భయం. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చెప్పిన వాస్తవాలు ఎక్కడ జనంలోకి వెళ్లిపోతాయోనన్న భయం. అప్పులపై ప్రతిరోజూ తాము వండి వారుస్తున్నవి అబద్ధాలని జనానికెక్కడ తెలిసిపోతుందోనన్న భయం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బావుందని జనమెక్కడ స్థిమితపడతారోనన్న భయం. అందుకే... ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల్ని ప్రచురిస్తూనే... తన వ్యాఖ్యలతో మరింత పెద్ద కథనాన్ని వండి వార్చేసింది ‘ఈనాడు’. వాస్తవాలంటూ అసత్యాలు, అర్థసత్యాలను అచ్చువేసింది.
ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పారని... ఆర్థిక స్థితి బాగుంటే బకాయిలెందుకు చెల్లించటం లేదని తనదైన పైత్యంతో ఆపసోపాలు పడింది. ఏం! చంద్రబాబు నాయుడి హయాంలో ఉద్యోగులకు 5 డీఏలను బకాయి పెట్టింది వాస్తవం కాదా? అప్పుడు ఇలాంటి రాతలెందుకు రాయలేదు రామోజీరావు గారూ? పౌరసరఫరాల శాఖ బిల్లులు, ఇరిగేషన్ బిల్లులు, పంచాయతీరాజ్ బిల్లులు... ఆఖరికి మధ్యాహ్న భోజన పథకానికి కూడా చంద్రబాబు బకాయిలు పెట్టలేదా? తాను దిగిపోయే నాటికి చంద్రబాబు ఏకంగా రూ.37,689 కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టడం అబద్ధమా? అప్పుడెందుకు రాయలేదు ఇలాంటి రాతలు? ఈ బకాయిల్లో 29,776 కోట్లను ఈ ప్రభుత్వం వచ్చాకే చెల్లించింది కదా? ఇలాంటి నిజాలు ఎందుకు చెప్పరు రామోజీ? చంద్రబాబు నాయుడి హయాంలో ఐదేళ్లూ ఆర్థిక వ్యవస్థ మామూలుగానే ఉన్నా... అప్పులు మాత్రం అతి దారుణంగా పెరిగిపోయాయి.
ఈ ప్రభుత్వం వచ్చాక తొలి ఏడాది ఆర్థిక మందగమనం కాగా... తరువాతి రెండేళ్లూ కోవిడ్ ఇబ్బందులు చుట్టుముట్టాయి. దాదాపు ఏడాదిన్నర కాలం పూర్తిగా లాక్‌డౌన్లతోనే గడిచిపోయింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా అప్పుల్ని అదుపులోనే ఉంచుతూ... పాత బకాయిలు చెల్లిస్తూ... జన జీవితాలు ఆగిపోకూడదన్న సంకల్పంతో సంక్షేమాభివృద్ధి పథకాలకు ఎలాంటి లోటూ రాకుండా ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళుతున్నారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి. ఇవన్నీ కనిపించవా? ఏం.. ఇప్పుడున్న బడ్జెట్టే కదా చంద్రబాబు హయాంలోనూ ఉన్నది! అప్పట్లో ఇప్పటి పథకం ఒక్కటి కూడా లేదెందుకు? ‘దోచుకో–పంచుకో–తినుకో’ అనే డీపీటీ పద్ధతినే ఫాలో అయ్యి మీరంతా వాటాలు వేసుకోవటం వల్లే జనానికి నేరుగా ప్రయోజనం కలిగేలా (డీబీటీ) ఒక్కటి కూడా చేయలేకపోయారన్నది నిజం కాదా? ఇలాంటి పథకాల ఆలోచనలు కూడా చేయని చంద్రబాబును ఇంకెన్నాళ్లు వెనకేసుకొస్తారు?
ముఖ్యమంత్రి సభలో చెప్పిన వాస్తవాలకు.. నిపుణుల వ్యాఖ్యలంటూ వక్రభాష్యాలు చెప్పటానికి చంద్రబాబును వెనకేసుకొచ్చే ఆ మూడు మీడియా సంస్థలూ తెగ తాపత్రయపడిపోయాయి. అసలింతకీ ఎవరా నిపుణులు? మార్గదర్శి పేరిట మందిని ముంచేయబోయిన రామోజీరావా? చిన్ననాడే కిరోసిన్‌ను రాష్ట్రం దాటించానని గొప్పలు చెప్పుకున్న రాధాకృష్ణా? లేక తమ న్యూజెన్ కొబ్బరినూనె రాసుకుని చేతులు కడుక్కోపోతే చేతులపైనా వెంట్రుకలు మొలుస్తాయని జనానికి గుండుచేసిన టీవీ5 నాయుడా? ఎవరు నిపుణులు? రాష్ట్రం అప్పుల గురించి, ద్రవ్యలోటు గురించి ముఖ్యమంత్రి ‘కాగ్’ గణాంకాలనూ తప్పు అనేంత నైపుణ్యం ఈ ముగ్గురికి, వీరి బాస్ చంద్రబాబుకు ఉందనుకోవాలా? అసలు 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం ఏప్రిల్ నెల తొలి పది రోజుల్లోనే ప్రజలను మభ్య పెట్టడానికి, ఎన్నికల తాయిలాల కోసం ఏకంగా రూ.6000 కోట్లు ఖర్చుచేసింది.
అదే నెల్లో ఒకేరోజున 5వేల కోట్లు అప్పు చేసింది. వీటన్నిటినీ తదుపరి ప్రభుత్వం తీర్చాలి కదా? అలాంటి వాస్తవాలు ఎప్పుడైనా రాశారా రామోజీరావు గారూ? ప్రతికూల పరిస్థితుల్లో కూడా గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఒకవంక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే మరో పక్క కేపిటల్ వ్యయం ఎంత చేసిందీ... తద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఎంత వృద్ధి చెందిందో కాగ్ నివేదికలు, బడ్జెట్ అకౌంట్స్ ఆధారంగా ముఖ్యమంత్రి వివరించారు. ఈ వాస్తవాలు జనానికి చేరితే ఇబ్బందులొస్తాయన్న ఉద్దేశంతో నిపుణులు లెక్కలంటూ సిగ్గులేకుండా సొంత అంకెలతో మాయ చేసింది ‘ఈనాడు’.
బాబు అప్పులు దాచేస్తే దాగవు
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ,2,69,462 కోట్లు అప్పు తెచ్చారని ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో వెల్లడించారు. అది సరికాదంటూ బాబు హయాంలో అప్పులను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసింది ఎల్లో మీడియా. టీటీపీ హయాంలో 2,57,509.87 కోట్ల రుణమే ఉన్నట్లు పేర్కొంది. నిజానికి చంద్రబాబు ప్రభుత్వం 2019 ఎన్నికల ముందు ఏప్రిల్ నెల తొలి పది రోజుల్లోనే ప్రజలను మభ్యపెట్టడానికి రూ.6000 కోట్లను వ్యయం చేసింది. అంతేకాక ఏప్రిల్ 9న ఒకే రోజు రూ.5000 కోట్లు అప్పు చేసింది.
అంటే ఎన్నికలకు రెండు రోజుల ముందు... ఒకే రోజున ఆ ఆర్దిక సంవత్సరపు రుణ పరిమితిలో 15 శాతాన్ని అప్పు చేసింది. ఒక సంవత్సరంలో చేయాల్సిన అప్పులో 15 శాతాన్ని ఎన్నికలకు రెండ్రోజుల ముందు ఒకేరోజున చేసేస్తే... ఈ ఎల్లో నిపుణులకు కనిపించనే లేదు. ఒక్కడైనా కలమెత్తలేదు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం ఏ చిన్న అప్పు చేసినా... దుష్టచతుష్టయం శివాలెత్తిపోతోంది. బాబు చివర్లో చేసిన అప్పులు కలిపితే ఆయన హయాంలో అప్పులు రూ.2,69,462 కోట్లకు చేరాయి. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పింది కూడా ఇదే. ఇవన్నీ బడ్జెట్ డాక్యుమెంట్లలో ఉన్నవే. గంతలు కట్టుకున్న రామోజీకి మాత్రం ఇవి ఎన్నటికీ కనిపించవు.
బడ్జెట్ గణాంకాలను కాదంటూ ఎక్కువ అప్పులు
ఈ ఏడాది మార్చి నెలాఖరుకు బిల్లుల బకాయిలతో కలిపి మొత్తం అప్పులు రూ.4,13,000 కోట్లు అంటూ ‘ఈనాడు’ సొంత పైత్యం ప్రదర్శించింది. దీనికి పేరులేని నిపుణులను అడ్డుగా పెట్టుకుంది. వాస్తవానికి రాష్ట్ర బడ్జెట్ డాక్యుమెంట్లో ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి రాష్ట్ర అప్పులు రూ.3,90,670.19 కోట్లు అని స్పష్టంగానే ఉంది.
పైపెచ్చు ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ద్రవ్యలోటు రూ. 38,224 కోట్లుగా అంచనా వేయగా కాగ్ నివేదిక ప్రకారం ద్రవ్యలోటు 25,194.62 కోట్లుగా ఉంది. దీంతో మొత్తం అప్పులు 3,82,164.62 కోట్లకు తగ్గాయి. ఈ వాస్తవాలను చెప్పని రామోజీరావు... పెండింగ్ బిల్లులతో కలిపితే అప్పులు 4,13,000 కోట్లు ఉండవచ్చంటూ చేతనైనంత బురద చల్లే ప్రయత్నం చేసింది.
గ్యారెంటీ అప్పులపైనా తప్పుడు లెక్కలు
ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులపైనా ‘ఈనాడు’ తప్పుడు అంకెలనే ప్రచురించింది. గతేడాది డిసెంబర్‌నాటికి ప్రభుత్వ రంగ çసంస్థ ల ద్వారా గ్యారెంటీతో చేసిన అప్పులు రూ.1,17,730 కోట్లుగా ఉన్నట్లు ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. ‘ఈనాడు’ మాత్రం రూ.1,38,603 కోట్లు అంటూ సొంత గణాంకాలను పల్లెవేయటం... ప్రభుత్వ ఆరి్థక పటిష్టతను దిగజార్చే కుట్రలో భాగమే తప్ప మరొకటి కాదు.
బాబు పెండింగ్ బిల్లులు రూ. 29,776.42 కోట్లు ఇప్పుడు చెల్లించలేదా?
ముఖ్యమంత్రి చెప్పినట్లు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగుంటే బిల్లులు ఎందుకు పెండింగ్‌లో పెడుతున్నారన్నది రామోజీరావు ఎల్లో ముసుగులో అడిగిన ప్రశ్న. ఏం! బిల్లులు పెండింగ్‌లో ఉంచటమనేది ఇప్పుడే మొదలైందా? టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ ఎలాంటి అసాధారణ పరిస్థితులూ లేవు కదా? ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులేవీ లేవు కదా? అయినా అప్పులెందుకు చేశారు? కేపిటల్ వ్యయం తక్కువగా చేశారెందుకు? పైపెచ్చు 37,689 కోట్లకుపైగా బిల్లుల్ని పెండింగ్‌లో ఉంచేశారెందుకు? వీటిపై ఎన్నడూ ఒక్క ప్రశ్నకూడా వేయలేదెందుకు రామోజీ? మూడేళ్లుగా ఆర్థిక మందగమనం, కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటూనే... ఈ అప్పుల్లో 29,776.42 కోట్లను ఈ ప్రభుత్వం చెల్లించటం నిజం కాదా? ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పౌరసరఫరాలు, ఉపాధి హామీతో పాటు ఇరిగేషన్‌కు చెందిన పెద్ద మొత్తంలో బిల్లులను బాబు బకాయి పెట్టలేదా? ఇవన్నీ దుష్టచతుష్టయానికి కనిపించవెందుకు?
నిజాలు దాచేందుకు... ఎన్ని కష్టాలో?
Published Sun, Sep 18 2022 5:46 AM | Last Updated on Sun, Sep 18 2022 8:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment