‘మార్గదర్శి’ కేసులు నీరుగారుస్తున్నారు: పొన్నవోలు సుధాకర్‌రెడ్డి | Ysrcp Leader Ponnavolu Sudhakarreddy Comments On Ap Government | Sakshi
Sakshi News home page

‘మార్గదర్శి’ కేసులు చంద్రబాబు నీరుగారుస్తున్నారు: సుధాకర్‌రెడ్డి

Published Sat, Feb 15 2025 6:15 PM | Last Updated on Sat, Feb 15 2025 7:48 PM

Ysrcp Leader Ponnavolu Sudhakarreddy Comments On Ap Government

సాక్షి,హైదరాబాద్‌:ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ విచ్చిన్నం జరుగుతోందని, ప్రభుత్వమే రాజ్య హింసకు  పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ జనరల్‌ సెక్రటరీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పొన్నవోలు శనివారం(ఫిబ్రవరి15) మీడియాతో మాట్లాడారు. ‘ఆంధ్ర ప్రదేశ్‌ను  రావణ కాష్టంలా ప్రభుత్వం  మారుస్తోంది.వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుల ఆస్తులను ధ్వంసం చేశారు.

ప్రజలపై  దాడులు చేస్తే  నో పోలీస్ అన్నట్లుగా ఉంది. మాచర్లలో  దాడులు చేస్తే ఊళ్ళు కాలి చేసి పోతున్నారు .వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నారు. పోలీసులే మేం ఏమీ చేయలేమంటున్నారు.మీడియా  ముసుగులో మాఫియాలా  తయారవుతున్నారు.ఏపీలో ఏడు నెలలుగా ప్రాథమిక హక్కులు ఎక్కడ పోయాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్ బ్రేక్  డౌన్ కాదు.. ప్రభుత్వమే దాడులు  చేస్తోంది.

దాడులపై కమిషన్‌ను  అపాయింట్ చేయాలి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేనిని కక్ష పూరితంగా  కేసులో  ఇరికించారు .2023లో సత్య వర్ధన్‌ను విచారిస్తే  కులం పరంగా నన్ను  తిట్టలేదు  అని కోర్టులోనే చెప్పాడు. విశాఖలో  బందువుల ఇంట్లో ఉంటే సత్య వర్ధన్ తమ్ముడిని  బలవంతంగా  రప్పించి అతని వద్ద  తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారు. ప్రభుత్వం   చట్టాలను అవహేళన  చేస్తోంది. తాడిపత్రిలో  మాజీ ఎమ్మెల్యేను నియోజక వర్గంలో  కాలు పెడితే చంపేస్తాం  అని  పబ్లిక్‌గా ఓ  ఎమ్మెల్యే కామెంట్‌ చేస్తే చర్యలేవి.మాజీ  ఎమ్మెల్యేకే  ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల  పరిస్థితి ఏంటి’అని పొన్నవోలు ప్రశ్నించారు.

మార్గదర్శి కేసులను చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తోంది..

రాష్ట్రంలోనే అతిపెద్ద ఆర్థికనేరానికి పాల్పడిన 'మార్గదర్శి చిట్స్, మార్గదర్శి ఫైనాన్షియల్స్' కేసులను చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తోందని పొన్నవోలు ఆరోపించారు. ఈనాడు సంస్థలకు చెందిన మీడియా మాఫియా అండ కోసం చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆర్థిక నేరాల నుంచి మార్గదర్శికి విముక్తి కల్పించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోందన్నారు. 2006 లోనే దాదాపు రూ.2610 కోట్ల రూపాయలను మార్గదర్శి సంస్థ ప్రజల నుంచి చట్ట వ్యతిరేకంగా డిపాజిట్ల రూపంలో సేకరించిందన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ధారించిన కేసు నుంచి మార్గదర్శిని బయటపడేసేందుకు చంద్రబాబు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారన్నారు.

‘ఈనాడు పత్రిక వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావుకు మార్గదర్శి చిట్ ఫండ్స్, మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనే రెండు సంస్థలు ఉన్నాయి. వీటి ద్వారా ఆనాడు రామోజీరావు ప్రజల నుంచి రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్దంగా, చట్ట వ్యతిరేకంగా వేల కోట్ల రూపాయలు డిపాజిట్ల రూపంలో సేకరించారు. ఈ విషయాన్ని అప్పటి పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ బయటపెట్టారు. రామోజీరావు పాల్పడిన ఈ ఆర్థిక నేరంపై ప్రజల నుంచి ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్ కు అందిన ఫిర్యాదుల నేపథ్యంలో వీటిపై కేసులు నమోదయ్యాయి. 

2006 లెక్కల ప్రకారం రామోజీరావు తన మార్గదర్శి సంస్థల ద్వారా 2.75 లక్షల మంది నుంచి రూ.2610 కోట్ల రూపాయలను డిపాజిట్లుగా సేకరించారు. రిజర్వ్ బ్యాంక్ 1984 చట్టం ప్రకారం బ్యాంకులు మాత్రమే డిపాజిట్లు సేకరించాలి. ఇతర ఏ సంస్థలు సేకరించినా అది నేరం. పత్రికను నడుపుతూ ఆర్థిక నేరాల గురించి నిత్యం పత్రికల్లో కథనాలు రాయించే రామోజీరావు తాను అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్న విషయం తెలిసే చట్టాలను ఉల్లంఘించారు. 

తన చేతిలో మీడియా ఉంది, తనను ఎవరూ ప్రశ్నించలేరు, ఎవరైనా తన అక్రమాలను ప్రశ్నిస్తే వారిపై తన మీడియా మాఫియాను ప్రయోగిస్తాననే ధీమాతో రామోజీరావు వ్యవహరించారు. మార్గదర్శి సంస్థలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి దీనిపై విచారణకు సీఐడీని ఆదేశిస్తూ 2006లో జీఓలు 800, 801 జారీ చేశారు. తరువాత సిఐడీ అధికారులు విచారణ జరిపి రామోజీ ఆర్థిక నేరాలపై కోర్టుకు చార్జిషీట్‌ సమర్పించారు. తరువాత ప్రభుత్వాలు మారడం, తిరిగి రామోజీరావు తన మీడియా మాఫియాతో పాలకులను ప్రభావితం చేసే స్థాయిలో తన ఆర్థిక నేరాల నుంచి బయటపడేందుకు పావులు కదిపారు.

రాష్ట్ర విభజన తరువాత 31.12.2018 నాడు ఏపీ ఉమ్మడి హైకోర్ట్ ఆఖరి పనిదినం రోజున రామోజీ ఆర్థిక నేరాలకు సంబంధించిన మార్గదర్శి కేసులో ఫిర్యాదుదారికి నోటీసులు లేకుండా, ఎటువంటి వాదనలు వినకుండా, రిజర్వ్ బ్యాంక్, ఏపీ ప్రభుత్వాన్ని పార్టీ చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా కేసును రామోజీరావు క్వాష్ చేయించుకోవడం జరిగింది. ఈ విషయం కాస్త ఆలస్యంగా తెలుసుకున్న ఫిర్యాదుదారు ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్ట్ కు వెళ్ళి క్వాష్ పిటీషన్ ను కొట్టేయించారు. తిరిగి ఈ కేసును విచారించాలని తెలంగాణ కోర్ట్ ను సుప్రీంకోర్ట్ ఆదేశించింది. 

విచారణలో ఉన్న ఈ కేసులో రామోజీరావు కుమారుడు చెరుకూరి కిరణ్ తానే హిందూ అవిభక్త కుటుంబానికి కర్తను అని ఇంప్లీడ్ పిటీషన్ వేశారు. ఇటీవల రామోజీరావు చనిపోయాడు కాబట్టి కేసును కొట్టేయాలని రామోజీరావు తరుఫు న్యాయవాదులు తాజాగా కోర్ట్ లో కొత్త వాదనను తీసుకువచ్చారు. దీనిపై ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం నుంచి సీఐడీ కనీసం అప్పీల్ కూడా చేయకుండా మార్గదర్శి కేసు కొట్టేసేందుకు సహకరిస్తున్నారు. అంటే గత అయిదేళ్ల పాటు వైయస్ జగన్ ప్రభుత్వంపై నిత్యం ఈనాడు పత్రికను అడ్డం పెట్టుకని దుష్ర్పచారం చేయించినందుకు గానూ చంద్రబాబు ఈనాడు సంస్థలకు చెందిన మార్గదర్శికి అనుకూలంగా క్విడ్ ప్రో కో కింద సహకరిస్తున్నాడు’అని పొన్నవోలు ఆరోపించారు.

మార్గదర్శి సంస్థలో అనేక ఆర్థిక అక్రమాలు..

‘మార్గదర్శి చిట్స్ లో జిల్లాలో సేకరించిన అమౌంట్లు హెడ్ ఆఫీస్ కు పంపడం చిట్స్ చట్టం ప్రకారం నేరం. జిల్లాల్లో సేకరించిన డబ్బులో కొందరు మధ్యలో చిట్స్ నిలిపివేస్తే, వాటిని మార్గదర్శి ఖాతాలో వేసుకుని, వారి ఆస్తులుగా చూపించారు. మార్గదర్శి బ్యాలెన్స్ షీట్ లో ఆస్తులు, అప్పులను సక్రమంగా చూపలేదు. ప్రజల సొమ్మును అక్రమంగా తీసుకుని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులుగా పెట్టారు. 

రూ.2610 కోట్లు డిపాజిట్లుగా చూపి, దానిలో 1300 కోట్లు నష్టాలుగా చూపించారు. ప్రజల డబ్బు చీటీల రూపంలో తమ వద్ద పెడితే, దానిని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి సగానికి పైగా నష్టాలు వచ్చినట్లు చూపారు. ఇవ్వన్నీ సీఐడీ విచారణలో కూడా వెలుగుచూశాయి. వైయస్ఆర్ ప్రభుత్వంలో రంగాచారి కమిటీని నియమించింది. దీనిని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వకుండా అడ్డుకున్నారు. 

మార్గదర్శిపై విచారణ జరిపిన సీఐడీ అధికారులపై వ్యక్తిగత దాడిగా ఈనాడు పత్రికలో బుదరచల్లే రాతలు రాస్తూ వారిని భయపెడుతున్నారు. సీఎం చంద్రబాబు అండతో వారికి పోస్టింగ్ లు ఇవ్వకపోవడం, బదిలీలు చేయించడం చేస్తున్నారు. ఈనాడు గ్రూప్ కు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలపై పార్లమెంట్‌లో ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ ఎంపీ  పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కుటుంబంపై ఈనాడు పత్రిక దుర్మార్గమైన తప్పుడు రాతలతో వేధిస్తోంది. 

జేజే రెడ్డి మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభకుల్లో ఒకరైతే, ఆయనను శంకగిరి మాన్యాలు పట్టించి, వారి ఆస్తులు గుంజుకుని, దేశం నుంచి పరారయ్యేలా చేశారు. మీడియా మాఫియాగా చీకటి వ్యాపారాలకు పాల్పడుతూ, అధికార తెలుగుదేశం పార్టీతో అంటకాగుతూ, ప్రజల్లో తమకు వ్యతికులపై విషప్రచారానికి దిగుతున్నారు. ప్రభుత్వాలు తమ చెప్పుచేతల్లో ఉంటాయని, మేం తలుచుకుంటే ఏ ప్రభుత్వాన్ని అయినా గద్దె దించుతామనే అహంకారంతో ఉన్నారు’ అని పొన్నవోలు విమర్శించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement