ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాని, ఆయన సతీమణి భారతి కాని నవ్వినా ఈనాడు రామోజీరావు సహించలేకపోతున్నారు. నిజంగా ఇది ఈనాడు మీడియా విపరీత పోకడే. ఇదేం వైపరీత్యం అంటూ పండగ రోజున వారు ప్రచురించిన వార్త దిక్కుమాలినతనంగా ఉంది. దానికి చండాలపు ఇంట్రడక్షన్. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లను తిడితేనే వైసీపీ టిక్కెట్ ఇస్తానని జగన్ అంటున్నారని ఒక పచ్చి అబద్దం రాశారు. సంక్రాంతి సంబరంలో జగన్ దంపతులు పాల్గొని అక్కడ జరిగిన కొన్ని సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను తిలకించి, ఎప్పుడైనా హాస్య సన్నివేశం వస్తే నవ్వారట. అంతే! ఈనాడు మీడియాకు ఏడుపు వచ్చేసింది. గత నాలుగున్నరేళ్లుగా నిత్యం జగన్‌పై ఏడుస్తూనే ఉన్న ఈనాడు మీడియా పండగ రోజున కూడా అదే ప్రకారం రోదించిందన్నమాట.
✍️ఈ కార్యక్రమంలో జగన్ ఒక్క ముక్క కూడా ప్రత్యర్ది రాజకీయ పార్టీలపై మాట్లాడలేదు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు భోగి మంటలు వేసుకుని పండగ జరుపుకోకుండా జగన్‌పై నానా దూషణలకు దిగితే అది మాత్రం రామోజీరావుకు సప్తస్వరాల సంగీతం మాదిరి వినిపించింది. ప్రభుత్వపరంగా జరిగిన సంక్రాంతి వేడుకలో ఒక గాయని పాట పాడుతూ ప్రతిపక్ష పార్టీలను ఫాల్తు పార్టీలు అన్న పదం వాడారట. మరో మిమిక్రి కళాకారుడు లక్ష్మీపార్వతి గొంతు అనుకరిస్తూ జగన్ నవ్వు చక్కగా ఉంటుందని, చంద్రబాబు ఏనాడైనా నవ్వాడా అని అన్నారట.
✍️ఈ సందర్భంలో ఒకసారి వైఎస్ భారతి చప్పట్లుకొట్టారట. అంతే ఈనాడుకు ఎక్కడ లేని బాధ వచ్చేసింది. అక్కడితో పూర్తి కాలేదు. వీరి అసలు ఏడుపు ఏమిటంటే ఎన్.టి.రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డిల స్వరాన్ని మిమిక్రీ చేస్తూ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములను పొగుడుతున్నట్లు మాట్లాడారట. అది ఈనాడుకు నచ్చలేదు. జగన్ వీటిని నవ్వుతూ వింటూ కూర్చున్నారు. జగన్ నవ్వుతారా! భారతి చప్పట్లు కొడతారా అంటూ తన పైత్యాన్ని అంతటిని ప్రదర్శిస్తూ ఒక వార్త వండేశారు. జగన్ 2014లో తన చేతిదాక వచ్చిన అధికారాన్ని కోల్పోతేనే పెద్దగా బాధపడలేదు. నవ్వుతూనే ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి ఎదుర్కున్నారు. అలాంటిది ముఖ్యమంత్రి అయి ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమంలో నవ్వితేనే ఈనాడు మీడియాకు ఏడుపు వచ్చేసింది.
✍️ఏమి చేద్దాం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణది అదే తరహా ఏడుపు.ఇక చంద్రబాబు, పవన్‌ల కార్యక్రమం గురించి చూద్దాం. భోగి నాడు అయినా రాజకీయాలకు దూరంగా ఉండి ప్రజలకు ఒక మంచి సందేశం ఇచ్చి ఉంటే చంద్రబాబు సీనియారిటీకి ఒక గౌరవం వచ్చేది.కాని ఆయన యథా ప్రకారం జగన్‌పైన, ఆయన ప్రభుత్వంపైన దూషణలకు దిగారు. దేవతల రాజధానిలో రాక్షస వధ జరిగిందట. అమరావతిలో సైకో వధ జరుగుతుందట. ముఖ్యమంత్రిని పట్టుకుని సైకో అని అంటే అది ఈనాడు రామోజీకి బూతుపదంలా అనిపించదు. సైకో వధ అని చంద్రబాబు అంటే ఎవరిని చంపాలని అనుకుంటున్నారన్న ప్రశ్న ఈనాడు మీడియాకు కాని, తదితర ఎల్లోమీడియాకు కాని రాదు. సీఎం జగన్ భస్మాసురుడట. నిజానికి అమరావతి గ్రామాలలో వేలాది ఎకరాలను రైతుల నుంచి స్వాధీనం చేసుకుని వారిపాలిట భస్మాసురుడి మాదిరి మారింది చంద్రబాబు కాదా!
✍️ఇప్పుడు పవన్ కళ్యాణ్ సరెండర్ అయిపోయారు కనుక విమర్శించడం లేదు కాని, గతంలో అమరావతిని కుల రాజధాని అని, ఇతరప్రాంతాలవారికి నివసించే అవకాశం ఎక్కడ ఉందని అడిగారా? లేదా? ఇక్కడ సంపద సృష్టించి ,పేదలకు అండగా ఉంటానని చంద్రబాబు అంటున్నారు. నిజంగా చంద్రబాబుకు పేదలపై అంత ప్రేమ ఉంటే రాజధాని గ్రామాలలో వారికి ఇళ్ల స్థలాలు కేటాయించి, గృహాలు నిర్మించడానికి జగన్ సంకల్పిస్తే,దానికి చంద్రబాబు ఎందుకు అడ్డుపడ్డారు. దీనిని బట్టి అర్ధం అయ్యేదేమిటంటే చంద్రబాబు అమరావతిని రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చి బడా బాబులకు, ధనికులకు సంపద పెంచాలని ఆలోచిస్తే, జగన్ పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి సంపద సృష్టించాలని తలపెట్టారనే కదా!
✍️జగన్‌ను పట్టుకుని మానసిక రోగి అని చంద్రబాబు అంటే అది సరదాకు అన్నట్లా? వైఎస్సార్‌సీపీవారు ఎవరైనా చంద్రబాబుకు ఫలానా వ్యాధి ఉందని అంటేనేమో దూషించినట్లా?. నిజానికి ఎవరూ ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉంటే బెటర్. కాని ఈనాడు రామోజీరావు మాత్రం జగన్ ను ఎవరు దూషించినా సంబరం చెందుతూ, అదే చంద్రబాబును ఎవరైనా ఒక్క మాట అనగానే నానా యాగి చేస్తుంటారు. అక్కడే సమస్య వస్తుంది. ఈయన జర్నలిజాన్ని తెలుగుదేశంకు తాకట్టు పెట్టకుండా,ఎవరు తప్పు మాట్లాడినా ఆక్షేపించితే కాదంటారా?ఇక పవన్ కల్యాణ్ కూడా రాష్ట్రానికి చీడ పట్టిందని ఏపీ ప్రజలపై తన ద్వేషాన్ని మరోసారి కక్కారు.
✍️ప్రజలంతా సుఖంగా ఉండాలని కోరుకోవలసిన తరుణంలో ఈ చీడ, కీడుల గురించి మాట్లాడుతున్నారంటేనే వీరి మనసులు ఎంత విషపూరితం అయ్యాయో అర్ధం చేసుకోవచ్చు.చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ,లోకేష్ లకు పదవులు ఉంటే రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉన్నట్లు. వీరికి పదవులు లేకుంటే, ప్రజలు ఓడిస్తే చీడపట్టినట్లు అని వీరు భ్రమపడుతుంటారు.ప్రజలు ఎప్పుడూ బాగానే ఉంటారు.కాకపోతే చంద్రబాబు,పవన్ వంటి నేతలు సమయం ,సందర్భం లేకుండా రాజకీయ విమర్శలు చేసి అప్రతిష్టపాలు అవుతున్నారు. ఈనాడు రామోజీరావు వంటివారు రోజువారి ఏడుపును పండగరోజు కూడా వదలలేదన్న భావన అందరిలోను ఏర్పడింది.
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ మాజీ చైర్మన్
ఇదీ చదవండి: అబద్ధాలు వండబడును c/o రామోజీ
Comments
Please login to add a commentAdd a comment