ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తే...
దాని ఫలితాలు జనానికి అందాలి.
పేదల సంక్షేమానికి పథకాలు పెడితే...
అవి నేరుగా వారిని చేరాలి.
ప్రభుత్వం ఓ కార్యక్రమం తలపెడితే...
జనమంతా భాగస్వాములవ్వాలి.
ఇదిగో... ఈ లక్ష్యాల సాధనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఓ సేనను తయారు చేసుకున్నారు. క్రమశిక్షణ కలిగిన సైన్యమిది. ప్రతినెలా 1వ తేదీన అవ్వాతాతల ఇళ్ల తలుపు తట్టడమే కాదు. పొలాల్లోని రైతులు,ఆసుపత్రుల్లోని రోగులు సహా అందరినీ పరామర్శిస్తూ వారికి ప్రభుత్వం ఇచ్చే పింఛన్ల నుంచి ఇతర సంక్షేమ ఫలాలను నేరుగా అందిస్తున్నారు. కాబట్టే... ఇపుడు రాష్ట్రంలో అర్హత ఉండి పథకం అందలేదనే వారెవరూ లేరు. వివక్షతో దూరమైన వారు లేరు. లంచాలివ్వాలని బాధపడేవారు లేరు. అందుకేనేమో!! జనానికి చేరువైన ఈ జగనన్న సైన్యంపై చంద్రబాబులో వణుకు మొదలైంది. బాబు భయంతో... దిక్కుతోచని రామోజీరావుకు కలవరం పెరుగుతోంది. దాని ఫలితమే ‘ఈనాడు’ వరస కథనాలు!!. ఇటీవలే వలంటీర్లనుగూఢచారులుగా వర్ణిస్తూ కథనం వండి వార్చిన రామోజీ... బుధవారం ‘వాలంటీర్లతో ఓటు మాట’ అంటూ మరో కథనం అచ్చేశారు. మరి ఇందులో నిజానిజాలేంటి?
రామోజీ సహా చంద్రబాబు జట్టు మొత్తం తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం... వలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారనేది. గౌరవ పారితోషికం తీసుకుంటూ... పేరుకు తగ్గట్టే సేవాభావంతో పని చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా రాష్ట్రంలోని కొన్ని కోట్ల కుటుంబాలకు ప్రభుత్వ పథకాల్నిచే ర్చటమనేది... వ్యవస్థలో వచ్చిన గొప్ప మార్పు. సేవా దృక్పథంతో లంచాలు, వివక్షకు తావులేకుండా వీరంతా పనిచేస్తుండటం వల్లే ఇది సాధ్యమైంది. ‘‘వీళ్లు చేసినన్నాళ్లు చేస్తారు. మంచి ఉద్యోగం వచ్చినా, దీనికన్నా మంచి అవకాశం వచ్చినా వెళ్లిపోతారు’’ అని వీరిని నియమిస్తున్నపుడే చెప్పారు సీఎం వైఎస్ జగన్. మరి అలా గౌరవ పారితోషికం తీసుకుంటూ... ప్రభుత్వ పథకాలను జనానికి చేరువ చేస్తున్న వలంటీర్లకు ఏ రాజకీయ పార్టీపైనా అభిమానమో, దురభిమానమో ఉండకూడదా? ఒక పార్టీ పట్ల వారు గనక అభిమానం చూపిస్తుంటే దాన్ని ఎవరైనా ఆపగలరా? తాము అభిమానించే పార్టీ తాలూకు సమావేశాలకు వాళ్లు గనక హాజరైతే దాన్ని తప్పు అనగలమా? ఎందుకీ రాతలు రామోజీరావు గారూ?
బాబు ఘోరాలు చేసినా ప్రశ్నించలేదేం?
ఇప్పుడు వలంటీర్ల సైన్యం ద్వారా అర్హులైన రాష్ట్ర ప్రజలందరికీ పథకాలు నేరుగా అందుతున్నాయి. లంచాలు, వివక్షకు అవకాశమే లేకుండా పోయింది. కానీ చంద్రబాబు నాయుడి హయాంలో పేదలకు పింఛన్లు, ఇళ్లు, రుణాలు.. ఇలా ఏమివ్వాలన్నా ఆయన ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీల సిఫారసు తప్పనిసరి. వారు ఓకే అంటేనే... ఇళ్లయినా, పింఛన్లయినా... ఆఖరికి రుణాలైనా. అందుకే అప్పట్లో పథకాల సొమ్ములన్నీ తెలుగుదేశం కార్యకర్తలకే అందాయి. టీడీపీ నేతలకు లంచాలిచ్చిన వారికే దక్కాయి. జన్మభూమి కమిటీలు ఆమోదించిన వారికే ఇళ్లతో సహా ఇతర పథకాలను ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశిస్తూ నాటి ప్రభుత్వం ఏకంగా జీవో కూడా విడుదల చేసేసింది. స్థానికంగా ఎక్కడైనా వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులుంటే... వారి ప్రమేయం లేకుండా స్వచ్ఛంద కార్యకర్తల పేరిట టీడీపీ వారిని నియమించుకుని మరీ ప్రతి పథకాన్నీ దుర్వినియోగం చేశారు. ఇది ప్రబలిపోవటంతో కొందరు అప్పట్లో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించినా... ఇందులో తప్పేమీ లేదని న్యాయస్థానం పేర్కొనటంతో టీడీపీ మరింతగా రెచ్చిపోయింది. లబ్ధిదారుల వివరాలు సైతం లేకుండా... ‘నచ్చినోళ్లకు నచ్చినంత..’ అనే రీతిలో సాగిన ఈ దుర్నీతిపై అప్పట్లో ‘ఈనాడు’ ఒక్క అక్షరం ముక్క రాస్తే ఒట్టు! రామోజీరావు ఒక్క ప్రశ్న సంధిస్తే ఒట్టు! వాస్తవమేంటంటే అప్పట్లా ఇప్పుడు వలంటీర్లకు పథకాలను మంజూరు చేసే అధికారమేదీ లేదు. వారు కేవలం సంధానకర్తలు. ప్రజల దరఖాస్తులను ప్రభుత్వ యంత్రాంగానికి అందజేయటం వరకే వారి పని. డాక్యుమెంట్ల ఆధారంగా అర్హతలను తేల్చేది పై స్థాయి అధికారులే.
ఒకవేళ వలంటీర్లు తమకు పథకం దక్కకుండా చేస్తారనుకుంటే నేరుగా సచివాలయాలకే వెళ్లి దరఖాస్తు చేయొచ్చు. అయినా ఏ కారణం వల్లనైనా రాకపోతే... మళ్లీ దరఖాస్తు చేయొచ్చు. లబ్ధిదారుల సోషల్ ఆడిట్... పారదర్శకంగా పేర్లు సచివాలయాల్లో ప్రదర్శించటం... ఇదంతా వీసమెత్తు కూడా దాపరికం లేని వ్యవహారం. ఇక లబ్ధిదారులు ఎంపికయ్యాక వారికి ఆ పథకం ఫలాల్ని అందజేసే బాధ్యతను మాత్రం వలంటీర్లు తీసుకుంటున్నారు. అంటే వీరు ప్రజలకు– ప్రభుత్వానికి వారధి మాత్రమే. మరి ఈ రాతలెందుకు? వారికి సొంత రాజకీయ అభిప్రాయాలుండటం తప్పెలా అవుతుంది?
దుష్ప్రచారానికి దారులు...
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మొదట ఈ వలంటీర్ల ఆలోచనను బయటపెట్టి నియామకాల ప్రక్రియ మొదలుపెట్టినపుడు బాబు నానా యాగీ చేశారు. ఎల్లో దుమారం ఎక్కువే రేగింది. అసలు వీళ్ల అవసరమేంటి? అంటూ కథనాలు వండేసింది ఎల్లో ముఠా. కానీ వలంటీర్లు తమ సేవా భావంతో ప్రజలకు దగ్గరయ్యారు. కోవిడ్ సమయంలో ప్రపంచమంతా నివ్వెరపోయే పనితీరు కనబరచడంతో పాటు... పెన్షన్లు అందించటంలో కొత్త చరిత్ర లిఖించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరుస్తూ వారే బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. దీంతో ‘వలంటీర్ల గౌరవ వేతనం పెంపు’ పేరుతో వారిని రెచ్చగొట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసేలా పురిగొల్పింది టీమ్ ఎల్లో. అందులో కూడా సక్సెస్ కాలేక ... ఏకంగా వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలంటూ ఎన్నికల సంఘానికి తెలుగుదేశం నేతలే ఫిర్యాదు చేశారు. తరవాత వాళ్లను గూఢచారులుగా పేర్కొంటూ కొత్త ప్రచారానికి తెరతీశారు. ఇప్పుడేమో వాళ్లు వైఎస్సార్ సీపీ సమావేశాలకు హాజరవుతున్నారంటూ మరో వాదన తెచ్చారు.
వలంటీర్లకు ఎన్ని బాధ్యతలో...
ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించటంలో వలంటీర్ల వ్యవస్థ ఎండావానలను లెక్క చేయక... చలికి భయపడక అహర్నిశలూ పనిచేస్తున్నదనేది కాదనలేని వాస్తవం. 2019 జూన్ నుంచి ఈ వ్యవస్థ ప్రతి నెలా దాదాపు 62.5 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తోంది. కొత్త రైస్ కార్డులివ్వటంతో పాటు రైస్ కార్డులున్న వారందరికీ సేవలందిస్తోందీ వ్యవస్థ. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద కొత్త కార్డులు మంజూరు చేయటం... ఆరోగ్య శ్రీని ఉపయోగించుకోవటంపై అవగాహన కల్పించటం చేస్తోంది.
ఇవే కాదు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ కాపు నేస్తం, చేయూత, రైతు భరోసా, మత్స్యకార భరోసా, వైఎస్సార్ జలకళ, వాహనమిత్ర, నేతన్న నేస్తం, ఆసరా, వైఎస్సార్ బీమా, సంపూర్ణ పోషణ, ఉచిత పంటల బీమా, లా నేస్తం, రైతులకు సున్నా వడ్డీ, ఆరోగ్య ఆసరా, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, జగనన్న తోడు, రజకులు.. టైలర్లు... నాయీ బ్రాహ్మణుల కోసం జగనన్న చేదోడు, జీవ క్రాంతి, అమూల్ పాలవెల్లువ, కంటి వెలుగు, అమ్మ ఒడి... అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లకు ఒకసారి అందించే ఆర్థిక సాయం, పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్ల స్థలాల పట్టాల మంజూరు, ఈబీసీ నేస్తం వంటి పదుల కొద్దీ పథకాల ఫలాలను అర్హులకు చేరుస్తున్నారు.
ఈ తేడా కనిపించదా రామోజీ?
►బాబు హయాంలో జన్మభూమి కమిటీ సభ్యులంతా నామినేటెడ్ వ్యవహారమే. టీడీపీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఆ పార్టీ ఇన్‌ఛార్జీలే నామినేట్ చేసేశారు. అందులో కులమతాల పాత్రా అధికమే. కానీ జగనన్న సైన్యమైన వలంటీర్లను మాత్రం... దరఖాస్తులు స్వీకరించి, ఇంటర్వ్యూలు నిర్వహించి రిజర్వేషన్లు, రోస్టర్ ప్రకారం స్థానిక ఎంపీడీవోలే ఎంపిక చేశారు. అందుకే ప్రస్తుతం పనిచేస్తున్న 22.65 లక్షల మందిలో 82 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే!!. పైపెచ్చు వీరిలో సగానికి పైగా మహిళలే. వీరి సేవలను యునిసెఫ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. తమ అభివృద్ధి లక్ష్యాల కోసం వలంటీర్లతో కలిసి పనిచేస్తున్నాయి.
►బాబు హయాంలో జన్మభూమి కమిటీ సభ్యులు పూర్తిగా రాజకీయ నాయకుల్లానే పనిచేశారు. వలంటీర్లు మాత్రం సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాల్లో విధిగా హాజరు వేయించుకుంటున్నారు. జవాబుదారీతనంతో పనిచేస్తున్నారు. అందుకే ఈ సైన్యాన్ని చూసి బాబుకు వణుకు పుడుతోంది.
►రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడున్నర ఏళ్లలో దాదాపు రూ.3.5 లక్షల కోట్లను వివిధ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్దిదారులకు అందజేస్తే.. ఎక్కడా పైసా అవినీతి జరగకుండా ప్రతి పైసా నేరుగా లబ్ధిదారులకు చేరింది. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పథకాల్లో 15 శాతం కూడా పేదలకు సరిగా చేరని పరిస్థితి ఉండేది.
కోవిడ్ సమయంలో ప్రపంచమే జేజేలు కొట్టింది...
2020 తొలినాళ్లలో ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి వణికిస్తున్నపుడు... దేశం యావత్తూ భయాందోళనలు నిండి, ఆసుపత్రులలో బెడ్‌లు సైతం దొరక్క విలవిలలాడినపుడు అందరికీ ఒక దిక్సూచిలా కనిపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. పక్క రాష్ట్రాల నుంచి కోవిడ్ రోగులు సైతం నిబంధనలను గాలికొదిలేసి మరీ ఏపీకి వచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడకు వస్తే... ఇక భయం లేదని ప్రతి ఒక్కరూ భరోసా ఫీలయ్యారంటే... అది ఈ ప్రభుత్వం సృష్టించిన వలంటీర్ల వ్యవస్థ వల్లే సాధ్యమైందని వేరే చెప్పక్కర్లేదు. ఎందుకంటే కోవిడ్ మహమ్మారికి భయపడి జనం ఇళ్లలోంచి బయటకు రావటానికే భయపడుతున్న సమయంలో... బయట తిరిగితే ప్రమాదమని తెలిసి కూడా వీరే సైన్యంగా పని చేశారు. ఇళ్లకు రోజువారీ సరుకులతో పాటు మందులు అందించటంతో పాటు 16 కోట్ల మాస్కుల్ని జనానికి అందజేశారు. పేదలకు ప్రత్యేక సాయంగా రూ.వెయ్యి చొప్పున అందించటంతో పాటు వ్యాక్సిన్లు త్వరగా అందేలా చూశారు. క్వారంటైన్ సెంటర్లలో సేవలందించటంతో పాటు రికార్డు స్థాయిలో 46 సార్లు ఫీవర్ సర్వే చేశారు. అన్నిటికన్నా ప్రధానం... కోవిడ్ మృతుల భౌతికకాయాలను దహనం చేయటంలోనూ సాయపడ్డారు. అలాంటి సేవలకు యావత్తు దేశం జైకొట్టగా... రామోజీరావు మాత్రం రాజకీయాలు అంటగడుతూ చెలరేగిపోతుండటం ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం తప్ప మరొకటి కాదనే చెప్పాలి.
ప్రభుత్వ విభాగాలకూ సహాయంగా...
►ఇవికాక వివిధ ప్రభుత్వ విభాగాలు సైతం వలంటీర్ల సేవలు ఉపయోగించుకుంటున్నాయి. సొంతిళ్లున్న వారిని ఆస్తిపన్ను చెల్లించమని అభ్యర్థిస్తున్న వలంటీర్లు... స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే, మనం మన పరిశుభ్రత, ఫ్రైడే–డ్రైడే, చెత్త పన్ను వసూలు... ఇలాంటి అంశాలన్నిటా వినియోగదార్లకు అవగాహన కల్పిస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి విభాగానికి, పంచాయతీ రాజ్– గ్రామీణాభివృద్ధి విభాగానికి సహకరిస్తున్నారు.
►కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల్లో అర్హత ప్రమాణాలను విచారించడంలో వీఆర్వోలకు సహకరిస్తున్నారు.
►వైద్య, ఆరోగ్య శాఖ చేపట్టే వ్యాక్సినేషన్ డ్రైవ్‌లకు, ఫీవర్ సర్వేలు, ఆరోగ్య సర్వేలకు వలంటీర్లే ఆధారం.
►వలంటీర్ల సాయం లేకుంటే ఆర్‌బీకే సిబ్బంది ఈ–క్రాప్ బుకింగ్‌కు రైతులను గుర్తించడం అంత తేలిక కాదు.
►ప్రత్యేక వాహనాల్లో రేషన్ బియ్యాన్ని ఇళ్ల వద్దకు తీసుకెళ్లి అందజేస్తున్న ఎండీయూ ఆపరేటర్లకు పూర్తి సహకారం వలంటీర్లదే.
►ఇక తుపానులు, భారీ ప్రమాదాలు జరిగినపుడు చాలా మంది వలంటీర్లు స్వచ్ఛంద సైనికుల్లా రంగంలోకి దూకి సేవలందిస్తున్నారు. నిన్నగాక మొన్న వచ్చిన కోనసీమ వరదల్లో వలంటీర్ల సాయాన్ని అక్కడి ఏ వ్యక్తినడిగినా చెప్పకమానడు.
►మరి ఇన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్న వలంటీర్లను రామోజీరావు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఏదో ఒకలా వాళ్లను తమ విధులకు దూరం చేద్దామనా? ఈ రాష్ట్రంలో అర్హులకు పథకాలు అందకుండా చేసి... ప్రభుత్వానికి ఆ మకిలిని అంటిద్దామనా? ఇంతకన్నా ఘోరమైన కుట్ర ఉంటుందా రామోజీ?
Comments
Please login to add a commentAdd a comment