
సాక్షి, నెల్లూరు: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. అలాగే, 14 ఏళ్ళు సీఎంగా పనిచేసి 54 సంస్థలను ప్రైవేట్ పరం చేసిన చరిత్ర చంద్రబాబుది అంటూ ఎద్దేవా చేశారు. రైతులను దళారులు దోచుకుంటుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందా? అని ప్రశ్నించారు.
నెల్లూరులోని జిల్లా పార్టీ ఆఫీసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘అన్నదాతలఫై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. విత్తనాలు, ఎరువులు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఎకరాకి లక్ష రూపాయలు అదనంగా వస్తే.. ఇప్పుడు ఎకరానికి 40 వేలు దాకా రైతులు నష్టపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మాటల్లో తప్ప.. చేతల్లో లేదు. టీడీపీ హయాంలోనే రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటారు.
టీడీపీ గెజిట్ పత్రికల్లోనే వార్తలు వస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మిర్చి రైతులు ధరలు లేక అల్లాడిపోతున్నారు. ఆరు వేల కోట్ల రూపాయలు మేర మిర్చి రైతులు నష్టపోతున్నారు. దళారులు దోచుకుంటుంటే.. ప్రభుత్వం చోద్యం చూస్తుంది. రైతులు ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంది. అన్నదాత సుఖీభవ పథకం అమలు చెయ్యకపోవడం వల్ల.. అప్పులు తెచ్చుకుని రైతులు వ్యవసాయం చేస్తున్నారు. పెట్టుబడులు పెరిగి.. రాబడి తగ్గడంతో రైతులు అప్పులు ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు.
వైఎస్ జగన్ తీసుకొచ్చిన వ్యవస్థలు ఉండకూడదనే కక్షతో.. రైతులను చంద్రబాబు రోడ్డున పడేస్తున్నాడు. 14 ఏళ్ళు సీఎంగా పని చేసి 54 సంస్థలను ప్రైవేట్ పరం చేసిన చరిత్ర చంద్రబాబుకే దక్కింది. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చెయ్యకపోతే అన్నదాతలను కలుపుకుని ఆందోళనకు శ్రీకారం చూడతాం’ అని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment