నారా చంద్రబాబు నాయుడుకి ఇప్పట్లో ఉన్నన్ని ‘సొంత’ టీవీ చానెళ్లు అప్పట్లో లేవు. అప్పట్లో అంటే 2004 అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత వచ్చిన ఈటీవీ–2, టీవీ–9, టీవీ–5, స్టూడియో ఎన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. ఇవన్నీ ఆయన ప్రయోజనార్థం వెలసినవే. లేదా, వెలశాక ఆయన ప్రయోజనార్థం పని చేసినవీ, చేస్తున్నవే.
పదవి కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారు. చంద్రబాబు కోసం రామోజీరావు ఎంతైనా డప్పు కొడతారు. ‘ఈనాడు’ కొట్టే డప్పు సరిపోక సొంతంగా ఒక ఎలక్ట్రానిక్ డప్పు ఛానల్ కోసం కేంద్రాన్ని పర్మిషన్ అడిగారు చంద్రబాబు. అది కూడా ఎప్పుడూ.. 2004 ఎన్నికలకు ఇంకో ఎనిమిది నెలలే సమయం ఉందనగా అప్పుడు పర్మిషన్ రాలేదు. మళ్లీ అడిగారు. మళ్లీ పర్మిషన్ రాలేదు. అప్పుడు కేంద్రంలో ఉన్నది ‘చంద్రబాబు ప్రభుత్వమే’! అధికారంలో ఉన్న బీజేపీకి టీడీపీ మిత్రపక్షం కనుక.. టీడీపీకి బీజేపీ డప్పన్నా కొట్టాలి, లేదంటే డప్పు కొట్టించుకోడానికి డబ్బన్నా ఇవ్వాలి. బీజేపీ ఆ రెండూ చేయలేదు!
‘థూ..’ ఇదేం ఫ్రెండ్షిప్ అనుకున్నారు చంద్రబాబు. దేశంలో అప్పటికి 78 మంది ప్రైవేట్ వ్యక్తులు టీవీ చానెళ్లు నడుపుతున్నారు. వాళ్లకు అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను సొంత బ్రాడ్‌కాస్టింగ్‌కు, టెలికాస్టింగ్ సౌకర్యాలకు అనుమతించకపోడం ఏమిటి!!’’ అని చంద్రబాబు తరఫున ‘ఈనాడు’ ప్రశ్నించింది. ప్రశ్న మాత్రమే మిగిలింది. పర్మిషన్ రాలేదు.
చివరికి చంద్రబాబుకు దూరదర్శనే దిక్కయింది. ‘సప్తగిరి’లో టైమ్ స్లాట్ సంపాదించి రోజుకు నాలుగు గంటలు ‘మీకోసం’ అంటూ తన కోసం ప్రసారాలు చేయించుకున్నారు. 2003 ఆగస్టు 15న ఆ డప్పు ప్రసారాలు ప్రారంభం అయ్యాయి. ప్రాథమిక విద్య, మహిళలు, యువజనులపై అందులో ప్రత్యేక కార్యక్రమాలు ఉండేవి. రాజకీయ ప్రసంగాలు, టెలిఫోన్‌లో ముఖాముఖి, ఔట్‌డోర్ బ్రాడ్ కాస్టింగ్ వ్యాన్‌ల సహాయంతో క్షేత్ర ప్రదర్శనలు, శిక్షణ, క్విజ్ పోటీలు, నిపుణుల చర్చల వంటి రూపాలలో అవి ప్రసారం అయ్యేవి. ఎన్ని విధాలుగా ఓటర్లకు గేలం వేయవచ్చో అన్ని విధాలుగా టీవీ ప్రసారాలతో గేలం వేసి, వలలు పన్నారు చంద్రబాబు.
డప్పులో భాగంగా సప్తగిరిలో ప్రతి రోజూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ఒక సాంగ్ ఉండేది. ఆ సాంగ్‌లో చంద్రబాబు నవ్వుతూ కనిపించేవారు. పసుపు రంగులు కనిపించేవి. ఆంధ్రప్రదేశ్ మ్యాప్, వెనుక దృశ్యాలు అన్నీ పసుపే. ఆఖరికి యాంకర్లు కూడా పసుపు దుస్తుల్నే ధరించేవారు. ఆ పసుపు ప్రసారాలకు 2004 ఎన్నికల ముందు వరకు ఆ ఎనిమిది నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం దూరదర్శన్‌కు 12 కోట్లకు పైగా చెల్లించింది!. సప్తగిరితో ఒప్పందంలో భాగంగా దూరదర్శన్ వాళ్లు చంద్రబాబు పాల్గొనే బహిరంగ సభలు, ఇతర కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలను ఇచ్చేవారు. ఆ డప్పుకు చంద్రబాబు డబ్బు ఇచ్చేవారు. ఎక్కడి నుంచి వచ్చేది అంతంత డబ్బు?!
‘వెలుగు’ దారిద్య్ర నిర్మూలన పథకాలు, వన సంరక్షణ సమితుల బడ్జెట్ నుంచి గుట్టుగా కొన్ని బండిల్స్ లాగేసేవాళ్లు! బ్రిటన్, ప్రపంచ బ్యాంకు, డి.ఎఫ్.ఐ.డి. (డిపార్ట్‌మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్) వంటి సంస్థల సాయంతో నడిచే పథకాల నుంచి మరికొంత నొక్కేసేవారు. జిల్లా కలెక్టర్‌లతో చంద్రబాబు వారం వారం జరిపే వీడియో కాన్ఫరెన్సులు, విద్యా కార్యమ్రాల ప్రసారాలకు చెల్లించే డబ్బు కూడా అక్కడి నుంచే జమయ్యేది.
‘సప్తగిరి’నే కాకుండా ప్రైవేట్ టెలివిజన్ చానల్ ‘తేజ’లో వారానికి ఒకసారి ‘డయల్ యువర్ పార్టీ ప్రెసిడెంట్’ కార్యక్రమ ప్రసారానికి 90 నిమిషాల స్లాట్‌ను కూడా చంద్రబాబు అద్దెకు తీసుకున్నారు. టీడీపీ పార్టీ కార్యకర్తలతో ఇంటరాక్షన్ కోసం తీసుకున్న ఆ స్లాట్‌కి కూడా ప్రజాధనాన్నే ఇంధనంగా వాడేశారు చంద్రబాబు.
టీవీలో అన్ని కార్యక్రమాలు చేపట్టినా కూడా ఎలక్ట్రానిక్ మీడియాను సరిగా క్యాచ్ చెయ్యలేకపోతున్నానని చంద్రబాబు వెలితి ఫీల్ అయేవారు. మీడియాను క్యాచ్ చేస్తే ఓటర్లను క్యాచ్ చెయ్యొచ్చని ఆయన నమ్మకం. అందుకే రాష్ట్రానికొక అధికారిక ఛానెల్ కావాలని కేంద్రాన్ని అడిగారు. అడిగి కాదనిపించుకున్నారు. చంద్రబాబేం స్పెషల్ కాదు కదా. ఇస్తే అన్ని రాష్ట్రాలకు పర్మిషన్ ఇవ్వాలి. అందుకే కేంద్రం ఇవ్వలేదు.
రాష్ట్ర ప్రభుత్వం సొంతగా ఒక టీవీ ఛానల్ పెట్టుకోడానికి కేంద్రం అనుమతిస్తుందని చంద్రబాబు చాలాకాలం పాటు ఆశగా ఎదురు చూసినా అనుమతి లభించలేదు. చివరి రామోజీరావే చంద్రబాబు కోసం 2003 డిసెంబర్ 28న ఈటీవీ-2 న్యూస్ ఛానల్ ప్రారంభించారు. అయినా చంద్రబాబును గెలిపించుకోలేకపోయారు. ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్సార్‌కు పట్టం కట్టారు. ప్రజలు చంద్రబాబు ప్రచారాలను, ఈ–మోజీ టీవీ ప్రసారాలను నమ్మలేదు. వైఎస్సార్ పాదయాత్రతో నడక కలిపి, ఆయనకు విజయ తిలకం దిద్దారు.
Comments
Please login to add a commentAdd a comment