌కు రూ.5.71 చొప్పున కుదుర్చుకున్న సోలార్‌ పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌

ఏటా రూ.3,750 కోట్ల ఆదా...
ప్రస్తుతం రాష్ట్రం కొనుగోలు చేస్తున్న విద్యుత్‌ యూనిట్‌కు సగటున రూ.5.10 అవుతోంది. సెకీ విద్యుత్‌ మాత్రం యూనిట్‌కు రూ.2.49కి వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రానికి ఎన్‌టీపీసీ ఇస్తున్న సౌర విద్యుత్‌ ధర కూడా ట్రేడింగ్‌ మార్జిన్‌ కలిపి యూనిట్‌కు రూ.2.79 అవుతోంది. ఎలా చూసినా సెకీ విద్యుత్‌ తక్కువకే వస్తోంది. ఏటా దాదాపు రూ.3,750 కోట్లు ఆదా అవుతోంది. కాకపోతే ‘ఈనాడు’ రాతల్లో ఇవేవీ ఉండవు. ఆ రాతల లక్ష్యం వేరు మరి. 

35 వేల కోట్ల భారం.. ఎవరి పాపం?
టీడీపీ ప్రభుత్వ హయాంలో మార్కెట్‌లో సౌర విద్యుత్‌ యూనిట్‌ రూ.2.44లకు లభిస్తుంటే (బ్యాక్‌డౌన్‌ చార్జీలతో కలిసి రూ.3.54), ఏకంగా యూనిట్‌ రూ.6.99కి కొన్న చరిత్ర బాబుది. దాన్ని ఏమాత్రం విమర్శించని నిఖార్సయిన జర్నలిజం రామోజీది. ఇక çపవన విద్యుత్‌కయితే యూనిట్‌కు రూ.4.84 వరకు అదనంగా పెట్టి నామినేషన్‌ పద్ధతిలో మరీ పీపీఏలు చేసేశారు. పోటీ బిడ్డింగ్‌ లేనేలేదు. ‘ఈనాడు’కు ఇదంతా దోచిపెట్టినట్లుగా కనిపించకపోవటమే చిత్రం. 4 వేల మెగావాట్లకు ఒప్పందాలపై సంతకాలు చేశాక ఎక్కువ చెల్లిస్తున్నట్లు చంద్రబాబుకు గుర్తుకువచ్చి ఏపీఈఆర్‌సీకి ఓపీ నెం.17ను దాఖలు చేయటం హాస్యాస్పదమే తప్ప మరొకటి కాదనే చెప్పాలి. ఏదేమైనా ఫలితం మాత్రం విద్యుత్‌ పంపిణీ సంస్థలపై ఏటా రూ.3,500 కోట్ల భారం. అది కూడా 25 ఏళ్లపాటు. ప్రస్తుత విలువ ప్రకారం డిస్కమ్‌లు రూ.35 వేల కోట్లకు పైనే చెల్లించాలి. ఈ కథంతా ‘ఈనాడు’కు ఇంపుగా అనిపించటం చిత్రాతిచిత్రం. 
– సాక్షి, అమరావతి

‘ఈనాడు’కి అక్కర్లేని నిజాలివీ...
►టీడీపీ హయాంలో రూ.30 వేల కోట్లు రుణాలు తీసుకుని 2018–19 నాటికి వాటిని ఏకంగా రూ.62 వేల కోట్లకు చేర్చటం నిజం కాదా?
►గత ప్రభుత్వం బకాయిలకు 2014–19 మధ్య రూ.24,165 కోట్లు మాత్రమే చెల్లించగా, ప్రస్తుత ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో రూ.35,963 కోట్లు చెల్లించటం అబద్ధమా? ►విద్యుత్‌ రంగంలో దుబారా, దోపిడీ అరికట్టి మూడేళ్లలో విద్యుత్‌ కొనుగోళ్లు, ఉత్తమ యాజమాన్య విధానాల ద్వారా దాదాపు రూ.4,925 కోట్లు ఆదా చేయటం నిజం కాదా?
►వ్యవసాయ రంగానికి ఐదేళ్లలో టీడీపీ విడుదల చేసిన మొత్తం రాయితీలు రూ.13,255 కోట్లు కాగా, ఈ ప్రభుత్వం రెండున్నరేళ్లలో విడుదల చేసిన సబ్సిడీ రూ.21,497 కోట్లు. ఈ నిజాలతో మీకు పనిలేదా రామోజీ? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement